Anton Chekov కథ, "The Lottery Ticket" కి యథేఛ్ఛాశైలిలో చేసిన అనుసృజన!
ఆదివారం.
చిరు ఉద్యోగులైన శ్యామలా, ఆమె భర్త రవి కుమార్ ఇద్దరికీ సెలవే. తీరిగ్గా, తాపీగా తమ పనులు చేసుకుంటున్నారు.
వంటిల్లు సర్దుతున్న శ్యామల, పని ఆపి, చిన్న కప్పులో సగం మాత్రం టీ ఇచ్చి,
"ఇదే ఆఖరు ఈ పూటకి, మూడో సారి పూర్తయింది దీంతో" అన్నది భర్తతో!
రొటీన్ గా "సరేలే", అన్నాడు కుమార్, మళ్ళీ అడుగుతే, తప్పకుండా ఇస్తుంది అనే ధీమా దండిగా కనబరుస్తూ!
లోపలికి వెళ్ళబోతూ,శ్యామల,
"ఏవండీ కాస్త పేపర్ చూసి, భాగ్యలక్ష్మి లాటరీ టికెట్ రిజల్ట్స్ వచ్ఛాయేమో చూడరా, ఒక టికెట్ కొన్నాను మొన్నా మధ్య" అన్నది, భర్తతో!
అన్నదే కానీ,"మన కెక్కడిదిలే అంతటి అదృష్టం", అంటూ
"రిజల్ట్ ముందే తెలుసులే, నాకు రాదు" అనే ధోరణితో లోపలికి వెళ్ళి, వంటింటి సామాను సర్దుకోవటం మొదలు పెట్టింది కర్తవ్యంగా, నిర్వికారంగా!!
*****
లాటరీ రిజల్ట్ చూడాలన్న ఆమె ఆత్రుతలో సగం కూడా ఉన్నట్టు లేదు, అతనికి!
ఆ భాగ్యలక్ష్ములు, బంపర్ లాటరీలు వచ్చే జాతకం కాదులే మనది అని గట్టి నమ్మకం, పాపం అతనికి!! తాపీగా రాజకీయాలు, సినిమాలు, ఆటలు అన్ని కాలమ్స్ చూశాడు, కొన్ని చదివాడు-ఓ అరగంటైంది. లోపలి నుంచి మళ్ళీ ఎంక్వైరీ కమ్ రిక్వెస్ట్!
"ఏవండీ,చూశారా, రిజల్ట్స్ వచ్చాయా?!
మీ చేత్తో పేజీలు తిరగేసి, మీ కంటితో చూడండి కాస్త- ఈ సారైనా తగులుతుందేమో?!", అని!
****
“సరే, నెంబర్ చెప్పు” అన్నాడు కుమార్, రానిదాన్ని చూసేసి, రాలేదని చెప్పేస్తే, ఒక పని ఐపోతుందిలే అనుకుంటూ!!
నెంబరూ, నెంబరూ....అంటూ బ్యాగ్ లో నుంచి డైరీ తీసి, చూసి. చెప్పింది: 9500100..246. అని ఇంకా చెప్పబోతుంటే, "ఆగాగు ఇంతవరకు కలిసిందా చూద్దాం, ఆ తరువాత క్లైమాక్స్ కి వెళ్దాం!" అన్నాడు రవికుమార్, కొంచెం ఉత్సాహంతో.
"సరే మీరు చూడండి, నేను ఈ మిగతా పని పూర్తి చేసి వచ్చేస్తాను", అన్నది ఓపికమంతురాలైన, శ్యామల.
****
కుమార్ కి ఆట్టే టైం పట్టలేదు, రెండో పేజి మొదట్లోనే ఉన్నది ఆ 9500100 సీరీస్. అమ్మయ్య ఉప్పెనకు కొట్టుకుపోయిన గుడిసె లాగా, మొత్తం కొట్టుకుపోలేదు, సంతోషం!
