అవ్యంగాంగీం సౌమ్యనామ్నీం హంసవారణగామినీమ్ |
తనులోమ కేశ దశనాం మృద్వంగీ ముద్వహేత్ స్త్రియమ్ || (3 - 10)
అవ్యంగ (లోపరహితమైన) శరీరాంగములు కలిగి, చక్కని అంగీకారయోగ్యమైన పేరు కలిగి, హంసవారణగామినీమ్ (హంసలా, ఏనుగులా తిన్నగా, గంభీరంగా నడిచే), తనులోమ కేశ (శరీరం మీద తగుమాత్రపు కేశములు, శిరోజములు కలిగి), చిన్న పండ్లు, మృదువైన శరీరము కలిగిన స్త్రీని ఉద్వహేత్ (వివాహం చేసుకోవాలి).
ఏ కన్యకు తోడబుట్టినవాడు లేడో, ఏ కన్యకు తన తండ్రి ఎవరో తెలియదో, అలాంటి కన్యను ప్రాజ్ఞుడు వివాహం చేసుకోరాదు. ఎందుకంటే ఆ కన్య తన తండ్రికి పెంపుడు కూతురు, లేక అధర్మ సంతానం అయ్యే అవకాశం ఉంది.
బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు మొదటి వివాహం చేసుకునేందుకు స్వజాతిలో (తన వర్ణంలో) పుట్టిన కన్యయే శ్రేష్ఠమైనది. అయితే, (కామతస్తు ప్రవృత్తానామ్) కామముతో ప్రవర్తించినవారికి ఈ క్రింద తెలిపిన విధంగా అనులోమ వివాహములు శ్రేష్ఠమైనవే.
పై మూడు వర్ణముల పురుషులు తమ తమ వర్ణములకు చెందిన కన్యలను మాత్రమే కాక అవసరం మేరకు తమ కింది వర్ణముల స్త్రీలను కూడా వివాహం చేసుకొనడాన్ని ‘అనులోమ వివాహం’ అంటారు. ఒక బ్రాహ్మణుడు తన వర్ణానికి చెందిన బ్రాహ్మణ కన్యనే కాక అవసరమనుకుంటే తన కింది మూడు వర్ణములైన క్షత్రియ, వైశ్య, శూద్ర కన్యలను కూడా వివాహం చేసుకొనవచ్చు. అలాగే ఒక క్షత్రియుడు తన క్షత్రియ వర్ణానికి చెందిన కన్యనే కాక, కింది వర్ణములకు చెందిన వైశ్య, శూద్ర కన్యలను కూడా వివాహం చేసుకొనవచ్చు. అదే విధంగా ఒక వైశ్యుడు తన స్వవర్ణానికి చెందిన వైశ్య కన్యనే కాక అవసరం మేరకు ఒక శూద్రకన్యనూ వివాహం చేసుకొనవచ్చు. ఇలా కామంతో ప్రవర్తించే పై వర్ణానికి చెందిన ఒక పురుషుడు కింది వర్ణానికి చెందిన ఒక కన్యను వివాహం చేసుకొనడాన్ని అనులోమ వివాహం అంటారు. మనుధర్మశాస్త్రం దీనిని అనుమతించింది. కింది వర్ణానికి చెందిన ఒక పురుషుడు పై వర్ణానికి చెందిన స్త్రీని వివాహం చేసుకొనడాన్ని ‘ప్రతిలోమ’ లేక ‘విలోమ’ వివాహం అంటారు. దీనిని మాత్రం మనువు అనుమతించలేదు. కామంతో ప్రవర్తించిన పై మూడు వర్ణాల పురుషులకు తమ కింది వర్ణాల కన్యలను వివాహమాడేందుకు అనులోమ వివాహం పేరిట అవకాశం కల్పించిన మనువు ప్రతిలోమ లేక విలోమ వివాహాన్ని ధర్మశాస్త్ర విరుద్ధమని భావించాడు.
ఒక శూద్రునకు వివాహానికి ఎప్పుడూ శూద్రకన్యయే శ్రేష్ఠురాలు. ఒక వైశ్యునికి తన వైశ్య వర్ణానికి చెందిన కన్య లేక ఒక శూద్ర కన్య శ్రేష్ఠులే. ఒక క్షత్రియునికి క్షత్రియ కన్యయే కాక, వైశ్య, శూద్ర కన్యలు కూడా వివాహానికి శ్రేష్ఠమైనవారే. ఒక బ్రాహ్మణునికి తన స్వజాతి బ్రాహ్మణ కన్య కాక క్షత్రియ, వైశ్య, శూద్ర కన్యలూ వివాహానికి శ్రేష్ఠమైనవారే.
