గత సంచిక తరువాయి »
పిదప శేఖరే, "అన్నట్టు మీ పెళ్లికై రాత్రి మీ నాన్నగారితో మాట్లాడాను అన్నారు. ఆ సంగతి ఎంత వరకు వచ్చిందన్నారేమిటి" అని అడిగాడు చిన్నగా నవ్వుతూనే.
కుమ్మీ గమ్మున తన చూపును శేఖర్ చూపులో పెట్టింది.
శేఖర్ తన చూపును తిప్పలేదు. ఆమెనే చూస్తున్నాడు.
కుమ్మీ తన చూపు తిప్పింది.
"వాళ్లు అడిగినంత నాన్న ఇవ్వలేమంటున్నారు. అన్నయ్య సర్దినా కుదరడం లేదు" అని చెప్పింది కుమ్మీ.
"ప్చ్. కలిసి ఉండడానికీ ఈ పెట్టుబడులు ఏమిటో" అన్నాడు శేఖర్.
"ఏం మీరు తీసుకోలేదా" అని అడిగేసింది కుమ్మీ.
నవ్వేశాడు శేఖర్.
"ఎందుకు నవ్వుతున్నారు" అంది కుమ్మీ.
"మీ కౌంటర్‌కు. అదే మీరు గొప్ప షార్పుగా రియాక్టు అవుతారు" అన్నాడు శేఖర్.
"అదేమిటి నేను అడిగేది తప్పా" అంది కుమ్మీ.
"అడిగేది తప్పుకాదు. ఆ అడిగే విధం నొప్పిస్తోంది అంటున్నా" చెప్పాడు శేఖర్.
"ఏమిటో మీరు. నాది ప్రతిదీ తప్పు అంటున్నారు" అని తల గొక్కుంటుంది కుమ్మీ.
"అయ్యో మీది తప్పు అనడం లేదు. మీది బిలో బిహేవిర్ అవుతోంది అంటున్నాను." అన్నాడు శేఖర్.
పిమ్మట కుమ్మీ ముఖంలో పసితనాన్ని చూసి మాట మార్చాడు శేఖర్, "మీరు సినిమాలు, కథలు పుస్తకాలు చదువుతుంటారా" అని అంటూ.
"చాలా తక్కువ. ఐనా ఎందుకు" అని అడిగింది కుమ్మీ.
శేఖర్ నవ్వేడు.
"మళ్లీ ఎందుకు నవ్వుతున్నారు" అని అడిగేసింది కుమ్మీ వెంటనే.
శేఖర్ ఆ నవ్వును ఆపి, "ఏమీ లేదు. ఇంకా నయం సినిమాకు వెళ్దామా. ఏమైనా పుస్తకాలు కొనుక్కుందామా అని మిమ్మల్ని అడగలేదు నేను. అలా అడిగి ఉంటే నేను రాను, నేను కొనను, నాకు అవి అంతగా నచ్చవు అని మీరు అంటారేమోనని తలుచుకుని నవ్వేను" అని తిరిగి నవ్వేడు శేఖర్.
కుమ్మీ కూడా నవ్వింది.
"హమ్మయ్య అలా నవ్వండి. హాయిగా ఉంటుంది" అన్నాడు శేఖర్.
ఆ తర్వాత ఆ ఇద్దరూ ఆ షాపు నుండి బయటకు వచ్చి ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.
*** *** *** ***
రెండు రోజులు తర్వాత -
ఉదయం ఆఫీసుకు సెలవు పెట్టి కుమ్మీ వాళ్ల ఊరు వెళ్లాడు శేఖర్.
అక్కడ శేఖర్ని చూసిన వారంతా పక్కకు తప్పుకున్నట్టు కదిలారు. అతనిని వింతగా చూస్తూ ఉండిపోయారు చాలా మంది. నేరుగా బిట్టు వాళ్ల ఇంటి అడ్రసు ప్రకారం వెళ్లి వాళ్లను కలిశాడు.
ఆ ఇంటిలో వాళ్లూ శేఖర్ని చూసి కంగారు పడ్డారు. అప్పటికే శేఖర్ గురించి తమ ఇంట్లో వాళ్లకు చెప్పి ఉన్న బిట్టు తండ్రి మాత్రం వెంటనే తేరుకొని శేఖర్‌ను తన ఇంట్లోకి తీసుకు వెళ్ళి కుర్చీలో కూర్చోపెట్టాడు.
