Menu Close
Venkat Nagam
మన ఊరి రచ్చబండ
-- వెంకట్ నాగం --

మంగలి వాడి దృష్టి ఎదుటివాడి జుట్టు మీదే సహజంగా ఉంటుంది, అది అతడి వృత్తి ధర్మం. సీన్ కట్ చేస్తే...అమెరికా అధ్యక్షుడి ప్రస్తుత దృష్టి కాస్త ఆర్ధిక పరిపుష్టి ఉన్న దేశాలపైనే బలంగా ఉంది. కాకపోతే తేడా ఏమిటంటే మంగలి వాడు జుట్టు కత్తిరించి తల భారం తగ్గిస్తాడు, ఇక్కడ అమెరికా అధ్యక్షుడు ఆర్ధిక పరిపుష్టి ఉన్న భారత్ తదితర దేశాలపై టారిఫ్ భారం మోపి తన దేశం బలపడాలని భావిస్తున్నారు. కానీ వాస్తవ పరిస్తితి అందుకు విరుద్ధంగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఏతావాతా టారిఫ్ భారం అమెరికా వినియోగదారుడు మోయవలసి వస్తుందనీ, ఇతర దేశాలనుండి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తు, సేవలకు అమెరికా వినియోగదారుడు ఎక్కువ రేటు చెల్లించవస్తుందనీ - తద్వారా అమెరికా ఎకానమీ నెమ్మదిస్తుందని వారి అంచనా. వీరి అంచనాల ప్రకారం టారిఫ్ ల మూలంగా ఒక దేశంగా అమెరికాకు అదనపు ఆదాయం సమకూరిన సమయంలోనే, అమెరికాలో ఉన్న వినియోగదారుడు మరింత పేదవాడు అయ్యే అవకాశం ఉంది. గత నెల లో సిరిమల్లె వేదికగా భారత్ పై ట్రంప్ విధించిన 50 శాతం టారిఫ్ ల గూర్చి విపులంగా చర్చించాము. కొద్దిరోజుల్లో టారిఫ్ ల కారు మబ్బులు తొలగిపోయే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. బహుశా 50 శాతం టారిఫ్ లకు బదులుగా 15 శాతంతో సరిపెట్టే అవకాశం ఉంది. తద్వారా భారత్ - అమెరికాకు మధ్య నెలకొన్న టారిఫ్ ల యుద్ధంకు తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. రెండు మద గజాల పోరాటంలో గెలుపు ఎవరిది అనే సంగతి అటుంచి, వాటి కాళ్ళ కింద నేలపై నివసించే చిన్నా చితక ప్రాణుల సంగతేమిటి అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు? తూర్పు పడమర సినిమాలో పి. సుశీలమ్మ పాడిన ఈ ప్రశ్నకు బదులేది పాటను పాడుకోవాలేమో? ప్రస్తుత పరిస్థితిని ముందుగా దశాబ్దాల క్రితమే ఊహించి "తూర్పు పడమర ఎదురెదురూ" పాటను ఈ సినిమాకు డా. సి.నారాయణ రెడ్డి రాసారేమో!

వెనుకటికొకడు "వ్యాపారం జోరుగా సాగుతోంది, రెండో బర్రెను అమ్మి డబ్బు పంపమన్నాడట", నిజంగా వ్యాపారం జోరుగా సాగుతుందా లేదా మొదటి బర్రె అమ్మగా వచ్చిన డబ్బును స్వాహాచేసిన పిదప ఉన్న రెండో బర్రె పై వాడి కన్ను పడిందా?" అనే సందేహాలు రావడం సహజం. అమెరికా ఎకానమీ బ్రహ్మాండంగా ఉంది, టారిఫ్ ల డబ్బుతో మరింత బలోపితం చేద్దామనే ఆలోచనకు ఈ నానుడి సరిగ్గా సరిపోలా?