పై వర్ణాల వారు అవసరార్థం అనులోమ వివాహం చేసుకోవచ్చన్న మనువు దానినీ పూర్తిగా సమర్థించలేదు. పై మూడు వర్ణాల వారు శూద్ర స్త్రీని వివాహం చేసుకుంటే వారి సంతానంతో సహా శూద్రత్వం పొందుతారని కఠినంగానే నియమం విధించాడు.
ద్విజులకు శూద్ర కన్యతో వివాహం కూడదు
శూద్ర కన్యతో కామంతో ప్రవర్తించే ద్విజులు (పై మూడు వర్ణాల పురుషులు) తప్పనిసరి పరిస్థితులలో అనులోమ వివాహం చేసుకొనడాన్ని సమర్థించిన మనువు, ఆ తరువాత శూద్ర కన్యతో వివాహాన్ని ఎంత తీవ్ర పదజాలంతో ఖండించాడో చూడండి.
ఎన్ని కష్టాలలో ఉన్నప్పటికీ ఒక బ్రాహ్మణుడు, క్షత్రియుడు గృహస్థాశ్రమాన్ని కోరుకున్నట్లైతే ఒక శూద్రకన్యను వివాహం చేసుకోవచ్చని ఇతిహాసాలలో ఎక్కడా పేర్కొనలేదు. మోహంతో శూద్రజాతి కన్యను పెళ్లాడిన ద్విజులు (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలకు చెందినవారు) తమ సంతానంతో సహా శూద్రత్వాన్నే పొందుతారు.
శూద్ర స్త్రీని వివాహం చేసుకున్న బ్రాహ్మణుడు భ్రష్టుడౌతాడని అత్రి మహర్షి, గౌతమ మహర్షి చెప్పారు. ఒక క్షత్రియుడు శూద్ర స్త్రీ వలన సంతానం పొందితే పతితుడౌతాడని శౌనక మహాముని పేర్కొన్నాడు. ఒక వైశ్యుడు శూద్రకన్యకు పుట్టిన కారణంగా పతితుడౌతాడని భృగు మహర్షి పేర్కొన్నాడు.
ఒక బ్రాహ్మణుడు శూద్ర స్త్రీని పాన్పు ఎక్కించుకుని అధోగతిని పొందుతాడు. ఆమెకు సంతానాన్ని పుట్టించి తన బ్రాహ్మణత్వాన్ని కోల్పోతాడు. ఒక బ్రాహ్మణుడు తాను రోజూ చేసే హోమములు మొదలైన దైవిక క్రియలు, శ్రాద్ధములు మొదలైన పితృ సంబంధమైన క్రియలు, అతిథి దేవతల పూజలు మొదలైనవి శూద్ర స్త్రీ చేత చేయిస్తే అట్టి హవ్య కవ్యములను దేవతలు, పితృదేవతలు స్వీకరించరు. అట్టి విప్రునికి స్వర్గలోక ప్రాప్తి కూడా ఉండదు.
వృషలీ ఫేనపీతస్య నిశ్వాసోపహతస్య చ |
తస్యాం చైవ ప్రసూతస్య నిష్కృతిర్న విధీయతే || (3- 19)
వృషలుడు అంటే శూద్రుడు. వృషలీ అంటే శూద్ర స్త్రీ. ఫేనము అంటే నురుగు. నోటి నురుగు, లాలాజలము లేక అధరామృతాన్ని కూడా ఫేనము అనే అంటారు. పీతస్య - తాగినవాడు. ఒక శూద్రస్త్రీ అధరామృతాన్ని గ్రోలినవాడికి, ఆమె నిశ్వాసములచేత ఉపహతుడైనవాడికి (ఆమె నిట్టూర్పులు సోకినవాడికి), (తస్యాం చైవ ప్రసూతస్య) ఆమె యందు సంతానం పుట్టించినవాడికి, నిష్కృతిర్న విధీయతే (నిష్కృతి లేదు అంటే ప్రాయశ్చిత్తం లేదు).
