
జీవితం……
నీవంటే కోపం క్రోధం
ఏవం ఏహ్యం
సీదరం సెగ్గెం లేవు... జీవితం……!
కాని...నువ్వడిగే ఆ ప్రశ్నలకి
చేసే సవాళ్ళకి ...
దిగాలుపడి దించిన తలెత్తలేకున్నా!
చేష్టలుడిగి చూస్తున్నా!
నీ అమాయకపు పోకడ తరచూ
నన్నుఆశ్చర్యచకితురాలిని చేస్తుంది
అయినా...నువ్వంటే నాకు
నిరసన.. నిరాకారం లేవు
బతకడానికి బాధవసరమని
దరహాసానికి ధర ఉంటుందని
నువ్వందించిన సమస్యలు
సంధించిన సందర్భాలు
కోరిన….. కోరని …..
మోజుపడిన...మది ఎంచని
ఆకర్షితమైన .. ఆసక్తి లేని
బంధాలలో నా ఉనికి మనికి
అల్లుతావని తెలియదు
అయినా... నీ వంటే ఉదాసము ఉపేక్ష లేవు
ఈ రోజు నా చెక్కిళ్ళు
చెరువులయ్యాయని
అడలు ఆర్తి లేదు
రేపు ఇవే చెక్కిళ్ళు ఎడారులైతే
ఒక్క నీటి చుక్క కోసం
వేసారుతానేమో!
జీవితం! నీ మీద నింద కాని నెపము కాని లేవు
ఇది కేవలం నీతోనే
చెప్పుకునే గోడు! ఆర్పు!!
నీ కంటే నాకు
సన్నిహితులెవరున్నారు చెప్పు!!
తెగని బంధాలు!
మధుర మంజుల గళమామెది!
మందస్మిత వదనమామెది! అతిసుందర రూపమామెది!
ఆమె గాన మాధుర్యం ఆమె దేహ సౌందర్యం
ఆమె అపురూప కౌశలం గాంచి
అబ్బురపడి అచ్చెరువొందారు శ్రోతలు.
అతి మధుర ఆమె గానం!
అంతకు మించిన మృదంగ వాద్యం!
సన్నగవీచే శీతల పవనం
అందరిని మత్తులో ముంచిన సమయం!
అకస్మాత్తుగ అపస్వరం!
ఆమెది కాదు!
మృదంగందా లేక
మృదంగం వాయిస్తున్న ముదుసలిదా!
అతనివేలు రక్తం చిందింది!
ఆమె కళ్ళు రక్తం చిమ్మాయి!
అవమానం భరింపలేని అహం
కళ్ళతో లెమ్మని సైగ చేసింది!
వేదిక మీంచి తరలిపొమ్మంది కళ్ళతోనే!
నూనూగు మీసాల నూత్న యౌవ్వనుడుని
రా రమ్మని రమ్యంగా పిలిచి దరువు వేయమంది!
ఇన్నేళ్ళ బట్టి ఆమెకు తాళం వేసిన వృద్ధుడు
కంపిస్తున్న శరీరంతో లేచి నిండు కన్నీటితో
రెండు చేతులు జోడించి మంచె దిగపోబోయి…
ఎవరో ఆపినట్లు ఆగిపోయాడు……..
అతని వలె శరీరం ముడుతలు పడ్డ మృదంగం
"నీ వలె నాలో జవసత్వాలు ఉడిగిపోయె!”
నీ కరముల తాకిడికి అలవడిన నా జీర్ణించిన దేహం
ఈ యువకుడి సమ్మెట పోటులకి తాళెనా!!
“తీసుకుపో నీ వెంట" అని కన్నీరు కార్చింది.
చిన్నప్పటినుండి సాకాడు
తాళ విద్య నేర్పాడు.
మౌనంగా తన మృదంగాన్ని
హృదయానికి హత్తుకుని
ముసలిద్వయం మౌనంగా
మంచె దిగిపోయింది!