తుఫాను వచ్చినప్పుడు వర్షం ఉత్తినే ఒంటరిగా రాదు, తనతో పాటు గాలిని, ఉరుములు, మెరుపులను తోడుగా తెచ్చుకుంటుంది. టారిఫ్ తుఫాను సమయంలో ఆయాచితంగా వచ్చిన మరో ఉపద్రవం "H1B వీసా రుసుము $100,000 కు పెంపుదల". ట్రంప్ ప్రభుత్వం ఇటీవలే H1B వీసా రుసుమును $100,000 కు పెంచే ఆర్డరు మూలంగా భారతదేశంపై తీవ్ర ప్రభావం పడుతోంది. 2025 సెప్టెంబర్ 21 నుండి అమల్లోకి వచ్చిన ఈ భారీ పెంపుదల, ప్రధానంగా భారతదేశానికి చెందిన వేలాది మంది టెక్‌ నిపుణులు, విద్యార్థులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. 2025 సెప్టెంబర్ 21 నుండి ఈ $100,000 రుసుము కొత్త H1B వీసా పిటిషన్లకు వర్తిస్తుంది. ఇది వ్యక్తికి ఒకసారి మాత్రమే చెల్లించాల్సిన రుసుము. ఈ కొత్త రుసుము అమెరికా వెలుపల నుండి వచ్చే కొత్త H1B వీసా దరఖాస్తుదారులకు వర్తిస్తుంది, కానీ ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్న వీసా హోల్డర్లకు, అలాగే వీసా రెన్యూవల్స్ చేసుకునే వారికి ఈ కొత్త రుసుము వర్తించదని వైట్‌హౌస్ స్పష్టం చేసింది. అయితే, "జాతీయ ప్రయోజనాల ఆధారంగా" కొన్ని మినహాయింపులు ఉండవచ్చని తెలిపినా, ఆ నిబంధనలు ఇంకా స్పష్టంగా తెలియవు. తాజాగా అమెరికాకు వచ్చిన విదేశీ విద్యార్ధుల H1B వీసా పిటిషన్లకు ఈ పెంపుదల వర్తించదు అనే కొత్త మినహాయింపు ప్రకటించారు. తద్వారా వారి గుండె గాభరా కొంత తగ్గింది అనే చెప్పాలి.

అయితే దుందుడుకుగా చేసిన ఈ $100,000 H1B రుసుము పెంపుదల ప్రకటన వల్ల, భీతిల్లి అటు అమెరికా నుండి భారత్ కు వెళ్ళే విమానాలలో ఎక్కి కుర్చున్న H1B వినియోగదారులు అర్ధాంతరంగా ఫ్లైట్ దిగిపోయారట. ఇటు భారత్ కు కుటుంబ సభ్యులతో గడపాలని వచ్చిన H1B వినియోగదారులు దగ్గరలొ ఉన్న విమానాశ్రయాలకు పరుగులు పెట్టి అదరా బదరా అమెరికాకు వెళ్ళే ఫ్లైట్లను పట్టుకోవాల్సి వచ్చింది. మైక్రోసాఫ్ట్ తదితర సంస్థలు కూడా తమ H1B ఉద్యోగులకు ఈ రకమైన ఆదేశాలు ఇవ్వడంతో అటు అమెరికాలో ఇటు భారత్ లో ఒకేసారి తీవ్ర గందరగోళం నెలంకొంది. ఏతావాతా భారత్ లో ఇప్పుడు ఇంటి పనిమనుషులు, ఆటో డ్రైవర్లు, రిక్షా తొక్కేవారికి కూడా ట్రంప్ అంటే ఏమిటో తెలిసివచ్చింది. ప్రకటన వెలువడిన వెంటనే, అమెరికా వెలుపల ఉన్న చాలామంది భారతీయ H1B వీసా హోల్డర్లు, కొత్త నిబంధనలు అమల్లోకి రాకముందే అమెరికాకు తిరిగి రావడానికి ప్రయత్నిస్తారు - తద్వారా ప్రయాణాలపై తీవ్ర గందరగోళం నెలకొనే అవకాశం ఉంది, కావున అమలు తేదీని వాయిదా వెయ్యాలనే విజ్ఞత లేని సలహాదారులు ఇప్పుడు అమెరికా అధ్యక్షుడి చుట్టూ ఉన్నారు.

భారతదేశంపై ప్రభావం

భారతదేశానికి చెందినవారే 70% కంటే ఎక్కువ H1B వీసాలను పొందుతున్నందున, ఈ కొత్త రుసుము భారతదేశంపై భారీ పరిణామాలకు దారితీస్తుంది. ఈ నిర్ణయం భారతీయ నిపుణులు, విద్యార్థులు మరియు వారి కుటుంబాల్లో తీవ్ర ఆందోళన కలిగించింది. భారతదేశ విదేశాంగ శాఖ కూడా ఈ పాలసీ "మానవతా పరిణామాలకు" దారితీస్తుందని హెచ్చరించింది.