"ఇదిగో మీ కాగితం. దీన్ని బ్యాంకు వారికి ఇవ్వండి. మీ బోరింగ్ కు లోన్ ఇస్తారు" అని చెప్పి ఒక కాగితాన్ని బిట్టు తండ్రికి ఇచ్చాడు.
"మీరే తేవాలా సారూ" అన్నాడు బిట్టు తండ్రి.
"అదే, నేనే కోరి వచ్చాను. నేను మీ బిట్టులా ఉన్నాను అన్నారుగా. ఆ విషయం ఏమిటో తెలుసుకుందామని వచ్చాను" చెప్పాడు శేఖర్ నవ్వుతూ.
"అవును సారూ. మా బిట్టులానే మీరు ఉన్నారు" అని బిట్టు తండ్రి వెళ్లి గోడన ఉన్న ఫోటోను తీసి శేఖర్ చేతిలో పెట్టాడు.
ఆ ఫోటోను చూస్తూ శేఖర్ కుమ్మీ ఎప్పుడో ఇట్టిదే చూపిందిగా అని అనుకొని, "ఇతను మీ బిట్టునా. అబ్బో ఇతనిలానే నేను ఉన్నానే." అన్నాడు.
"అవును బాబు. మా బిట్టూలానే మీరు ఉంటారని మా వాళ్లు ఎంతగానో చెప్పారు. కానీ మేము మిమ్మల్ని ఇలా చూసిన తరువాత నమ్ముతున్నాం. ఎంత వింత?" అన్నారు అక్కడ కూడిన ఆడవాళ్లు శేఖర్‌నే చూస్తూ.
"నేను ఈ ఫోటోను చూశాక నమ్ముతున్నాను. నిజమే! వింతే మరి. నాకు మీకు ఏ సంబంధం లేదు. నాకు ఈ ఊరే తెలియదు. సంగతి తేల్చుకుందామనే కోరి వచ్చాను. బిట్టు చనిపోయాడా. ఎలా" అని అడిగాడు శేఖర్ కాస్తా చొరవగా.
వెంటనే ఎవరూ మాట్లాడలేదు. మళ్లీ నెమ్మదిగా కదిపాడు ఆ విషయాన్ని శేఖర్.
బిట్టు తండ్రి అప్పుడు, "మా ఒక్కగాని ఒక మగ బిడ్డ బిట్టు. మంచోడే. మా కుటుంబంలో వాడు ఒక్కడే చదువుకున్నోడు. వయసు ప్రభావంతో, వీడితో చదువుతున్న మా ఊరు పిల్ల వీడు ప్రేమించుకున్నారు. అటు ఇటు మా కుటుంబాలకు తెలీదు వాళ్ల పెళ్లికి మా పర్మిషన్ అడిగినంతవరకు. వాళ్లు తమ పెళ్లికి అడగ్గా మా కుటుంబాలు కలవ్వు కనుక మేము వాళ్ల పెళ్లికి కాదన్నాం. మా కట్టుబాట్లు మావి. అవే వాళ్లకు చెప్పాం. మా వాడు మాత్రం తాము తప్పక పెళ్లి చేసుకుంటామన్నాడు. తనకు ఉద్యోగం వచ్చింది కనుక బ్రతికేస్తామన్నాడు. కానీ ఆ పిల్ల కాదంది. దాంతో బిట్టు ఉరి వేసుకొని చనిపోయాడు. మాకు నరకం చూపాడు" అని చెప్పాడు.
'కుమ్మీ తలుస్తున్నట్టు ఇక్కడ పరిస్థితి లేదు. నేను అనుకున్నదే సుమారుగా ఇక్కడ కానవస్తోంది.' అని అనుకున్నాడు శేఖర్ అప్పుడే. అక్కడ చాలా విచారం ఆవరించింది అప్పటికే.
శేఖర్ అది గమనించి, "నేను వచ్చి ఆ విషయాన్ని కదిపి మిమ్మల్ని మళ్లీ బాధ పెట్టాను. మన్నించండి." అని అన్నాడు.
"అయ్యో అలా అనకండి సారూ. మీ రాకే మాకు ఆనందంగా ఉంది" అన్నాడు బిట్టు తండ్రి.
శేఖర్ తన చేతిలోని ఫోటోను బిట్టు తండ్రికి ఇస్తూ, "ఇక నేను బయలుదేర్తాను" అని అన్నాడు.
"అరె. ఉండండి. మీకు ఏమీ పెట్టలేదు. కొబ్బరి బొండాం తెస్తాను" అని అన్నాడు బిట్టు తండ్రి హడావిడిగా.
"వద్దు వద్దు. మజ్జిగ లేదా మంచి నీళ్లు ఇవ్వండి చాలు" అని అన్నాడు శేఖర్.
"మజ్జిగా. మా ఇంట్లోది తాగుతారా సారూ" అని అన్నాడు బిట్టు తండ్రి సంశయంగానే.
"ఏం బిట్టు ఐతే మీ ఇంట్లోది తాగడా" అని అడిగాడు శేఖర్.
"అయ్యో తమరు ఎంత గొప్పవారు" అని బిట్టు తండ్రి తన ఆడవారికి మజ్జగ తెమ్మని చెప్పాడు.
వారు తెచ్చిన మజ్జిగ గ్లాసును అందుకొని శేఖర్ కు అందించాడు ఆ వెంటనే.
శేఖర్ మజ్జిగ తాగుతూ, "మీరు ఈ పట్టింపులే వీడండి. అన్నింటా మార్పులు వస్తున్నాయి. మీవి వర్షాధార పంటలు ఒకప్పుడు. ఇప్పుడు పంటలకై బోరులు తీసుకుంటున్నారు. అలాగే మనం మారుతుండాలి. మనం మనుషులం. జరిగిందేదో జరిగిపోయింది. పంతాలు, పట్టింపులు వదలండి. జరిగి పోయిన అట్టివి తిరిగి జరక్కుండా మనం చూసుకోవాలి. అలా నడుచుకోవాలి." అని చెప్పాడు.
"అవును సారూ. బాగానే చెప్పారు. అందరూ మారాలిగా. ఏ ఒక్కరైనా ముందు పడితే తిరుగుబాటు అంటారు. వెలి వేస్తారు." అన్నాడు బిట్టు తండ్రి దిగులుగా.
"అదే వద్దు. మీకు అవసరమై బోరుకు ప్రయత్నిస్తున్నారు. మీ వాడలో మీరే బోరుకై ముందుకు వచ్చారు. అవునా. మీరు ముందుకు వచ్చారని మిమ్మల్ని కాదంటారా. మీ భాషలోనే మిమ్మల్ని ఇప్పుడు వెలి వేస్తారా. ఐనా ముందు ఇక్కడ మీకు ఆ ఆలోచన వచ్చిందా. లేదే. మీ అవసరం మీది. మీరు చేసేది మంచిదైతే మిమ్మల్ని అంతా అనుసరిస్తారు. చూడండీ మీరు బోర్ వేస్తారు ఇప్పుడు. అప్పుడు మిమ్మల్ని చూసి మరిన్ని బోర్లు తెస్తారు మీ ఊరు వాళ్లు. చూడండి. అదే మార్పుకు దారి. అప్పుడు మీరే గొప్పవారు" అని చెప్పాడు శేఖర్.
బిట్టు తండ్రి తలాడించాడు. తర్వాత శేఖర్ బయలు దేరాడు. బస్సు ఎక్కించడానికని శేఖర్ వెంట కదిలాడు బిట్టు తండ్రి.
దార్లో, "బిట్టు ప్రేమించిన అమ్మాయిది ఈ ఊరే కదా. వాళ్ళ ఇల్లు ఎక్కడ" అని అడిగాడు శేఖర్ బిట్టు తండ్రిని.
"ఆ దిగువ వాడ సారూ" అని చెప్పాడు బిట్టు తండ్రి.
తర్వాత శేఖర్ ఏమీ మాట్లాడలేదు. చుట్టూ జనాలు కదిలి వస్తుండడంతో.
బిట్టు తండ్రిని వాళ్లు శేఖర్ గురించే వాకాబు చేస్తున్నారు మెల్లి మెల్లిగా.
బస్సు స్టాపు చేరుకున్నారు అంతా. బస్సు వచ్చే టైం ఐందన్నారు ఎవరో.
