ఊళ్ళో మా ఇంటి ప్రక్క,
ఉండేదొక ఒక అక్క!
ఒక యేడు పెద్దది ఆ అక్క
బడిలో ఒకే క్లాసు నేనూ,అక్క!
ఆటలు,చదువుల్లో తనెప్పుడూ మేటి
బడిలో తనకెవరూ లేరు పోటీ!
మేము కలిసే ఆటలాడుకునేది,
కావాలనే తను ఒక్కోసారి ఓడేది!
ఓ రేగుచెట్టుండె మాఇంటిముందున
పండ్లకోసం ఎక్కేటోళ్లం కొమ్మకొమ్మన!
పురుగుల్లేని దోరపండొక్కటి దొరికినా,
కలిసి తినేటోళ్ళం కాకెంగిలిన!
నేను కొత్తచొక్కా వేసుకున్నా,
మురిసిపోయేది నాకన్నా !
నన్నెవరేమైనా అన్నా,
అడ్డువచ్చేది ఏమైనా !
ఆరో క్లాసుకు నేను గురుకులమెళ్లా
సెలవులప్పుడే కలుసుకునేది మళ్ళా!
ఎండాకాలం సెలవులకు ఇంటికెళ్లా,
పెళ్లిచేసి పంపారట కనబళ్ళా!
వాళ్ళ నాన్ననడిగా "పదమూడేళ్లకే పెళ్లా?"
అయనన్నాడు, "బాధ్యతకదరా ఆడపిల్ల!",
"మనుషులం! ఏముంది మన చేతులల్ల?",
"పెళ్లినిర్ణయాలు జరిగేది సొర్గంల!".
మరోయేటి సెలవులకు మళ్ళీ ఇంటికొచ్చా,
అక్కగూడ వచ్చెనట ఆనందపడ్డ!
కలుద్దామనెళ్లి కిటికీపక్క నిలబడ్డా,
సంకలో చూశానో చంటిబిడ్డ !
తనకే కావాలి ఓ అమ్మ,
తానయింది ఓ బిడ్డకు అమ్మ!
జీవితమది ఓ ఆటబొమ్మ
విధి ఆడుకొనే వింత బొమ్మ !
కంటిలోన కనిపించె నెర్రనిజీర,
కంటకారుచుండె కన్నీటిధార!
పాలచెక్కిళ్ళ పారెనా అశ్రుధార,
బాల్యగుండెల నెగసె బడబాగ్నిధార!
కట్నపుబాకీ లక్ష కొరకట
కరుకు మాటల తూటాలట!
కొరకొర చూపుల జూచిరట
బాకీకొరకు పుట్టింటి కొచ్చెనట!
వాళ్ళనాన్న అన్నాట్ట, "చూడమ్మా!"
"ఊకె ఊకె ఇంటికి రావద్దమ్మా!"
"ఊళ్ళో నా పరువు పోతుందమ్మా!"
"పంటొచ్చినంక బాకీ పంపిత్తనమ్మా!"
పుట్టింట నొప్పింపలేని,
మెట్టింట మెప్పింపలేని,
దరిచేరే దారి కానరాని,
దిక్కుతోచని దీనురాలు!
కన్నీరునాపి పోదామంది రేగుపండ్లకు.
ఎక్కామొక కొమ్మమీదకు!
కనబడెనో రేగుపండు ఆకుపక్కకు,
నవ్వుకొనితిన్నాం కాకెంగిలి చేసుకు!
బంధుబలగం సందు సందున ఎందరున్నా,
నిందల నీడల్లో వేధింపుల బంధనాల్లో ఒంటరి బందీ తాను!
హృదయాంతరాళం ప్రళయఘోష చేస్తున్నా,
అధరం దాటని మూగ ఆర్తనాదం తాను! మౌనశిఖరం తాను!
గర్భమంతా మండుకాసారం నిండియున్నా,
మంచుగప్పి మలయమారుతం వీస్తున్న మహాగ్నిపర్వతం తాను!
నిశ్చలమైన నీటితో సమతలముగా తలపిస్తున్నా,
అంబుధి అడుగున అగుపించని అంతులేని అగాథం తాను!
