Menu Close
VSRao
మహాత్మా గాంధి
డా. వల్లూరుపల్లి శివాజీరావు
Mahatma-Gandhi
Image by WikiImages from Pixabay

ఇంగ్లండ్ లో మోహన్ దాస్ జీవితం, పరివర్తన

శాఖాహార కార్యాచరణ

బారిష్టర్ అవటానికి ముందు మోహన్ దాస్ లండన్ లో ఉన్న ఒక శాఖాహార సమాజంలో ఒక ప్రముఖ పాత్ర వహించారు. ఆ సమయంలో London Vegetarian Society లో కార్యనిర్వాహక సభ్యుడిగా ఎన్నికైన తరువాత ప్రతి సమావేశం తప్పని సరిగా హాజరు అయ్యేవారు. కాని, ఏ చిన్న ఉపన్యాసం ఇవ్వవలసి వచ్చినా మోహన్ దాస్ కు నాలుక ఆడేది కాదు. ఇది చూసి Vegetarian Club పత్రిక సంపాదకుడు Dr. Josiah Oldfield, కరంచంద్ తో ఇలా అన్నాడు. “నీవు నాతో బాగానే మాట్లాడతావు. కాని కమిటీ సమావేశంలో నీ పెదవులను ఎందుకు విప్పలేవు? నీవు కేవలం ఝుమ్మని ధ్వని చేసే ఒక మగ తేనెటీగ (Drone) వు. ఈ పరిహాసం గురించి చాలా ఏళ్ల తరువాత బాపూజీ ఇలా వ్యాఖ్యానించారు.

“తేనెటీగలు చకచకా పని చేస్తుంటాయి. కాని మగ తేనెటీగ ఎప్పుడూ సోమరిపోతే. ఇతరులు తమ అభిప్రాయాలు వెల్లడిస్తుంటే నేను నిశ్శబ్దంగా ఉండేవాడిని. నాకు మాట్లాడాలనే కోర్కె బలీయంగా ఉన్నా, నా అభిప్రాయాలను ఎలా వ్యక్తీకరించాలో తెలియదు. నేను ధైర్య కూడగట్టుకుని మాట్లాడుదామనుకున్న సమయానికి ఇతర సభ్యులు వేరే అంశం లేవనెత్తి నేను చెప్పేదానికి అడ్డుపడేవారు. ఇలా చాలా కాలమే జరిగింది.”

కొంత కాలానికి ఈ Vegetarian సొసైటీ లో విభేదాలు తలెత్తాయి. ఈ సొసైటీ అధ్యక్షుడైన Arnold Hills ‘Thames Iron Works & Ship Building’ కంపెనీ యజమాని. ఈయన Protestant క్రైస్తవ మతంలో స్వచ్ఛతను పాటించే ‘ప్యూరిటన్’ (Puritan) తెగకు చెందిన వ్యక్తి. ఈయనకు సులభతరమైన పద్ధతులను పాటించే ‘యాంటీ ప్యూరిటన్' (Anti-Puritan) అయిన Thomas Allinson అభిప్రాయాలు నచ్చలేదు. అందువల్ల ఈయనను శాకాహార సొసైటీ నుంచి బహిష్కరించాలని ‘Mr. Hills’ సభలో తీర్మానం ప్రవేశపెట్టాడు. మోహన్ దాస్ కు ‘Mr. Hills’ యెడల సదభిప్రాయం ఉన్నా అభిప్రాయాలు నచ్చనంత మాత్రాన Allinson ను బహిష్కరించటం అక్రమమని భావించాడు. ఒక వ్యక్తికి సమాజేతర విషయాలలో ఎటువంటి అభిప్రాయాలున్నా శాఖాహారాన్ని అభిమానించే ప్రతి వ్యక్తి ఈ సొసైటీ లో సభ్యత్వానికి అర్హుడని మోహన్ దాస్ అభిప్రాయం.

