దక్షిణ ఆఫ్రికా
గాంధీజీ జీవితాన్ని మలుపు తిప్పిన, జీవితానికి పునాది వేసిన, ప్రిటోరియా నివాసం
డర్బన్ నుంచి బయలుదేరిన గాంధీజీ మార్గ మధ్యంలో రెండు రోజులపాటు పడిన కష్టాలను, అవమానాన్ని భరించి ఎట్టకేలకు ప్రిటోరియా రాత్రి 8 గంటలకు చేరారు. ఆయనను స్వాగతించటానికి రైల్వే స్టేషన్ కు ఎవరూ రాలేదు. సేథ్ అబ్దుల్లా తరఫు అటార్నీ ఎవరిని పంపలేదు. ఇంత రాత్రి వేళ తనకు ఏ హోటలూ ప్రవేశం ఇవ్వదని తెలిసి గాంధీజీ కలవరపడుతూ ఆలోచించసాగారు. ఈ సంఘటనను, ఆ తరవాత జరిగిన విషయాలను గాంధీజీ ఇలా వివరించారు:
"ఆ సమయంలో రైల్వే స్టేషన్ లో కొన్ని గుడ్డి దీపాలు వెలుగుతున్నాయి. చాలా తక్కువ మంది రైలు దిగారు. వారందరు తమ టిక్కట్లు టిక్కట్ కలెక్టర్ కు ఇచ్చిన తరువాత నేను నా టిక్కట్ ఇచ్చి అతనిని హోటళ్ల వివరాలను అడగాలనుకున్నాను. అతను సహకరించకపోతే, రాత్రి స్టేషన్ లో గడపదలచాను. కాని అతను నాకు ఏమాత్రం ఉపయోగపడలేదు. ఆ సమయంలో ఒక అమెరికన్ నీగ్రో జాతీయుడు నా వద్దకు వచ్చి నీవు ఈ ప్రాంతానికి క్రొత్తవాడిలా కనపడుచున్నావు. నాతో వస్తే నిన్ను ఒక చిన్న హోటల్ కు తీసుకువెళ్తాను. దాని యజమాని ఒక అమెరికన్ వ్యక్తి. అతను నాకు బాగా తెలుసు. నీకు అతను తన హోటల్ లో ఆశ్రయమిస్తాడు’అని చెప్పాడు.
నేను ధన్యవాదాలు తెలిపి అతని వెంట నడిచాను. నన్ను Johnston’s Family Hotel కు తీసు కువెళ్లాడు. దాని యజమాని Mr. Johnston హోటల్లో నాకు ఆశ్రయం ఇస్తూ ఇలా అన్నాడు. మీరు మీ భోజనం మీకు ఇచ్చిన గదిలోనే చేయాలి. మీ భోజనం మీ గదికే పంపిస్తాను. మీరు డైనింగ్ రూములో భోజనం చేస్తే ఇతర అథితులు కోపంతో హోటల్ నుంచి వెళ్ళిపోతారు. అది నాకు నష్టం కలుగజేస్తుంది అని అన్నాడు.
అతని నిబంధనకు సమ్మతించి నాకు ఇచ్చిన గదిలో ప్రవేశించాను. ఒంటరిగా కూర్చుని అంత వరకు చేసిన ప్రయాణం, పడిన కష్టాలను నెమరు వేసుకున్నాను. నా గదిలోకి ఎవరైనా భోజనం తెస్తారేమోనని ఎదురు చూస్తూ కూర్చున్నాను. కొంత సేపటికి యజమాని వచ్చి మిమ్ములను భోజనం చేయమని కోరినందుకు సిగ్గుపడుతున్నాను. నేను హోటల్ లో ఉన్న ఇతర అతిథులతో మీ గురించి మాట్లాడాను. వారిలో ఎవరికీ మీరు డైనింగ్ రూమ్ లో భోజనం చేయటం అభ్యంతరం లేదు. మీరు ఎన్నాళ్ళు ఈ హోటల్ లో ఉన్నా డైనింగ్ రూములోనే భోజనం చేయండి’అని వినయంగా చెప్పాడు.
ఆయనకు ధన్యవాదాలు చెప్పి డైనింగ్ రూముకు వెళ్లి కడుపునిండా భోజనం చేశాను. మరుసటి రోజు సేథ్ అబ్దుల్లా కు సంబంధించిన అటార్నీ Mr. A.W. Baker ను కలిశాను. ఆయన నన్ను సాదరంగా ఆహ్వానించి ఇలా అన్నాడు: మేము ఒక మంచి సలహాదారును నియమించినందువల్ల బారిష్టర్ కు తగిన పని మీకు ఇవ్వటం లేదు. ఈ కేసు కొంచెం కష్టతరమైనది; చాలాకాలం నుంచి నలుగుతోంది. కాని మీనుంచి కావలసిన వివరాలు తెలుసుకుంటాను. సేథ్ అబ్దుల్లా గురించిన విషయాలను కూడా మీ నుంచి సేకరిస్తాను. మీరు బస చేయటానికి తగిన వసతి చూపిస్తాను. ఆ ఇంటిని నిర్వహించే యజమానురాలు మీకు ప్రవేశం ఇస్తుంది అని ఆయన నన్ను ఆమె ఇంటికి తీసుకువెళ్ళాడు.
ఆమె ఇంట్లో ఉండటానికి, భోజనానికి ఆమెకు నేను వారానికి 35 షిల్లింగులు ఇచ్చేటట్లుగా నిర్ణయం జరిగింది.
క్రైస్తవులతో గాంధీజీ సాన్నిహిత్యం
Mr. Baker ఒక అటార్నీయే కాదు, క్రైస్తవ బోధకుడు కూడా. మొదటి పరిచయంలో ఆయన గాంధీజీని మత సాన్నిహిత్యం గురించి అడిగితే నేను జన్మతః హిందువును. కాని హిందూమతం గురించి ఎక్కువగా తెలియదు. ఇతర మతాల గురించి అసలు తెలియదు. నిజానికి మతం విషయంలో నేను ఎక్కడ ఉన్నానో తెలియదు. నా మతం గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేయాలనుకుంటున్నాను. వీలయితే ఇతర మతాల గురించి కూడా అని ఆయన సమాధానమిచ్చారు.
Mr. Baker ఇది విని సంతోషంతో ఇలా అన్నాడు. నేను South Africa General Mission లో ఒక డైరెక్టర్ ను. నా స్వంత ఖర్చుతో ఒక చర్చి కట్టించి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాను, బోధనలు చేస్తూ ఉంటాను. నాకు జాతి, వర్ణ వివక్షత లేదు. నేను, నాతో పనిచేసేవారు ప్రతి రోజు మద్యాహ్నం ఒంటి గంటకు కొంత సేపు కలుసుకుని శాంతి, విజ్ఞానం కొరకు ప్రార్ధనలు చేస్తుంటాము. మీరు రేపు ఆ సమయానికి వస్తే మేము అందరం హర్షిస్తాం. మీకు బైబిల్ తో పాటు ఇతర పుస్తకాలను ఇస్తాము. తప్పక రండి అని ఆహ్వానించాడు.
Mr. Baker చెప్పిన దానిని గురించి గాంధీజీ ఆలోచించారు. Mr. Baker కు తనమీద అంత ఆసక్తి ఎందుకు? ఆయన, ఆయన సహచరులనుంచి తనకు వచ్చే లాభం ఏమిటి? క్రైస్తవ మతం గురించి ఎంతవరకు అధ్యయనం చేయాలి? హిందూమత గ్రంధాలను ఎలా సేకరించాలి? స్వమతం గురించి క్షుణ్ణంగా తెలియని తాను పరమతం గురించి అధ్యయనం చేయటం సమంజసమా? ఇలా తర్కించుకుంటూ చివరకు Mr. Baker బృందం నుంచి క్రైస్తవ మతం గురించి వీలయినంత తెలుసుకుంటాను. కాని, తన మతం గురించి సంపూర్తిగా తెలుసుకోకుండా పర మతాన్ని స్వీకరించకూడదని తీర్మానించుకున్నాడు మన భవిష్యత్ జాతి పిత.
