
గత సంచిక తరువాయి... ముగింపు కథ కొనసాగింపు .... »
3. పూర్ణ కామేశ్వరి
ఒకేలా ఇద్దరినీ పెంచినా, తల్లికో మనసు ఉంటుందని కొడుకు అనుకున్నట్టు కూతురు అనుకోలేక పోయింది. బయట నుంచి వచ్చిన కోడలు చూపిన సంస్కారం కూడా చూపలేక పోయింది.
చుట్టుపక్కల వాళ్ళు ఉండేది మాటలు అనడానికి అని సరిపెట్టుకుంది. తనను విడిచి వెళ్లిపోయిన భర్త కోసమో, కాదన్న మెట్టినింటి వాళ్ళ కోసమో ఆలోచనలు మానింది.
తన బాధను, ఆనందాన్ని పంచుకునే తోడు కోరుకోవడమే తనకు సరైన మార్గం అనుకుంది. చరమ దశ లోనైన ఒంటరిగా మిగిలిపోకూడదు అనుకుంది శ్యామలమ్మ.
అలా అనుకున్న క్షణం తన కళ్ళల్లో మెదిలిన వ్యక్తి రమణ మూర్తి.
తనలాగే అతనూ ఒంటరే. పాతికేళ్లుగా తెలిసిన వ్యక్తి. ఎప్పుడు ఏ సహాయం కావాలన్న నిలబడి చేసిన వ్యక్తి. వయసు మీద పడుతూ ఈ మధ్య చిన్న చితకా ఆరోగ్యం సమస్యలు కూడా వస్తున్నాయి..
ఒకరికొకరు ఆసరా అవుతాము.
నిశ్చయించుకున్న శ్యమలమ్మ అడుగులు మూర్తి గారింటి వైపుకు నడిచాయి.
ముగింపు కథ కొనసాగింపు ....
4. భాస్కర బాల భారతి - శీర్షిక ‘తోడు-నీడ’
ఆరుపదుల వసంతాలు చూచిన శ్యామలమ్మకు.వంటరి తనం కొత్తేమీకాదు, ఇన్నాళ్ళూ భర్త వదిలేసి వెళ్ళిపోగా అత్తాగారు నిరాదరించి తరిమేసినా, పుట్టింటోళ్ళు చేరదీయకున్నా, కాన్వెంటు పాఠశాలలో టీచరు ఉద్యోగంచేస్తూ, కష్టాల కడలిని దాటి, పిల్లలను ప్రయోజకులను చేసి ఓ ఇంటి వారిని చేసింది.
కానీ శ్యామలమ్మ ఇప్పుడెందుకో వంటరిగా ఫీలవుతూంది, బాధ్యతల బరువులు తగ్గాయ్!
ఒంటరితనము నిలువెల్లా దహించివేస్తూంది. ఇన్నాళ్లూ భర్తతోడు లేకున్నా పిల్లల ఆలనా పాలనతో ఒంటరితనం కనిపించలేదు.
ఇపుడు తోడుగా వున్న బిడ్డలు దూరమై, మరలా ఒంటరైంది! ఒంటరితనాన్ని భరించలేక పోతూంది!
అనుకోకుండా ఓరోజు న్యూస్ పేపరులో ఓ ప్రకటనను చూసింది.
భర్త చనిపోయిన వితంతువులూ, భార్య గతించిన పురుషులూ, వివాహమే కాని వృద్ధకన్నెలూ, ముదిరిన బెండకాయ బ్రహ్మచారులూ, కట్నకానుకల సమస్యలతో పెళ్ళి కాక వైవాహిక జీవితానికి దూరమైన అమ్మాయిలూ, అందరికీ తగిన తోడు కుదిరించబడును. ఒకసారి మా "తోడూ-నీడ'' మ్యారేజ్ బ్యూరో ను సంప్రదించండి! మీకు నచ్చిన, మిమ్ము మెచ్చిన తోడుతో సుఖమయమైన వైవాహిక జీవితాన్ని గడపండి! ఒంటరి జీవితానికి స్వస్తి పలకండి!" అన్న ఆ ప్రకటన చదివింది శ్యామలమ్మ!
అంతే, ఎడారిలో ఒయాసిస్సు, ఎదురైనట్లూ, పోగొట్టుకున్న పెన్నిధి కళ్ళముందు సాక్షాత్కరించినట్లూ, ఎండి, మోడువారిన చెట్టు చిగురించినట్లూ, ఓంటరితనం మటుమాయమై, జంటతో శేషజీవితాన్ని గడిపినట్లూ ఊహించుకుని, ఆ తోడూ-నీడ మారేజ్ బ్యూరోకు వెళ్లింది శ్యామలమ్మ!
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేసి రిటైర్డ్ ఐన శంకరయ్య కూడా భార్య చనిపోయి, కొడుకూ కోడలూ, కూతురూ, అల్లుని ఆదరణ కరవై వారికి బరువై, ఒంటరితనము భయంకరమై, తోడును వెదకుతూ, తోడూ-నీడా మ్యారేజ్ బ్యూరోకు వెళ్లాడు!
శ్యామలమ్మా-శంకరయ్యలకు ఒకరికొకరు నచ్చారు. ఒంటరితనానికి స్వస్థి పలికి జంటగా బతకాలనుకున్నారు! శంకరయ్యకు తలదాచుకోను ఓ గూడూ, బతకడానికి పెన్షన్ వస్తుంది!
"నీకు నీవారడ్డు రారు! నాకు నావారడ్డు రారు !జంటగా బతుకుదాంరావే" ఆనుకున్నారు,
తమ అభిఫ్రాయాలను కొడుకూ, కోడలూ, కూతురూ అల్లుళ్ళకు తెలిపారు!
'మీ ఆనందమే, మా ఆనంద' మని, తప్పుకున్నారు. చుట్టు పక్కలవారు "ఈవయసులో, ఈవిడ కిదేంపోయేకాలం?" అని అన్నారు.