అంటే, ఈ లాటరీలో ఆ మిగతా మూడు అంకెల నెంబరూ సరిపోతే,15,00,000/- రూపాయలు దక్కుతుంది. ఆ సగం సరిపోయిన లాటరీ నెంబర్ ఆనందంలోనే కాస్సేపు తేలిపోవాలని ఊహలలోకి వెళ్ళిపోయాడు కుమార్.
****
ముందు, ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్ అయినా కట్టుకోవాలి, ఆ ఊరికి పొలిమేరల్లో ఉన్న తమ సొంత స్థలంలో! దూరమైనా ఫరవాలేదు, బస్సుల్లో వెళ్తాం, ఆఫీసులకు, ఈ రాకాసి అద్దె తగ్గిపోతుంది అనుకున్నాడు. మొట్టమొదటి ఖర్చుగా, ఒక 10 లకారాలు పక్కన పెట్టేస్తూ!
మిగిలిన దానితో ఏవిఁటీ, రెండో ప్రయారిటీ?!
ఆఁ, శ్యామల టికెట్ కొన్నది కాబట్టి, ఆమెకు ఓ 20000 పెట్టి ఏదైనా చిన్న నగ కొనాలి, ముచ్చటగా, మంగళంగా!
"కనక" మహాలక్ష్మికి స్వాగతం చెప్పినట్టూ అవుతుంది, శ్రీమతీ సంతోష పడుతుంది.
బాలెన్స్ 480000/- బహు జాగ్రత్తగా అడుగులెయ్యాలి ఇక!
ఇంకా ఏం చేద్దాం?!
ఆలోచనలను గిలకొట్టాడు, అమృతం సాధించాలన్న పట్టుదలతో, దేవాసురులు క్షీరసాగరం మథించినట్టు!
ఆఁ తట్టింది, కొంత ఖర్చైనా సరే కాశ్మీర్ ట్రిప్పు వేస్తాం. నేనూ, తనూ, హాయిగా AC రైళ్ళలో, బస్సుల్లో!
ఎన్నో సినిమాల్లో చూశాం ఆ కాశ్మీర్ అందాలు. ఇప్పుడిక నేరుగా చూడబోతున్నాం. ఆహా! అనుకొన్నాడు.
ఒక పాతిక వేలు పక్కన బెట్టాడు. చేతికి రాని, లేని డబ్బులను పక్కన పెట్టడం ఏమిటీ అని విస్తుపోకండి, మాట వరుసకి అన్నమాట. అంతే!!
అంటే ఇంకా మిగిలింది, 4,55,000/- బడ్జెట్ టైట్ చేయాలి ఇక అని తీర్మానించుకున్నాడు.
కానీ, తన చిరకాల వాంఛ, విమానయానం - అది మటుకు పూర్తి చేసుకోవాల్సిందే. ఇంతకు మించి సువర్ణావకాశం రాదు గాక రాదు అనుకున్నాడు.
ఫ్రాన్స్ వెళ్దామా లేక ఈజిప్టు వెళ్ళి పిరమిడ్లు వగైరా చూద్దామా అని మీమాంస బయల్దేరింది. ఇంతలో!
సరే వెళ్ళడం ఖాయం! ఎక్కడికి అన్నది, అప్పుడు చూసుకుందాం అని తీర్మానించుకున్నాడు.
కానీ ఒక్కడినే వెళ్తే ఖర్చు తగ్గుతుంది. పైగా స్వేచ్ఛగా వెళ్లి రావచ్చు! మొదటి సారి, ఫ్యామిలీతో అనగా భార్యామణితో వెళ్ళడంలో విసుగు కనిపించింది అతనికి!
చీటికి మాటికి ఏవో అందియ్యటం, కొని పెట్టటం, సామాను సర్దుబాటు, వాటి తాళాలు చూడటం ఇవే సరిపోతుంది తనతో ఐతే! పైగా ప్రతి రూపాయి ఖర్చుకి ఒకటే నస! దుబారా దుబారా అంటూ! అవును ఒక్కణ్ణే వెళ్తాను ఈ సారి.
అంతగా అయితే వాళ్ళ వాళ్ళింట్లో దింపి వెళ్తాను. వెళ్ళటం మటుకు ఒక్కణ్ణే. ఖాయం అని నిశ్చయించేసుకున్నాడు.
వాళ్ళవాళ్ళ మాట రాగానే ఒళ్ళు మంట కూడా వచ్చేసింది కుమార్ కి. ఈ లాటరీ విషయం గుంభనంగా ఉంచాలి లేదా రోజుకొకడు ఇంటికి వచ్చి అప్పు అడగటం ఆరంభిస్తే! అమ్మో, పెద్ద తలనొప్పి!
To be avoided at all costs, yes by all means, అనుకున్నాడు!
ఫారిన్ వెళ్ళే ఆలోచన ఉన్నవాడికి, ఇంగ్లీషులోనే ఆలోచనలు రావటం సహజం అన్నట్టు!!
*****
ఇంతలో పని పూర్తి చేసుకొని శ్యామల వచ్చింది. ఎంతో ఆశగా,"చూశారా, అంబ పలికిందా?", అంటూ అడుగుతూ!
"రారా, దాదాపుగా పలికినట్లే! నువ్వు చెప్పిన వరుస నెంబరు అయితే ఉంది రెండో షీట్లోనే. ఇదిగో చూడు" అన్నాడు కుమార్!
"దాదాపుగా ఉండటం మేమిటండీ?! ఉండండి, మిగతా మూడంకెలనూ కూడా కలిపి చూద్దాం" అన్నది.
రవికుమార్ తాపీగా," కాస్త ఉండవమ్మా లాటరీ రాణీ, కాస్సేపు నిజంగానే లాటరీ దక్కిందనే అనుకొని, ఆ పైకం ఏంచేయాలో ఆలోచిస్తే నష్టం ఏమన్నా ఉందా?!" అని అడిగాడు.
శ్యామలకూ, పూర్తి నెంబరు చూడాలని ఉన్నా, పైకం వస్తే ఏం చేయాలో ఊహించటంలో ఏదో మజా కనిపించింది. రాకపోతే, దిగులు పడటానికి జీవితమంతా ఉండనే ఉంది!
అంతలోనే, కుమార్, "నేను నిర్ణయించేశాను, నువ్వూ కాదనవు, నాకు తెలుసులే, ముందుగా, మన ప్లాటులో చిన్నదైనా సరే, ఇల్లు ఒకటి కట్టుకుందాం!" అన్నాడు.
శ్యామల సంతోషంగా,"నిజమేనండీ, అదే చేద్దాం ముందుగా. ఈ అద్దెఇంటి బాదరబందీ తప్పుతుంది" అన్నది.
"నీకు నగల కొనుగోలు, ఒక కాశ్మీరం ప్రయాణం కూడా ఉన్నాయి నా ప్లాన్ లో,తెలుసా", అన్నాడు, తన ప్లాను మీద ప్రశంసల వర్షం కురిపిస్తుందని ఎదురుచూస్తూ!
"ఎందుకండీ అంతా దుబారా, హాయిగా బ్యాంకులో వేసుకుందాం మిగతాది", అన్నది శ్యామల తన సహజమైన పొదుపరి వైనంలో!
"ఎంత వచ్చినా మన ఆలోచనలు మారవా శ్యామలాదేవి గారూ?! సరే ఇది విను అసలైంది! తరువాత, నేనొక ఫారిన్ ట్రిప్ వెళ్ళబోతున్నా! అన్నాడు రవికుమార్ సూటిగా! మొహమాటంగానో, సిగ్గుతోనో అన్నట్టు ఉంది ఆ అనటం, కాస్త తగ్గిన స్వరంతో, తొందరగా!
"నేను అంటే మీరొక్కరేనా, నేను రావట్లేదా?! అంది శ్యామల ఆశ్చర్యంగా!
"నువ్వొచ్చి ఏం చేస్తావ్ అక్కడ. పైగా నీకు ఆ వాతావరణం పడదు కూడా!" అన్నాడు కుమార్!
"మీరేం చేస్తారో, నేనూ అదే చేస్తాను, చూస్తాను", అన్నది శ్యామల, కొంచెం కోపంతో!
ఆమె ఆలోచనలు ఎటు సాగుతాయో అని కాస్త నిశ్శబ్దం వహించాడు రవి.
అసలు టికెట్ కొన్నది నేను, లాటరీ తగిలింది నాకు. డబ్బు వస్తోంది నాకు. అట్లాంటిది, నువ్వు రావద్దు, నేను వెళ్తాను అంటారేవిఁటీ విచిత్రంగా. అనుకున్నది శ్యామల!
మొదటి సారి, రవికుమార్ కి, భార్య ఎట్లా ఒక బోరైన లగేజ్ గా అనిపించిందో, ఆమెకు కూడా అట్లాగే కొత్త అనుమానాలు రాసాగాయి. అసలు నా ఆనందాలు పట్టించుకోకుండ ఈ ధోరణి ఏవిఁటీ,?! నాకు మాత్రం ఊహలు, ఆశలు లేవా?! తగ్గేదే లేదు అనుకుని, చురచురా చూసింది అతని వైపు!
అతనికీ అర్ధమైంది ఆమె ఆలోచనల దారి.
వెంటనే "చూడు, నాలుగో పేజీ, ఇదిగో, 9500100 446,!
నీ 246 లేదు., అన్నాడు, అక్కసుగా అన్నట్టు!
ఒకే క్షణంలో, అప్పటివరకు ఊరించిన ఆశలు, వాటితో పాటే, ఒకరిపై ఒకరికి అసహనం ఎగిరిపోయినట్లైంది!
ఒక్కసారి, ఆకాశంలో నుంచి నేలకు జారినట్టూ, ఇల్లంతా ఇరుకుగా ఉండి, ఇంకా చిన్నవైనట్టూ, తాయిలం ఇచ్చి లాగేసినట్టూ, ముందే నెంబరు చూసిన అతనికీ, అప్పుడే చూసిన ఆమెకు, ఇద్దరికీ ఒకే లాగా అనిపించింది ఆ క్షణం, పాపం!
ఒకే ఒక్క క్షణం నిశ్శబ్దంగా సుదూరంగా చూస్తూ ఉండిపోయారు! కూచున్నవారు, ఒకేసారి ఇద్దరూ లేచి, మొహాలు చూసుకున్నారు. నిట్టూర్పులతో కూడినవే అయినా, చిరునవ్వులు అప్రయత్నంగా విరిశాయి, వారి పెదవులపై!
"రా, అలా వెళ్ళొద్దాం", అన్నాడు రవికుమార్!
శ్యామల, తలుపు తాళం వేసి, భర్త వెంట వెళ్ళింది, మామూలుగా ఎప్పుడూ వెళ్ళినట్లే!
మీరు ముందే చూసేశారు కదూ మొత్తం నెంబరు, రాలేదని ముందే తెలుసు కదూ మీకు? అన్నది శ్యామల, రెండడుగులు నడవగానే. రవికుమార్ చిరునవ్వే, ఆమె ప్రశ్నకు "అవును", అనే సమాధానమైంది.
కాస్త దూరం నడవగానే, శ్యామలే అన్నది, "ఎందుకు మొత్తం నెంబరు కలవలేదో తెలుసా?" ఒక్కళ్ళే వెళ్తానని ఆలోచించారుగా అందుకే"!
అతను వెంటనే,"అయితే ఈ సారి ఇద్దరం వెళ్తున్నట్లే ఊహిస్తాలే, రేపే కొను, ఇంకో టికెట్" అన్నాడు!
"తప్పకుండా స్వామీ" అన్నది ఆమె మెల్లిగా!
ఆమె, మరునాడు కొనే ఉంటుంది ఇంకో లాటరీ టికెట్!
అతని భరోసా ఉందిగా, ఈ సారి ఫారిన్ ట్రిప్ ఇద్దరికీ అంటూ!
***
అవును, నిజమే!!
Bagundi.