*****
ముందుమాట
నాకు చిన్నప్పటినుంచి వచనకవిత్వంలో ఓ రకమైన కుతూహలం ఉండేది. 14-15 ఏళ్ళ వయస్సులోనే కీర్తి శేషులు డాక్టర్ సి. నారాయణరెడ్డి గారి కవితలు, వారు ఆ కవితలని పఠించే తీరు నన్ను చాలా ఆకర్షించేది. నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రసాయనిక శాస్త్రం అభ్యసిస్తున్నప్పుడు వారు తెలుగు శాఖలో రీడర్ గా ఉండేవారు. వారు నన్ను చాలా ప్రోత్సహించేవారు. క్రమేపీ నాకు వచన కవిత, కథానిక ప్రక్రియల్లో అభినివేశం, అభిమానం కలగడం ప్రారంభమైంది. అలాగే ఆ రోజుల్లో All India Radio లో పనిచేస్తున్న కీ.శే. వేలూరి సహజానందం గారు నా కవితలని రేడియోలో చదవడానికి ఎన్నో అవకాశలిచ్చి ప్రోత్సహించేవారు. ఇంగ్లండు లో రసాయనిక పరిశోధన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నప్పుడు నాకు గీతాంజలి అనే బహుభాషా కవుల సంఘంతో పరిచయమేర్పడి వారి ప్రోత్సాహంతో తెలుగు, ఆంగ్ల భాషల్లో కవితలు రాయడం మొదలుపెట్టాను. ఆ సంస్థ అధ్యక్షులు డా కృష్ణకుమార్ గారు ఉత్తరప్రదేశ్ వారైనా తెలుగు భాష మీద మిక్కిలి గౌరవం చూపించి రెండు సంకలనాలలో నా తెలుగు మరియు ఆంగ్ల కవితలు ముద్రించారు. సుమారు 4 సంవత్సరాల క్రితం ఇంకో తెలుగు సాహితీ అకాడెమీ సమూహంతో పరిచయమేర్పడి తెలుగులో మాత్రమే కవితలు రాయడం మొదలెట్టాను. ఆ సమూహ అధ్యక్షులు మాజీ ఉపకులపతులు గంగిశెట్టి లక్ష్మీనారాయణగారు ఎంతో అభిమానంతో నాకు స్వాగతం పలికి నాకు మార్గదర్శకులుగా నిలబడి నా సాహిత్య పయనానికి దోహదమిచ్చారు.
మార్చి 2023 హైదరాబాదు సిరికోన సాహితీ అకాడమీ కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఉపకులపతులు ఆచార్య కిషన్ రావు గారు నా కవితా సంపుటి ‘మనసు విప్పిన మడతలు’ ఆవిష్కరించారు. నా కవితా సంపుటిని ప్రశంసించిన పెద్దలందరికీ వినమ్ర నమస్సులు.
ఆచార్య రాణి సదాశివమూర్తి, కులపతి, శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం, తిరుపతి
వీరి కవితలను చదువుతుంటే ఒక భాద్యత గల కవయిత్రి, కనబడని సూత్రధారిణి గోచరిస్తారు. ప్రతి శీర్షికలో ఒక కొత్తదనం, పద పదంలో మెత్తదనం, కవిత కవితలోచిత్తాన్ని కదిలిచే చిత్తరువులు, చిత్ర వైచిత్రిని నింపుకున్న భావ కల్పతరువులు దర్శనమిస్తాయి.
శ్రీ నివర్తి మోహన్ కుమార్, చార్టెడ్ ఎకౌంటెంట్
పురుషాధిక్య సమాజంలో గ్లాస్ సీలింగ్ బ్రద్దలుచేసి తమదైన ప్రత్యేకత నిలుపుకున్న భారతీయ వనితల్లో అరవిందారావుగారు కూడా ఒకరు. వీరు పరస్పర భిన్న ప్రవృత్తులను సమతుల్యము చేసుకుని జీవితాన్ని ఒక కళగా మలుచుకున్నవారు. ప్రస్తుత కవితాకదంబమే అందుకు సాక్ష్యం.
డా శారదాపూర్ణ శొంఠి షికాగో, యు.ఎస్.ఎ.
అరవింద గజల్ రచయిత్రిగా, సృజనాత్మక గేయరచయిత్రిగా, గాయనిగా పేరెన్నికగన్నారు. ఆమె వృత్తి ఉజ్వలం. ప్రవృత్తి అద్భుతం. ఆమె కవితలు భావ కవిత్వ ధోరణిలో సాగుతాయి. చదువరుల అంతరంగాన్ని సుతారంగా తాకి, ఊపి ఆమె అనుభూతిలో భాగమవుతాయి. భావకవిత్వ సమాలోచనకి ఈ కవితా సంపుటి బర్హిపింఛం.
నా ఈ కవితా సంపుటి ‘మనసు విప్పిన మడతలు’ లోని కవితలు ఇకపై సిరిమల్లె పత్రికలో ప్రతినెలా పాటకులను అలరిస్తాయని నమ్ముతున్నాను.
నమస్కారములతో – పారనంది అరవిందారావు