ఇక ఉద్యోగ నియామకాలపై ప్రభావం గణనీయంగా ఉంది అని స్పష్టంగా తెలుస్తుంది. విదేశీ నిపుణులను నియమించుకునే అమెరికా కంపెనీలపై ఈ అధిక రుసుము భారీ ఆర్థిక భారాన్ని మోపుతుంది. దీనివల్ల కంపెనీలు తమ నియామక వ్యూహాలను మార్చుకోవాల్సి వస్తుంది. ఇది వీసా స్పాన్సర్‌షిప్‌పై ఆధారపడిన భారతీయ నిపుణులను నేరుగా ప్రభావితం చేస్తుంది. ఈ విధానం వల్ల నష్టపోయిన చాలామంది భారతీయ నిపుణులు అమెరికాకు బదులుగా కెనడా లేదా యూరప్‌లోని ఇతర దేశాలను ఎంచుకునే అవకాశం ఉంది. ఇది అమెరికా పోటీదారులకు మేలు చేయవచ్చు. ముఖ్యంగా కెనడాలో ఉన్న ఐటీ కంపెనీల నెత్తిన పాలు పొసినట్లే అని అనుకోవాలి. ఎందుకంటే అమెరికాకు ఆనుకొన్న ఉన్న కెనడా ఐటీ కంపెనీలకు ఇది మరింత సౌకర్యంగా ఉంటుంది. అధిక మొత్తంలో వీసా రుసుము చెల్లించకుండా, కొన్ని అమెరికా కంపెనీలు తమ వ్యాపారాలను కెనడా, భారతదేశం వంటి దేశాలకు అవుట్‌సోర్స్ చేసే అవకాశం ఉంది. తద్వారా భారత్ కు అవుట్‌సోర్సింగ్ పెరిగి మరిన్ని దేశీయ ఉద్యోగాలు యువతకు లభించే అవకాశం ఉంది.

ప్రస్తుత స్థితి

కొత్త రుసుమును సవాలు చేస్తూ అక్టోబర్ 2025 ప్రారంభంలో కొన్ని సంస్థలు దావా వేశాయి. దీనిపై సుదీర్ఘ న్యాయపోరాటం జరిగే అవకాశం ఉంది. ట్రంప్ ప్రభుత్వం విధించిన $100,000 H1B వీసా రుసుమును సవాలు చేస్తూ, 2025 అక్టోబర్ 3న కార్మిక సంఘాలు, ఆరోగ్య సంరక్షణ సంస్థలు, విద్యాసంస్థలు, మరియు మత సంస్థలతో కూడిన ఒక కూటమి కాలిఫోర్నియాలోని ఉత్తర జిల్లా ఫెడరల్ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంలో పేర్కొన్న ముఖ్యమైన అంశాలు ఇక్కడ ఉన్నాయి:

వ్యాజ్యంలో ప్రధాన వాదనలు:

రాజ్యాంగ విరుద్ధం: ఈ కొత్త రుసుము విధించడానికి అధ్యక్షుడికి ఎలాంటి రాజ్యాంగబద్ధమైన అధికారం లేదని వ్యాజ్యం వాదిస్తోంది. పన్నులు విధించే అధికారం కేవలం కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని, అధ్యక్షుడు ఏకపక్షంగా ఇలాంటి రుసుములను పెంచడం రాజ్యాంగ ఉల్లంఘన అని పేర్కొంది.

చట్టపరమైన ఉల్లంఘన: ఈ విధానం 'అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ యాక్ట్' (ఆఫా) ని ఉల్లంఘించిందని ఆరోపించింది. ప్రభుత్వ ఏజెన్సీలు నిబంధనలను రూపొందించేటప్పుడు ప్రజలకు తెలియజేయడం, వారి అభిప్రాయాలను స్వీకరించడం తప్పనిసరి. కానీ, ఈ రుసుమును ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా, చర్చ లేకుండా, సరైన కారణం చూపకుండా విధించారని పిటిషనర్లు పేర్కొన్నారు.

నియంత్రణలు లేవు: ఈ రుసుము హేతుబద్ధం కాదని, ఇది కేసులను పరిష్కరించే వాస్తవ ఖర్చులతో సంబంధం లేకుండా ఉందని వాదించారు.