ఈ విషయంలో మోహన్ దాస్ తో పాటు చాలా మంది Allinson బహిష్కరణ అంగీకరించకూడదని భావించారు. వీరు తమ అభిప్రాయాలను నిర్భయంగా వేదిక మీద వెల్లడించారు. కాని మోహన్ దాస్ కు మాట్లాడే ధైర్యం లేదు. చివరకు తన ఆలోచనలను ఒక కాగితం మీద వ్రాసి చదివే ధైర్యం కూడా లేకపోయింది. చివరకు జరిగిన ఎన్నికలలో Allinson ఓడిపోయాడు. ఫలితంగా తన స్వంత అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడించలేని మోహన్ దాస్ కార్యనిర్వాహక సంఘ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

తన ఈ అశక్తతను గాంధీజీ ఈ విధంగా వెల్లడించారు.

“ఈ సిగ్గు, భయం నేను ఇంగ్లండ్ లో ఉన్నంతకాలం నాతోనే ఉన్నాయి. నేను ఎంతోమంది గొప్ప వ్యక్తులను కలిసినప్పుడు కూడా నా నోరు మూగపోయేది. ఒకసారి ‘The Ethics of Diet’ పుస్తక రచయిత ‘Ho ward Williams’ను కలిసినప్పుడు శాఖాహారాన్ని వ్యాప్తి చేసేవిధంగా ఒక ఉపన్యాసం ఇవ్వమని నన్ను కోరాడు. నా కంటే ముందు చాలా మంది సంక్షిప్తంగా, నిర్భయంగా తమ అభిప్రాయాలను వెల్లడించారు. నేను నా ఉపన్యాసాన్ని ఒక కాగితం మీద వ్రాసుకుని చదవటానికి నిలబడ్డాను. కాని చదవ లేకపోయాను. నా దృష్టి మందగించింది, వణుకు ప్రారంభమైంది, కాళ్ళు తడబడ్డాయి, మాటలు పెగ ల్లేదు. మాట్లాడలేక సిగ్గుపడుతూ అలాగే నిలబడి ఉన్నాను. నా పరిస్థితి చూసి నా మిత్రుడు సార్జెంట్ మజుందార్ నా వద్ద నుంచి కాగితం తీసుకుని చదివాడు. ఈ ఉపన్యాసాన్ని అందరు హర్షించినా, నేను నా అశక్తతను అసహ్యించుకుని ఎంతో సిగ్గుపడ్డాను.”

అసత్యమనే తెగులు

1850కు ముందు ఇంగ్లండ్ లో అతి తక్కువమంది భారతీయులు ఉండేవారు. అచ్చటి ఉన్నత పాఠశాల, కాలేజీ విద్యార్థులందరూ బ్రహ్మచారులే. ఒకప్పుడు భారతదేశంలో కూడా ప్రతి విద్యార్థి స్థిరమైన బ్రహ్మ చారే. కాని 17 వ శతాబ్దం నుంచి బాల్య వివాహాలు విరివిగా జరగటం సామాన్యమైపోయింది. బాల్య వివాహాలు ఇంగ్లండ్ లో ఉండవు గాబట్టి వివాహితులైన భారతీయ విద్యార్థులు సిగ్గుతో తమకు వివాహమైందని బహిరంగంగా వెల్లడించేవారు కాదు. దీనిని గోప్యంగా ఉంచటానికి మరొక కారణం ఉంది. అది తాము నివాసముంటున్న ఇంటి ఆడ పిల్లలతో స్వేచ్ఛగా తిరగటానికి అడ్డు అవుతుంది. ఆడపిల్లల తండ్రులు కూడా యువతీ యువకులు స్నేహం నెరపటాన్ని ప్రోత్సహించేవారు. అందువల్ల ఇంగ్లండ్ వెళ్లిన భారతీయ యువకులు కూడా ఆంగ్ల యువతులతో కలిసి తిరిగి సంబంధాలు పెట్టుకునేవారు. వారు వివాహితులైనా కాదని వారితో అసత్యమాడేవారు. ఈ అంటు రోగం మోహన్ దాస్ కు కూడా అంటుకుంది.

దీనిని గురించి గాంధీజీ మాటల్లో తెలుసుకుందాము

“నాకు పెళ్లి అయి, ఒక కుమారుడు ఉన్నా నేను బ్రహ్మచారి అని చెప్పుకోటానికి సందేహించలేదు. ఈ నటన నాకు సంతృప్తి కలిగించలేదు. నా గోప్యం, మౌనం నన్ను మరింత లోతుకు వెళ్లకుండా కాపాడాయి. నేను నిజం చెప్పితే ఏ యువతీ నాతో సంభాషించదు, నాతో బయటకు వెళ్ళటానికి ముందుకు రాదు. అందువల్ల నేను బ్రహ్మచారి అని చెప్పలేదు. నా పిరికితనం నా దాపరికంతో సమానం.”

“నేను ‘Ventnor’ (లండన్ కు 125 కి.మీ./75 మైళ్ళు) లో నివాసమున్న ఇంటి యజమానురాలు లాంటి వారు తమ కుమార్తెలను అతిథులతో బయటకు పంపించటానికి ఇష్టపడేవారు. ఈమె కుమార్తె నన్ను ఒక రోజు ఆ ఊరిలో ఉన్న కొండ వద్దకు వాహ్యాళికి తీసుకువెళ్ళింది. నాకు సహజంగా వడివడిగా నడిచే అలవాటు ఉంది. కాని ఈ అమ్మాయి నాకంటే వేగంగా నడిచి అతిగా వాగుతూ నన్ను దాదాపు లాక్కుని వెళ్లినంత పని చేసింది. నేను ఆమె ప్రశ్నలకు ‘అవును’, ‘కాదు’ అని సమాధానం ఇచ్చాను. కొండ ఎక్కిన తరువాత కొంతసేపటికి దిగేటప్పుడు ఎత్తు మడమల కాలిజోళ్ళు (high heels shoes) వేసుకున్న ఈ అమ్మాయి బాణం లాగా క్రిందకు దూసుకు వెళ్ళిపోయింది. నేను సిగ్గుపడుతూ అతి కష్టం మీద క్రిందకు దిగగలిగాను. ఆమె నాతో ఆడిన పరిహాసం నన్ను మరింత సిగ్గుకు గురి చేసింది.”

“కొన్నాళ్ల తరువాత ఒక రోజు ‘Brighton’ (లండన్ కు 53 మైళ్ళు) లో ఒక రెస్టారెంట్ కు వెళ్ళినప్పుడు ‘మెను’ (menu) కార్డు చూసినప్పుడు అది అంతా ఫ్రెంచ్ భాషలో ఉంది. ఏ పదార్ధాలు కావాలి అని తెలియక కొట్టుమిట్టాడుతున్న నన్ను చూసి ఒక మధ్య వయస్సు స్త్రీ ‘నేను సహాయం చేయనా’ అంటూ నా దగ్గరకు వచ్చింది. అలా జరిగిన ఆమెతో పరిచయం నేను ఇంగ్లండ్ లో ఉన్నంత కాలం, ఆ తరువాత కూడా కొనసాగింది. రెస్టారెంట్ లో పరిచయం తరువాత ఆమె తన లండన్ చిరునామా ఇచ్చి ప్రతి ఆదివారం తన ఇంటికి Dinner కు ఆహ్వానించింది. కొన్నిసార్లు మామూలు రోజులలో కూడా ఆహ్వానించి నాకు ఉన్న బిడియాన్ని పోగొట్టటానికి ప్రయత్నించింది. ఈ ప్రయత్నంలో కొంతమంది యువతులను నాకు పరిచయం చేసింది. వీరిలో ఒక అమ్మాయి ఆమె ఇంట్లో నివసించేది. మొదట్లో ఈ అమ్మాయితో మాట్లాడటం కష్టమనిపించినా తరచుగా మాట్లాడటంవల్ల క్రమేణా నా బిడియం, జంకు తగ్గిపోయాయి.”

“మా ఇద్దరి మధ్య ఉన్న చనువు చూసి ఈ పెద్దావిడ మదిలో వేరే ఆలోచనలు మొదలయ్యాయి. ఇవి తెలుసుకున్న నేను సందిగ్ధంలో పడ్డాను. నేను వివాహితుడనని ఈ పెద్దావిడకు చెప్పియుండవలసిందని అనిపించింది. అలా చెప్పి ఉంటే ఈమె ఈ యువతితో నా పరిచయం ముందుకు వెళ్లనిచ్చేది కాదు. అలాగే నేను ఆ రోజున అంత దురవస్థలో ఉండేవాడిని కాదు. ఈ ఆలోచనలతో ఆమెకు ఒక ఉత్తరం ఈ విధంగా వ్రాశాను.”

“మనం ‘Brighton’ లో కలిసినప్పుడు నీవు నా మీద చాలా దయ చూపించావు. ఒక తల్లి తన కొడుకుకు ఎంత సహాయం చేస్తుందో అంత చేశావు నాకు. నేను వివాహం చేసుకుంటే బాగుంటుందని భావించి అనేక మంది యువతులను పరిచయం చేశావు. ఇంకా ముందుకు వెళ్ళటం ఇష్టం లేక, నీ ప్రేమ, దయకు నేను అర్హుడను కాదని భావించి ఈ ఉత్తరం ద్వారా నీకు నిజం తెలియదలచాను. యదార్ధానికి నేను నిన్ను కలవక ముందే వివాహితుడను. కుర్రవాడిగా ఉన్నప్పుడే నేను పెళ్లి చేసుకున్నాను. నాకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఈ సంగతి నీకు ముందు చెప్పనందుకు నాకు చాలా బాధగా ఉంది. కాని దేవుడు ఈ నిజాన్ని ఇప్పుడైనా వెల్లడించటానికి కావలిసిన ధైర్యం ఇచ్చాడని సంతోషంగా ఉంది. ఈ నా పొరపాటును నన్ను క్షమించగలవా? నీ ద్వారా పరిచయమైన ఈ అమ్మాయితో నేను ఏనాడూ అసభ్యంగా ప్రవర్తించలేదు. నా హద్దులు నాకు తెలుసు. నేను వివాహితుడనయిన సంగతి తెలియక, ఈ అమ్మాయి నాతో పరిచయం, స్నేహం మరింత బలపడి, ముందుకు తీసుకువెళ్లి దారితీయాలని నీవు సహజంగా కాంక్షించవచ్చు. పరిస్థితులు ఇంతకంటే ముందుకు పోగూడదనే సదుద్దేశ్యంతో నిజాన్ని నీకు ఈ విధంగా వెల్లడిస్తున్నాను.”

“ఈ ఉత్తరం అందుకున్న తదుపరి, నీ ఆతిధ్యానికి, అభిమానానికి నేను అనర్హుడని నీవు అనుకోవచ్చు. ఇది తప్పు అని నేను భావించను. నా యెడల నీవు చూపించిన ప్రేమ, అనురాగం, ఆసక్తి నన్ను శాశ్వతంగా ఋణగ్రస్తుడను చేశాయి. ఈ ఉత్తరం చదివిన తరువాత నీవు నన్ను నిరాదరించకుండా నీ ఆతిధ్యాన్నికి తగిన వాడనని నీవు భావిస్తే, నేను సహజంగా ఎంతో సంతోషిస్తాను.”

“ఇలా వ్రాసినందువల్ల నా మీద ఉన్న కొండంత బరువు దిగిపోయినట్లనిపించింది. దీనికి ప్రత్యుత్తరం ఆమెనుంచి తిరుగు టపాలో మరుసటి రోజే వచ్చింది. ఆమె ఇలా వ్రాసింది.”

“నిష్కపటమైన నీ ఉత్తరం అందింది. దానిని చదివి నేను, నాతో ఉన్న అమ్మాయి ఎంతో నవ్వుకున్నాం. నీవు నేరంగా పరిగణించిన అసత్యం క్షమార్హమైనదే. నీ యదార్ధ విషయాలను నాకు తెలిపినందుకు చాలా సంతోషం. నీకు నా ఆహ్వానం ఎప్పటిలాగానే ఉంటుంది. వచ్చే ఆదివారం నీ కోసం ఎదురు చూస్తుంటాం. నీ బాల్య వివాహం గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది.”

“ఈ విధంగా అసత్యమనే వ్రణం నుంచి నేను ప్రక్షాళన చేసుకున్నాను. అప్పటినుంచి నేను ఏనాడూ నా వైవాహిక జీవితం గురించి మాట్లాడటానికి సంకోచించలేదు.”

Mahatma-Gandhi-18Years మతంతో గాంధీజీ సాన్నిహిత్యం, పరివర్తన గురించి తదుపరి సంచికలో తెలుసుకుందాము.

****సశేషం****

Posted in September 2025, వ్యాసాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *