Menu Close
Kadambam Page Title
నడిచే దేవుడు "నాన్న"
చందలూరి నారాయణరావు

ఎనభై ఏళ్ల వయసులోనూ
ఆ చేతులు చల్లగా మాట్లాడతాయి.
బిడ్డలు ఎంత ఏపుగా ఎదిగినా
ఇంకా తేమనందించాలని తపిస్తాయి.
నంగి నంగిగా నొక్కిపలికే మాటలతో
చొంగ కార్చే పండు తనంలోనూ
ఊట తగ్గని ప్రేమ తీపిని
పంచే పేగుబంధానిది ఎప్పుడూ
వృద్ధాప్యమెరుగని పెద్దరికమే.

వయోభారంలోనూ
బంధం విలువను మరువని మనసు
వంగిన నడుములోనూ
వాలిన హుషారుని కూడతీసికొని
చూపులతో దగ్గరకు లాక్కొని
తడిమి చూసే స్పర్శ ఎంతటి అదృష్టమో!
బిడ్డలు ఎంతటి భాగ్యవంతులైనా
ఈ బంధానికి విధేయులే.

ఎప్పుడు చూసినా
ఏదో దాచి చెప్పినట్లుగా
ఎంతో కూర్చి ఇచ్చినట్లుగా
గుచ్చి గుచ్చి చెప్పే బాధ్యత ముందు
కన్నవారెంతవారైనా పారాడే పసివారే.

కడుపునపడ్డ క్షణం నుండే
కలలకు జీవం పోసి
ఎదిగే బిడ్డను ఎప్పుడూ
ఎదలో పెట్టుకు మోసి
మొద్దుబారిన చేతులు
నెర్రెలుబారిన మడిమలు
కీళ్ళని సవరిస్తూ చేసే
ప్రతి కదలిక ప్రేమమయం.

తప్పటడుగుల్లో నడిపించి
నేడు వణుకుతున్న చిటికెన వ్రేళ్ళు,
లోకాన్ని చూపించి మురిపించి
అలసి నీరుకారుతున్న గాజు కళ్ళు,
అందమైన జీవితానికై అహోరాత్రులు
శ్రమించి ఆ జీవన విధానంలో
నడిచి నడిచి అరిగిన మోచిప్పలు,
మంచిని భోదించి, మాటల్ని నేర్పించి
నేడు మూగబోయిన ఆ గొంతు..

నేటికీ కడుపుతీపితో
పరితపించే ప్రేమ స్వరూపాలై
ప్రేమజల్లులను కురిపించే
ఓ ప్రత్యక్ష మధురానుభూతుల
నేల మీద నడిచే మేఘమే "నాన్న".
ప్రతి ఇంటి గుడిలో, ప్రతి మనిషి మదిలో
విలసిల్లే దేవుడు "నాన్న".
* * *
( జూన్ 20 వతేది పితృదినోత్సవం సందర్భముగా నా అంతరంగంలో..మెదలిన చిరు అలజడుల ఆవిష్కరణే ఈ కవిత )

Posted in July 2021, కవితలు

1 Comment

  1. Dr.కె.రామకృష్ణ

    నడిచే దేవుడు నాన్న కవిత చాల బాగుంది.
    చండలూరి నారాయణ రావు గార్కి అభినందనలు.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!