
సంగీతంలో సాహిత్య పరిమళాలు విరబూసినందున, పాత పాటలలో అంతటి మాధుర్యం మనకు గోచరిస్తున్నది. నేటి క్రొత్త పాటలలో సంగీతంలో సరికొత్త బాణీలు కనపడుతున్నాయి కానీ భాష పరిమళాలు అన్నివేళలా గుబాళించడం లేదు. అంతేకాదు పరభాషా పదాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. కనుకనే నేటి పాటలు అంతగా గుర్తుకూడా ఉండటం లేదు. తెలుగు పదాల పొందిక నాడు అమరింతగా నేడు కుదరటం లేదు. అలాగని మాధుర్యమైన గేయాలను రచించగల రచయితలు తెలుగులో లేరని కాదు. వారికి సరైన అనుకూల వాతావరణం కల్పించడం లేదు.
ఆనాడు గుండమ్మ కథ సినిమా కోసం పింగళి నాగేంద్ర రావు గారు వ్రాసిన ఈ ప్రేమ గీతం కేవలం సరళమైన తెలుగు పదాలతో ఎంత అందంగా అమరిందో వింటూ వుంటే అర్థమౌతుంది. పైపెచ్చు ఘంటసాల గారు స్వయంగా స్వరకల్పన చేసి పాడిన ఈ పాటను మీకోసం అందిస్తున్నాము.
పల్లవి :
మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే
తెలుపక తెలిపే అనురాగము
నీ కనులనే కనుగొంటిలే
నీ మనసు నాదనుకొంటిలే
మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే
చరణం : 1
కదిలీ కదలని లేతపెదవుల తేనెల వానలు కురిసెనులే ఆ...
కదిలీ కదలని లేతపెదవుల తేనెల వానలు కురిసెనులే
ఆనందముతో అమృతవాహిని ఓలలాడి మైమరచితిలే
మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే
చరణం : 2
ముసిముసి నవ్వుల మోముగని నన్నేలుకొంటివని మురిసితిలే ఆ...
ముసిముసి నవ్వుల మోముగని నన్నేలుకొంటివని మురిసితిలే
రుసరుసలాడుతు విసిరిన వాల్జడ వలపు పాశమని బెదరితిలే
మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే
తెలుపక తెలిపే అనురాగము
నీ కనులనే కనుగొంటిలే
నీ మనసు నాదనుకొంటిలే
మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే