గమ్యానికి గమనం

అలుపు సొలుపు లేక
అందమైన బాటలలో
మాటామంతీ లేక
విసుగు విరామం లేక
దట్టమైన అడవుల్లో
చెట్లనుంచి దూసుకుంటూ
చెరువు ప్రక్క రాచుకుంటూ
నదుల మీంచి దాటుకుంటూ
పల్లెలలోంచి పాకుకుంటూ
కొండల్ని కలుసుకుంటూ
గుట్టల్ని కరుచుకుంటూ
బహుదూరం బహుదూరం
పయనించే ఓ ! రైలూ !
పెద్దలని మోస్తావు
పేదలని మోస్తావు
పెట్టెల్ని మోస్తావు
కట్టెల్ని మోస్తావు
కాసులు నిండా నింపిన
సంచుల్ని మోస్తావు
ముసలి ముతకలని
చిన్న చితకలని
భిన్నం లేకుండా
భుజం మీద మోస్తావు
రాత్రనక పగలనక
ఎండనక వాననక
ఎవరో చెప్పే గమ్యానికి
తలవూపి వెళ్తావు !
నీకు నచ్చిన గమ్యం
ఏదైనా ఉందా మరి ?
ఎదలో దాగుందా సరి ?
ఉంటే తరలిపో! కొద్దిరోజులకి,
నే నచ్చజెప్తా మా మనుజులకి,
నీవు కోరిన గమ్యానికి
గమనం సాగించు!
సేద కాస్త తీరగనే
దయచేసి కనిపించు!!
చాలు! ఇక చాలు!

గుట్టగా నా ఎదుట
గుమ్మరించిన అక్షరాలు
నే చేసే రూపకల్పనలకి
నే దిద్దే రూపురేఖలకి
కూసంత శబ్దం చేయక
నా ముందు తలవంచి
నను శిరసావహిస్తాయే!
మరి ఏమిటి ఈ రోజు?
గుస గుస లాడుతున్నాయి!
వాటి వదనాలలో ఒక వశపడని
అవిధేయ ..అస్వాధీన ..మాటవినని..
అధికార ధిక్కరణ కానవస్తోంది.
ఒకటి నడుము మీద చేతులుంచి
నిదానంగా నా దెస చూసి
చాలు! ఇక చాలు!
చింత.. చీకురు గురించి
క్లేశము.. ఖేదము గుప్పించి
వగపు ..వెగడు చూపించి
కలతలు ..కలవరము కలిగించి
కాటుక కన్నుల కన్నీరు కార్చి
ఇక్కట్లు… ఇరకటముల ముంచే
కవితలు కథలు రాయద్దు
గలగల పారే సెలయేరులతో
మిలమిల మెరిసే ఇసుకతిన్నెలతో
విరగబూసిన ఉపవనాలతో
కలకలమనే శుకపికాలతో
వెన్నెల వెదజల్లుతున్న విరహపు చినుకుల
అనురాగ తీగ లల్లుకుంటున్న
ప్రేయసీ ప్రియుల కైతలు రాయి!
మాకూ …అడపదడప ఆనందంతో
ఉప్పొంగాలనీ ఉల్లాసించాలనీ
చిటపట చినుకులలో చిందులేయాలనీ
ఎగిరి గంతేసి మిన్ను తాకాలనుంటుంది
మాపై కనికరించి నీ కలం సిరాలోముంచి
మనోజ్ఞమైన మనోహరమైన కవితలిక కురిపించు!
*****
ముందుమాట
నాకు చిన్నప్పటినుంచి వచనకవిత్వంలో ఓ రకమైన కుతూహలం ఉండేది. 14-15 ఏళ్ళ వయస్సులోనే కీర్తి శేషులు డాక్టర్ సి. నారాయణరెడ్డి గారి కవితలు, వారు ఆ కవితలని పఠించే తీరు నన్ను చాలా ఆకర్షించేది. నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రసాయనిక శాస్త్రం అభ్యసిస్తున్నప్పుడు వారు తెలుగు శాఖలో రీడర్ గా ఉండేవారు. వారు నన్ను చాలా ప్రోత్సహించేవారు. క్రమేపీ నాకు వచన కవిత, కథానిక ప్రక్రియల్లో అభినివేశం, అభిమానం కలగడం ప్రారంభమైంది. అలాగే ఆ రోజుల్లో All India Radio లో పనిచేస్తున్న కీ.శే. వేలూరి సహజానందం గారు నా కవితలని రేడియోలో చదవడానికి ఎన్నో అవకాశలిచ్చి ప్రోత్సహించేవారు. ఇంగ్లండు లో రసాయనిక పరిశోధన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నప్పుడు నాకు గీతాంజలి అనే బహుభాషా కవుల సంఘంతో పరిచయమేర్పడి వారి ప్రోత్సాహంతో తెలుగు, ఆంగ్ల భాషల్లో కవితలు రాయడం మొదలుపెట్టాను. ఆ సంస్థ అధ్యక్షులు డా కృష్ణకుమార్ గారు ఉత్తరప్రదేశ్ వారైనా తెలుగు భాష మీద మిక్కిలి గౌరవం చూపించి రెండు సంకలనాలలో నా తెలుగు మరియు ఆంగ్ల కవితలు ముద్రించారు. సుమారు 4 సంవత్సరాల క్రితం ఇంకో తెలుగు సాహితీ అకాడెమీ సమూహంతో పరిచయమేర్పడి తెలుగులో మాత్రమే కవితలు రాయడం మొదలెట్టాను. ఆ సమూహ అధ్యక్షులు మాజీ ఉపకులపతులు గంగిశెట్టి లక్ష్మీనారాయణగారు ఎంతో అభిమానంతో నాకు స్వాగతం పలికి నాకు మార్గదర్శకులుగా నిలబడి నా సాహిత్య పయనానికి దోహదమిచ్చారు.
మార్చి 2023 హైదరాబాదు సిరికోన సాహితీ అకాడమీ కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఉపకులపతులు ఆచార్య కిషన్ రావు గారు నా కవితా సంపుటి ‘మనసు విప్పిన మడతలు’ ఆవిష్కరించారు. నా కవితా సంపుటిని ప్రశంసించిన పెద్దలందరికీ వినమ్ర నమస్సులు.
ఆచార్య రాణి సదాశివమూర్తి, కులపతి, శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం, తిరుపతి
వీరి కవితలను చదువుతుంటే ఒక భాద్యత గల కవయిత్రి, కనబడని సూత్రధారిణి గోచరిస్తారు. ప్రతి శీర్షికలో ఒక కొత్తదనం, పద పదంలో మెత్తదనం, కవిత కవితలోచిత్తాన్ని కదిలిచే చిత్తరువులు, చిత్ర వైచిత్రిని నింపుకున్న భావ కల్పతరువులు దర్శనమిస్తాయి.
శ్రీ నివర్తి మోహన్ కుమార్, చార్టెడ్ ఎకౌంటెంట్
పురుషాధిక్య సమాజంలో గ్లాస్ సీలింగ్ బ్రద్దలుచేసి తమదైన ప్రత్యేకత నిలుపుకున్న భారతీయ వనితల్లో అరవిందారావుగారు కూడా ఒకరు. వీరు పరస్పర భిన్న ప్రవృత్తులను సమతుల్యము చేసుకుని జీవితాన్ని ఒక కళగా మలుచుకున్నవారు. ప్రస్తుత కవితాకదంబమే అందుకు సాక్ష్యం.
డా శారదాపూర్ణ శొంఠి షికాగో, యు.ఎస్.ఎ.
అరవింద గజల్ రచయిత్రిగా, సృజనాత్మక గేయరచయిత్రిగా, గాయనిగా పేరెన్నికగన్నారు. ఆమె వృత్తి ఉజ్వలం. ప్రవృత్తి అద్భుతం. ఆమె కవితలు భావ కవిత్వ ధోరణిలో సాగుతాయి. చదువరుల అంతరంగాన్ని సుతారంగా తాకి, ఊపి ఆమె అనుభూతిలో భాగమవుతాయి. భావకవిత్వ సమాలోచనకి ఈ కవితా సంపుటి బర్హిపింఛం.
నా ఈ కవితా సంపుటి ‘మనసు విప్పిన మడతలు’ లోని కవితలు ఇకపై సిరిమల్లె పత్రికలో ప్రతినెలా పాటకులను అలరిస్తాయని నమ్ముతున్నాను.
నమస్కారములతో – పారనంది అరవిందారావు