Menu Close
manusmrithi page title
రెండవ అధ్యాయము (ఎ)

గాయత్రి మంత్రాన్ని జపింపక, కాలానుగుణంగా చేయాల్సిన క్రియలను చేయకుండా ఉండే ద్విజుడు (బ్రాహ్మణుడు, క్షత్రియుడు లేక వైశ్యుడు) సాధుజనులలో (సజ్జనులలో) గర్హణమునకు అంటే నిందకు పాత్రుడౌతాడు.

ఓంకారముతో కూడుకొని, అవ్యయములైన (నాశ రహితములైన), భూర్భువస్సువములనే మహావ్యాహృతులు, త్రిపద అంటే మూడు పదములు కలిగినదైన సావిత్రి - అంటే గాయత్రి మంత్రం - వేదానికి ముఖము అని తెలుసుకొనండి.

వేదాధ్యయనము చేసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా -

‘ఓం భూర్భువస్స్వః
తత్సవితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి |
ధియో యో నః ప్రచోదయాత్ ||’

-- అంటూ గాయత్రి మంత్రాన్ని చదువుతూనే వేదాధ్యయనాన్ని ప్రారంభించాలి. వాస్తవానికి దీనిని అందరూ గాయత్రి మంత్రం అంటున్నా ఇది సవితృ (సూర్య) ఉపాసన మంత్రం. అందుకే దీనిని సావిత్రి మంత్రం అని కూడా అంటారు. గాయత్రి అనే ఛందస్సులో ఉన్న కారణంగా ఇది గాయత్రి మంత్రం పేరిట ప్రాచుర్యం పొందింది. ఈ మంత్రంలో మానవుడు అన్ని శక్తులలోకీ గొప్పదైన ధీ శక్తి (Higher Intelligence) ని తనకు ప్రసాదించ వలసిందిగా సూర్యుడిని ప్రార్థిస్తాడు. భూమినీ, ఆకాశాన్నీ, స్వర్గాన్నీ తేజోమయం చేస్తున్న సవితా (కాంతికి మూలమైన దైవం) యొక్క తేజస్సుకు మాత్రమే కాక, దేవతలు వెలుగొందడానికి కూడా మూల కారణమైనట్టి ధీ శక్తిని మాలో ప్రచోదనం చెయ్యి (మాయొక్క ధీ శక్తిని చిలుకు, ప్రేరేపించు). శరీరానికి కన్ను ఎలాంటిదో, మనస్సుకు ధీశక్తి అలాంటిదనీ, మానవులు సంపాదించగలిగే శక్తులలో ధీ శక్తే అత్యుత్తమమైన శక్తి అనీ, అదే అత్యున్నతమైన జ్ఞానమనీ  వేదాలు స్పష్టంచేశాయి. భగవద్గీత (సాంఖ్య యోగము - 54) కూడా ధీశక్తి ఎవరిలో స్థిరంగా ఉంటుందో, అలాంటి స్థిరబుద్ధి కలిగిన స్థిత ప్రజ్ఞుడిని ‘స్థితధీ’ అని పేర్కొంది.

ఎవడు ప్రతిదినము అతంద్రితుడు కాక అంటే సోమరిపోతు కాక, ఓంకార పూర్వకమైన మహావ్యాహృతులను త్రీణి వర్షాణి అంటే మూడు సంవత్సరాలపాటు జపిస్తాడో వాడు బ్రహ్మపదం పొందుతాడు. అతడు వాయువు వలె కామచారి అంటే కోరుకున్న చోటికి వెళ్ళగలిగే వాడిగానూ, సాక్షాద్బ్రహ్మ స్వరూపునిగానూ మారిపోతాడు.

ఏకాక్షరము అంటే ‘ఓమ్’ అనే ఒక అక్షరాన్ని మించిన  బ్రహ్మము లేదు. ప్రాణాయామమును మించిన తపస్సు లేదు. సావిత్రి (గాయత్రి) ని మించిన మంత్రం లేదు. మౌనంగా ఉండడం కంటే సత్యం చెప్పడం గొప్పది.

వేదాల్లో చెప్పబడిన హోమాలు, యజ్ఞాల వంటివన్నీ క్షరములే అంటే  నశించిపోయేవే. ఒక్క ‘ఓమ్’  అనేది మాత్రం ఎన్నటికీ నశించనిది (అక్షరం). అదే బ్రహ్మము, అదే ప్రజాపతి కూడా.

విధియజ్ఞాజ్జపయజ్ఞో విశిష్టో దశభిర్గుణై : |
ఉపాంశు : స్యాచ్ఛతగుణః సాహస్రో మానసః స్మృతః || ( 2 -85)

వేదాలలో చెప్పబడిన విధిని అనుసరించి చేసే యజ్ఞం విధియజ్ఞం. దానికంటే జప యజ్ఞం అంటే ఓంకార, మహా వ్యాహృతులు జపిస్తూ చేసే క్రియ పదిరెట్లు మెరుగైనట్టిది. అదే ఉపాంశువుగా అంటే పక్కనున్నవారికి కూడా వినిపించకుండా అతి మెల్లగా చేసే జపయజ్ఞం వందరెట్లు మెరుగైనట్టిది. నాలుక, పెదవి కాస్త కూడా కదిలించకుండా వేద మంత్రాలను మనసులోనే జపిస్తూ చేసే మానసికం వేయిరెట్లు మెరుగు.