ఆర్థిక నష్టం: ఈ రుసుము వల్ల ఉద్యోగ నియామకాలు కష్టతరం అవుతాయని, ముఖ్యంగా ఆసుపత్రులు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, పాఠశాలలు, మరియు మత సంస్థలు తీవ్రంగా ప్రభావితం అవుతాయని వ్యాజ్యం వాదించింది. ఈ సంస్థలు ముఖ్యమైన కార్మికులను నియమించుకునే సామర్థ్యాన్ని కోల్పోతాయని, ఇది దేశవ్యాప్తంగా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని పేర్కొంది.

తక్షణ ఉపశమనం కోసం అభ్యర్థన: ఈ రుసుము అమలును తక్షణమే నిలిపివేయాలని, తద్వారా ఉద్యోగులు మరియు సంస్థలు ఏర్పడిన అయోమయం నుంచి బయటపడాలని పిటిషనర్లు కోరారు. ఈ వ్యాజ్యం ఫలితం ఎలా ఉంటుందనేది ఇంకా స్పష్టంగా తెలియదు, దీనిపై సుదీర్ఘ న్యాయపోరాటం జరిగే అవకాశం ఉంది. 2025 అక్టోబరు 31 నాటికి ఈ వ్యాజ్యంపై కోర్టు ఇంకా తుది తీర్పు వెలువరించలేదు. కేసు ఇంకా న్యాయస్థానంలో కొనసాగుతోంది.

అయితే, ఈ కేసులో తుది తీర్పు వెలువడక ముందే, కోర్టు నుంచి 'ప్రిలిమినరీ ఇంజక్షన్' (తాత్కాలిక నిషేధాజ్ఞ) వచ్చే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనిపై నిర్ణయం ఈ నవంబర్‌లో వచ్చే అవకాశం ఉంది. ప్రిలిమినరీ ఇంజక్షన్ మంజూరైతే: కొత్త H1B పిటిషన్లు దాఖలు చేసేటప్పుడు $100,000 రుసుము చెల్లించాల్సిన అవసరం తాత్కాలికంగా నిలిచిపోవచ్చు. ప్రిలిమినరీ ఇంజక్షన్ తిరస్కరైతే: వ్యాజ్యం కొనసాగుతున్నప్పటికీ, రుసుము చెల్లించాల్సి ఉంటుంది. తుది తీర్పు వెలువడటానికి చాలా నెలలు పట్టవచ్చు, ఎందుకంటే తీర్పుపై అప్పీళ్లకు వెళ్లే అవకాశం ఉంటుంది.

ట్రంప్ ప్రభుత్వం విధించిన $100,000 H1B వీసా రుసుము పెంపు భారతదేశం నుండి వచ్చే నిపుణులపై అనేక విధాలుగా తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా ఐటీ రంగంపై దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.

భారతీయ నిపుణులపై ముఖ్య ప్రభావాలు:

అమెరికా కలలకు గండి: ఈ భారీ రుసుము కారణంగా చాలామందికి అమెరికా వెళ్ళాలనే కల ఒక ఆర్థిక భారంగా మారుతుంది. ముఖ్యంగా విద్యార్థులు, యువ నిపుణులు, మధ్య స్థాయి కంపెనీలలో పనిచేసేవారికి ఇది పెద్ద సవాలుగా మారుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన యువ గ్రాడ్యుయేట్‌లు, ఇంజినీర్లు, టెక్ నిపుణులపై ఈ ప్రభావం ఎక్కువ ఉంటుందని అంచనా.

వివాహాలపై ప్రభావం: వివాహ మార్కెట్‌పై కూడా ఈ ప్రభావం ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. H1B వీసా హోల్డర్లకు ఉన్న "విలువ" పెరిగే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు, దీనివల్ల పెళ్లి సంబంధాల విషయంలో వీసా స్థితి ఒక ముఖ్యమైన అంశంగా మారుతుంది. ఇకపై అమెరికాకు లక్ష డాలర్ల H1B వీసా ఫీజు చెల్లించి వెళ్ళేవారు బహుశా వేళ్ళ మీద లెక్కపెట్టదగిన వారు ఉంటారు, తద్వారా అమెరికాలో ప్రస్తుతం H1B వీసా పై ఉండి, గ్రీన్ కార్డుకు వేచిఉన్నవారికి గ్రీన్ కార్డుకు త్వరగా లభించే అవకాశం ఉంది. అయితే దీనికి కొన్ని ఏండ్లు పట్టవచ్చు.

