Menu Close
Kadambam Page Title
జీవన గానం
-- రుచిత --

శిశిరంలో ప్రకృతి..
సుందరంగా రమణీయంగా
పులకిస్తోంది..

అందమైన పువ్వులు
మంచుతో కప్పివేసిన క్షణాలు..
స్వచ్ఛంగా మంచుపూవులై
వికసించిన తరుణాలు..
ఏవో తెలియరాని అనుభూతులు
మదిని పరవశింపచేసే ఆనందాలు..

ఆకాశంలో నెలరేడు
మబ్బుల్లో దోబూచులాడువేళ..
కాననంలో పండువెన్నెలలు,
పిండారబోసినట్లు పరచుకున్న యామినిలో
నిశీధానికి తావెక్కడిది ?

వెన్నెల వెంటే చీకటని తెలుసు విపినానికి !
ఎన్నో ఏళ్లుగా జీవనగమనాన్ని సాగిస్తున్న తనకి! తన అనుభవాల ఎడదకి!

వెన్నెల రేయి, చల్లని హాయి గొలిపినా ,
వేడిసెగల ఎండలు లేనిదే , రోజు గడిచేనా !

జీవన గమనంలో ఆటుపోట్లు వచ్చిపోతున్నా,
ఆనంద క్షణాలు కరిగిపోతున్నా ,
జీవన గమనం ఆగునా ?

అలజడలు లేని మనసుండాలని
కోరుకుంటుంది ఆ క్షణం , నా హృదయం..
జీవన పయనమంటే అలజడులే కాదు..
ఆనందంతో, పూలరెక్కలై తేలియాడే
డోలికలంటోంది మానసం !
ఇదే మన జీవన గానం..

వానైనా, వరదైనా,
శీతలమైనా, గ్రీష్మమైనా
సమమే కాంతారానికి..
అది ప్రకృతికి భూషణమైన పచ్చలహారం
పచ్చదనమే దాని జీవనగానం..

Posted in January 2025, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!