విళయకాల అగ్నికీలలు మెలయుచున్నా,
ప్రసన్నంగా మూసియున్న ముక్కంటివాని మూడోకన్నుతాను!
తిరిగి అత్తోరింటికెళ్లేనొక రోజున,
రోజులు గడిచుచుండె నెంతో భారమున!
మౌనవేదనతో నలుగుచుండె మదిలోన,
ఎండ్రిన్ సీసా కనబడెనొక మూలన!
తనవైపున చూపుతగదంటూ,
కష్టాలు కలకాలముండవంటూ,
కాలం కక్షగట్టేది కొంతకాలమేనంటూ,
చంటిబిడ్డను చూడమంటూ,
పంటిబిగువన బాధలనోర్వమంటూ,
మంచిరోజొకటి ముందుండెనంటూ,
వెరవవద్దని వేడుకుంటూ,
నోరులేని సీసా మొరపెట్టుకుంటూ
మొత్తుకుంటున్నది. లేనిచేతులు జోడించుకుంటూ!
వెలుగునీడల నడుమ నలుగుతూ నడుచు,
సుఖదుఃఖములను కూడుతూ గడుచు
జీవితమన్నది పోరుతూ జీవించాలనుచు
తర్కించు వయసింకా రాని తానొక
బాల అబల! అందరున్న అనాథ!
విలయరూప మెత్తిన వికల కాళరాత్రి
కలకాలం అలాగే నిలిచియుండి
వెలుగింక రాదు,రాలేదని, తలచీ
విలపిస్తూ విధికి తలవంచినదేమో!
కాలుడే గెలిచెనొక రోజున
మూతవిప్పి పోసి గొంతులోన,
విసిరికొట్టె సీసా నేలపైన!
ఎండ్రిన్ విషమెగబాకె తనువులోన!
ఈ పాపమెవ్వరిదని ప్రశ్నిస్తూ,
ఓ బతుకును కాలరాస్తూ,
మిగిలిన చుక్కలు నేలరాలుస్తూ,
ఏడుస్తున్నది ఖాళీ ఎండ్రిన్ సీసా!
పసిప్రాణమెట్లు తీస్తుమంటూ,
పంచభూతాలు పరిపరివిధాల వగచుచున్నాయి, చింతిస్తూ!
భూతల్లి భోరున విలపిస్తూ,
విరించి వెర్రిరాతలను నిరసిస్తోంది, వేనోళ్ళ వెక్కిరిస్తూ!
పుడమితల్లి ఒడిలో తానొదిగిపోవగా,
నిలిచెనిల వనితల ఈతిబాధలకు సాక్షిగా!
వేధింపు మరణాలన్నవి ఒక సంద్రమవగా,
కరిగి కలిసిపోయెనందున తానొక్క కన్నీటిబొట్టుగా!
కాలగర్భమున కలిసె! అకాలముగా!
శూన్యముగా! అనంతముగా!
అనంతమైన శూన్యముగా !
శూన్యమైన అనంతముగా !
వేదనతో రోదిస్తూ రోజూ చస్తూ బతికినపుడు
పట్టించుకోని పక్కింటివారూ, పంచాయితీ పెద్దలూ,
చచ్చి బతికిపోయి శాంతించినపుడు
పాపమయ్యో! అన్యాయమంటూ తెగ దీర్ఘాలు తీస్తున్నారు!
నేనున్నానంటూ వెన్నుతట్టి, వెనక అండగా నిలిచి,
అత్తింటివారితో సంధికై యత్నించని బంధుబలగం,
తన కన్నీరు కట్టెలపై కాగినాక, తాము కన్నీరు కారుస్తూ
శోకాలు పెడుతూ, కోపతాప శాపాల రాగాలు పాడుతున్నారు!
తానెక్కిన బలిపీఠం జాతి భవితకు గుణపాఠం నేర్పిన క్షణాన,
పద్దెనిమిదేళ్లలోపు పెళ్లిళ్లు వద్దంటూ ఊరిపెద్దలు తీర్మానించిరి!
నాలుగూర్ల జనులు నాంది పలికుతూ ఆమోదించిన క్షణాన,
ప్రాణత్యాగం పాపమని తెలియని తాను పుణ్యాత్మురాలయింది!