ఆ రోజు ఆదివారం. ఉద్యోగస్తులంతా బధ్ధకంగా ఒళ్ళు విరుచుకు మళ్ళీ పడుకుని, రిలాక్సింగా నిద్రలేచే రోజు. వారానికో రోజు ఆట విడుపు. ముఖం కడిగానన్పించి బాల్కనీలో కుర్చీలో చేరగిలపడి భార్య అందించిన వేడి కాఫీ సిప్ చేస్తూ స్వర్గానికి బెత్తెడు ఎడంలో ఉన్న ఉమామహేశ్వర్రావు దృష్టి ఎదురింటి గేటుపై పడింది. ఎవరో ముగ్గురు వ్యక్తులు ఓరగా వేసిఉన్న ఆ ఇంటి తలుపు నెట్టుకుని లోపలి కెళ్ళారు. "ఏంటోయ్! ఆ పిచ్చితాత ఇంటికి ఎవరో వచ్చినట్లున్నారు. ఆయన కెవ్వరూ లేరని నీవే చెప్పినట్లు గుర్తు!" ఆశ్చర్యాన్ని వేడి కాఫీలో ఒలక బోసుకుంటూ అడిగాడు పక్కనే ఉన్న ప్రవీణను.
తానూ కాఫీ సిప్ హాయిని అనుభవిస్తూ "ఔనండీ! ఆయన కెవ్వరూ లేరు మరి! ఇటీవల అప్పుడప్పుడూ ఇలా ఎవరో ఒకరు వచ్చి పోవడం జరుగుతూనే ఉంది” అంది. గత మూడేళ్ళుగా ఉమామహేశ్వర్రావు, ప్రవీణలు తమ ఇద్దరు పిల్లలతో ఆ అపార్ట్మెంట్లో ని ఐదో అంతస్థులో ఉంటున్నారు.
కండలు పెంచను, ఉన్నవాటికి ‘సిక్స్ పేక్స్’ ఇవ్వనూ, పొట్ట కరిగించనూ, నానాకష్టాలూ, కుస్తీలూ పడుతున్న పూర్ణచంద్రరావు దృష్టి కూడా అటేమళ్ళింది. ఎదురుగా స్టూల్ పై కూర్చుని మగని కండలు చూసి ఆనందిస్తూ వేడి అల్లంచాయ్ రుచిని అనుభవిస్తున్న భార్యను చూసి, "ఏమే కుసుమా! ఆ పిచ్చితాతకు ఎవ్వరూ లేరని చెప్పావ్! మరి ఎవరో ఆయనింటికి పొద్దుటే వచ్చారు? నీ ఇన్ఫర్మేషన్ రాంగ్" అన్నాడు అలసట తీర్చుకుంటూ.
"ప్రపంచంలో మరేదైనా రాంగ్ ఐతే ఔగాక, నా ఇన్ఫర్మేషన్ మాత్రం రాంగ్ కానేకాదు. ఆ వచ్చిన వారెవరో ఆ విషయమేంటో తెల్సుకోనిదే ఈ బాల్కనీ విడువను. ఇదే నా శపధం." మంగమ్మ శపధ’మంత గట్టిగా శపధం చేసిన భార్యను చూసి …..
"నీ శపధం రేపటికి మార్చుకుని నా టిఫిన్ సంగతి చూడు, ఆకలిగా ఉంది, మా బుజ్జివి కదూ!" బ్రతిమాలాడు.
పూర్ణచంద్ర రావు, కుసుమా తమ పదేళ్ళ పిల్లాడితో ఆ అపార్ట్మెంట్ లో ఆరో అంతస్థులో ఉంటున్నారు ఆరేళ్ళుగా.
ఆవలిస్తూ ఆరోకప్పు కాఫీ తాగుతూ ఆనందరావు కిటికీలోంచి, ఎదురింటి వైపుచూస్తూ, నిద్ర వదిలించుకుని, "ఏమేవ్ భాగ్యం ఇలారా! ఈ పిచ్చితాత ఇంటికెవరే వచ్చారు? అదీనీ ముగ్గురు!" ఆతృతగా అర్ధాంగిని కేకేశాడు.
"ఏం కొంపలు మునిగి పోయాయి? అలా అరుస్తున్నారు? ఉప్మాకు పోపేస్తున్నాను. ఇంకాసేపట్లో పిల్లమూకతో పాటు మీరూ ఆకలి కేకలేస్తారాయె! ఏంటి విషయం?" కోపంగా చేతిలోని గరిటెతోనే బాల్కనీలోకొచ్చింది భాగ్యం.
"అబ్బా! ఈ ఆదివారమూ ఉప్మాయేనా? పూరీ తిని వారమైంది." నిస్సత్తువగా స్టూల్ పై కూర్చుండిపోయాడు. ఆనందరావు లో ఏమాత్రం ఆనందం లేనేలేదు.
"చాల్లే సంబడం! వారం వారం ఓ వంద పూరీలు చేయను నాది చెయ్యా! మిషనా? ఇహ నుండి నెలకోమారే పూరీ. నూనె రేటేంతో తెల్సా? మన ఇంట్లో పూరీలకు వారానికి కేజీ నూనె కావాలి, పిల్చిన విషయం చెప్పండి బాణలి కాలిపోతున్నది." విసుగ్గా అడిగింది భాగ్యం.
"అదా! ఎదురింటి పిచ్చితాతకు ఎవ్వరూ లేరన్నావ్? ఇప్పుడే ఎవరో గేటు తీసుకుని వెళ్ళడం చూసాను" కుతూహలం ఆపుకోలేక పూరీ విషయం పక్కనపెట్టి అడిగాడు ఆనందరావు.
"ఔను లేదన్నాను. ఆ ప్రవీణ చెప్పిన మాటలవి. ఏమో ఎవరైనా దూరపు బంధువులు ఉండి ఉండవచ్చుగా! ఐనా మీకెప్పుడూ ఎదురిల్లూ పక్కిల్లూ తప్ప స్వంత ఇల్లు పట్టదా! ఎప్పుడూ పర పురాణమే కానీ స్వపురాణం అవసరం లేదా? పిల్లలేం చదువుతున్నారో, ఎవరితో తిరుగుతున్నారో ఏమీ అక్కర్లేదా?" ఇంతెత్తున ఎగురిపడుతున్న ‘ఇల్లాలి సునామీ’ ని తప్పించుకోను బాత్రూంలో దూరాడు ఆనందరావు. ఆయనకు నలుగురు కొడుకులు. కూతురి కోసం చూస్తూ అలా కనేశాడు నలుగురు ఉధ్ధారకులను. వారు ఇంట్లో వంటింటినీ బయట క్యాంటీన్ నూ చాలా బాగా ఉధ్ధరించేస్తున్నారు క్లాస్ మారకుండా. ఆనందరావు ఆ అపార్ట్మెంట్లో ముచ్చటగా మూడో అంతస్థులో ఉంటాడు.
స్నానం పూర్తి చేసి చీర ఆరేసుకుంటున్నఅనసూయమ్మ దృష్టీ ఎదురింటి పైనే పడింది. ఆమె మొదటి అంతస్థులో ఉద్యోగం చేస్తున్న తన కూతురితో పాటు ఇద్దరు మనవళ్ళనూ చూసుకుంటూ ఉంటున్నది. అల్లుడు ఆఫీస్ పని మీద అమేరికా వెళ్ళడంతో ఉన్న ఒక్క కూతురూ వంటరిగా ఉంటున్నదని తోడుగా ఉండను వచ్చి ఏడాదైంది. వచ్చినప్పటినుండీ ఎదురింట్లో వంటరిగా ఉంటున్న'పిచ్చితాత' గా ఆ అపార్ట్ మెంట్ వారంతా చెప్పుకునే ఆ వంటరి వృధ్ధునిపైనే! బేంక్ ఆఫీసర్‌గా రిటైరైన ఆమె భర్తకు ఇవేవీ పట్టవు. తన పనేంటో తానేంటో. మార్నింగ్ వాక్, ఈవెనింగ్వాక్, పేపర్, టి.వి ఆయన ప్రపంచం.
