Menu Close
లేఖిని - కథా లోగిలి
సేకరణ, కూర్పు - అత్తలూరి విజయలక్ష్మి
డబ్బు
- అప్పలకుట్టి రాజ్యలక్ష్మి -

పాతికేళ్ళ రాధికకు నవ్వొచ్చింది.

పర్సులో పాతిక రూపాయలు లేవు. పాతికేళ్ళకే బాధ్యతలు అర్థం అయి, పర్సు నింపాలన్న లక్ష్యం ఏర్పడింది. కాలేజీలో అభ్యసించిన చదువు పక్కబలం. సగటు మధ్యతరగతి విలువలు ససేమిరా ఒప్పుకోని సంఘర్షణ.

మొన్నామధ్య ఉద్యోగులు సమ్మె చేయడంతో తండ్రిగారికి జీతం రాలేదు. వస్తేనే వారం నిలవని సంపాదన, ఇహ రాకుంటే చెప్పేదేముంది. విధి లేక బావమరిది నుంచి కార్డు రాసి ఐదు వందల చేబదులు ప్రయత్నం... రాసింది కార్డు కదా ఇంట్లో అందరూ చదివే ఉంటారు.

మేనమామ వచ్చినప్పుడు భోంచేస్తూ, “మీ సాంబారు విస్తరిలో ప్రవహిస్తుంది బావా!” అంటూ పలచని సాంబారును అపహాస్యం చేస్తే ఓ నవ్వు నవ్వి ఉరుకున్నాడు. అక్క కంట్లో కన్నీళ్ళు గిర్రున తిరగడం ఆ తమ్ముడు గమనించలేదు. ఆ సాంబారు తినే, నలుగురు పిల్లలూ ఏపుగా ఎదిగారు. వేసవి సెలవల్లో బారుగా ఎదిగిన పిల్లలను పుట్టింట్లో ‘పెరుగు తోటకూరలాగా ఎదిగారు రాధమ్మ పిల్లలం’టూ పొగుడుతుంటే మొహాన సన్నటి చిరునవ్వు.

వారానికోసారి తీసుకువచ్చే కూరగాయలను వారం పొడుగూతా వండి మెప్పించడంలో ఆమె నిర్మలా సీతారామన్ గారికే పాఠాలు చెప్పగలదు మరి.

ఆ మధ్య అరియర్సు వచ్చినప్పుడు ఇద్దరు ఆడపిల్లలకు తులం, తులం చైన్లు కొన్నప్పుడు ఆ దంపతులు కోహినూరు తెచ్చుకున్నంత సంబరపడిపోయారు.

ఇంట్లో అంతా బానే ఉంటుంది. ఐశ్వర్యం లేదన్న వాస్తవం బయటి వాళ్ళకే కనిపిస్తుంది. బడులకు వెళ్తున్న పిల్లలు సంపదను ఇప్పట్లో పెంచలేరు. పెద్దకూతురు రాధికే కాలేజి చదువు ఈ మధ్యే ముగించింది. ఆమెకేదైనా సంపాదన ఏర్పడితే ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చు.

టైపు క్లాసుకు వెళ్ళడం. లెక్కల ట్యూషను మొదలు పెట్టింది. ఆరుగురు పిల్లలతో గిర్రున నెల తిరిగేసరికి ఒక్కోరికి వంద చొప్పున అప్పనంగా ఆరువందలు కంటజూసింది. అమ్మకిచ్చేసింది. ఆ డబ్బు ఏ సమస్యని పరిష్కరించకున్నా పిల్లకు ఆనందమిస్తున్నదన్న నిమ్మది. మూడు నెలల స్ట్రైకు ముగిసి యూనియన్లు సంధి కుదిర్చాక తొంభై రోజుల సెలవుతో సర్దగా జీతం చేతికి వచ్చింది. ఇతర అప్పులు తీరుస్తూ ముందు బావమరిది ఐదొందలు పంపించేశాడాయన.

