మన ఆలయాలు, మన సంస్కృతి పరిరక్షక పవిత్ర ప్రామాణికాలు
కళారామ మందిర్, నాసిక్, మహారాష్ట్ర
శ్రీ రామ రామ రామేతి రమేరామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే
మన జీవితాలతో పెనవేసుకొని ప్రతి ఒక్కరూ పదే పదే పాడుకొనే ఈ పద్యం/శ్లోకం ఎవరికి సుపరిచితం కాదు. ఈ స్తుతి చాలు ఆ కోదండరాముణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి. ఆయన పాటించిన నియమ నిష్ఠలు, నైతిక విలువల ప్రమాణాలు ఎంతో విలువైనవి, అందరికీ ఆమోదయోగ్యమైనవి. అందుకే ఆయన ఆదర్శ పురుషుడయ్యాడు.
మన తెలుగువారికి ఎంతో పవిత్రమైన గోదావరి నది పుట్టిన నాసిక్ ప్రాంతంలో కళారామ సంస్థాన ఆధ్వర్యంలో నిర్మించి నిర్వహించబడుతున్న శ్రీ కళారామ ఆలయ విశేషాలు శ్రీరామ నవమి సందర్భంగా మీ కోసం మన ఆలయసిరి లో అందిస్తున్నాను.
క్రీ.శ.1780 సంవత్సరంలో ఈ ఆలయానికి శంకుస్థాపన జరిగింది. క్రీ.శ.1792 నాటికి ప్రధాన ఆలయ నిర్మాణం పూర్తయింది. ఈ ఆలయ గోపురాలలో నేటికీ నాటి వాస్తు సాంప్రదాయాలను మనం చూడవచ్చు. ఇటువంటి ఆలయ నిర్మాణాలు మనకు చాలా అరుదుగా కనిపిస్తాయి. అంతే కాక 200 ఏళ్ళు దాటినా కూడా రాతితో కట్టిన ఆ ఆకృతులు చెక్కుచెదరక నిలిచి నేటికీ ఎంతో మంది భక్తులకు నేత్రానందం కలిగిస్తున్నాయంటే నాటి నిర్మాణ చాతుర్యానికి, అకుంఠిత కృషికి ఇంతకంటే వేరే నిదర్శనం ఉండదు.
ఈ ఆలయ నిర్మాణానికి వాడిన నల్లటి పాలరాయిని సమీప పర్వత శ్రేణుల నుండే సేకరించారు. అయితే టన్నుల కొద్దీ బరువున్న ఆ బండలను తగిన పరిమాణంలో పగులగొట్టి వాటిపై శిల్పాలను చెక్కాలంటే అదేమంత సులువైన పని కాదు. ఆ బండలను ముందుగా నిర్మాణ స్థలానికి రవాణా చేయడమే నాడు ఎంతో ప్రయాసతో కూడిన పని. కానీ రెండువేలమంది కార్మికులు నిరంతరం శ్రమించి నేడు మనం చూస్తున్న ఇంత పెద్ద కట్టడాన్ని నిర్మించారు. ప్రధాన ఆలయం అంతా 96 రాతి స్థంబాల మీద నిర్మించారు. ముఖద్వారాన్ని అర్థ చంద్రాకారంలో మలిచారు. అదే మన శిల్పుల పనితనానికి తార్కాణం. ఆలయ శిఖరాలన్నీ బంగారుపూతతో తాపడం చేయడం వలన రాత్రి,పగలు ఎంతో ప్రకాశవంతమై కనులకు ఇంపుగా ఉంటుంది.
ఈ ఆలయంలో కొలువైన సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రుడు ఎంతో ఎంతో మహిమలు కలవాడని ప్రతీతి. కోరుకున్న కోర్కెలు తీర్చే నీలమేఘశ్యాముడని అందరూ నమ్ముతారు. దేశంలోని అన్ని రామాలయాలకు భిన్నంగా ఇక్కడి మూలవిరాట్టు నల్లరంగులో ఉంటాడు. అయినా ఎంతో ప్రకాశవంతంగా, ఆహ్లాదకరంగా దర్శనమిస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి, నవరాత్రి వేడుకలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. అప్పుడు జరిగే రథయాత్రలో పాల్గొనటానికి వేలమంది భక్తులు తరలివస్తారు.