వైశ్వదేవము, బలికర్మ, నిత్యశ్రాద్ధము, అతిథి భోజనము, బ్రహ్మ యజ్ఞము - ఈ ఐదింటినీ పంచ మహా యజ్ఞములు అంటారు. వీటిలో బ్బ్రహ్మయజ్ఞం మినహా మిగిలిన నాలుగింటినీ పాకయజ్ఞాలు అంటారు. ఈ నాలుగు పాకయజ్ఞాలు, విధి యజ్ఞాలు మొత్తం కలిపినా గాయత్రి జపిస్తూ చేసే జప యజ్ఞం విలువలో పదహారవ వంతు కూడా చెయ్యవు.

విధియజ్ఞములు తదితర వేద విహితమైన క్రియలు చేసినా చేయకున్నా బ్రాహ్మణుడు జపయజ్ఞం చేతనే నిస్సంశయంగా మోక్షసిద్ధిని పొందుతాడు. సర్వప్రాణి మైత్రుడైన బ్రాహ్మణుడు కూడా యజ్ఞముల సందర్భంగా జీవహింస చేయక తప్పదు. కావున ఆ కారణంగా బ్రాహ్మణుడు కొన్ని జంతువులకు విరోధి కావలసి వస్తుంది. అయితే అతడు జపయజ్ఞం పాటిస్తే ఏ ప్రాణికీ విరోధి కాకుండా సకల ప్రాణికోటికీ మిత్రునిగానే ఉండగలుగుతాడు.

వేదయుగంలో విధి యజ్ఞాలు (శ్రుతులలో చెప్పబడిన విధులకు అనుగుణంగా అంటే నియమాల ప్రకారం చేసే శ్రౌత యజ్ఞాలు) ముక్తికి సోపానాలుగా భావించేవారు. హింసకు వ్యతిరేకంగా బౌద్ధ, జైన ధర్మాలు చేసిన ప్రచారం ప్రభావం కారణంగా, హింస తగ్గుముఖం పట్టి క్రమంగా హింసాత్మకమైన విధియజ్ఞాల స్థానాన్ని హింసకు తావులేని జపయజ్ఞాలు ఆక్రమించసాగాయి. భగవద్గీత లోని విభూతియోగములోని 25 వ శ్లోకంలో శ్రీకృష్ణుడు అన్నిటా ఉత్తమోత్తమమైనవి తానే అని చెపుతూ, యజ్ఞాలలో తాను ‘జప యజ్ఞా’న్నని చెపుతాడు. అంటే హింసాత్మకమైన పలు శ్రౌత యజ్ఞాల కంటే జప యజ్ఞమే ఉత్తమోత్తమమైనదని భావం.

‘మనుస్మృతి’, ‘భగవద్గీత’ లలోని ఈ ప్రస్తావనలనుబట్టి అప్పటికి యజ్ఞ నిర్వహణలో చోటుచేసుకుంటున్న క్రమ పరిణామాన్ని మనం గమనించవచ్చు.

ఒక సారథి తన రథం లాగుతున్న గుర్రాలను పక్కకి పరుగెత్తకుండా తన అదుపులోనే ఉంచుకుంటాడు. అదే విధంగా ఒక విద్వాంసుడు తన ఇంద్రియాలను తన అదుపులో పెట్టుకుని అవి తమ విషయముల వైపు పరుగెత్తకుండా జాగ్రత్త పడతాడు. (ఇంద్రియాలు వేటిని పొందగోరుతాయో వాటిని విషయములు అంటారు. చెవి మంచి సంగీతాన్ని వినగోరుతుంది. కన్ను చక్కటి దృశ్యాలు చూడగోరుతుంది. చెవి అనే ఇంద్రియానికి సంగీతం విషయం. అలాగే దృశ్యం కన్ను అనే ఇంద్రియానికి విషయం.)

మన పెద్దలు పదకొండింటిని ఇంద్రియములుగా పేర్కొన్నారు. అవి వరుసగా - శ్రోత్రింద్రియం (చెవి), త్వగింద్రియం (చర్మం), చాక్షుసేంద్రియం (కన్ను), రసనేంద్రియం (జిహ్వా లేక నాలుక), ఘ్రాణేంద్రియం (నాసికా - ముక్కు) - ఈ ఐదూ జ్ఞానేంద్రియాలు. మలద్వారము, స్త్రీ / పురుష మర్మావయవము, కాలు, చేయి, వాక్కు - ఈ ఐదింటినీ పంచ కర్మేంద్రియములు అంటారు. మనస్సు పదకొండవ ఇంద్రియం. ఇది జ్ఞానేంద్రియాలనూ, కర్మేంద్రియాలనూ అదుపు చేస్తుంది. మనస్సును అదుపులో ఉంచుకున్న వ్యక్తి ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్నట్టే.

విషయ సుఖములు పొందటం చేత ఇంద్రియాలు శాంతింపవు. కోరిక విషయాభిలాషచేత ఎప్పటికీ తీరదు. ఉదాహరణకు ఎంతగా పొందినా కామం ఇంకా ఇంకా ప్రకోపిస్తూనే ఉంటుంది. అగ్నిలో పోసిన నెయ్యి కారణంగా అగ్ని మరింతగా ప్రజ్వరిల్లుతుంది. ఇంద్రియాలకు విషయాల పట్ల ఆసక్తి ఉండే కారణంగా మానవుడు భూలోకంలో కష్టాన్నీ, పరలోకంలో పాపాన్నీ పొందక తప్పదు. అలాంటి ఇంద్రియాలను అదుపులో ఉంచుకుంటేనే మోక్ష సిద్ధి సాధ్యం. అందుకే ప్రతివారూ ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాల్సి ఉంది.

కొందరు సకల విషయములనూ పొందగలమని భావిస్తారు. అయితే అది సాధ్యం కాదు. విషయాలు పొందే కొద్దీ ఇంద్రియాలకు మరింతగా విషయవాంఛ పెరుగుతూ పోతుంది. కనుక కోరికలను త్యజించి ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడమే ముముక్షువులకు (ముక్తి కోరుకునే వారికి) ఉత్తమ మార్గం. విషయాభిలాష ఉన్నవాడికి వాటిని సంపాదించడానికి ఎంతో కష్టపడాలి. ఈ సాధనలో ఎన్నెన్నో కష్టనష్టాలు ఎదుర్కోవలసి ఉంటుంది. సాధించిన తరువాత ఏ కారణం చేతనైనా ఆ విషయం అతడికి దూరమైతే ఆ వ్యక్తి పడే బాధ వర్ణనాతీతం. విషయాపేక్ష లేనివాడికి ఈ బాధలు, కష్టాలు ఏవీ ఉండవు. కనుక మోక్షగాములకు కోరికలను త్యజించడమే ఉత్తమ మార్గం.

అయితే ఇంద్రియములను విషయములనుంచి మరల్చడం అంత తేలికైన విషయమేమీ కాదు. ఇంద్రియములు ఆ యా విషయములను అనుభవించడం అనివార్యమైనదని అందరూ గుర్తించాలి. అయితే విషయ సుఖాలు అనుభవించడం ద్వారా కాక, ఒక వ్యక్తి వివేక జ్ఞానాన్ని పొందడం ద్వారా మాత్రమే నిత్యానిత్య వివేచన పొందగలడు. వేదాధ్యయనము, యాగములు, యజ్ఞములు, నియమములు, తపస్సు వంటివి చెడు తలంపు ఉన్న విప్రునికి ముక్తి సాధనా క్రమంలో ఎలాంటి సిద్ధినీ కలిగించవు.

ఎవడు పొగడ్తనూ, దూషణనూ సమానంగా స్వీకరిస్తాడో, ఎవడు మెత్తని పట్టునూ, గరుకైన కంబళినీ ఒకే విధంగా భావిస్తాడో, ఎవడు మంచి రూపవతిని చూసినా, కురూపిని చూసినా ఒకే రకంగా స్పందిస్తాడో, ఎవడు మధురాన్నం తిని, చేదయిన అన్నం తిని కూడా ఒకే తీరుగా ఉంటాడో, సువాసనలనూ, దుర్వాసనలనూ ఎవడు ఒకే రీతిలో స్వీకరిస్తాడో, ఎవడు సుఖాలలో సంతోషాన్నీ, కష్టాలలో దుఃఖాన్నీ పొందడో -- వాడే జితేంద్రియుడు. ఇంద్రియాలను జయించడం అంటే ఈ తరహా మానసిక స్థితిని అలవరచుకోవడం అన్నమాట.

మొత్తం ఇంద్రియాలలో ఒక్క ఇంద్రియం విషయాసక్తమై ఉన్నా, అట్టి వాడి జ్ఞానము బెజ్జము పడిన తోలు సిద్దె లోని నీటి వలె కారిపోయి ఆ జ్ఞానం నశిస్తుంది.

కాబట్టి ఇంద్రియాలన్నిటినీ లోబరచుకుని, మనసును అదుపులో ఉంచుకున్న వ్యక్తి యోగసాధనచేసి శరీరాన్ని శుష్కింపజేయవలసిన అవసరం లేకుండానే తాను కోరుకునే లక్ష్యాలన్నింటినీ సులువుగా సాధించగలడు.

***సశేషం***

Posted in November 2020, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!