Menu Close
Uma-Bharathi-HG
హృదయగానం (ధారావాహిక)
నేడే విడుదల
కోసూరి ఉమాభారతి

4

hrudayagaanam-04

పారూ సంగీత శిక్షణ విషయంగా .. పెద్దమ్మ చేసిన ప్రతిపాదనని ఓ తీపి కబురుగా రామ్ కి చెప్పేందుకు.. సగ్గుబియ్యం పాయసం చేసింది శాంత.

రాత్రి భోజనాల సమయంలో... మనమరాలిని గాయనిగా తీర్చిదిద్దాలన్న పెద్దమ్మ ధృడసంకల్పం గురించి,  అందుగ్గాను... తమ ముగ్గురి నడుమ కుదిరిన 'సంగీత సాధన ఒప్పందం' గురించి చెప్పింది.

అంతా విన్న రామ్ "సంగీతంలో మన బిడ్డని వృద్ధిలోకి తేవాలన్న గొప్ప ఆలోచనకి నీకు, అత్తమ్మకి ముందుగా అభినందనలు. మీకు ఎటువంటి సహాయసహకారాలని అందించగలనో చెప్పు." అన్నాడా తండ్రి.

****

మళ్ళీ వారానికి... అమ్మ, అమ్మమ్మ, అమ్మాయిల సంగీతోపాసన మొదలయింది. శాంత వారానికి మూడు గంటలు పారూకి సంగీత పాఠాలు నిర్వహిస్తుంది.

శుక్ర, శనివారాలు... పారూని, శాంతని ఆన్-లైన్ లో సమావేశ పరచి, నేర్చుకున్న పాఠాలని నెమరు వేయించాక... మనమరాలికి భావగీతాలు, జానపదాలు, లలిత సంగీతం, సరదా పాటలు నేర్పిస్తారు సీతమ్మ.

క్లాస్ ముగించే ముందు మాత్రం ప్రతిసారి తమ సంగీత దీక్ష యొక్క ధ్యేయాన్ని గుర్తు చేస్తారు సీతమ్మ. "సంగీతానికి కుల-మత-జాతి-భాషా బేధాలు లేవు. గౌరవపూర్వకంగా వచ్చిన ప్రతి అవకాశాన్ని... సాంప్రదాయం నుండి పాశ్చాత్య సంగీతం వరకు.. వివిధ రీతుల్లో పాడాలి. వృద్ధిలోకి రావడమే ధ్యేయంగా ముందుకు సాగాలి. మన పరమేశ్వరి అంతర్జాతీయంగా కూడా కీర్తిప్రతిష్టలు పొందాలి." అన్న ఆమె వ్యాఖ్యలతో ముగుస్తుంది వారి సంగీత సమావేశం.

అకుంఠిత దీక్షతో సాగుతున్న ఆ సంగీతకారుల సాధన, క్రమశిక్షణ, పట్టుదల ... రామ్ ని ఆశ్చర్య పరుస్తాయి.

****

అలా మూడేళ్ళపాటు ... నిర్వఘ్నంగా అమ్మ, అమ్మమ్మ నిర్వహించే కర్ణాటక సంగీతంలో ప్రాథమిక విద్యావిధానాలని శ్రద్దగా నేర్చుకుని సాధన చేస్తున్న పారూకి గానమే ప్రాణంగా మారిపోయింది. మధ్యమధ్యలో మూడు నెలలకి ఓ మారు అమ్మమ్మ వచ్చి నెలేసి రోజులు స్వయంగా శిక్షణనివ్వడం ఎలాగూ జరుగుతుంది.

పదమూడేళ్ళ పరమేశ్వరి సంగీతంతో పాటు చదువులోనూ చురుకుగా ముందుకు సాగింది. పారూ తొమ్మిదవ తరగతికి, తమ్ముడు పునీత్, చెల్లెలు జననీ నాల్గవ తరగతికి వచ్చారు. నేర్చుకున్న శ్లోకాలు, భావగీతాలు గుడిలో జరిగే మ్యూజిక్ క్లాసుల్లో, ఆలయ కార్యక్రమాల్లో పాడి అందరిని మెప్పిస్తుంది పరమేశ్వరి.