ఈ విషయం గురించి గాంధీజీ మాటల్లోనే తెలుసుకుందాము.
మరుసటి రోజు మద్యాహ్నం ఒంటి గంటకు Mr. Baker ప్రార్ధనాసమావేశానికి వెళ్లాను. ఆయన నన్ను Miss Harris, Miss Gabb, Mr. Coates, తదితరులకు పరిచయం చేశాడు. అందరం మోకాళ్ళ మీద కూర్చుని ప్రార్ధన మొదలుపెట్టారు. నేను కూడా అలాగే చేశాను. ఈ ప్రార్ధనలో ప్రతివ్యక్తి తమకు కాలసిన కోరికలను ఏకరువుపెట్టి వాటిని తనకు అనుగ్రహించమని దేవుడిని వేడుకున్నారు. తమ కొరకు ఆయనను తన హృదయకవాటాలు తెరవమని ప్రార్ధించారు.
వారు తమ ప్రార్థనలలో నా శ్రేయస్సును కూడా జొప్పించారు. అది ఇలా ఉంది: దేవా! ఈ మా సోదరుడికి మంచి మార్గం చూపించు. మాకు ప్రసాదించిన శాంతి ఈయనకు కూడా ఇవ్వు. మమ్ములను రక్షించే లార్డ్ జీసస్ ఈతనిని కూడా రక్షించు గాక.
5-10 నిముషాలు పాటు సాగిన ఈ ప్రార్ధనలు పూర్తి అయిన తరువాత అందరు మధ్యాహ్నం భోజనానికి వెళ్లిపోయారు. Miss Harris, Miss Gabb వయస్సు మళ్ళిన వృద్ధకన్యలు. వీరిద్దరు కలిసే ఉంటారు ఒకే ఇంట్లో. Mr. Coates ‘Quaker’ తెగ క్రైస్తవుడు. ఈ ముగ్గురూ మేము ప్రతి ఆదివారం మధ్యా హ్నం 4 గంటలకు కలుస్తూ ఉంటాము. మీరు రండి అని నన్ను ఆహ్వానించారు.
వీరితో పరిచయం పెరుగుతున్న కొద్దీ Mr. Coates నాకు అనేక క్రైస్తవమత పుస్తకాలను ఇవ్వటం ప్రారంభించాడు. వీటిల్లో క్రైస్తవ మతం గురించి ఉన్న వాదనలు నాస్తికులను కూడా ఆస్థికులుగా మార్చగలిగినంత ఘాటుగా ఉన్నాయి. వీటి ప్రభావంతో అప్పటివరకు మతం అంటే అపనమ్మకంతో ఉన్న నేను నమ్మకుడిగా మారాను. కాని జీసస్ ఒక్కడే దేవుడి అవతారం, దేవుడికి మానవుడికి మధ్య ఉన్న వారధి ఆయన ఒక్కడే అనే వాదన నన్ను కదిలించలేదు.
Mr. Coates నన్ను క్రైస్తవుడిగా మార్చటానికి అనేక విధాలుగా ప్రయత్నించాడు. క్రైస్తవం మతం స్వీకరించకుండా పాప పరిహారం, మోక్షం అసాధ్యమని ఆయన వాదన. జీవితంలో ఎన్ని మంచి పనులు చేసినా జీసస్ కరుణ లేకపోతే అన్ని నిష్ప్రయోజనం అంటాడు. ఈవాదనలతో నేను ఏకీభవించకపోయినా, నాలో ఒక మార్పు చోటు చేసుకుంది. అది: దేవుడంటే భయం, భక్తి.