రెండో అంతస్థులోని రేణూ, నాల్గో అంతస్థులోని నాగేశ్వర్రావూ అంతా ప్రొద్దుటే, అంటే మరీ ప్రొద్దుటే కాదు, ఆదివారం తొమ్మిదైతే కానీ ఆ అపార్ట్మెంట్ లో ‘పొద్దుట’ కాదు మరి! అంతా ఎదురింటి 'పిచ్చితాత' గా వారంతా పిల్చుకునే ఆయనింటిమీద అందరిచూపూ పడింది. అందరికీ ఉబలాటం గానే ఉంది. ఆ తాత ఇంటికొచ్చింది ఎవరై ఉంటారోనని! ఆ ‘గ్రేట్ ప్యారగాన్ మెడోస్'లో 60 కుటుంబాలు ఉంటున్నాయి. కొందరు ఓనర్స్ ఐతే మరికొందరు టెనెంట్స్ . త్రీ బెడ్రూం, టూ బెడ్రూం, సింగిల్ బెడ్ రూమ్ పోర్షన్స్ కూడా ఉన్నాయక్కడ. అన్నిసౌకర్యాలతో ఉన్నందున అంతా అక్కడ నివసించను ఇష్టపడతారు, పోటీపడతారు కూడా! అందుకే అద్దెకు రెక్కలొచ్చి ఎంతో వేగంగా రెట్టింపై పోయింది. ఎప్పుడూ నిండు గర్భిణిలా ఉంటుంది ఆ అపార్ట్ మెంట్.
నెలలో మొదటి ఆదివారం జరిగే ‘అపార్ట్ మెంట్ సర్వసభ్య సమావేశం’ ఆ ఆదివారం నాడే ప్రొద్దున 10గంటలకు. మొదటి అలారం 9.30 గం. లకు మోగుతుంది. 9.45కు రెండో అలారం మోగగానే అoతా అలర్ట్ అయ్యారు. ఆలస్యంగా వెళ్తే స్టూల్స్ పై కూర్చోవాలి, బ్యాక్ సపోర్ట్ ఉండదు. మరీ మూడో అలారానికి వెళితే మెట్లే గతి! కొత్త కుర్చీలు కొనను ఎవ్వరూ మనీ సపోర్ట్ చేయరు. దండగ ఖర్చంటారు, ‘ఒక్క రోజు కోసం వేస్టాఫ్ మనీ ఎందుకూ?’ అని కొందరి అభిప్రాయం.
తప్పని సరిగా ఆ మీటింగ్ కు హాజరవ్వాల్సిందే! లేకపోతే తమ భాగంలో ఏ అవసరం వచ్చినా తర్వాతి మీటింగుకు అటెండయ్యేంత వరకూ పట్టించుకోరు. అది అపార్ట్మెంటు నిబంధన అందుకే తప్పని సరిగా ఇంటి జంట వెళ్ళకతప్పదు. ప్రతి భాగానికీ వెళ్ళి చెప్పడం కష్టం గనుక పెద్ద కాలింగ్ బెల్ బిగించారు. రెండో అలారం మోగగానే అంతా గబగబా లిఫ్ట్ వద్దకు చేరారు.
అంతా సెల్లర్లో సర్దుకు కూర్చున్నాక ప్రెసిడెంట్ గత మాసపు మినిట్స్ చదివి "డియర్ ఫ్రెండ్స్! మనం గత నెలలో ఏదైనా ఒక సమాజ సేవా కార్యక్రమం చేయాలనే నిర్ణయానికి వచ్చాం. మన అపార్ట్ మెంట్ లో చాలామంది విశ్రాంత ఉద్యోగులున్నారు. హౌస్ వైవ్స్ కూడా ఉన్నారు. మనం చేపట్టబోయే ప్రాజెక్ట్ అందరికీ ఆదర్శంగా ఉండటంతో పాటుగా మన అపార్ట్మెంట్ పేరు నిల్పి గుర్తింపు వచ్చేదిగా ఉంటూ మిగతా అందరిలాంటిది కాక ప్రత్యేకంగా కూడా ఉండాలి. మీ మీ అభిప్రాయాలు వెలిబుచ్చవలసిందిగా కోరుతున్నాను." అని చెప్పాడు.
"మన అపార్ట్ మెంట్లో హౌస్ వైవ్స్ గా ఉన్న వారందరూ ప్రతి రోజూ వంట చేసి దేవాలయాల వద్ద ఉన్న భిక్షగాళ్ళకు లంచ్ పెట్టడం బావుంటుంది." సుందర్ సూచించాడు.
