''ఆంటీ, నాన్నగారికి అస్సలు బాగాలేదు. నెలరోజులుగా ఎవరినో కలవరిస్తున్నారు. ఫోన్లో ఓకే నంబరుకి ఎన్నోసార్లు కాల్ చేస్తున్నారు. అది మీ నంబర్. ''వాళ్ళు ఇక్కడలేరు. అమెరికా వెళ్లారు కదా నాన్న....అని చెప్పినా అయన మైండ్లో మీతో గడిపిన రోజులే స్థిరంగా వున్నాయి.
బంధువులు స్నేహితుల ఫోన్ నంబర్లు వెదికి అందుబాటులో వున్నవారందరినీ పిలిపించాను. వాళ్ళను చూసేరు. ఏదో అన్నారు. అర్థం కాలేదు.
'ఏమి చేయాలి డాక్టర్ అని అడిగితే ఆయన మనసులో ఎవరో వున్నారు. వారు రావాలి. అంతదాకా ఇలాగే వుంటుంది పరిస్థితి’ అన్నారు. అది మీరే అని అర్థం అయినా ఏమి చేయాలో తెలియడంలేదు.
నిజానికి సంవత్సరంగా నాన్న మీ ఇంటికి వెళ్లడం మీరు వున్నారా అని చూడటం జరుగుతోంది. అమ్మ చనిపోయాక నాదగ్గిరకి రండి నాన్న...అని అడిగాను. నా ఆరోగ్యం బాగానేవుంది పర్వాలేదు అంటూ దాటవేస్తున్నారు. ఎప్పటినుంచో అలవాటైన వంటావిడ, పనివాడు రంగయ్య కనిపెట్టి వున్నారు కదా అని నేను ఊరుకున్నాను. ఆయన కోరికమీద ప్రతివారం నేను కుటుంబంతో వెడుతున్న. చెల్లీ, అక్క బావలూ పిల్లలతోబాటు వస్తున్నారు. ఆరోజు మాతో సంతోషంగా గడిపేవారు......
క్రమంగా మార్పు వచ్చింది. తరచూ ఫోన్లు చేయడం, చెప్పకుండా బైటికి వెళ్లిపోవడం చేస్తున్నారు. డాక్టరుకి చూపిస్తే కొన్ని రోజులు ట్రీట్మెంట్ ఇచ్చారు. బాగానే కోలుకున్నారు. మూడునెలల తరువాత సడెన్గా కళ్ళుతిరిగి పడిపోయారు. మళ్ళీ హాస్పిటల్ కి తీసుకువెళ్ళాము.
నెలరోజులున్నారు. కానీ మెమరీ పోయింది .....చూస్తూవుంటారు. మాటలో స్పష్టత లేదు. అలాని చేతులూ కాళ్ళూ పనిచేస్తున్నాయి. నేను మాఇంటికి తీసుకు వచ్చేశాను. కొన్నిరోజులు అక్క, కొన్నిరోజులు చెల్లి కనిపెట్టి వుంటున్నారు......అంకుల్తో చెప్పండి. వీడియోకాల్ చేస్తాను. మీరిద్దరూ నాన్నను చూడవచ్చు. మీ తీరిక టైము చెప్పండి.....” అంటూ రాహుల్ తన తండ్రి ప్రసాద్ గురించి ఫోన్ చేసి చెప్పాడు.
ఆ రోజు చరణ్, రేవతికీ చాలా బాధ అనిపించింది. అమెరికా లో నాలుగేళ్లుగా వుంటున్నారు. మధ్యలో ఒకసారి ఇండియా వెళ్ళినపుడు స్నేహితులు నలుగురూ కలిశారు. హాపీగా గడిపారు. ఆ తరువాత ఫోన్లు చేసుకోవడం వీడియో కాల్స్ చేసుకొని మాటాడుకోవడంతో గడిచిపోయింది.
హైదరాబాదులో ఉన్నప్పుడు వాళ్ళు నలుగురు స్నేహితులూ వారానికోరోజు సినిమా ఒకసారి బైట హోటల్లో డిన్నర్ చేయడం లేదా ఎవరో ఒకరి ఇంట్లో టిఫిన్ చేయడం ఏదైనా మ్యూజిక్ కన్సర్ట్ కి వెళ్లడం ఆలా సరదాగా గడిచిపోయేది. పుట్టిన రోజులు ఏదైనా పండుగ రోజూ వస్తే కలిపి జరుపుకునేవారు.
సావిత్రికి ఏ భాషచిత్రమైన సరే ప్రతివారం చూడాలనేటంత ఇష్టం. ఒకేరోజు మూడు సినిమాలు చూసినరోజులూ వున్నాయి.
''సావీ ఎలా చూస్తావు....తలనొప్పిరాదూ అంటే రాదు. ఇప్పుడు చూసిన సినిమా బాగాలేదు. మంచిసినిమా చూడకపోతే వస్తుంది.''అనేది. నాలుగు రోజులు తిరిగితే నెలరోజులు ఏదో ఒక బాధ.
సావీకి హెల్త్ ప్రాబ్లెమ్. అందువల్ల ప్రసాదు సావీ ఏది అడిగిన 'వద్దు' అనేవాడుకాదు. వాళ్ళు చాల ప్రేమగా ఉండేవారు. మాకు అసూయగా వుండేది. సావీ అన్నతమ్ములు మేనమామలూ కజిన్స్ అంతా డాక్టర్లే. సావి అనారోగ్యం మాత్రం తెలీలేదు. ఆమెకు సంతోషం కలిగించడం ఒక్కటే మనం చేయాల్సింది ....అనే నిర్ణయానికి వచ్చారు అంతా.
కాలానుగుణంగా అన్ని పరిణామాలకూ అలవాటు పడ్డారు. రోజులు బాగానే గడిచిపోతున్నాయి అనుకునే టైములొ ప్రసాదుకి పెద్ద లోటు భార్య సావిత్రి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం.
ప్రసాదు కోలుకోడానికి స్నేహితులు చేయని ప్రయత్నము లేదు. మూడేళ్ళకి అతనూ జబ్బుపడ్డాడు. జీవిత గమనంలో అనారోగ్యాలు ఒడిదుడుకులూ నిష్క్రమణలూ తప్పవు. కానీ మనకు ఆత్మీయులు అనేవారి విషయంలో అది జరిగితే తట్టుకోలేం.
ఇప్పుడు ప్రసాద్ వంతు వచ్చిందా...అని వేదన కలిగింది. ఫేస్ టైం వీడియో ఆన్ చేసారు. కానీ ప్రసాద్ ఇటువైపు చూడలేదు. ఏ మాత్రమూ స్పందించలేదు.
ఆలా బెడ్ మీద వున్నాడు. కాసేపు రాహుల్ తో మరియు తన అక్క చెల్లెలుతో మాట్లాడేరు.
మరో నెలరోజులు అలాగే గడిచాయి. ప్రసాద్లో మార్పు లేదు. కానీ మూసుకున్న కళ్లనుంచి నీళ్లు కారుతుంటే,
అతడి బాధ పెరిగిందని రాహుల్ రోజూ చెపుతుంటే చరణ్ అన్నాడు.
''పద మనం ఇండియా వెడదాం.... అని.! రేవతి సిద్ధమైపోయింది. ఈ కోవిడ్ పరిస్థితిలో ఎలా వద్దు అనలేదు.
ఆత్మీయ నేస్తానికి సంతృప్తి ఇవ్వగలిగితే అంతకు మించిన ధర్మం ఏముంటుంది? అనుకుంది.
హైదరాబాదులో ఫ్లైట్ దిగి వెంటనే రాహులకి ఫోను చేసారు. ఇంటిముందు కారుదిగి పరుగు పెట్టినట్టే ప్రసాదు దగ్గిరకి వెళ్లారు.
రాహుల్ తండ్రి చెవిలో 'చరణ్ అంకుల్ - రేవతీ ఆంటీ వచ్చారు' చెప్పగానే ప్రసాద్ చేయి కదిలింది.
ఇద్దరూ ప్రసాద్ చెరోచేయి పట్టుకున్నారు. ఆ స్పర్శతో అతడి చేతులు పట్టు బిగించాయి.
''ప్రసాద్ మేము నీతో వున్నాము ఒక్కసారి చూడు''అన్నాడు చరణ్.
ప్రసాద్ పెదవులు చిన్న మందహాసంతోపాటు కొద్దిగా కదిలాయి.
అందరికీ అర్థమైంది. ప్రసాద్ లో స్పందన చిన్నపాటి తెలివి వచ్చాయని.
అంతే పూర్తిగా కోమాలోకి వెళ్ళిపోయాడు. అక్కడవున్న డాక్టరు చెప్పేరు.
''ప్రసాద్ ఎదురు చూసింది మీకోసమే.....అతని కోరిక తీరింది''.
అంకుల్ థాంక్స్ ఫర్ కమింగ్. ఇంటికెళ్లి రెస్ట్ తీసుకోండి. ...అన్నాడు రాహుల్ కృతజ్ఞతగా.
చరణ్ రేవతి ఇంటికి వెళ్లారు. చివరిసారి ప్రసాదునీ చూసి.
మరునాడు ఉదయమే రాహుల్నుంచి ఫోను వచ్చింది.
ఈ కథ ద్వారా
రచయిత ఏమి సందేశం ఇవ్వదలచు కున్నారో అర్థం కాలేదు.