ఆ సంఘటన ఓ పాఠం. ఎంత కాదనుకున్నా అయినవాళ్ళు అవసరానికి ఆదుకుంటారు. ఆ వేసవి సెలవులకు మేనమామ తన కూతుర్ని చదువుకోసం ముందు అడిగేసి అక్కగారింట్లో పెట్టాడు. ఇక్కడ చదువు ధ్యాస ఇంట్లో వాళ్ళకి ఎక్కువ. ఆ పిల్ల మూడునెలల్లోనే ఇక్కడ సర్దుకుంది. కానీ తన ప్రేమాయణం నిరాటంకంగా కొనసాగించింది. జాబులు రాయడం, పోస్టు చేయడంలో నేర్పరై పోయింది. ఆ పద్ధతులు తమ పిల్లలు ఎక్కడ వంట పట్టించుకుంటారో అని మనసులో దిగులు, గాభరాతో సాంబారులో ఉప్పు రెండు సార్లు వేసేంతగా చింతాక్రాంతమైన తల్లి మనసు ఇంటిల్లిపాదికీ తెలిసి వచ్చింది. ఇహ లాభం లేదని జాబు రాసి తమ్ముడుగారిని రప్పించారు. మాటలు, మనస్తాపాలతో బరువైన రోజులు రెండు. మేనకోడల్ని బస్సెక్కించి మరింత బరువైన గుండెలతో ఇల్లు చేరారు. డబ్బుండీ చదివించుకోలేని వ్యధ. రాధికకు ఓ విషయం అర్థమైంది. డబ్బు లేకపోవడం పెద్ద సమస్యే. డబ్బుంటే సమస్యలు ఉండవన్నది ఒక అపోహ. కొన్ని సమస్యలను డబ్బుతో సాధించలేము. చదువుకోడానికి డబ్బు కావాలి. కానీ ఫీజులు కట్టేస్తే చదువు పార్శిల్‌లో మెదడులోకి వెళ్ళదు. చదువు స్విగ్గీలు చేస్తే రాదు, సొంత వంటింట్లో వండాల్సింది. వాస్తవం అర్థమయ్యింది. చదవడానికి డబ్బును మించి ఏదో కావాలి.

తను ఆరొందలు సంపాయించి లెక్కలు చెప్పింది. ఆరుమందికీ ఫీజు ఒకటే, వారికి పరీక్షలలో వచ్చిన మార్కులు వేరువేరు. తన అవగాహనా పుష్పపు మొగ్గలో ఓ రెక్క విచ్చుకుంది.

అప్పట్నుంచి డబ్బు సంపాదించడంలో మెలకువ వచ్చింది. తానూ లాభపడుతూ రాబడి సంపద పెంచుకునే మార్గాలు వెతుక్కోవాలనుకుంది.

ఒక్కో ఉద్యోగానికి దరఖాస్తు పెట్టడం, పోస్టలు ఖర్చులు, ఎదురుచూపులూ చూస్తుంటే సంవత్సరం గడిచిపోయింది. దూరవిద్యలో చేరి యమెస్సీ గణితం మొదటి ఏడాది పరీక్షలు ఋతుపవనంలా కాకుండా, కూడబలుక్కుని తుఫాను వర్షాల్లా ఒక్కసారి దూకేయడంతో ట్యూషన్లు ఇతరాలు పక్కన బెట్టి ఓ వారం అహర్నిశలూ చదివేసింది. పాత ప్రశ్నాపత్రాలు, పరీక్షల ట్రిక్కులు తూచా తప్పకుండా పాటించి పరీక్షాగండం నుంచి బయటపడ్డట్టే.

ఏడాదిగా ఇంటిపట్టున ఉండి పనులు చక్కబెట్టుకుంటుంటే కుదురు వచ్చింది. ఇరుగుపొరుగు నోట ‘మంచి పొందికయిన పిల్ల ఏ ఇంట్లో పడుతుందోనన్న ఆశ’ ఉప్పందుకుంది. ‘మా తమ్ముడికి చూద్దామా’ అని ఒకరనుకుంటే ‘మా మరదికయితే మాతో ఇట్టే కలసిపోతుంద’ని మరో ఇల్లాలు. మగపిల్లలని ‘మోస్టు ఎలిజిబుల్ బాచులర్’ అన్నట్టు రాధిక చాలామంది ఇష్టపడే కాబోయే కోడలైపోయింది.