ఈ దశలోనే క్రైస్తవ తెగవారు ఈ విధంగా వాదించారు. 'మా మతం ప్రత్యేకత నీవు అర్ధం చేసుకోలేవు. నీవు చెప్పిన దానిని గురించి నీవు ఎల్లప్పుడూ నీలోని దోషాలు, తప్పులు గురించి, వీటికి ప్రాయశ్చిత్తం ఎలా చేసుకోవాలి అనే విషయాల గురించే ఆలోచిస్తున్నట్లుగా అర్ధమయింది; ఇటువంటి ఎడతెగని ఆలోచనలవల్ల విముక్తి ఎలా లభిస్తుంది నీకు? ప్రశాంతత ఎలా వస్తుంది? మనం అందరం పాపులమేనని నీవు వాదిస్తున్నావు; మా నమ్మకంలో ఎంత పరిపక్వత ఉందో చూడు; మనకు మనం ఎంత ప్రయత్నించినా పాప ప్రాయశ్చిత్తం మాత్రం అసాధ్యం. కాని పాప ప్రాయశ్చిత్తం మాత్రం తప్పనిసరి. అది సాధ్యమయ్యే మార్గం ఒకటే; అది పాపాలన్నిటిని జీసస్ పాదాల చెంత వేయటమే. ఆయన ఒక్కడే పాపరహితుడయిన దైవ పుత్రుడు; ఆయనను, ఆయన మాటను విశ్వసించేవారు ఉత్తమమైన, శాశ్వతమైన జీవితాన్ని అనుభవిస్తారు; జీసస్ ను నమ్మితే మనం పాపరహితులమవుతాం; మన పాపాలు చేస్తాం; ఈ ప్రపంచంలో పాపాలు చేయకుండా జీవించటం అసంభవం. అందువల్లనే మానవుల పాప పరిహారార్ధం కోసం జీసస్ బాధలు, కష్టాలు అనుభవించాడు. ఆయనకు పూర్తిగా సమర్పించుకున్నవారు మాత్రమే శాశ్వతమైన ప్రశాంతత పొందగలరు; వ్యాకులంతో ఉన్న నీవు జీసస్ కు సమర్పించుకున్న తరువాతే ఎంత ప్రశాంతత పొందుతావో ఆలోచించు.
ఈ వాదన నన్ను ఏమాత్రం కదిలించలేక పోయింది. నేను వినయంగా: మీరు అనుసరించే క్రైస్తవ మతాన్ని నేను అంగీకరించలేను. పాప పరిహారమార్గం వెతుక్కునేకంటే అసలు పాపాలు చేయక పోవటమే మేలైన మార్గం. ఒకవేళ తెలియక నేను పాపాలు చేస్తే వాటికి పరిష్కారమార్గం నేనే వెతుక్కుంటాను. అంతవరకు నాలోని అశాంతిని భరిస్తాను అని చెప్పాను.
దీనికి ఒక క్రైస్తవ Plymouth Brother ‘నీ ప్రయత్నం నిష్పలమవుతుంది. మేము చెప్పింది అనుసరించు అని అన్నాడు. నా దృష్టిలో ఈ వ్యక్తి తెలిసే చాలా తప్పులు, అక్రమాలు చేశాడు. కాని వీటి గురించి కించిత్ భయం, విచారం లేకుండా ప్రవర్తిస్తాడు. ఈ వాదనల తరువాత Mr. Coates చాలా కలవరపడ్డాడు నా గురించి. యదార్ధానికి అతను చాలా మంచి వ్యక్తి.
దక్షిణ ఆఫ్రికా భారతీయులతో గాంధీజీ సాన్నిహిత్యం
గాంధీజీ ప్రిటోరియా చేరిన తరువాత సేథ్ అబ్దుల్లా బంధువు Sheth Tyeb Haji Khan Muhammad తో పరిచయం ఏర్పరచుకున్నారు. ఆయనతో తనకు ప్రిటోరియాలో ఉన్న భారతీయుల పరిస్థితుల గురించి తెలుసుకోవాలని, వారిని కలుసుకోవాలి ఉందని చెప్పారు. అయన ఎంతో సహృదయంతో వెంటనే ప్రిటోరియాలో ఉన్న భారతీయులందరిని సమావేశపరిచాడు. ఈ సమావేశం Sheth Haji Muhammad Haji Joosab ఇంట్లో జరిగింది. వీరిలో హిందువులు చాలా తక్కువమంది ఉన్నారు.
మిగతా విషయాలు గాంధీజీ సుమారు 35 ఏళ్ల తరువాత ఇలా వివరించారు:
ఇంతమంది ప్రజలకు నేను ఇచ్చిన ఆ బహిరంగ ఉపన్యాసం నా జీవితంలో మొట్టమొదటిది. ఈ ఉపన్యాసానికి నేను ముందుగానే సన్నద్ధుడయ్యాను. నేను అంతకు ముందే వర్తకులు వారి వ్యాపారంలో నిజాయితీ పాటించరని విన్నాను. వారి దృక్పధంలో వ్యాపారం జీవితానికి, సత్యం (Truth) మతానికి సంబంధించినవి. వ్యాపారంలో సత్యం పొసగదు, ఆచరణీయం కాదు; సత్యం కొంతమేరకు మాత్రమే ఉపయోగపడుతుంది; కాని పూర్తిగా కాదు. పూర్తి సత్యంతో కూడిన వ్యాపారం అసంభవం అని అచ్చటి వ్యాపారుల వాదన.
నా ఉపన్యాసంలో ఈ వాదనను ఖండించాను. అది ఈ విధంగా జరిగింది: విదేశంలో నివసించేవారికి రెండు రకాల ధర్మాలున్నాయి. ఒకటి స్వదేశస్థులకు, రెండవది ఇచ్చట ఉన్న భారతీయులకు; వీరి నడవడి, ప్రవర్తన, సంఘటిత శక్తి అన్నిటికీ మూలం; కొద్దిమంది అయినా ఇది పాటిస్తే క్రమక్రమంగా అది లక్షలాది భారతీయులకు మార్గం చూపుతుంది; ఇంగ్లీషు వారితో పోల్చితే భారతీయులు అపరిశుభ్రమైన అలవాట్లలో జీవిస్తారు; దక్షిణ ఆఫ్రికాలో ఉన్న భారతీయులలో హిందువులు, మహ్మదీయులు, పార్సీలు, క్రైస్తవులు, గుజరాతీలు, మదరాసీలు, పంజాబీలు, సింధీలు, సూరత్ వారు, తదితరులు ఉన్నారు; వీరందరు తమ మధ్య ఉన్న వ్యత్యాసాలు, తారతమ్యాలు మరచిపోయి ఐక్యంగా ఉంటే అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అని నిర్భయంగా చెప్పాను.
ముగింపుగా అందరు కలిసి ఒక సంఘం ఏర్పరచుకుంటే ఇచ్చట స్థిరపడిన భారతీయులు పడే కష్టాలు, జరిగే అన్యాయాల గురించి అధికారులకు విపులీకరించి నివేదికలు ఇచ్చి, వారిపై ఒత్తిడి పెంచి న్యాయ పోరాటం చేస్తే, అది అందరికీ మేలు జరుగుతుందని వాదించాను. ఈ నా ఉపన్యాసం వారిలో కొంత చైతన్యం కలిగించింది. ఇదే అదను అనుకుని ఈ విషయాలమీద చర్చించాలని సూచించాను. ఫలితంగా, కొందరు తమకు జరిగిన, జరిగే అన్యాయాలు, కష్టాలు ఏకరువు పెట్టారు. వీరిలో అతి తక్కువమంది ఇంగ్లీషు భాష మాట్లాడగలరు. ఈ దేశంలో నివసిస్తూ ఇంగ్లీషులో ప్రావీణ్యం పొందటం అవసరం; ఏ వయస్సు వారైనా నేర్చుకోవచ్చు. కావాలంటే నేను ఇంగ్లీషు నేర్పుతానని వారికి నచ్చచెప్పాను. వారు చూపిన ఉత్సాహం నాకు సంతృప్తినిచ్చింది. చివరకు ఇటువంటి సభలు నెలకు ఒకటి, వీలయితే ప్రతి వారం నిర్వహించాలని నిర్ణయించాం.