వెంటనే హౌజ్ వైఫ్ ఐన కుసుమ కోపంగాలేచి "ఏం మాకు మాత్రం విశ్రాంతి అవసరం లేదా? ఆఫీసులకు వెళ్ళేవరకూ మీకంతా అన్నీ చేసి అందించి మళ్ళీ వండివార్చి దేవాలయాలు వెతుక్కుంటూ వెళ్ళి వడ్డించాలా?"అని మండిపడగా,
"మా టీ.వీ సీరియల్స్ అన్నీఏమై పోవాలని? మేము మాత్రం రిలాక్స్ అవక్కర్లేదా? నేనూ కుసుమకు మద్దతిస్తున్నాను. మేం దీనికే మాత్రం ఒప్పుకోం" అని తన మద్దతు లేచి మరీ తెలిపింది పద్మ.
"చర్చ పక్కదారి పడుతున్నది. విషయానికి రండి. గత నెల సమావేశం కూడా ఇంతే." కుమార్ అన్నాడు.
"పోనీ మనం ప్రతి ఆదివారం అన్నదాన కార్యక్రమం చేపడదాం." చేతన్ సూచన..
"ఆదివారాలన్నీ ఇలా పోతే ఇళ్ళ శుభ్రత. బట్టలుతుక్కోడం, డస్టింగ్ ఎవరు చేస్తారు?" మహాలక్ష్మి అరిచింది.
“పోనీ మగవారంతా వంటలు చేస్తే అందరమూ ఇక్కడే భోజనాలు చేసేద్దాం, మేము ఇళ్లలో పన్లు పూర్తిచేసుకుని వచ్చి భిక్షగాళ్ళందరికీ వడ్డించి అన్నీ శుభ్రం చేయిస్తాం" సులోచన సులోచనాలు సర్దుకుంటూ సూచించింది.
"నలభీమ పాకాలంటారుగా?" వెక్కిరింతగా అంది వనజ.
"ఈ అన్నదానం కుదిరేలా లేదు, పోనీ మనం పేద వాడల పిల్లలకు ఉచితంగా చదువుచెప్తే ఎలా ఉంటుందంటారు?" గతంలో తాను - ‘నలభీముల’ ప్రస్తావన తెచ్చిన విషయం గుర్తువచ్చి రూట్ మార్చాడు గుర్నాధం గుంభనంగా.
"బాగానే ఉంటుంది, ఎవరు, ఎప్పుడు, ఎక్కడ చెప్తారు?" చంపకం అడిగింది.
"దీన్నీ మా ఆడవారికో, హౌజ్ వైఫ్స్ కో అంట గట్టకండి, వాళ్ళ వద్ద కూర్చుని మేం చెప్పలేం" ముక్కు మూసుకుంటూ మునిలక్ష్మి అంది.
"నేనూ మునిలక్ష్మికి గట్టిగా మద్దతిస్తున్నాను." అంది మనోహరి చేతులెత్తి గాల్లోకి ఊపుతూ..
“మగవారం మాత్రమే ప్రతి ఆదివారం పొద్దుటే లేచి వెళ్ళి చదువు చెప్దాం" సుకుమార్ సూచించాడు.
"ఆ ఒక్కరోజూ ప్రొద్దుటే ఎక్కడ లేద్దాం చెప్పడి" బధ్ధకంగా అన్నాడు బాబూరావ్.
"ఈ చదువులు చెప్పడాలూ అవీ కష్టం. ఒక్కోచోట ఒక్కో సిలబస్. మనం ప్రిపేరవాలి, దానికి టైమెక్కడ? ఆఫీస్‌లో మిగిలిన పని వర్క్ ఫ్రంహోం చేసినా కూడా కావడం లేదు. మరోటి సూచించండి" సుధీర్ చెప్పాడు.
"మా యింట్లో పిల్లలనే ట్యూషన్ లో పెట్టాం. ఎక్కడికో వెళ్ళి వాళ్ళ కెక్కడ చెప్తాం? అది అయ్యేపనే కాదు" తన ఇబ్బందీ తెలిపాడు ఇంద్రేశ్వర్రావ్, అతగాడు ఏదైనా త్యాగం చేస్తాడు ఆదివారం నిద్ర తప్ప.
"సరే! పోనీ మనకి దగ్గరగా ఉన్నభరత్ నగర్ ‘ఓల్డేజ్ హోం’ కెళ్ళి పాపం ఐన వారెవ్వరూ లేని, ఆ అనాధ ముసలివాళ్ళతో కాస్తసేపు మాట్లాడి, పండ్లూ స్వీట్లూ అవీ ఇచ్చివద్దామా?" ప్రపోజ్ చేశాడు ప్రసాద్, దీనికంతా ఒప్పుకుంటారని అతని ఆశ.
