Menu Close
manusmrithi page title
మొదటి అధ్యాయము (ఏ)

మను ధర్మ శాస్త్ర ప్రశంస

విదుషా బ్రాహ్మణేనేద మధ్యేతవ్యం ప్రయత్నతః |
శిష్యేభ్యశ్చ ప్రవక్తవ్యం సమ్యజ్ఞాన్యేన కేనచిత్ || (1 -103)

ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేయడం యొక్క ప్రయోజనం బాగా తెలిసినవాడైన బ్రాహ్మణోత్తముడు ఈ మను ధర్మశాస్త్రాన్ని ప్రయత్నపూర్వకంగా (జాగ్రత్తగా) చదవాలి. అతడే  శిష్యులకు చెప్పాలి. తదితర వర్ణాలకు చెందినవారు దీనిని ఇతరులకు చెప్పరాదు.

ఈ శ్లోకం ప్రకారం క్షత్రియులు, వైశ్యులు మను ధర్మ శాస్త్రం చదవకూడదని ఎక్కడా నియమంలేదు. అయితే వారు దీనిని ఇతరులకు బోధించడం మాత్రం  నిషిద్ధం. ఒక్క బ్రాహ్మణుడికి మాత్రమే ఈ ధర్మశాస్త్రాన్ని అధ్యాపనం చేసే అంటే ఇతరులకు బోధించే అధికారం ఉంది. శూద్రుడికి ఈ ధర్మశాస్త్రం బోధించడమే కాదు; చదవడం, వినడం కూడా నిషిద్ధమే.

ఇదే విషయమై ‘కవిరాజు’ త్రిపురనేని రామస్వామి తన ‘సూత పురాణం’ కావ్యంలో సూతుడిని ఇలా ప్రశ్నిస్తాడు - “అయ్యా! బ్రాహ్మణేతరులు వివేచనతో సంస్కృత భాషను చదవకూడదా? చదివిన వాటినన్నింటినీ వారు ద్విజన్ములకు (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు) వినిపించకూడదా? అలా ఎవరైనా చేస్తే వాళ్ళు నరకంలో నశించక తప్పదా? ఈ ధర్మసూక్ష్మం కొంచెం వివరించి చెప్పండి.”

అప్పుడు సూతుడు ఇలా బదులిస్తాడట - “లోగడ ఒక సత్త్రయాగం సందర్భంగా వ్యాసుడికీ, శౌనకుడికీ ఇదే విషయమై సంవాదం జరిగింది. జన్మ బ్రాహ్మణుడు కాని సూతుడు చేసే కావ్య గానం, చెప్పే ధర్మ సూక్ష్మాలు బ్రాహ్మణులు వినవచ్చా? అన్న శౌనకుడి ప్రశ్నకు వ్యాసుడు - ధర్మవ్యాధుడనే ఒక బోయవాడి నుంచి లోగడ కౌశికుడు ధర్మ సూక్ష్మాలు తెలుసుకున్న విషయం చెప్పి, బ్రాహ్మణేతరుడు అలా చెప్పడం కానీ, బ్రాహ్మణులు అది వినడం కానీ ఎంతమాత్రం ధర్మ విరుద్ధం కాదని తెలిపాడు. మీ తెలుగుదేశంలోనే కంచెర్ల గోపన్న అనే బ్రాహ్మణుడు విద్వాంసులు వేనోళ్ళ కీర్తించే భక్తి యోగాన్ని మ్లేచ్ఛుడైన కబీర్ దాస్ చెప్పగా విని తెలుసుకోలేదా?”

ఇలా శూద్రుడు ధర్మశాస్త్రాలు చదవ కూడదు, విన కూడదు, బోధించ కూడదు అంటూనూ, క్షత్రియులు, వైశ్యులు ధర్మశాస్త్రాలు చదవవచ్చు, వినవచ్చు కానీ బోధించరాదంటూనూ మన ప్రాచీనులు విధించిన ఆంక్షలు ఎంత అర్థరహితమైనవో సున్నితంగా, వ్యంగ్యంగా విమర్శించారు ‘కవిరాజు’.

ఈ ధర్మశాస్త్రాన్ని కఠిన నియమములతో అధ్యయనం చేస్తూ, ఆ యా విధులను ఆచరించే బ్రాహ్మణునికి మనోవాక్కాయ సంబంధములైన పాపములేవీ అంటవు.

ఇంకా ఈ ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేసి, అనుష్ఠించే బ్రాహ్మణుడు తాను కూర్చున్న పంక్తిలో తనతో పాటు కూర్చున్న అపాంక్తేయులను సైతం పావనులను చేస్తాడు. (అప్రాస్యులు లేక అపాంక్తేయులు అంటే సహపంక్తి భోజనానికి - కలిసి కూర్చుని భోజనం చేయడానికి - అర్హత లేనివారు). తన ముందు ఏడు తరాల వారిని, తన తరువాత ఏడు తరాల వారిని అతడు పరిశుద్ధులను చేస్తాడు. అట్టి వ్యక్తి సకల ధర్మజ్ఞుడు అయిన కారణంగా అతడు ఈ సమస్త భూమండలాన్నీ దానంగా పొందేందుకు కూడా అర్హుడు.

ఈ ధర్మశాస్త్రం చదవడం మన కోర్కెలు నెరవేర్చుకొనడానికి చక్కని సాధనం. నిత్య కర్మలను ఎలా చేయాలో బోధిస్తుంది కనుక ఇది శ్రేష్ఠమైనది. అన్నిరకాల విధి నిషేధములను తెలిపేది కనుక ఇది బుద్ధి వివర్ధనము (జ్ఞానాన్ని పెంపొందించేది). ఇది కీర్తినీ, దీర్ఘాయుష్షునూ ఇస్తుంది. మోక్షానికి ఇదే ప్రధాన సాధనం.

ఈ ధర్మశాస్త్రంలో ధర్మం సమగ్రంగా చెప్పబడింది. ఏవి చేయదగిన పనులో, ఏవి చేయదగనివో, ఏవి ధర్మములో, ఏవి అధర్మములో చెప్పడం మాత్రమే కాదు. విహితములు చేస్తే కలిగే మంచి, నిషిద్ధములు చేస్తే జరిగే కీడు వివరంగా చెప్పబడింది. నాలుగు వర్ణాల ప్రజలు నిత్యం పాటించవలసిన ఆచారములను కూడా ఇది వివరించింది.

శ్రుతులలో, స్మృతులలో చెప్పబడిన ఆచారములే పరమ ధర్మములు. కనుక ఒక ద్విజుడు తప్పనిసరిగా ఆచారవంతుడై ఉండాలి. అతడు ప్రయత్నపరుడై ఆచారాలను తు. చ. తప్పక పాటించాలి.

ఆచారాద్విచ్యుతో  విప్రో న వేదఫల మశ్నుతే |
ఆచారేణ తు సంయుక్తస్సంపూర్ణ ఫల భాగ్భవేత్ || (1 - 109)

ఆచారము నుంచి విచ్యుతుడైన (తొలగిన) విప్రుడికి వేద ఫలం లభించదు. మరో పక్క ఆచారవంతుడికి సంపూర్ణ ఫలం లభిస్తుంది. ఆచారం మీదనే ధర్మశాస్త్రం మొత్తం ఆధారపడి ఉందని గ్రహించిన మునులు తమ తపస్సుకు సదాచారాన్నే మూలాధారంగా చేసుకున్నారు.

ఇక ఈ ధర్మశాస్త్రంలోని మొదటి అధ్యాయంలో జగత్తు ఎలా ఉత్పత్తి అయిందో వివరించబడింది. రెండవ అధ్యాయంలో ధర్మ లక్షణములు, ప్రమాణములు, సంస్కారములు, బ్రహ్మచర్య వ్రతము వంటివి వివరించబడ్డాయి. మూడవ అధ్యాయములో స్నాతక విధులు, వివాహ విధానము, గృహస్థు పాటించవలసిన వైశ్వదేవం మొదలైన పంచమహాయజ్ఞముల గురించి, శ్రాద్ధ కర్మలు మొదలైన వాటి గురించి చెప్పబడింది. నాలుగో అధ్యాయంలో గృహస్థు నియమాలు, జీవనోపాధి సాధన మార్గాలు వంటివి చెప్పబడ్డాయి. ఐదవ అధ్యాయములో వర్జించదగు కొన్ని ఆహారాలు, మరణం కారణంగా కలిగే అశౌచాల వంటి వాటి గురించి వివరించబడింది. ఆరవ అధ్యాయములో వానప్రస్థ ధర్మాలు, యతి ధర్మాలు, సన్యాస ధర్మాలు వివరించబడ్డాయి. ఏడవ అధ్యాయంలో రాజ ధర్మాలు చెప్పబడ్డాయి. ఎనిమిదో అధ్యాయంలో న్యాయ నిర్ణేతలు విచారణలో ధర్మ నిర్ణయం చేయడం, సాక్షులను ప్రశ్నించే విధానం వంటివి ఉన్నాయి. తొమ్మిదవ అధ్యాయంలో స్త్రీ పురుషులు  కలయిక, ఎడబాటు సందర్భంగా పాటించవలసిన ధర్మసూత్రాలు, ధనము యొక్క దాయ భాగము గురించి, జూదమును గూర్చిన విధులు మొదలైనవన్నీ వివరించబడ్డాయి. పదవ అధ్యాయంలో వర్ణ సంకరం కారణంగా ఏర్పడిన పలు కొత్త జాతుల గురించి, వారు అవలంబించదగిన వృత్తుల గురించి, ఆపద్ధర్మాన్ని గురించి వివరించడం జరిగింది. పదకొండవ అధ్యాయంలో ప్రాయశ్చిత్త విధుల గురించి చెప్పబడింది. పన్నెండవ అధ్యాయంలో దేహాంతర ప్రాప్తి గురించి, మూడు విధములైన కర్మల గురించి, శాస్త్ర విహితములైన, శాస్త్ర నిషిద్ధములైన కర్మల ఫలితముల గురించి, దేశ ధర్మములు, జాతి ధర్మములు, శాశ్వత కుల ధర్మములు, పాషండుల ధర్మాధర్మాల గురించి వివరించబడింది. స్వాయంభువ మనువు చెప్పిన ఈ ధర్మశాస్త్రంలో ఇవన్నీ ఉన్నాయి. మనువు నాకు చెప్పిన విధంగానే నేను మీకు ఈ ధర్మశాస్త్రాన్ని యథాతథంగా చెపుతాను. వినండి - అన్నాడు భృగు మహర్షి మునులతో.

(భృగు మహర్షి చెప్పిన మానవ ధర్మ శాస్త్ర సంహిత మొదటి అధ్యాయం సంపూర్ణం)

***సశేషం***

Posted in April 2020, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!