మన ఆహారపు అలవాట్లు - జీవన శైలి:
పీచు పదార్థాలు మన శరీరానికి ఎంత ముఖ్యమో మనకు తెలుసు. ఘన ఆహార పదార్థాల లోని అణువుల మధ్యన బంధాలను విడగొట్టి జీర్ణప్రక్రియ సులభతరం చేస్తాయి. మనం రోజూ తినే అన్ని రకాల పండ్ల మీద ఉన్న తొక్కులో ఎంతో పీచు వుంటుంది అందుకే తీయటి పండుకైనా దాని తొక్కు కొంచెం వగరుగా చేదుగా ఉంటుంది.
అయితే ప్రస్తుత కాలంలో వాడుతున్న కృత్తిమ ఎరువుల వలన రసాయనాలు అన్నీ తొక్కులో ఉండిపోయి అనేక రుగ్మతలు కలిగిస్తున్నాయి. అందుకే అందరూ ఆర్గానిక్ అనే పదంతో బాగా పరిచయం పెంచుకొంటున్నారు. అందులో తప్పులేదు. కానీ మనలో ఉన్న రోగనిరోధక సాంద్రతను పెంచుకొనే విధంగా మనం ప్రయత్నిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. శరీరానికి భౌతిక శ్రమను కలిగించడం మంచిదే. కొంచెం కష్టపడే మనస్తత్వాన్ని పిల్లలకు చిన్నప్పటి నుండి అలవాటు చేయాలి. అలాగే విపరీతమైన వత్తిడిని కూడా కలిగించకూడదు. ఒక చిన్న ఉదాహరణ నాకు స్ఫురించింది.
ఒక చెక్క ముక్క (వుడ్ స్ట్రిప్) ను గోడకు బిగిస్తున్నప్పుడు మాలెట్ వాడి సున్నితంగా కొట్టాలి అంతేకాని లోహ సుత్తితో గట్టిగా కొడితే చెక్క ముక్క విరిగిపోతుంది లేకుంటే దాని ఆకృతి చెడిపోతుంది. మన ఇమ్మ్యూనిటి సిస్టం కూడా అంతే. మనం కొంచెం సుతిమెత్తంగా దానిని ఇబ్బంది పెడుతుంటే దాని సాంద్రత పెరిగి తద్వారా మన శరీరంలో రోగనిరోధక శక్తి పెంపొందుతుంది.
మన జీర్ణ ప్రక్రియ వ్యవస్థ ఒక యంత్రం వంటిది. ఇంకా చెప్పాలంటే మన నిత్యం ఉపయోగించే వాషింగ్ మెషిన్ లాంటిది. అందులో గుడ్డలు ఎక్కువైతే పనితనం తగ్గుతుంది. ఏ యంత్రమూ సంవత్సరాల తరబడి ఒకేవిధమైన ప్రమాణాలను (పెర్ఫార్మన్స్) చూపించవు. కాలంతో పాటు వాటి నైపుణ్యం కూడా తగ్గుతూ వస్తుంది. మన శరీరంలోని అన్ని వ్యవస్థలూ కూడా అంతే. ఇరవై ఏళ్ళ వయసులో ఉన్న దేహ ధారుడ్యం, మన జీర్ణ వ్యవస్థలో విడుదల అయ్యే ఆమ్లాల సాంద్రత అరవై ఏళ్ళ వయసులో ఉండదు (అయితే మనసుకు ఇందులో మినహాయింపు ఉంది). కనుక మన స్థితిని బట్టి తీసుకునే ఆహారం యొక్క పరిమాణం, ఘాడత మారాలి. పాతదైన వాషింగ్ మెషిన్ లో బాగా గ్రీసు అంటుకున్న బట్టలు వేస్తే ఏమౌతుంది? ఆ గ్రీసు లోపలి గొట్టాలలో పేరుకుపోతుంది లేదా గుడ్డలతోనే అంటుకొని ఉంటుంది. దానిని వదిలించడం ఆ వయసు మళ్ళిన యంత్రానికి అంత సులువు కాదు. అలాగే మనం తీసుకునే ఆహారం లో కూడా సంతృప్త కొవ్వు (saturated fat) కూడా మన రక్త నాళాలలో పేరుకుపోయి తగిన శారీరక శ్రమ లేకుంటే అది కరగక అన్ని రకాల రుగ్మతలకు హేతువౌతుంది. ఇటువంటి పరిస్థితులలో పీచు పదార్థాలు తమ వంతు కృషి చేసి ఆ క్రొవ్వు ను విడగొట్టి కరిగించే ప్రయత్నం చేస్తాయి. అందుకే మనం పీచు పదార్థాలు ఎక్కువగా తినవలసిన అవసరం ఉంది. ఒక ఆపిల్ మనలను వైద్యుడికి దూరంగా ఉంచుతుంది అనే నానుడి ఉంది. కారణం ఆపిల్ లో ఉన్న అత్యధిక పీచు పదార్థ ప్రభావం. ఆపిల్ లో ఉన్న antioxidants మన శరీరం లోని free radicals యొక్క ప్రభావాన్ని నియంత్రించేందుకు ఎంతగానో సహాయపడతాయి. కనుకనే రోజుకో ఆపిల్ తినమని వైద్యులు, పెద్దవారు సలహా ఇస్తుంటారు. శరీర బరువు తగ్గడానికి కూడా ఆపిల్స్ సహకరిస్తాయి.
NIce madhuaji! so clear .