కొత్తగా వెళ్ళేవారికి సమస్యలు: ప్రస్తుతం అమెరికాలో ఉన్న వీసా హోల్డర్లకు ఈ రుసుము వర్తించనప్పటికీ, కొత్తగా అమెరికాకు H1B వీసా పై వెళ్ళాలనుకునేవారికి ఇది ఒక పెద్ద అడ్డంకిగా మారుతుంది.

ఉద్యోగావకాశాలు తగ్గుతాయి:

ఈ రుసుము కారణంగా అమెరికాలోని చిన్న, మధ్య స్థాయి కంపెనీలు, స్టార్టప్‌లు భారతీయ నిపుణులను నియమించుకోవడానికి వెనకాడుతాయి. దీంతో భారతీయ నిపుణులకు అమెరికాలో ఉద్యోగావకాశాలు తగ్గుతాయి.వేరే దేశాలకు వలస: చాలామంది నిపుణులు కెనడా లేదా యూరప్ వంటి ఇతర దేశాలను ప్రత్యామ్నాయంగా చూసే అవకాశం ఉంది. ఇది భారతదేశానికి కొంతవరకు "రివర్స్ బ్రెయిన్ డ్రెయిన్‌"కు దారితీయవచ్చు.

మానసిక ఒత్తిడి:

అమెరికాలో స్థిరపడాలని ఆశించే వేలాది మంది భారతీయ కుటుంబాలకు ఈ నిర్ణయం తీవ్ర ఆందోళన, అయోమయం కలిగించింది.

భారతీయ ఐటీ కంపెనీలపై ప్రభావం:

నియామక వ్యూహాల్లో మార్పు: టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి పెద్ద ఐటీ కంపెనీలకు ఇది పెద్ద సవాలు. నిపుణులను అమెరికాకు పంపే బదులు, ఎక్కువ అవుట్‌సోర్సింగ్ లేదా దగ్గరి దేశాలైన మెక్సికో, కెనడా వంటి వాటిపై దృష్టి పెట్టవచ్చు.

అనుభవం లేనివారికి కష్టం: ఈ రుసుము కారణంగా, అత్యంత నైపుణ్యం ఉన్న నిపుణులకు మాత్రమే అవకాశాలు లభించే అవకాశం ఉంది. తక్కువ అనుభవం ఉన్న లేదా జూనియర్ స్థాయి నిపుణులకు అమెరికాలో ఉద్యోగం దొరకడం కష్టమవుతుంది. ఈ పరిణామాల వల్ల భారతీయ నిపుణులకు అమెరికాలో భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని చెప్పవచ్చు.

అమెరికాకు ప్రత్యామ్నాయంగా నిలుస్తున్న కొన్ని ముఖ్య దేశాలు:

అమెరికాలో H1B వీసా రుసుము పెంపు నేపథ్యంలో, భారతదేశం నుండి వచ్చే నిపుణులు, ముఖ్యంగా టెక్ రంగంలోనివారు, వివిధ ప్రత్యామ్నాయ దేశాలు మరియు వీసా మార్గాలను పరిశీలిస్తున్నారు. అమెరికాకు ప్రత్యామ్నాయంగా నిలుస్తున్న కొన్ని ముఖ్య దేశాలు ఇక్కడ ఉన్నాయి.

కెనడా : కెనడా చోద్యం చూస్తూ ఊరికే ఉండదు, తన ఇమ్మిగ్రేషన్ విధానాలను మరింత సులభతరం చేస్తూ, నైపుణ్యం కలిగిన నిపుణులను ఆకర్షిస్తోంది. ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ: పాయింట్ల ఆధారిత వ్యవస్థతో ఇది అర్హులైన అభ్యర్థుల కోసం ఒక వేగవంతమైన మార్గం - దీని ద్వారా కెనడా ఐటీ నిపుణులని ఆకర్షిస్తుంది. ప్రాంతీయ నామినీ కార్యక్రమాలు -  కొన్ని కెనడియన్ ప్రాంతాలు టెక్ నిపుణుల కోసం ప్రత్యేక ప్రణాళికలను రూపొందించవచ్చు.