అష్టవిధ వివాహాలు
నాలుగు వర్ణాల వారికి కొన్ని హితములైన, మరికొన్ని అహితములైన ఎనిమిది రకాల వివాహాల గురించి ఇప్పుడు చెప్పుకుందాం.
బ్రాహ్మో దైవస్తథైవార్ష : ప్రాజాపత్యస్తథాసురః |
గాంధర్వో రాక్షసశ్చైవ పైశాచశ్చాష్టమో 2 ధమః || ( 3-21)
బ్రాహ్మము, దైవము, ఆర్షము, ప్రాజాపత్యము, ఆసురము, గాంధర్వము, రాక్షసము, పైశాచము అని వివాహాలు ఎనిమిది రకాలు. వాటిలో ఎనిమిదవదైన పైశాచము అన్నింటిలోకీ అధమము.
ఏ వర్ణము వారికి ఏది శాస్త్రీయమైన వివాహమో, ఎవరికి ఏ వివాహం చేసుకొనడం కారణంగా ఏ యే గుణదోషాలు కలుగుతాయో, ఆ యా వివాహముల వలన పుట్టిన సంతానానికి కలిగే గుణాగుణములు ఏమిటో వాటన్నిటినీ ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రాహ్మణునికి మొదటి ఆరు రకాల వివాహాలు (బ్రాహ్మ, దైవ, ఆర్ష, ప్రాజాపత్య, ఆసుర, గాంధర్వ వివాహములు) శ్రేష్ఠమైనవే. క్షత్రియునికి చివరి నాలుగు (ఆసురము, గాంధర్వము, రాక్షసము, పైశాచము) శ్రేష్ఠమైనవి. వైశ్య, శూద్రులకు రాక్షస వివాహం మినహా మిగిలిన ఏడు వివాహాలూ శ్రేష్ఠమైనవే.
చతురో బ్రాహ్మణస్యాద్యాన్ ప్రశస్తాన్ కవయో విదుః |
రాక్షసం క్షత్రియస్యైకమాసురం వైశ్యశూద్రయోః || ( 3- 24 )
మొదటి నాలుగు రకాల వివాహములు ( బ్రాహ్మ, దైవ, ఆర్ష, ప్రాజాపత్య వివాహాలు) బ్రాహ్మణునికి ప్రశస్తములు. క్షత్రియునికి ఒక్క రాక్షస వివాహము, వైశ్య శూద్రులకు ఒక్క ఆసుర వివాహము మేలైనవని విజ్ఞులు చెపుతారు.
మొత్తం ఎనిమిది రకాల వివాహాలలో బ్రాహ్మ, దైవ, ప్రాజాపత్య వివాహములు మాత్రమే ధర్మశాస్త్ర సమ్మతములు. బ్రాహ్మణునికి ఆర్ష వివాహము, క్షత్రియునికి రాక్షస, గాంధర్వ వివాహాలు ధర్మ సమ్మతమే అయినా, ఆసుర, పైశాచ వివాహాలు మాత్రం క్షత్రియులు ఎప్పుడూ అనుసరించదగినవి కావు. గాంధర్వ, రాక్షస వివాహాలు రెండూ వేర్వేరుగా కానీ, కలిసిగానీ క్షత్రియునికి శాస్త్ర సమ్మతములే.
ఇక ఈ ఎనిమిది రకాల వివాహాల లక్షణాలు ఇలా ఉంటాయి.
వేదాధ్యయనము చేసిన, ఆచారవంతుడైన ఒక బ్రహ్మచారిని కన్య తండ్రి తమ ఇంటికి రప్పించి, అతడికి సకల మర్యాదలు చేసి, విలువైన వస్త్రాలు, నగలతో అలంకరించబడిన తన కుమార్తెను అతడికిచ్చి చేసే వివాహం బ్రాహ్మ వివాహం.
జ్యోతిష్టోమము మొదలైన యజ్ఞాలను నిర్వహించిన ఒక ఋత్విజుడికి, ఒక కన్యాదాత, ఆ యజ్ఞ నిర్వహణ సందర్భంగానే అలంకృతయైన తన కుమార్తెను కట్టబెట్టడం దైవ వివాహం.
జ్యోతిష్టోమము అనేది సోమ యాగాలలో ఒకటి. దీనిని 16 మంది ఋత్విజులు నిర్వహిస్తారు. యజ్ఞ నిర్వహణ చేసే వారిని ఋత్విజులు అంటారు. హోత, ఉద్గాత, అధ్వర్యుడు, బ్రహ్మ అనే నలుగురు యజ్ఞ నిర్వహణలో ప్రధాన ఋత్విజులుగా వ్యవహరిస్తారు. ఈ నలుగురికీ సహాయకులుగా ఒక్కొక్కరికి ముగ్గురు చొప్పున పన్నెండు మంది - అంటే మొత్తం పదహారు మంది - ఋత్విజులుగా వ్యవహరించే సోమయాగము జ్యోతిష్టోమము.
కన్యాదాత వరుడి నుంచి ఒక గో మిథునమో (ఆవుల జంట) లేక రెండు వృషభములను (ఎడ్లను) తీసుకుని తన కుమార్తెను అతడికి ఇచ్చి చేసే వివాహం ఆర్ష వివాహం.
ఇలా గోవులు లేక ఎడ్లను వరుడు కన్యాదాతకు ఇచ్చి కన్యను స్వీకరించడం కన్యాశుల్కం లేక ఓలి లేక ఉంకువ ను సూచిస్తున్నది. వ్యవసాయం ద్వారా ఆహారధాన్యాలను పండించడం నేర్చుకోక ముందు మానవులకు పశుసంపదే ప్రధానమైన సంపద. ప్రాచీన ఈజిప్షియన్, గ్రీకు, భారతీయ సమాజాలలో ఇదే తరహాలో పశువులను కన్యాశుల్కంగా ఇచ్చి వివాహం చేసుకునే ఆచారం ఉంది. వివాహంలో వధువు తండ్రి వరునికి వరకట్నం ఇచ్చే ఆచారం కంటే వరుడే వధువు తండ్రికి కన్యాశుల్కం ఇవ్వడం చాలా ముందరి కాలపు ఆచారమని చరిత్ర పరిశోధకులు తేల్చారు.
‘మీరు ఇరువురూ కలిసి ధర్మం ఆచరించండి’ అని వధూవరులకు చెపుతూ వరపూజ చేసి (పెళ్లి కుమారుడిని పూజించి) వధువు తల్లిదండ్రులు అతడికి కన్యాదానం చేసే వివాహం ప్రాజాపత్య వివాహం.
వరుడు వధువుకు, ఆమె బంధువులకు తన శక్తి మేరకు ధనాన్ని ఇచ్చి, తన ఇష్టం ప్రకారం చేసుకునే వివాహం ఆసుర వివాహం.
స్త్రీ పురుషులు ఇరువురూ ఒకరి పట్ల మరొకరు గాఢమైన అనురక్తితో చేసుకునే వివాహం గాంధర్వ వివాహం. దీని ప్రధాన ఉద్దేశం ఇరువురూ తమ కామ వాంఛ తీర్చుకోవడమే. కామం కారణంగా ఏర్పడిన ఈ వివాహం లక్ష్యం మైథున క్రియయే.
హత్వా ఛిత్వా చ భిత్వా చ క్రోశంతీం రుదంతీం గృహాత్ |
ప్రసహ్య కన్యాహరణం రాక్షసో విధిరుచ్యతే || ( 3- 33 )
కన్య యొక్క బంధువులు వివాహానికి సమ్మతించనప్పుడు అడ్డుపడిన వారందరినీ హత్యచేసి, చీల్చి చెండాడి, ఖండఖండాలుగా వారిని నరికి, వరుడిని తిట్టిపోస్తూ ఏడుస్తూ ఉన్న కన్యను బద్దలు కొట్టబడిన ఆమె ఇంటినుంచి బలవంతముగా తీసుకెళ్లి చేసుకునే వివాహం రాక్షస వివాహం.
ఒక స్త్రీని ఆమె ఇష్టంతో పనిలేకుండా నిద్రిస్తున్నదానిని లేక మత్తులో ఉన్నదానిని లేక ఏమరుపాటుగా ఉన్నదానిని బలాత్కారముగా అనుభవిస్తే దానిని పైశాచ వివాహం అంటారు. పిశాచాలు పాటించే ఈ ఎనిమిదవ తరహా వివాహం అష్టవిధ వివాహాలలో అధమమైనది.