శేఖర్ ఏమీ పట్టించుకోవడం లేదు. బస్సు వచ్చింది. శేఖర్ బిట్టు తండ్రికి చెప్పి ఆ బస్సు ఎక్కాడు.
*** *** *** ***
సాయంకాలం -
స్కూలు కాగానే బయటకు వచ్చిన కుమ్మీని ఆపాడు శేఖర్.
తనతో వస్తున్న తన రూమ్మేట్ను పంపించేసి కుమ్మీ, శేఖర్ వద్దకు వచ్చింది.
ఆ ఇద్దరూ పక్కగా వెళ్లి నిల్చున్నారు. ఎండ తగ్గి వాతావరణం చక్కగా ఉంది.
"ఉదయం మీ ఊరు వెళ్లాను" చెప్పాడు శేఖర్. గతుక్కుమంది కుమ్మీ. అక్కడి సంగతులన్నీ చెప్పాడు.
అన్నీ విని ఏమీ అనలేదు కుమ్మీ.
"అంతా సవ్యంగానే ఉంది. అప్పటివి క్షణికావేశాలే. బిట్టును కోల్పోయాం కానీ కాలం మాత్రం అప్పటి వారిని కుదుట పర్చింది, కుదురు చేసింది." అని చెప్పాడు శేఖర్.
ఆ వెంటనే, "ఇటు చూడండీ. ఎవరి దారి వారిది. మీ ఊరిలో ఒకరి సొద మరొకరిదిన్నూ. కానీ అక్కడా మార్పు వస్తోంది. అక్కడకు వెళ్లిన నాకు ఆ మార్పు చూచాయగా అగుపించింది. ముఖ్యంగా బిట్టు తండ్రి వైపు నుండి" అని కూడా చెప్పాడు.
కుమ్మీ అంది, "నాకు అందలేదు కదా. నా వరకు వచ్చేసరికి వాళ్లు మారలేదు కదా" అని.
"దెబ్బ లేందే నొప్పి తెలియదు. నొప్పి ఐతేనే జాగ్రత్త చేపడతాం. గతాన్ని మార్చలేం. వర్తమానాన్ని అనుభవిద్దాం. ముందుకై అడుగు వేద్దాం. అంతా మంచే అనుకుందాం" అని అన్నాడు శేఖర్.
కుమ్మీ తలాడించింది.
"సరే మరి. మీరు పాఠాలు చెప్పి అలిసి పోయారు. నేను ప్రయాణ బడలికలో ఉన్నాను. కనుక, పోయి రెస్టు తీసుకుందామా" అని అన్నాడు శేఖర్ నవ్వుతూ.
కుమ్మీ మళ్లీ తలాడించింది.
ఇద్దరూ అక్కడ నుండి కదిలారు ఎవరు దారిన వారు.
నడుస్తున్నారే కానీ శేఖర్ ప్రయాణ విషయమై ఆలోచిస్తోంది కుమ్మీ. కుమ్మీ ప్రదర్శించిన ముభావం విషయమై యోచిస్తున్నాడు శేఖర్.
*** *** *** ***
రాత్రి -
రూమ్మేట్ అడగ్గా, "ఈ పూట నేను వంట చేసుకోను. నువ్వూ నాకై ఏమీ చేయకు ప్లీజ్" అనేసింది కుమ్మీ. పైగా తొందరగా పక్క పర్చుకొని పండుకుంది.
ఒక పక్క ఆకలి మరో పక్క ఆలోచనలు కుమ్మీని కుదట పడనీయడం లేదు, కుమ్మీకి నిద్ర పట్టనీయడం లేదు.
అప్పుడే తన నాన్న నుండి ఫోన్ రావడంతో కుమ్మీ లేచి గది బయటకు వచ్చేసింది. వీధి గేటుకు పక్కన ఉన్న అరుగు లాంటి జాగా మీద కూర్చుంది. తన నాన్నతో మాట్లాడుతోంది.
"ఉదయం ఆ శేఖర్ మన ఊరు రావడం ఆ బిట్టు వాళ్ల ఇంటికి వెళ్ళడం ఐందట. పైగా ఆ శేఖర్ అచ్చం బిట్టులానే ఉన్నాడని ఊరులో అనుకుంటున్నారు" చెప్పాడు కుమ్మీ నాన్న.
కుమ్మీ గతుక్కుమంది.
"తల్లీ ఆ శేఖర్ వాళ్ల మనిషిలా ఉంది. వాళ్ల వాడే కనుక ఆ బిట్టు రూపం వచ్చింది అతనికి." అని అన్నాడు కుమ్మీ నాన్న ఆందోళనగా.
"లేదు నాన్నా. వాళ్ళతో ఇతనికి ఏ సంబంధం లేదు. నేనూ మొదటే అడిగాను. కాదని నాకు అప్పుడే చెప్పారు" అని చెప్పింది కుమ్మీ.
"ఏమో తల్లీ. మనకు ఇక ఏ తల నొప్పి వద్దు. మేము మరి ఎట్టి ఇబ్బందులు పడలేం. అమ్మా చెప్పుతోంది. వద్దు ఆ శేఖర్‌కు నువ్వు దూరంగా ఉండు. అన్నయ్యతోనూ మాట్లాడేను. మన ఇల్లు తాకట్టు పెట్టైనా నీ పెళ్లి త్వరగా చేసేస్తాం. అంత వరకు నువ్వు ఏదీ నమ్మకు దేనికీ తొందర పడకు. జాగ్రత్త" అని చెప్పాడు కుమ్మీ నాన్న ఏకరవుగా.
కుమ్మీ సరేననేసింది.
ఆ ఫోన్ కట్టవ్వగానే లేచి గది లోకి వెళుతుండగా అప్పుడే తన అన్నయ్య నుండి ఫోన్ వచ్చింది.
తిరిగి అక్కడే కూర్చుండి పోయింది కుమ్మీ. తన అన్నయ్యతో మాట్లాడుతోంది.
ఆ అన్నయ్య కూడా కుమ్మీ నాన్న చెప్పిందే చెప్పి, "నా ప్రెండ్స్ నుండి అప్పుకై ప్రయత్నిస్తున్నాను. అంతటా కూడబెట్టి నీ పెళ్లి తొందర గానే చేసేస్తాడు మన నాన్న. అంత వరకు నువ్వు గమ్మున హద్దున ఉండు. తెలిసిందా." అని చెప్పి ఫోన్ కట్ చేసేశాడు.
కొద్ది సేపు అక్కడే ఉండిపోయింది కుమ్మీ. తర్వాత నెమ్మదిగా లేచి తన గది లోకి వెళ్లిపోయింది. అది లగాయితు ఆ రాత్రంతా ఆమెకు నిద్ర లేదు.
*** *** *** ***
మర్నాడు -
ఉదయం బ్యాంకు పనులు కానిచ్చి ఇంటికి తిరిగి వస్తున్నాడు బిట్టు తండ్రి.
దార్లో ఎదురు వచ్చిన బిట్టు స్నేహితుడు బిట్టు తండ్రిని ఆపి, "ఆ శేఖర్ మన ఊరు కుమ్మీ ఇద్దరూ మంచి పరిచయస్తుల్లా ఉన్నారు. నేను ఆ ఆఫీసు పని మీద పట్నం వెళ్లాను నిన్న. అలా నిన్న సాయంకాలమే ఆ ఇద్దర్నీ చూశాను. చాటుగా తెగ మాట్లాడుకుంటున్నారు." అని చెప్పాడు.
బిట్టు తండ్రి, "అవునా. ఆ ఇద్దరూ ఎలా కలిశారు. ఆ శేఖర్‌ను మన బిట్టు అని కుమ్మీ అనుకొని ఉంటుంది" అన్నాడు.
"అనుకుంటుంది. కానీ అతడు మన బిట్టు కాదుగా. బిట్టు చనిపోయాడని కుమ్మీకి తెలుసుగా" అన్నాడు బిట్టు స్నేహితుడు.
"ఆ పిల్లకు ఎందుకు తెలీదు. తెలుసు. అదే మరి ఆ శేఖర్ మన బిట్టులా ఉంటేను పరిచయం చేసుకుందేమో" అన్నాడు బిట్టు తండ్రి.
"చాల్లే మామా. ఎంతైనా కుమ్మీ అతడితో తిరగడం ఎలా మొదలెట్టిందో చూడు. అది నెరజాణ" అన్నాడు బిట్టు స్నేహితుడు.