ఆ అమ్మాయి మనసు మాత్రం చెక్కుచెదరక ఇంటి ఆర్థిక పరిస్థితులు బాగుపడడం మీదే. ఇంట్లో చదువు ‘శ్రమ ముందడుగు’ అన్న ఇరుసుమీదే తిరుగుతోంది. అభ్యాసంతో అధ్యయనంతో చదువు, జ్ఞానం వస్తాయనే నమ్మకం ఉంది. సంపద రావాలంటే ఆ జ్ఞానం సరిగ్గా ఉపయోగించి ప్రణాళికల ప్రకారం పనిచేయాలి. ముందు పెట్టుబడి రాబట్టుకుంటేనే లాభాలు విస్తరణలు. పెట్టుబడి అంటే ధనమేనా? ధనం మాత్రమే కాదు ధనంతో బాటు కాలం ప్రతిభ, ప్రజ్ఞాపాటవం, పనివిలువలు, సమిష్టి విలువలు.

తను ట్యూషన్లు చెబుతూ, ఆ అనుభవంతో పిల్లలకు సరళమైన పద్ధతిలో లెక్కలను సాధించి జవాబు రాబట్టడం గురించి ఓ పుస్తకం తయారు చేసింది. కోణార్కు గైడు, గోల్డెన్ గైడుల ధర ధగధగలాడితే ఈ పుస్తకం జిరాక్సు డబ్బులకే అందుబాటులోకి వస్తుంటే పిల్లలు ఈ పుస్తకానికే మొగ్గు చూపారు.

కాలగమనాన యమ్మెస్సీ గణితం డిగ్రీతో ఈ స్వయంరచనతో తాను ఓ ఎంపిక చేయదగిన అభ్యర్థై కూచుంది. మంచిపేరున్న బడిలో లెక్కలమాస్టారంటే తక్కువేమీ కాదు. పైగా గౌరవం కూడాను.

కూతురు గుండెల మీద కుంపటనీ, బరువనీ ఎవరూ అనకపోగా మా ఇంట్లో అంటే మా ఇంట్లో మంచి కోడలవుతుందన్న పోటీలు.

ఆర్థికంగా కుటుంబం, స్థిరపడ్డాకే పెళ్ళనేసింది. తప్పదు పెళ్ళి జీవితంలో భాగం. కానీ కష్టపడి పెంచి పెద్ద చేసిన కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంటే పెళ్ళికి ఊ అంటానంది.

ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. పెళ్ళి ఎట్లాగూ తప్పదు. ఉండూరు బంధుత్వమైతే కాపురం, బాధ్యత కాస్త సులువుగా కష్టం లేకుండా చూసుకోవచ్చు. తమ్ముడు, చెల్లెలు ఎదిగే వరకే ఇబ్బంది. తర్వాత వారి సహకారమూ ఉంటుంది.

ఒకటి, మూడు వీధులకవతల ఉన్న మీనాక్షి తమ్ముడి సంబంధం. అతనికి ఇల్లు మీనాక్షి వాళ్ళ పైమిద్దె మీదనే. ఇంకోటి, మూడిళ్ళకవతల ఉన్న రాజామణి మరిది సంబంధం. తల్లిదండ్రులు ఛాయిస్ రాధికకే ఇచ్చారు.

మీనాక్షి తమ్ముడు సాఫ్టువేరు. రాజామణి మరిదేమో సివిల్ ఇంజనీరు. పైగా ఉన్న వీధి లోనే కాపురం. వాళ్ళది సొంతిల్లు కూడా. వేలు కురిసే సాఫ్టువేరా, నింపాదిగా వెళ్ళే సివిలింజనీరా... తేలాలి. తర్వాత ఒడ్డూ పొడుగు, అందం చందం... తనేం పెద్ద ఐశ్వర్యారాయ్ కాదు. అలనాటి అంజలీదేవి, మధుబాల కోవకి రాదు. రంగూ ఛామనఛాయ. అయినా సగటు సంబంధాలకైతే చక్కటి పిల్లే. ఇద్దరూ కట్నకానుకల ప్రసక్తి తేలేదు. గుడిలో పద్ధతిగా చేసుకుందామని ముందుకొచ్చారు కూడా.

చాలాసేపు ఆలోచించాక పెళ్ళిచూపుల వరకు వచ్చింది ప్రస్థావన. ముందు మీనాక్షి వాళ్ళు వచ్చారు. మాటలు, పలకరింపులు జరిగాయి. వెనువెంటే తర్వాతి రోజు రాజామణి కుటుంబం, మరిది గోపాలం వచ్చారు. దాదాపు రోజూ వీధిలో తారసపడి బైకుకు, స్కూటీకి దారి ఇచ్చి పుచ్చుకున్న పరిచయం. పెళ్ళిచూపులంటే ఇద్దరికీ నవ్వొచ్చింది. ఏదో సాంప్రదాయం, పైగా ఆలోచనాధోరణిలో కొత్తకోణం.

ఎటూ తేల్చలేకపోతుంటే తల్లే అంది, “నాకైతే గోపాలం నచ్చాడు. రోజూ చూస్తున్నాం ఎలాటి భయాలూ లేకుండా ఊ అనొచ్చు. మీనాక్షి తమ్ముడంటే ఆరా తీయాలి.” అందరం ఎప్పుడూ కాస్త శ్రమపడడానికి లోతుగా విషయం తెలుసుకోవాల్సి ఉంటే కొంచెం ఆరా తీయడానికి ముందుకు వెళ్ళం. తెలిసిన అందుబాటులో ఉన్న విషయాలతో నిర్ణయాలు తీసుకుంటాము.

రాధిక ఆలోచించింది. ఎంతోమంది కుర్రకారు ఆకతాయితనం చూపుతారు. ఇరుగు పొరుగు నిజమైన ప్రవర్తనను బాగా తెలుసుకునే ఉంటారు. ఇన్నేళ్ల జీవితంలో ఎప్పడూ అతను సంస్కారవంతమైన ప్రవర్తనతోనే అగపడ్డాడు. ఉన్న వీధే అయినా చొరవ తీసుకుని దగ్గరవను ప్రయత్నించ లేదు. అతను తనతోనే కాదు ఇంకా వీధిలో ఉన్న వేరే కుటుంబాల అమ్మాయిలతోనూ బాగానే ఉంటున్నాడు. ఒక విధంగా అతను మిస్టర్ క్లీన్ బిరుదాంకితుడు.

మీనాక్షిగారి తమ్ముడు ఎలాంటివాడో ఆరా తీయాలి. తెలుసుకోవాలి. పైగా సాఫ్టువేరు. ఎప్పుడైనా పోయే ఉద్యోగం. విపరీతమైన ఒత్తిడి, పోటీ. సివిలింజనీర్లు లేకుండా ప్రపంచం లేదు. ఎక్కడైనా పని ప్రాధాన్యత. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేసుకుంటే గౌరవం, సమాజంలో గుర్తింపు. ఎప్పుడైనా కట్టడాలు, వాటి బాగోగుల పనులు లేకుండే సమాజం లేదు. రేపు పని ఉండదన్న భయం లేదు. కొత్త కట్టడాలు లేకున్నా, పాతవాటి పరామర్శ చక్కగా నిర్వహించుకోవడం అనే ప్రణాళికలను అమలు చేసేది సివిల్ వాళ్ళే. వారికి సమాజంతో సర్దుకు పోవడం వెన్నతో పెట్టిన విద్య. ఇద్దరూ ఒకే రంగమైతే ఏం చేసేదో కానీ రెండు సంబంధాలూ ఉన్న ఊరే. వారి వ్యాపకాలు, సమాజానికి వారి పట్ల గల ధోరణీ ఎంపికలో తరాజుతో బేరీజు వేసుకుంటున్నది.

అత్యధికులు సాఫ్టువేర్ వెంట పరుగు పెడుతుంటే తాను పాతపద్ధతితో పయనిస్తున్నదా? నిజమే... పెళ్ళి అన్న అంశమే తరతరాలుగా వస్తున్నది. సమకాలీన సర్దుబాట్లు తప్పితే పెద్దగా అప్‌డేట్లు అవసరం లేని అబ్సలేటు కాని సామాజిక ఏర్పాటయే గోపాలం సంబంధం సరేననుకుంది.

ఇంట్లో మాట విషయం తరచడం ఎలాగూ వస్తుంది. తల్లితో తన అభిప్రాయం చెప్పింది. ఆవిడ భర్తతో మాట్లాడాక, రాజామణిని మాట్లాడాలని “వస్తావా? రమ్మంటావా?” అని అడిగేసింది. పొరుగింటి ఆడపడచు. పెళ్ళయాక ఆ ఇంట కాపురం చేసుకుంటూ ఎన్నోసార్లు పక్కింట కష్టం, సుఖం తనతో చెప్పుకున్నది. అలా పెద్దావిడగా ఆవిడకు ఆ మాత్రం చనువుంది మరి.

మధ్యాహ్నంగా వచ్చిన రాజామణితో వివరంగా మాట్లాడాక అంతా ‘సరేనంటే సరే’ అనుకున్నారు. ఈ సంబంధం ఖాయం అనుకున్నాక మీనాక్షికి ముందు తమ నిర్ణయం చెప్పేయాలనీ నిర్ణయించారు. సాయంకాలం వారి ముందే మరిదితో మాట్లాడింది.

అంతా సరేనంటే సరేనన్నాడు. సాయంత్రం ఆమె భర్త కుటుంబ పెద్దలతో మాట్లాడాక ఖాయం చేసుకోవచ్చనే అక్కడ ఉన్న అందరికీ అనిపించింది.

రాధిక తల్లి మనసులో గతం గిర్రున తిరిగింది. తొలికాన్పు, సుఖప్రసవం… పాప ఎదగడం, చిన్న చిన్న అనారోగ్యాలు, ఆరాటాలు, నిద్రలేని రాత్రులు, ముద్దు ముద్ధు మాటలు. పట్టుచీర, పెళ్ళికూతురు పూలజడ అంటూ మారాము చేయడం. మెల్లిగా సంగీతం క్లాసు, డాన్సు క్లాసంటూ పరిగెత్తడం...  బడి, గుడి, ఫీజులు, పుస్తకాలు...  పరుగు ఎప్పుడూ ముందుకే... వెంట వెంట తమ్ముడు, చెల్లి, ముగ్గురు పిల్లలతో పనిలో ఏళ్ళు, ఊళ్ళు ఎటుపోయాయో గమనించనంత వ్యస్థత, అస్వస్థతలు లేకపోవడం వలన ఆత్మీయంగా గడచిన జీవితం. పెళ్ళి. తన పెళ్ళే నిన్నో మొన్నో అయినట్టుంటే అమ్మాయి పెళ్ళిమాటలు.

జీవితం రంగురంగుల హరివిల్లుకంటే తక్కువేమీ కాదు. బతుకు ఆరాటంలో కొన్ని రంగులను మనం గమనించకున్నా అవి కాంతినిచ్చి ఆకాశ వారధిని అన్యోన్యంగా నిర్మిస్తాయి. ఆర్థిక ఒడిదుడుకులు ఎక్కడో పుట్టి వచ్చి తీరం తాకే అలల లాటివే. తీరానికి అందాన్ని ఇస్తూ ముందుకు పరుగెత్తమని కవ్విస్తూ, కాళ్ళు తడుపుతూ సాగరతీరం సంసార సమాహారం.

‘కలుద్దాం. మళ్ళీ పెళ్ళివిందులో’ అన్న నిర్ణయం జీవితపు మరో అంకానికీ కొత్త తరఫు కుటుంబ హరివిల్లు ఆవిర్భవానికి హాయిగా ఆర్భాటం మొదలెట్టింది.

Posted in September 2025, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *