భారత దేశంలో ఉన్నప్పుడు వ్రాసిన పదకొండు కథలలో నాలుగు కథలు నేను చేస్తున్న ఉద్యోగం నేపథ్యంగా వ్రాయడం కాకతాళీయం కాదు. మేల్కొన్న సమయంలో దాదాపు 50 శాతం పైన ఆఫీసులో గడుపుతున్నప్పుడు, అది సహజమే.
1986 లో ఆంధ్రజ్యోతి వార పత్రిక, తెలుగు కళా సమితి, న్యూ జెర్సీ వారి తరఫున నిర్వహించిన మినీ కథల పోటీకి పంపించినదీ కథ. సాధారణ ప్రచురణకు నెగ్గినది. అలా నేను నా రచనా వ్యాసంగంలో మొదటి సంవత్సరం (1986) లో వ్రాసిన రెండు కథలకు అమెరికా దేశంతో అనుబంధం ఉండడం మటుకు కాకతాళీయమే.
బ్యాంక్ లో మేనేజ్మెంట్ కేడర్ లో చదువులు ముగించిన వెంటనే చేరడం వల్ల, తరచూ వయస్సులో నాకంటే పెద్దవాళ్ళ పైన మేనేజర్ గా పని చేయాల్సి వచ్చేది. ఆ రోజులలో క్లర్లికల్ కేడర్ తో బాటు, ఎంట్రీ లెవెల్ ఆఫీసర్ల కు కూడా యూనియన్ ఉండేది. ఈ యూనియన్ లో పని చేసే వారు, ఆఫీసు పని పై పైనే చేసి, ఎక్కువగా వారి యూనియన్ పనులపైనే ఉండేవారు. కొందరు మరీ అన్యాయం. ఏ పనీ చేయకుండా బలాదూర్ తిరిగేవాళ్లు. ఈ లీడర్ లకు మేనేజ్మెంట్ అధికారులతో ఉన్న సంబంధాల వల్ల, అవసరం అయ్యితే బ్యాంకింగ్ పనులు ఆపగలిగే సత్తా ఉండడం వల్ల, వారు చేస్తున్న పదవులకి మించి, మంచి ప్రభావం, పలుకుబడి ఉండేది. వారి చుట్టూ ఏదో ట్రాన్ఫర్ లకు, మేనేజ్మెంట్ పెట్టిన కేసుల్లో ఇరుక్కుని బయట పడడానికి సహాయం కోరుతూ, యూనియన్లో మరో మెట్టు ఎక్కడానికి ప్రయత్నిస్తున్న ఉద్యోగస్తుల ఒక చిన్న గుంపు, భజన సంఘంలా, బెల్లం మీద ముసిరిన ఈగలు లాగ చుట్టుముట్టి ఉండేవారు.
బ్యాంకింగ్ పనులు అందులోనూ క్యాష్, చెక్ లు, బిల్లులు లాంటి అకౌంట్ లావాదేవీలు సమయానికి ముగించాల్సిన పనులు కావడంతో, ఈ యూనియన్ ఉద్యోగస్తులతో పనిచేయించడం గగన తరం అయ్యిపోయేది.
ఈ నేపథ్యంలో వ్రాసిన హాస్య మినీ కథ ఇది. పోటీకి పంపించిన కథ కాబట్టి, పంపించిన తరువాత ప్రచురణకి అట్టే సమయం పట్టలేదు. పరిస్థితులు మారడం వల్ల, ఈ కథ అవుట్ డేటెడ్ గా అనిపించడంలో ఆశ్చర్యం లేదు.
ఈ కథ వ్రాసిన పదేళ్లకే బ్యాంక్ లలో అందులోనూ రిజర్వ్ బ్యాంక్ లోనూ చాలా మార్పులు వచ్చాయి. ఆ మార్పులు బ్యాంకులో అమలు పరచడంలో నాకు కీలక పాత్ర నిచ్చారు. ఆ ప్రయత్నంలో నేను యూనియన్ లీడర్ లకు కంప్యూటర్ ల గురించి అవగాహన కల్పించడమే కాక, ఆ లీడర్ల మొదటి గుంపుకు ముంబాయి లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ మార్పులు వచ్చిన తరువాత, బ్యాంక్ లలో యూనియన్ ప్రభావం తగ్గిపోవడం అందరికీ విధితమే. బహుశా చాలా మంది అలనాటి యూనియన్ లీడర్ ల పిల్లలు, భారత దేశంలోనూ, విదేశాలలో ఐ.టీ. రంగంలో పనిచేస్తుంటారని నా అంచనా.
ఈ ప్రహసనానికి మంచి ముక్తాయింపు ఉంది. నేను కంప్యూటర్ ల మీద ట్రైనింగ్ ఇచ్చిన యూనియన్ లీడర్ లు ట్రైనింగ్ అయ్యే సరికి మంచి సన్నిహితులైపోయారు. వారంతటికి వారే నాకు ఒక వీడ్కోలు విందు లంచ్ టైమ్ లో పెట్టారు. ఆ సందర్భంలో వారు కొత్త కరెన్సీ నోట్లతో ఒక కంప్యూటర్ బొమ్మను చేసి, ‘టు సర్ విత్ లవ్’ అని వ్రాసి మరీ నాకు ప్రెజెంట్ చేయడంతో, ఈ కథ ఒక 360 డిగ్రీ పరిక్రమణ పూర్తి చేసిందనుకుంటాను. ఇంగ్లీషులో అయితే, ఈ కథ “టర్న్డ్ ఇన్ ది గ్రేవ్” అనాల్సి వచ్చేదేమో!
ట్రాజడీ ఆఫ్ ఎర్రర్స్
‘‘ఇవ్వాళైనా ఎగ్జిబిషన్‌కు తీసుకెళ్తారా లేదా? ఇవ్వాళ ఆఖరి రోజట’’ అంది సీత.
‘‘చూస్తానే. అంతా, ఆఫీసులో ఉండే పనిని బట్టి ఉంటుంది. అస్సలు ఆ సుబ్బారావు అనుకున్నాడంటే నేను ఇంటికి తొందరగా వచ్చేయొచ్చు. అడిగి చూస్తాను. ఏమంటాడో మరి’’ అన్నాడు రామారావు, సీత భర్త.
‘‘ఇదిగో మళ్ళీ చెప్తున్న. వారం రోజుల నుంచి తీసుకెళ్తానని ఊరిస్తున్నారు. ఇవ్వాళ రాకపోయారంటే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను’’.
‘‘సర్లేవే నేను రావడానికే ప్రయత్నిస్తాను. అంతా సుబ్బారావు చేతుల్లో ఉందన్నానుగా’’. రామారావు మాట్లాడటం పూర్తికాకుండానే, సీత ‘‘బాగానే వుంది మీ వరస, మాట్లాడితే ఆ సుబ్బారావు సాకు తీసుకుంటారు...’’ అంటూ రామారావును సాధించడం మొదలెట్టింది.
***
సుబ్బారావు భోంచేసి భార్య తెచ్చిన కిళ్ళీ నములుతూ లుంగీ విప్పేసి, పాంటు వేసుకుని, షర్ట్ పాంటులోకి టక్ చేయడం మొదలెట్టాడు. మంచి మూడ్‌లో ఉన్నట్లు అతను వేస్తున్న ఈలనే తెలుపుతుంది.
‘‘పారు, ఈ సాయంత్రం ప్రోగ్రామేంటి? ఎగ్జిబిషన్‌కు వెళ్దామా, ఇవ్వాళ ఆఖరి రోజట’’. అంటూ తన భార్య పార్వతి నడిగాడు సుబ్బారావు.
‘‘ఏంటండీ రోజూ తిరగడమే. నిన్న, మొన్న సినిమాలకెళ్ళాము. అంతకు ముందు మూడు రోజులు ఫ్రెండ్సని ఎక్కడెక్కడో తిప్పారు. ఇవ్వాళ హాయిగా ఇంట్లోనే రెస్టు తీసుకుందాము’’ అంది పార్వతి.
‘‘ఆదేం లాభం లేదు డియర్. ఇవ్వాళ వెళ్ళాల్సిందే. నాలుగున్నరకంతా ఇంట్లో ఉంటాను. రాత్రికి వంట చేయెద్దులే. ఎగ్జిబిషన్ నుంచి వస్తూ ఏదో హోటల్లోనే భోంచేద్దాం’’ అన్నాడు సుబ్బారావు. ఇక ఆవిడకి సరేనని అనడానికి కూడా అవకాశం ఇవ్వకుండా గట్టిగా ఈల వేస్తూ బుగ్గమీద చిటిక వేసి, ఇంటిబయటకు వెళ్ళి స్కూటర్ స్టార్ట్ చేశాడు. స్కూటర్ మీద కూర్చొని, ఓ సిగరెట్ అంటించి, కిళ్ళీ వల్ల ఎర్రగా పండిన నోటినుంచి, ఓ ముద్దు భార్యకి గాలిలో ఊది, స్కూటర్ తన ఆఫీసు వైపుకు దౌడు తీయించాడు.
***
రామారావు ఆఫీసులో కూర్చుని, అక్కడ ఆఫీసుకి వచ్చిన వాళ్ళనందరినీ ఓసారి చూశాడు. చాలామటుకు అందరు సమయానికి వచ్చారు. సుబ్బారావు ఇంకా రాలేదు. రామారావుకి అతనింకా రాలేదని ఆతృతగా ఉంది. అతను వస్తేగాని తన పని కాదు. పని అవ్వుతేకాని తను ఇంటికి పోలేడు. రామారావు అసంకల్పితంగా గోళ్ళు కొరుక్కోవడం మొదలెట్టాడు. సుబ్బారావుకు పని గురించి పట్టించుకోనవసరం లేదు. తీరిగ్గా కనీసం ఓ అరగంట ఆలస్యంగా వస్తాడు ఆఫీసుకు. తనేం పన్జేసుకోవాలో నిర్ణయించుకుని, దర్జాగా సిగరెట్టు త్రాగుతూ, పాన్ నములుతూ తన పని చేసుకుని సాయంత్రం మిగిలిన వాళ్ళ పనెంతవరకు వచ్చిందో ఓసారి చూసుకుని, అందరికి బై, బై చెప్పి వెళ్ళిపోతాడు. ఎంతైనా అదృష్టవంతుడు. చక్కటి జీతం, రాజా లాంటి ఉద్యోగం.
రామారావు ఆలోచనల కడ్డుతగులుతూ, సుబ్బారావు సరిగ్గా తన టైముకు, అదే ఆఫీస్ టైంతో పోలిస్తే ఓ అరగంట ఆలస్యంగా పెద్దగా ‘‘హలో, హలో,’’ అంటూ అక్కడున్న ఉద్యోగులందరితో చాలా స్నేహంగా మాట్లాడుతూ వచ్చాడు. సుబ్బారావును చూస్తూనే ఎంత మార్పు? అందరూ ‘‘హలో సుబ్బారావు గారూ’’ అంటూ విష్ చేశారు. పలకరింపుగా, భయంగా, ఎంతో ఆత్మీయంగా నవ్వారు. సుబ్బారావు ప్రత్యేకతయే అది. అందరిచేత నవ్విస్తూనే పని చేయించుకోగలడు. సుబ్బారావు తన కుర్చీలో కూర్చొని సిగరెట్టు తీసి అంటించాడు. తన ముందున్న ఫైళ్ళు ఓ అరగంట చూసి, ఏదో వ్రాసేసి, ‘‘యాదయ్య ఈ ఫైళ్ళను తీసుకెళ్ళు’’ అంటూ ఫ్యూనుకు చెప్పాడు. తనతో తెచ్చుకున్న సినిమా పత్రికలు అటు తరువాత చూడటం మొదలెట్టాడు. ఇదంతా చూస్తున్న రామారావు, ఇదే మంచి సమయం ఇప్పుడు సుబ్బారావు మంచి మూడులో ఉంటాడని, సుబ్బారావు దగ్గరికి వచ్చి, అతని ముందు నిలబడి, ‘ఎక్స్‌క్యూజ్ మి’ అన్నట్లు దగ్గాడు సుబ్బారావు రామారావును తలెత్తి చూసి ఏం కావాలన్నట్లు కనుబొమ్మలెగరేసాడు.
‘‘మీరేం అనుకోకుంటే సుబ్బారావు గారూ ఓ ఫేవరు చేయాలండి’’
‘‘చెప్పండి’’ అన్నాడు సుబ్బారావు కుర్చీలో కూర్చునే.
రామారావును కుర్చీలో కూర్చోమని కూడా చెప్పలేదు. కాని, పని తనదవ్వటం మూలాన, రామారావు పెద్దగ ఫీల్ అవ్వలేదు. ‘‘మరేం సుబ్బారావు గారు, నేను ఇవ్వాళ కొంచెం అర్జంటుగా, అదేనండి మామూలు మన ఆఫీసు టైంకి, 5.30 కంతా సాయంత్రం ఇంటికి వెళ్ళగలిగితే చాలు. వారం రోజుల నుంచి 3, 4 గంటలు ఆలస్యంగా పని చేయవలసి వస్తుంది. ఇంటికి వెళ్ళేసరికి రాత్రి 8, 9 గంటలౌతున్నది. మీరు కొంచెం అనుకుంటే, నేను ఇంటికి మామూలు టైంకి వెళ్ళవచ్చును’’.
సుబ్బారావు నిర్లక్ష్యంగా అధికార దర్పంతో ‘‘నన్నేం చేయమంటారండి. ఎవరి పన్లు వాళ్ళు చేసుకోవాలి. నా పని అయిపోతే నేను వెళ్ళిపోతాను. అలాగే మీ పని అయిపోయిన తరువాత మీరెళ్ళండి. ఎవరి బాధ్యత వారికుంటుంది కదా’’ అని జవాబిచ్చాడు.
‘‘అదేనండి నేను చెప్పడం మీరనుకున్నారంటే, మిగతావాళ్ళు కూడా పని తొందరగ చేసేసి, నా పని తొందరగయ్యేటట్లు చేయగలరు. మీరంటే భయము, గౌరవము అన్ని మిగతావాళ్ళకున్నాయి. మీకు తెలుసుగా, అకౌంట్సు అన్నీ క్లోజ్ చేస్తే కాని నేనింటికి వెళ్ళలేనని. మిగతా వాళ్ళు పని చేసేట్టు చేయడం మీ వల్లనే సాధ్యం...’’
‘‘చూద్దాం లెండి’’ అంటూ, ఇంకా ఏదో మాట్లాడబోతున్న రామారావును మధ్యంతరంలోనే ఆపేసి, తిరిగి ప్రముఖ సినీతార, తారాదేవి తన కుక్కకు సబ్బుకొంటానికని ఏ హీరోతో లండన్ పోయిందో చదవడంలో మునిగిపోయాడు.
రామారావు చేసేదేంలేక, తన సీటుకు వచ్చి కూర్చొని, సుబ్బారావు మిగిలిన వాళ్ళతో చెప్పి, తన పని సులభం చేయిస్తాడా లేదానని అప్పుడప్పుడు గోళ్ళు కొరుకుతూ, తన వద్ద కొచ్చిన లెడ్జర్లు, ఫైళ్ళు చూడసాగాడు. రామారావు నోటికి గోళ్ళ మొదలు తగిలి, కొరకడానికి ఇంక గోళ్ళేమి లేవని తెలుసుకునేసరికి సాయంత్రం 4.15 అయ్యింది. సుబ్బారావు స్కూటర్ స్టార్టు చేసాడు, సుబ్బారావు మనస్సులో ఎగ్జిబిషన్ నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు భార్యతో హోటలుకు పోవాలన్న ఆలోచన తప్పితే మరేమి లేదు.
రామారావు ఆ రోజు ఇంటికి రాత్రి 9.30కి వెళ్ళేసరికి ఇంటి తలుపుకున్న తాళం కప్ప వెక్కిరించింది. ఇంతకీ, సుబ్బారావు ఆ ఆఫీసులో చేసేది గుమస్తా ఉద్యోగమే. కాదంటే, ఉద్యోగుల యూనియన్‌లో ఓ చిన్న లీడరు.
మరి రామారావు? ఆ ఆఫీసు మేనేజరు.
(ఆంధ్రజ్యోతి, 1986)