జర్మనీ: జర్మనీ తన EU బ్లూ కార్డ్ విధానాన్ని సవరించి, టెక్ నిపుణులకు ఆకర్షణీయమైన అవకాశాలను కల్పిస్తోంది. EU బ్లూ కార్డ్ - ప్రత్యేకించి ఐటీ నిపుణులకు బ్లూ కార్డ్ పొందడానికి విశ్వవిద్యాలయ డిగ్రీ అవసరం లేకుండా, 3 సంవత్సరాల అనుభవం ఉంటే సరిపోతుంది. బ్లూ కార్డ్ హోల్డర్లకు జర్మనీ పర్మనెంట్ రెసిడెన్సీని పొందే అవకాశం ఉంది.

యునైటెడ్ కింగ్‌డమ్: UK కూడా తన వీసా విధానాలను మార్పు చేస్తూ, టెక్ నైపుణ్య నిపుణులను ఆకర్షిస్తోంది. గ్లోబల్ టాలెంట్ వీసా - ఇది డిజిటల్ టెక్నాలజీతో సహా వివిధ రంగాలలో నిపుణులకు స్పాన్సర్‌షిప్ అవసరం లేకుండా UK లో పనిచేయడానికి వీలు కల్పిస్తుంది. అర్హులైన వారికి ఇది UK పర్మనెంట్ రెసిడెన్సీని పొందడానికి వేగవంతమైన మార్గం.

ఇతర వీసా మార్గాలు

అమెరికాలోనే H1B బదులుగా ఇతర వీసా మార్గాలను కూడా కొందరు నిపుణులు పరిశీలిస్తున్నారు.

L-1 వీసా: బహుళజాతి కంపెనీల్లో పనిచేసేవారు ఇంట్రా-కంపెనీ బదిలీ కోసం ఈ వీసాను ఉపయోగించుకోవచ్చు. ఇది H1B మాదిరిగా లాటరీ పద్ధతిలో ఉండదు.

O-1 వీసా: అసాధారణమైన ప్రతిభావంతులకు ఈ వీసా వర్తిస్తుంది. దీనికి వార్షిక పరిమితి ఉండదు, కాబట్టి H1B రుసుము పెంపు తర్వాత ఇది ఒక ప్రత్యామ్నాయంగా మారింది.

EB-5 వీసా: పెట్టుబడిదారులకు ఈ వీసా పర్మనెంట్ రెసిడెన్సీని పొందే మార్గాన్ని అందిస్తుంది. అయితే ఏడు కోట్ల రూపాయలను అమెరికాకు బదిలీ చేసి ఇన్వెస్టర్ గా మారాలి.

ఇతర ఆసియా దేశాలు:

సింగపూర్, మలేషియా, UAE: ఈ దేశాలు కూడా నైపుణ్యం కలిగిన నిపుణులను ఆకర్షించేందుకు సులభమైన వీసా విధానాలు, మెరుగైన జీతభత్యాలు, పన్ను ప్రయోజనాలను అందిస్తున్నాయి.

అమెరికాలో H1B వీసా నిబంధనలు కఠినతరం కావడంతో, భారతీయ నిపుణులు ఈ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం ప్రారంభించారు, ఇది ప్రపంచవ్యాప్తంగా నైపుణ్య నిపుణుల వలసకు కొత్త ధోరణులకు దారితీస్తుంది.

చిన్న మరియు మధ్య తరహా కంపెనీలపై ప్రభావం:

ఆర్థిక భారంగా మారుతుంది: ప్రస్తుతం ఉన్న $4,500 రుసుముతో పోలిస్తే, $100,000 రుసుము చాలా ఎక్కువ. ఈ వ్యయాన్ని భరించడం చిన్న మరియు మధ్య తరహా సంస్థలకు (శంఏస్) దాదాపు అసాధ్యం. కొత్త $100,000 H1B రుసుము అమెరికాలోని చిన్న కంపెనీలకు తీవ్ర ఆర్థిక భారాన్ని కలిగించడమే కాకుండా, మొత్తం ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రుసుముతో చిన్న సంస్థలు, స్టార్టప్‌లు అంతర్జాతీయ నిపుణులను నియమించుకునే సామర్థ్యాన్ని కోల్పోతాయి, దానివల్ల ఆవిష్కరణలు తగ్గుముఖం పట్టే ప్రమాదం ఉంది.

అంతర్జాతీయ నియామకాలు నిలిపివేస్తారు: ఈ అధిక ఖర్చుల కారణంగా చాలా చిన్న కంపెనీలు అంతర్జాతీయ నియామకాలను నిలిపివేయడం లేదా H1B వీసా ప్రోగ్రామ్‌పై ఆధారపడే ప్రణాళికలను పూర్తిగా రద్దు చేసుకోవడం జరుగుతుంది.

అమెరికా నిపుణుల కొరత: కొన్ని ప్రత్యేక రంగాలలో, అర్హత కలిగిన అమెరికన్ నిపుణుల కొరత ఉంది. H1B రుసుము పెరగడం వల్ల కంపెనీలు ఈ ఖాళీలను భర్తీ చేయలేక, తమ వ్యాపార కార్యకలాపాలకు ఆటంకం కలిగే పరిస్థితి దాపురిస్తుంది.

పెద్ద కార్పొరేట్‌లపై ప్రభావం:

పెద్ద కార్పొరేట్‌లు $100,000 రుసుమును చెల్లించగలిగినప్పటికీ, వారికి కూడా ఇది వ్యూహాత్మక సమస్యలను సృష్టిస్తుంది. అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి పెద్ద కంపెనీలు ఇప్పటికే వేల సంఖ్యలో H1B వీసా హోల్డర్లను కలిగి ఉన్నాయి. ఈ కొత్త రుసుముతో తాజాగా H1B లను తెచ్చుకోవాలంటే వారికి ఖర్చులు భారీగా పెరుగుతాయి. ఈ ఖర్చులను తగ్గించుకోవడానికి పెద్ద కంపెనీలు విదేశాలలో కార్యకలాపాలను పెంచడం లేదా తమ అంతర్జాతీయ బ్రాంచ్‌ల నుండి నిపుణులను తీసుకురావడానికి L-1 వంటి ఇతర వీసాలను ఉపయోగించుకోవడం వంటి మార్గాలను అన్వేషించవచ్చు.

ఆర్థిక అసమానత: ఈ విధానం కేవలం పెద్ద, డబ్బున్న కార్పొరేట్‌లకు మాత్రమే విదేశీ నిపుణులను నియమించుకునే అవకాశం కల్పిస్తుంది. ఇది చిన్న కంపెనీలు మరియు స్టార్టప్‌లను అణచివేస్తుంది, తద్వారా పోటీతత్వాన్ని తగ్గిస్తుంది.

మొత్తంగా, ఈ అధిక రుసుము అమెరికా ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలికంగా నష్టం చేకూరుస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే దున్నపోతు మీద వర్షం సామెతను గుర్తు చేసే విధంగా ప్రస్తుత పాలకుల వ్యవహార శైలి ఉంది. కావున పాఠకులారా, మీకు H1B ఇప్పుడు కాకపోయినా, మరి కొంతకాలం తరువాత కొత్తగా కావాలంటే పాత పద్దతుల్లో అంటే అంజనం వేయించుకోవడం, చిలక జోస్యం చెప్పించుకోవడం, శకునాలు చూసుకొని బయలు దేరడం తదితర పద్దతులు అవలంబించాలేమో! ఊహకు అందని రీతిలో అమెరికా అధ్యక్షుడి చేతలు ఉన్నాయి కావున వాటిని మన పాత పద్దతుల్లో ఎదుర్కోవాలేమో? లేదా అమెరికా కాడి పారేసి, డాలర్ డ్రీం లకు నమస్కారం పెట్టి, స్థానికంగా ఉద్యోగాలు సంపాయించి "రుపీ డ్రీం లకు" శ్రీకారం చుట్టాలేమో! ఘంటసాల, సుశీల పాడిన పాట - "ఉందిలే మంచి కాలం ముందు ముందూనా అందరూ సుఖపడాలి నందనందాన" పాడుకుంటూ ఉంటే ఏగొడవ ఉండదు కదా! ఏమంటారు? ఎప్పటిలాగే సిరిమల్లె పాఠకులకు సాహిత్యాభినందనాలు అందజేస్తూ...అలాగే పాఠకులందరూ యధావిధిగా క్రింద నున్న కామెంట్ బాక్స్ లో ఈ రచ్చబండ చర్చపై  మీ స్పందనను తప్పక తెలియజేయాలని వారిని అభ్యర్థిస్తూ.. ఈ నెల చర్చ ముగిద్దాం, వచ్చే నెలలో మరో ఆసక్తికరమైన రచ్చబండ చర్చ కు తెర తీద్దాం! అంతవరకూ సెలవు.

-- నమస్కారములతో, మీ వెంకట్ నాగం

********

Posted in November 2025, వ్యాసాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *