Menu Close
balyam_main

సామెతలతో చక్కని కధలు

- ఆదూరి హైమావతి

కలిమి లేములు కావడి కుండలు

"తాతగారూ! కావడి అంటే ఏంటీ? కుండ అంటే ఏంటీ?" అంటూ వచ్చాడు మనవడు.

"ఓహో ఏదో సామెత విన్నట్లున్నావుగా! పూర్తిగా చెప్పరా మనవడా !" అన్నారు తాతగారు.

"ఏం లేదు తాతగారూ కష్టాలు అంటే తెలుసు డిఫికల్టీ, సుఖము అంటే హ్యాపీనెస్, ఐతే కలిమి లేమి అంటే తెలీదు. తెలుగులో పూర్ కదా!. ఇంకా కావడి, కుండలు అంటే కూడా తెలీదు" అంటూ నసిగాడు మనవడు.

"నిజమేరా! ఏనాడైనా పల్లెలకెళ్లారా! వారి కష్టాలు చూశారా? ట్యాప్ తిప్పడం మొహం కడిగినంతసేపూ నీరు వృధాచేయడం. ఎంత నీరు వేస్ట్ గా పోతుందో మీకేం తెల్సు? ఆ నీటిని ఎంతో దూరం నుంచీ మోసుకొచ్చే వారు గ్రామాల్లో పూర్వం కావడిలో అంటే నీళ్లు కానీ తోటలో పండిన కూరగాయలూ, ఆకుకూరలూ ఇంటికి మోసుకొని రావడానికి ఒక వెదురు బద్దకు  రెండు కొసల్లో ఉట్లు కట్టి వాటిలో మట్టి కడవలు లేక కుండలు అంటారే వాటిని పెట్టి లేక కూరగాయలైతే గంపలు పెట్టి భుజంమ్మీద ఆనించుకుని మోసుకెళతారు. అదీ కావడి అంటే."

"అసలు మొత్తం వాక్యానికి అర్ధం చెప్పండి తాతగారూ!"

"అలారా దారికి. విను నీకు అర్ధమయ్యేలా ఒక కథ రూపంలో చెప్తాను.

'అనగనగా అవంతీ రాజ్యాన్ని అమరసింహుడనే రాజు పాలించేవాడు. ఆయన చాలా విజ్ఞుడూ, ప్రజల సుఖ సంతోషాల కోసం సత్వర నిర్ణయాలు తీసుకోడంలో దిట్టకూడా. సుభిక్షంగా ఉండే ఆయన రాజ్యం ఒక మారు వరుసగా రెండేళ్ళు వర్షాలులేక చెరువులన్నీ ఎండిపోయి, త్రాగు నీరూ, సాగు నీరూ కరవై పంటలు పండక ప్రజలు నానా ఇబ్బందుల పాలయ్యారు.

ప్రజల కష్టాలు చూసి రాజుగారి జాలిగుండె కరిగిపోయింది. దీనులైన కొందరు పేద ప్రజలకు కడుపు నింపుకునే మార్గమేలేక అన్నానికి అలమటించి పోవడం చూడలేని ఆయన ప్రధాన మంత్రితో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ముందుగా అన్నార్తులైన ప్రజల ఆకలి తీర్చను ఒక దండోరా వేయించాడు.

"తినను తిండిలేక బాధపడేవారంతా ప్రాతః కాలానికి రాజ భవనం దగ్గరకు రండహో" అనే పిలుపు విని తూర్పు తెల్లవారే సరికి కొండవీటి చేంతాడంత వరుసలో ప్రజలు రాజభవనం ముందు చేరడం, అంతః పుర గవాక్షం నుంచి చూసిన మహారాజు, ఆ పూటకు అందరికీ కరువు కాలానికని దాచిన రాజ ధాన్యాగారం నుంచి ధాన్యాన్ని తీసి అందరికీ వంటలు వండించి పెట్టించాడు. అంతా తృప్తిగా తిన్నాక, తానే స్వయంగా ఒక ప్రకటన చేశాడు.

"ప్రియ ప్రజలారా! మీకందరికీ తెల్సు గత రెండేళ్ళుగా వర్షాలు లేక మన దేశం కరువుకులోనైంది. దీన్నిమనం ఐకమత్యంతో కృషిచేసి శాశ్వత పరిష్కారం కోసం శ్రమించాలి. మన రాజ్యానికి నైరుతీ దిశగా రెండు పెద్ద కొండలున్నాయి. ఈశాన్య దిశగా మరో రెండు కొండలున్నాయి. మన రాజ్యంలో కురిసే వర్షపు నీరు అంతా కొండలమీద పడి వాగుల ద్వారా వృధాగా సముద్రంలో కలసిపోతున్నది. అందువల్ల మేము ఒక నిర్ణ యం తీసుకున్నాం. మనమంతా శ్రమించి మన రాజ్యపు సరిహద్దుల్లో నైరుతీ, ఈశాన్య దిక్కుల్లో వెయ్యేసి ఎకరాల వైశాల్యంలో బీడుగా ఉన్న భుమిలో పెద్ద తటాకం త్రవ్వుకుందాం. మనకిక నీటి సమస్యే ఉండదు. నైరుతీ ఋతుపవనాలవల్లా, ఈశాన్య ఋతుపవనాల వల్లాకురిసే ఆ వర్షమంతా ఆ తటాకాల్లో చేరుతుంది.

అవిగోండి అక్కడ ఉన్న పలుగులూ, పారలూ, తట్టలూ తీసుకుని బయల్దేరండి. ప్రతిరోజూ మీ అందరికీ ఉచిత భోజన సౌకర్యం ఏర్పరచి, మీరు చేసిన పనికీ మీకు సక్రమంగా ప్రతిఫలం అందిస్తాం." అని ప్రకటించి, ముందుగా తానే ఒక పలుగు తీసుకుని బయల్దేరాడు.

అతని వెంట పరివారమంతా బయల్దేరింది. ప్రజలంతా వారిని అనుసరించారు.

మహామంత్రి నైరుతీ దిశగానూ, మహారాజు ఈశాన్య దిశగానూ బయల్దేరారు. ముందుగానే రంగులతో గీయించి ఉన్న సరిహద్దుల ప్రకారం అంతా త్రవ్వకాలు ప్రారంభించారు.

ప్రతిరోజూ కడుపునిండా భోజనం చేస్తూ ప్రజలంతా మహారాజు, మహా మంత్రుల పర్యవేక్షణలో రెండు నెలల్లో వెయ్యేసి ఎకరాల స్థలంలో మూడు త్రాటి మాను లంత లోతుగా తటాకాలు త్రవ్వారు. ఆ మట్టి నంతా చుట్టూ గట్లుగా పోసి, సున్నం తొక్కి దాంతో గట్లను రాళ్ళతో గట్టిగా బిగించారు.

అంతా కొండపైన చేరి తాము త్రవ్విన తటాకాలను చూస్తూ ఆశ్చర్య పడుతుండగా, కుంభవృష్టిగా వర్షం కురవడం ప్రారంభ మైంది. ప్రజలంతా వర్షానికి తడుస్తూనే తాము తీసిన తటాకాల్లోకి నీరు కొండ చాళ్ళ నుంచి ప్రవహించి రావడం, ఆ నీరు తటాకాలలోకి చేరడమే కాకుండా నేరుగా తటాకాల్లో కూడా వర్షం కురవడం చూస్తూ గెంతుతూ ఆనందించారు.

మహారాజు "కలిమి లేములు కావడి కుండలని మీకు తెల్సుకదా! కష్ట సుఖాలు రెండూ వస్తూ ఉంటాయి. ఐతే మన లేమి కాలం ముగిసింది. ఇహ మన రాజ్యంలో కరువన్నది ఉండదు మనకు ఇహ అంతా కలిమే! సుఖమే." అని చెప్పారు.

ప్రజలంతా కరతాళ ధ్వనులు చేసుకుంటూ నాట్యాలు చేసుకుంటూ ఆనందించారు. తమ కష్టం ఫలించినందుకు వారి సంతోషానికి హద్దే లేదు.

అలా రెండు తటాకాలూ నిండి, సాగునీటికీ  త్రాగునీటికీ  అవంతీ రాజ్యంలో కరువన్నది ఆ తర్వాత ఎప్పుడూ రానేలేదు.

"అందుకే రా మనవడా ‘కృషి ఉంటే ఋషి‘ అవుతారనీ,’ కృషితో నాస్తి దుర్భిక్షం’ అనీ కూడా అన్నారు. తెలిసింది కదా!"

"ఓహో మహ బాగా తెలిసింది. థాంక్స్ తాతయ్య" అంటూ రివ్వున పరుగెత్తాడు మనవడు.

Posted in May 2019, బాల్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!