ఇది జరిగిన మరుసటి రోజే ఇంగ్లీషు బోధన ప్రారంభించాను. ముగ్గురితో మొదలు పెట్టాను. వీరిలో ఇద్దరు మహమ్మదీయులైన క్షురకుడు (మంగలి), ఒక గుమాస్తా; మరొకరు హిందువు అయిన చిల్లర దుకాణం యజమాని. వీరికి ఒక నిర్ణీతమయిన సమయం లేదు. వారి ఖాళీ సమయంలో అతి ఓపికతో ఇంగ్లీషు బోధించసాగాను. వీరిలో ఇద్దరు 8 నెలలలో చాలా అభివృద్ధి సాధించారు. వీరు తమ అకౌంట్లు, వ్యాపార సంబంధిత విషయాలు ఇంగ్లీషులోనే వ్రాయటం మొదలుపెట్టారు. క్షురకుడు తన ఖాతాదారులతో ఇంగ్లీషులో సంభాషించగలిగే నైపుణ్యం మాత్రం సాధించగలిగాడు.
ఇలా నేను తరచు నిర్వహించిన సభల ద్వారా భారతీయులు అనుభవించే హీనాతి హీనమైన కష్టాల గురించి బహిరంగంగా చర్చించగలిగే అవకాశం లభించింది. వీటిద్వారా ప్రిటోరియాలో నాకు తెలియని భారతీయుడు లేడు. అలాగే నాకు అవగతమవని వారి అవస్థ లేదు. ఇవన్నీ క్షుణ్ణంగా తెలుసుకున్న నేను వాటిని అచ్చట ఉన్న బ్రిటిష్ ఏజెంట్ Mr. Jacobus de Wet’ కు నివేదించాను. ఆయనకు భారతీయులపట్ల సానుభూతి ఉన్నా తాను చేయగలిగిన సహాయం పరిమితమేనని తన నిస్సహాయతను వ్యక్తం చేశాడు. కాని అవసరమయినప్పుడు నేను తనను కలిస్తే తనకు వీలయినంత సహాయం చేయగలనని చెప్పాడు.
ఈ బ్రిటిష్ ఏజెంట్ భారతీయుల వ్యవహారాలకు సంబంధించిన అధికార పత్రాలు చూపించాడు. Sheth Tyeb Haji Khan Muhammad కూడా తన అధికారిక పత్రాలు కూడా చూపించాడు. వీటిని పరిశీలించిన తరువాత ప్రభుత్వ విధి విధానాలు ఈ Orange Free రాష్ట్రంలో ఎంత వ్యతిరేకంగా ఉన్నాయో, వారు వారు ఎంత క్రూరంగా చూడబడుతున్నారో అర్ధమయింది.
ప్రిటోరియాలో ఉన్న కొద్ది రోజులలో 'Transvaal, మరియు Orange Free State భారతీయులు అనుభవించే ఆర్ధిక, సాంఘిక, రాజకీయ దుస్థితి, వారు పడే అవస్థల గురించి పూర్తిగా అర్ధం చేసుకోటానికి వీలయింది. ఈ అపారమైన అనుభవం భవిష్యత్తులో ఎంతగా ఉపయోగపడుతుందో అప్పుడు నాకు అవగతమవలేదు. ఈ అనుభవమే నా జీవితంలో ఒక పెద్ద మలుపు తిప్పింది, భవిష్యత్తుకు పునాది వేసింది.