Menu Close
మర్మదేశం (ధారావాహిక)

ఘాలి లలిత ప్రవల్లిక

ఘాలి లలిత ప్రవల్లిక

ప్రస్తుత సౌర కుటుంబం అక్రమించినంత స్థలంలో విశ్వంలోని పదార్థం అంతా ఒకే ముద్దగా, పదార్థం చాలా దట్టంగా చిక్కగా కనిపిస్తోంది.

"ఒరేయ్ కౌశిక్ ఇదేదో పెద్ద కొండ లా ఉంది రా ఇటు చూడు" అన్నాడు ఆశ్చర్యంగా దినేష్.

"ఇదేంట్రా ఇంత మెత్తగా ఉంది పట్టుకుంటే చేతిలోకి ఏమీ రావడం లేదు." అంది ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి శార్వాణి.

"మీరు గమనించారా? ఇక్కడ వేడి పెరుగుతున్నట్లుగా అనిపిస్తోందికదా!" అన్నాడు కౌశిక్.

"ఈ బ్రహ్మాండం లోని వేడి గరిష్ట స్థాయికి చేరుకున్నట్లు ఉంది. అందరూ మేథా ఇచ్చిన కవచం ధరించండి." అంటూ అరిచాడు చరణ్. అందరూ గబగబా తెల్లని వస్త్రాలలాంటి కవచాలను ధరించారు. అవి ట్రాన్స్పరెంట్ గా ఉన్నాయి. వారి లోపలి శరీరాలు కనపడుతున్నా బయట జరిగే ప్రక్రియలకు వారి శరీరం తదనుగుణంగా మారుతూ ఉంటుంది. అంటే వాయువులో వాయువులా, పదార్థంలో పదార్థం లా, అగ్నిలో అగ్నిలా నీటిలో నీరులా వారి శరీరం మారిపోతుంది.

ఇంతలో బ్రహ్మాండం బ్రద్దలై మహా విస్పోటనం జరిగింది. అంతే బ్రహ్మాండంలోని పదార్థమంతా చెల్లా చెదురై నది. "వామ్మో ఆ ముక్కలు నా మీద పడుతాయేమోరా దేవుడో"..గొల్లుమన్నాడు దినేష్.

"ఒరేయ్ దినేష్ పిచ్చివాడిలాగా మాట్లాడక. ఇది ఎప్పుడో జరిగిన విషయం మనం వెనక్కి వెళ్ళామన్న విషయం గుర్తు పెట్టుకో.." అన్నాడు చరణ్. శక్తి, రోదసి, కాలం అనేక రకాల ద్రవ్యరాశి ఈ విస్పోటనం నుండే ఏర్పడ్డాయి.

"అరే.....ఆ..పదార్ధం వేడి తగ్గి పరమాణువులు అణువులు ఆ తరువాత హైడ్రోజన్ హీలియం ఆక్సిజన్ వంటి మూలకాలుగా ఏర్పడుతోంది చూడండి." అన్నాడు కౌశిక్.

"ఇలా విచ్చిన్నమైన విశ్వపదార్ధం గురుత్వాకర్షణ శక్తి వల్ల తిరిగి సమీకృతమై నక్షత్రాలుగా, గెలాక్సీ లుగా ఏర్పడతాయి అన్నాడు...", అన్నాడు చరణ్.

ఇదంతా వాళ్ళ కళ్ళముందే జరిగిపోయింది లక్షల సంవత్సరాలు పట్టిన ఈ పరిణామాల్ని వీళ్ళు కొన్ని నిమిషాల్లోనే చూడగలిగారు.

"ఇదే రా బిగ్ బ్యాంగ్ థియరీ అంటే." అన్నాడు కౌశిక్

"మేథాపుణ్యమా అని మనం ఇది చూడగలిగాం." అన్నాడు దినేష్.

"అబ్బా అటుచూడండి ఆ నక్షత్ర మండలాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో!" సంబ్రమంగా అన్నది శార్వాణి.

అందరూ అటు చూశారు. మిలియన్లు, బిలియన్ల కొలదీ విశ్వాంతరాళంలో విస్తరించి ఉన్నాయి ఆ నక్షత్రాలు.

"వావ్ ఎంతబాగున్నాయో!" ఆశ్చర్యపోయాడు దినేష్.

"వాటికే అటు ఆ మండలాలు చూడండి నాలుగు రకాలుగా కనిపిస్తున్నాయి." అన్నాడు చరణ్.

"ఏది? ఎక్కడ?"కుతూహలంగా అడిగాడు దినేష్.

"అదిగో అటు చూడు ఆ నక్షత్ర మండలం బండి చక్రం లా ఉంది" అన్నాడు వేలుపెట్టి చూపిస్తూ కౌషిక్.

"ఇదిగో ఇటు చూడు ఈనక్షత్ర మండలం సర్పిలాకారం లో ఉంది కదూ"అన్నది శార్వాణి.

ఇదిగో ఇటు చూడండి ఈ నక్షత్ర మండలం ఎలా దీర్ఘవృత్తాకారం గా ఉందో!" అన్నాడు చరణ్.

'అవును నిజమే రోయ్' అంది శార్వాణి.

"మరి ఆ నక్షత్ర మండలానికీ ఏ ఆకారము లేదు ఎందుకో! పాపం నిరాకారం గా ఉంది!" అమాయకంగా అడిగాడు దినేష్ .

'అన్నింటికీ అన్ని ఆకారాలు ఉండవురా జిడ్డు వెధవా!' అంది శార్వాణి.

"ఇదో నన్ను అలా అనకు" అంటూ బుంగమూతి పెట్టుకు కూర్చున్నాడు దినేష్.

"సరిసర్లే సరదాగాన్న మాటలు పట్టించుకోకూడదు" అన్నాడు చరణ్.

"అబ్బో ఎన్ని వింతలో ఈ వింతలు మనం భూమి మీద నుంచొని చూసినప్పుడు మన కంటికి కనిపించ లేదుగా!" ఆశ్చర్యంగా అన్నాడు కౌషిక్.

"వీటికేనా! ఇంకా ఎన్నో చూడాల్సినవి ఉన్నాయి. అటు చూడండి ఆ నక్షత్ర మండలాలు ఎలా గుంపులు గుంపులుగ ఉన్నాయో"! అన్న మాటలు వినిపించాయి.

అందరూ అటు చూసారు. వారికి ఎవరూ కనపడలేదు.

***సశేషం***

Posted in July 2021, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!