Menu Close
Ghali-Lalitha-Pravallika
కొలిమి (ధారావాహిక)
-- ఘాలి లలిత ప్రవల్లిక --

కాలింగ్ బెల్ కొట్టగానే ఓ 90 సంవత్సరాల వృద్ధురాలు తలుపు తీసారు.

"డాక్టర్ గారి కోసం వచ్చాను," అంది ప్రణవి.

"నీ పేరు ప్రణవి నా" అని అడిగింది ఆ వృద్ధురాలు.

ప్రణవి ఆశ్చర్యపోతూ అవునన్నట్లుగా తల ఊపింది.

"రా... లోపలికి వచ్చి కూర్చో. అబ్బాయి కాసేపట్లో వస్తాడు," చెప్పింది.

లోపలకి వచ్చి ఆవిడ చూపించిన సోఫాలో కూర్చుంది ప్రణవి.

"మంచినీళ్లు కావాలా?"

“కొంచెం ఇవ్వండి," మొహమాటపడుతూ అంది.

ఆ వృద్ధురాలు లోపలికి వెళ్లి కుండలోని నీళ్లు చిన్న రాగి చెంబుతో తెచ్చి ఇచ్చింది.

ప్రణవి గడగడ తాగేసింది.

"భోజనం చేసావా?" అడిగింది ఆ వృద్ధురాలు.

"హా... తిన్నానండి." చెప్పింది ప్రణవి.

నిజానికి ఆమె ఏమి తినలేదు. ఉదయాన్నే ఆదరా బాదరా టీ తాగి ఇంట్లోంచి బయలుదేరింది. ఎప్పుడూ ఒంటరిగా బయట హోటల్ కి వెళ్లి తినటం అలవాటు లేదు. టౌన్ కి ఎప్పుడు వచ్చినా ఖాళీ కడుపుతోనే ఇంటికి వెళుతుంది.

ఏమనుకుందో ఏమో లోపలికి వెళ్ళి కాసేపు పోయాక, ఓ ప్లేటులో టిఫిన్ పట్టుకొచ్చి పెట్టింది.

"వద్దండి"

"పర్వాలేదు తిను. టీ తాగుతావా? కాఫీ నా?" అని అడుగుతూ టిఫిన్ ప్లేట్ ప్రణవి చేతిలో పెట్టింది.

"మీకెందుకండి శ్రమ," అంది.

"ఇందులో శ్రమ ఏముంది? గుమ్మంలోకి వచ్చిన వాళ్ళకు, ఉన్నంతలో అతిథి మర్యాదలు చేయడం మన సాంప్రదాయం. నీకు ఏం కావాలో చెప్పు,"

ఆవిడ వదిలేలాలేదు, అని అనుకొని

"ఏదైనా పర్వాలేదు." అంది ప్రణవి.

కాసేపటికి పాలు తీసుకొని వచ్చి ఇచ్చింది ఆవిడ.

"నిజానికి కాఫీ, టీలు మంచివి కావు. అందుకే పాలు ఇచ్చా" అన్నారు.

"అవును, మీరన్నది నిజమే, కానీ చాలామంది బాడీని కాఫీ, టీ లకు అలవాటు చేసుకున్నారు. పొద్దున్నే అవి తాగకపోతే పనులు మొదలు పెట్టరు," అంది.

"అలవాట్లు మనం చేసుకునే దాన్నిబట్టి ఉంటాయి. అలవాట్లను బట్టే ఆరోగ్యం. నీకు ఇప్పుడు ఇచ్చిన పాలల్లో కూడా హెల్దీ హెర్బల్ పౌడర్ కలిపాను. రుచి చూస్తానంటే చూడు. కాదు నాకు టీ, కాఫీలే కావాలంటే... అదే పెట్టుకోస్తాను." అన్నారు ఆవిడ.

"లేదు మేడం నేను ఇదే తాగుతాను," చెప్పింది ప్రణవి.

టిఫిన్ తినేసి పాలు తాగింది. "నిజంగా పాలు చాలా బాగున్నాయి. ఆ కాఫీ టీలు దీని ముందు దిగదుడుపే. ఇందులో మీరు కలిపిన పౌడర్ పేరు ఏంటి?" అడిగింది.

"దీనికి ఇంకా పేరు పెట్టలేదు. ఇది కూడా మా సొంత ప్రోడక్ట్. ఇది అన్ని వయసుల వారికి ఉపయోగపడుతుంది. స్టోరేజ్ కి ఎటువంటి రసాయనాలు కలపనిది. నాచురల్ ప్రోడక్ట్." అంటూ చెబుతున్న ఆవిడ కళ్ళల్లో ఒక రకమైన మెరుపును గమనించింది ప్రణవి.

'నిజమే ఎవరైనా ఏదైనా ప్రయోగం చేసినప్పుడు... వంటింటి ప్రయోగాల నుంచి చంద్రయాన్ వరకు... ఏదైనా, అది సక్సెస్ అయితే... వాళ్ళ ఆనందానికి పట్టపగ్గాలు ఉండవు.' అని మనసులో అనుకుంది ప్రణవి.

కాసేపు పోయాక

"నీకు ఎంతమంది పిల్లలు?" అడిగింది ఆ వృద్ధురాలు.

"ఇద్దరు" అని ముక్తసరిగా చెప్పింది.

ఇంక ఆవిడ తన పర్సనల్ విషయాలు అడగడం మొదలు పెడుతుందేమోనన్న భయంతో.

.. ప్రణవికి తన గురించి నలుగురికీ చెప్పుకోవడం ఇష్టం లేదు.

'ఆ ఓదార్పు మాటలు... మనసుని ఊరడించినట్లు కనపడినా, నిద్రాణమై ఉండి ఇప్పుడిప్పుడే మేలుకుంటున్న ఆత్మస్థైర్యాన్ని జాలి చూపుల ఊయలలో వేసి జోల పాడేయగలవు. ఆ నోట ఈ నోట బయటకు వచ్చి... భర్త వదిలేసిన ఆడదాని లాగా నలుగురు దృష్టిలో పడితే... మొగవాళ్ళు వెకిలి చూపుల బాణాలతో గుచ్చేస్తారు. ద్వంద్వార్ధ మాటలతో వెంటపడతారు.' అనే భయంతో కూడా బయట ఎవరి దగ్గర తన పర్సనల్స్ షేర్ చేసుకోదు ప్రణవి.

ప్రణవి పడుతున్న ఇబ్బందిని గ్రహించిందో ఏమో! ఇక ఎటువంటి ప్రశ్నలు అడగలేదు ఆవిడ.

నిజానికే ఆ వృద్ధురాలు ఎవరో ?...  డాక్టర్ కి అమ్మో? లేక ఎవరో? తెలుసుకోవాలి అని ప్రణవి మనసులో ఉన్నా... ఆవిడని గురించి అడిగితే! తన గురించి ఆవిడ అడుగుతుంది అన్న భయంతోనే... ఆవిడని ఏమీ అడగలేదు ప్రణవి.

"కూర్చో అమ్మా, ఇప్పుడే వస్తాను," అని చెప్పి ఆ వృద్ధురాలు బయటే ఉన్న ఓ పెద్ద పొయ్యి మీద మరుగుతున్న హెయిర్ ఆయిల్ ని కలియ పెట్టడానికి వెళ్ళింది.

ప్రణవి కూడా ఆవిడ వెనకాలే వెళ్లింది.

"రామ్మా" అంటూ పెద్ద తెడ్డు తీసుకుని ఆయిల్ కలిపింది.

"ఇంకా ఎంత టైం పడుతుంది ఇది పూర్తి అవ్వడానికి," అంటూ కుతూహలంగా అడిగింది ప్రణవి.

"ఆయిల్ పైకి తేలాలి. ఇది అవటానికి ఇంకా ఒక గంట పైన పడుతుంది లే." అని చెప్పి లోపల పనికి వెళ్ళిపోయింది.

ప్రణవి చేసేది లేక లోపలికి వచ్చి కూర్చుంది. అలా ఒంటరిగా కూర్చోవడానికి బోర్ గా ఫీల్ అయింది. తొందరగా ఇంటికి వెళ్ళాలి, చీకటి పడుతోంది అనే ఆలోచన ఆమెను స్థిరంగా ఉండనీయడం లేదు.

డాక్టర్ కి ఫోన్ చేసింది.

"నూరేళ్ళమ్మా. నేనే చేద్దామనుకుంటున్నాను, నువ్వు చేసావు. నేను అనుకోకుండా వేరే దూర ప్రాంత వెళ్లాల్సి వచ్చింది. నేను వచ్చేసరికి లేట్ అవుతుంది. ఇంట్లో స్టాక్ లేదు. ఎం.వి.పి కాలనీలో ఒక షాపులో కొన్ని బాటిల్స్ ఉన్నాయి. అవి నీకు తెచ్చి ఇద్దాం అనుకున్నాను. అనుకోకుండా వేరే పని పడింది.

వేరే వాళ్ల దగ్గర ఉన్న బాటిల్స్ ని తీసుకుని నీకు అందచేయమని ఒకతనికి చెప్పాను. అతను మరి కొద్దిసేపట్లో అక్కడికి వచ్చి నీకు బాటిల్స్ ఇస్తాడు," అని చెప్పాడు డాక్టర్.

"సరే సర్ కొంచెం ఎర్లీ గా రమ్మని చెప్పండి నాకు ట్రైన్ మిస్ అవుతుంది." అని చెప్పి ఫోన్ కట్ చేసింది.

ఫోన్ పెట్టేసిన కాసేపటికి, ఒకతను బాటిల్స్ తెచ్చి ప్రణవికి అందించాడు.

లోపల నుంచి బామ్మ గారు బయటకు వచ్చారు.

"ఏరా రాజు అయ్యగారి తో నువ్వు వెళ్లలేదా?" అని అడిగింది.

"లేదు బామ్మ. నన్ను ఇవాళ షాపులకు వెళ్లి మన కొత్త ప్రోడక్ట్ హెర్బల్ హెల్దీ ఫుడ్ గురించి మౌత్ పబ్లిసిటీ ఇమ్మనమన్నారు." చెప్పాడు అతను.

"నేను బయలుదేరతానండి." చెప్పింది ప్రణవి.

"రాజు ఈమెను రైల్వే స్టేషన్లో వదిలిపెట్టిరా," పురమాయించింది ఆవిడ.

"వద్దండి నేను వెళ్ళిపోతాను." అంది ప్రణవి.

"ఇక్కడ ఆటోలు బస్సులు ఫ్రీక్వెన్ట్ గా దొరకవు. పరవాలేదు నీకన్నా చిన్నవాడేగా డ్రాప్ చేస్తాడు," అంది.

"క్షమించండి. నేను ఎప్పుడూ ఎవరి బండీ ఎక్కలేదు. నేను ఆటో లోనే వెళ్తాను." అని చెప్పి తన లగేజ్ తీసుకుని బయటకు వచ్చేసింది ప్రణవి.

ఆవిడ అన్నట్లుగా చాలా సేపు ఎదురు చూసాక ఓ ఆటో దొరికింది.

రైల్వే స్టేషన్ కి వచ్చేసరికి ఆరుగంటల పాసింజర్ మూవ్ అవుతూ కనిపించింది.

రెండు చేతుల్లో బరువుతో రైలు బోగీలో కి ఎక్కబోయింది.

రైలు వేగం పెరిగింది.

రచయిత్రి పరిచయం ..

Ghali-Lalitha-Pravallika పేరు: ఘాలి లలిత B.A:Bed; కలం పేరు: ప్రవల్లిక

రచనలు: మట్టి పాదాలు కవితాసంపుటి, ఆహా కథాకుసుమాల సంపుటి, మర్మదేశం సైంటిఫిక్ ఫిక్షన్ బాలల నవల (“సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వెలువడింది.), కొలిమి (మినీ నవల) (ప్రస్తుతం “సిరిమల్లె” పత్రికలో ధారావాహికగా వస్తున్నది.)

పురస్కారాలు: 1. జిల్లా కలక్టర్ గారిచే ఉగాది పురస్కారాలు నాలుగు సార్లు; 2. గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి గురజాడ రాష్టీయ పురస్కారము; 3. సావిత్రిబాయి పూలేజాతీయస్థాయి ఆదర్శ ఉపాధ్యాయిని పురస్కారం; 4. ఆదర్శ మహిళా పురస్కారం; 5. పాతూరి మాణిక్యమ్మ కీర్తి పురస్కారం; 6. గుర్రాల రమణమ్మ సాహితీ పురస్కారం; 7. గుఱ్ఱం జాషువా పురస్కారం; 8. సత్యశ్రీ పురస్కారం; 9. గాడ్ఫాదర్ ఫౌండేషన్ నుంచి సాహితీ పురస్కారం; 10. సరోజినీ నాయుడు సాహితీ పురస్కారం; 11. విద్వాన్ విశ్వం ఉత్తమ కథా పురస్కారం; 12. అక్షరయాన్ నుంచి తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా 2022 లో సాహిత్య స్రష్ట పురస్కారం; 13. తానా వారి నుంచి 10,000 నగదు, సత్కారం; 14. సరోజినీ నాయుడు ఎక్స్ లెన్స్ అవార్డు.

బిరుదులు: ప్రతిలిపి బెంగుళూరు వారి నుంచి 'సాహితీ విశారద' బిరుదు మరియు తెలుగు కవితా వైభవం హైదరాబాదు వారినుంచి ‘సహస్రకవిమిత్ర’.

సాహిత్య పరంగా చేపట్టిన బాధ్యతలు: తెలుగు భాషోద్యమ సమితి ప్రధాన కార్యదర్శి; గురజాడ అప్పారావు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నెల్లూరు విభాగానికి అధ్యక్షురాలు; నెరసం సహ కార్యదర్శి; సింహపురి సాహితీ సమైఖ్యలో కార్యదర్శిగా కొంత కాలం పనిచేశారు.

ప్రస్తుతం, అక్షరయాన్ రచయిత్రుల సంఘంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ అక్షర యాన్ బాలికా, బాలుర విభాగములను నెలకొల్పారు. 108 మంది రచయితలచే మాయలోకం అనే గొలుసు నవలను రాయిస్తునారు. అలాగే శ్వేత ధామం అనే గొలుసు కట్టునవలను సాహితీ సిరికోన అనే సామాజిక మాధ్యమం లో మహిళలచే రాయిస్తున్నారు. బాల బాలికలచే నల్ల హంస అనే మరో గొలుసు నవలను కూడా వ్రాయిస్తున్నారు.

Posted in May 2024, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!