"బాబోయ్! అక్కడ మా బామ్మను పెట్టాం. నేను రానే రాను." రమేష్ అన్నాడు.
"మా తాతా అక్కడేగా ఉంటా.. నాకూ అవదు" అపర్ణ శృతి కలిపింది.
"పోనీ వాళ్ళను వదిలేసి మిగిలిన వాళ్ళం వెళదాం ఏమంటారు?" వెంకటేష్ అడిగాడు.
"అదెలా కుదురు తుంది? మా అమ్మమ్మా అక్కడేగా ఉంది, కాదంటే వాకవుట్చేసేస్తాం" చలపతి బెదిరించాడు ప్రతిపక్షనేతలా.
“మీరు వాకవుట్ చేస్తే మేం రన్నవుట్ చేస్తాం ..మాకూ క్రికెట్ గురించీ తెల్సు." ఆఫీస్ టైంలోనూ క్రికెట్ కామెంటరీ వింటూ ఎన్నిమార్లు హెచ్చరించినా మారక ఆఫీస్ పనిచేయనందుకు టెర్మినేట్ చేస్తామంటే, వాలెంటరీ ఇచ్చి రోజంతా క్రికెట్ మ్యాచ్ చూస్తూ మెలకువలోనూ పలవరించే క్రికెట్ కృష్ణయ్య కోపంగా లేచి చెప్పాడు, ఔట్, రన్ అనే మాటలు వింటే చాలు రెచ్చిపోతాడతడు.
ఒక్కసారిగా అక్కడ నవ్వుల ఝడివాన కురిసింది. పాపం ఆ వానలో తడిసి అవమానంగా తలవంచుకున్నాడు తండ్రి ఏదేదో మాట్లాడేయడంతో క్రిష్ణయ్య కొడుకు కార్తీక్. పదినిముషాలైనా నవ్వులు తగ్గక పోడంతో వాతావరణాన్ని మార్చేయాలని---
"ఓ.కే. ఓ.కే! అది వదిలేయండి. పోనీ మనం ఇళ్ళలో వాడని బట్టలూ, బ్లాంకెట్లూ, పోయిన చోట కుట్టించి, గుండీలవీ వేసి, ఉతికి ఐరన్ చేసి బ్లయిండ్ హోం కెళ్ళి ఇచ్చివద్దామా?" అన్నాడు ప్రెసిడెంట్ పరకాల్రావ్.
"ఓహో! ఇది మా ఆడాళ్ళపై వేయాలనా? అదేం కుదర్దు." అందుకుంది ఆమని.
"అవన్నీ స్టీల్ గిన్నెలకు వేసి బోల్డన్ని తీసుకుంటున్నాం..మరీ పోయినవి అలుగ్గుడ్డలుగా వాడుతున్నాం. ‘ఉన్నవి ఇచ్చుకుని గిచ్చుకున్నట్లు’ మళ్ళా కొనాలా? ఇప్పుడు మాపింగ్ క్లాతే మాల్స్ లో చాలా ఖరీదై పోయింది, ఈ ప్రెపోజల్ కుదురదు నా వరకూ.." అభయ అందుకుంది.
"స్లంస్ లో పాత చీరలూ అవీ పోగేసి ఇస్తేనో?" ఇందిర ప్రెపోజ్ చేసింది.
"ఇందిర గారూ! మీరు ఇంచార్జ్ గా ఉండి కలెక్ట్ చేయడం, ఉతికి, విస్త్రీ చేయించడం అదీ చేస్తారా?" ఇదన్నా కుదురుతుందనే ఆశతో అడిగాడు ఆదినారాయణ.
"నా వరకూ నేను అందరికీ మైల్స్ పెట్టడం వరకూ చేస్తాను. ఎవరైనా ఉతికి ఇస్త్రీ చేయడం చేస్తే, అట్ట పెట్టెల్లో ప్యాకింగ్ వాచ్మెన్ వాసుతో చేయిస్తాను."
"పోనీ ఎవరింట్లో ఉన్న పాత చీరలు వాళ్ళే వాషింగ్ మిషన్‌లో వేసేసి, ఐరన్ చేయించి ఇందిర గారికి అందజేస్తారా?" ఆదినారాయణ కనీసం ఈ సర్వీసైనా అంతా సరేనంటారేమోని తెగ ఆశపడుతున్నాడు.
"రోజువారీ గుడ్డలన్నీ ఆదివారం వాషింగ్, ఐరనింగ్ చేసే సరికి తలప్రాణాలు తోక్కొస్తున్నాయి. రాత్రైపోతున్నది, ఇహ ఆ పాతవన్నీ ఎవరుతుకుతారు, మా వల్లకాదు."మాధవి తేల్చేసింది.
"పోనీ మగవారు ఏం చేస్తారు ఆదివారం ఎవరింట్లో మగవారు వారింటి చీరలు రెడీ చేసేస్తే సరి, సేవంటున్నారుగా?” సలహా ఇచ్చింది సావిత్రి.
"ఆడవాళ్ళు కట్టుకున్నచీరలు మగవారు ఉతకడమా? ఇదేం బావుంటుంది పైగా, మన భారతీయ సంస్కృతి అందుకొప్పుకోదు" భాస్కర్ అన్నాడు ఇబ్బందిగా వీపునొప్పితో మెట్లపై కూర్చొంటూ.
"రెడీ చేసి ఇస్తే ఏ ఆడాళ్ళకో ఇచ్చి ఫోటోలు దిగను సిగ్గుగా ఉండదా? దీనికి మాత్రం సిగ్గా? దానికి మన భారతీయ సంస్కృతి ఒప్పుకుంటుందా?" కోపంగా అంది కోమలి, భాస్కర్ భార్యామణి. భాస్కర్ దొంగతనంగా ఆడవాళ్ళ ఫోటోలు తీయడం, ఆఫీస్‌లో లేడి కోలీగ్స్ తో తెగపూసుకు రాసుకు తిరగడం ఆమెకంత నచ్చవు, సమయాన్ని సద్వినియోగం చేసుకుంది పబ్లిగ్గానే.
"ఐనా మీకు తెల్సినట్లే లేదు, ఇటీవల స్లంస్లో సర్వెంట్ మెయిడ్స్ గా పనిచెసే మహిళలు డ్రెస్‌లు తప్ప చీరలే కట్టట్లేదు. వారు పని చేసే ఇళ్ళలో వాళ్ళ మేడంస్ [యజమానురాళ్ళు] ఇచ్చే డ్రెస్‌లు వేసుకుని కొన్ని కాలనీల్లో ఎవరు ఓనరో! ఎవరు మెయిడో! తెలీనే తెలీట్లేదు. పాత చీరలెవ్వరూ తీసుకోరు, ఆ ఇష్యూ వదిలేయండి ఇక్కడితో." భాస్కర్ బండారం బయల్పడకుండా చక్రం అడ్డేశాడు శ్యాంసుందర్.
"పోనీ మరో ఐడియా! మనం ఎంతో వృధా వ్యయం చేస్తూనే ఉన్నాం. క్రొత్త డ్రెస్లుకొని స్లం స్కూళ్ళల్లో పిల్లలకు పంచితే ఎలా ఉంటుందో ఒక్క నిముషం ఆలోచించండి." మణికంఠ తన ఆలోచనకు మురిసిపోతూ చొక్కా కాలర్ ఎగరేసుకున్నాడు.
మణికంఠ డ్రెస్ డిజైనింగ్చేసే ఒక కంపెనీలోమంచిపోస్టులో ఉన్నాడు.
"ఆహా! మీ బిజినెస్ పెంచుకోను ఇదో అవకాశంగా తీసుకుందామనా!? మీ MBA తెలివి మా దగ్గర సాగదు." వెంటనే అందుకుంది దివ్య, ఆమె కూడా డిజైనరే. ఇద్దరికీ వృత్తిపర పోటీ. చిలికి చిలికి గాలి వానవుతుందని సెక్రెటరీ "పోనీ స్లంస్లో పిల్లలకు నోట్‌బుక్స్ ,స్కూల్ బ్యాగ్స్ ఇస్తేనో?" అన్నాడు.
"ఇపుడు స్లంస్ లో యూనిఫాంస్ వద్ద నుండీ షూస్, నోట్ బుక్స్, అన్నీ ప్రభుత్వం ఓట్ల కోసం మైనారిటీలకు ఏదో చేస్తున్నట్లు డబ్బామోగించుకోనూ ప్రతిపక్షాల పోరుకు అడ్డుకట్టవేయనో చేస్తూనే ఉంది." ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న పురుషోత్తం చెప్పాడు.