"జనాలు ఈ పాప వాక్సరణిని బాగా ఇష్టపడుతున్నట్లున్నారు. సంగీతంలోని భక్తి భావాన్ని పలికించడంలో పారు నైపుణ్యం, పరిపక్వత జనాలకి నచ్చుతున్నాయి. ఈ పాప అసమాన నైపుణ్యాన్ని కొనియాడుతున్నారు." అని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు ఆలయ సంగీత బృందానికి సంబంధించిన సాయి శర్మ గారు.

"ఈ అమ్మాయి తన గానం ద్వారా చర్చ్ కార్యక్రమాల్లో చాలామందిని ఆకర్షిస్తోంది. ఈ మధ్య సంగీత ఔత్సాహికులైన యువత సభ్యత్వం నమోదయింది." అన్నారు ఫస్ట్ కమ్యూనిటీ చర్చ్‌కి చెందిన మాథ్యూ గారు.

పదమూడేళ్ల కూతురుని చూసి గర్వపడతారు కుమార్ దంపతులు. కవలలు కూడా అక్కకొస్తున్న పేరు, గుర్తింపు చూసి ఆనందిస్తారు. కానీ ఎవరైనా 'మీరు కూడా మీ అక్కలాగే పాడుతారా?' అని అడిగితే మాత్రం ముడుచుకుపోతారు.

****

శనివారం నాడు.. ఎప్పటిలా తెల్లారక ముందే తలారా స్నానం చేసి... పొంగలి వండుకుని వెళ్లి గుడిలోని వారికి పంచి వచ్చాక ... అమ్మమ్మ నుండి ఫోన్ కోసం ఎదురు చూడసాగింది పారూ.

"బాగుందిరా... నీకు శనివారాలు మీ అమ్మమ్మతో రోజు మొదలవుతే... ఆదివారాలు మీ మాలిని పిన్నితో మొదలవుతుంది. మరి అమ్మతో ఎప్పుడో?" అంటూ వెనుకగా వచ్చి... కూతురి భుజాల చుట్టూ చేతులు వేసింది శాంత.

"ఇవాళ నాకోసం ఓ పని చేయి చాలు. అమ్మమ్మ ఫోన్ చేస్తే మనకి వినబడుతుందిగా! ఈ లోగా మనం తోటలో వడియాలు పెడదాము. అమ్మమ్మకి వినిపించబోయే ఆ పాట...ముందు నాకోసం పాడు." అంటూ కూతురి చేయి పట్టుకుని తోటలోకి దారి తీసింది శాంత.

****

తల్లితో పాటు తెల్లని దుప్పటి పైన సగ్గుబియ్యం వడియాలు వరసగా పేర్చుతూ... కొత్తగా నేర్చుకున్న అన్నమయ్య కీర్తన అందుకుంది పారూ…

|| అలరులు గురియగ నాడెనదే |
అలకల గులుకుల నలమేలుమంగ ||
అరవిరి సొబగుల నతివలు మెచ్చగ
అర తెర మరుగున నాడె నదే |
వరుసగ పూర్వదు వాళపు తిరుపుల
హరి గరగింపుచు నలమేలుమంగ ||
మట్టపు మలపుల మట్టెలకెలపుల
తట్టెడి నడపుల దాటెనదే ||
పెట్టిన వజ్రపు పెండెపు దళుకులు
అట్టిట్టు చిమ్ముచు నలమేలుమంగ ||

రెండో చరణం పాడుతుండగా... కూతురి గానామృతానికి శాంత కళ్ళ వెంట ఆనందబాష్పాలు జలజలా రాలాయి. తన్మయత్వంలో తేలియాడింది ఆ తల్లి హృదయం.

పాట ముగుస్తూనే వారి వెనుక నుండి చప్పట్లు వినబడ్డంతో... వెనుతిరిగారు తల్లీకూతుళ్లు.

సీతమ్మ గారు, పక్కనే రామ్ ... ఇద్దరూ నవ్వుతూ చప్పట్లు కొడుతున్నారు. వాళ్లని చూసిన పారూకి ఆశ్చర్యంతో.. నోట మాట రాలేదు.

శాంత మాత్రం.."రా అమ్మా రా, స్టేషన్ కి రామ్ సమయానికి వచ్చారో లేదో అనుకుంటున్నా." అంటూ పెద్దమ్మకి ఎదురు వెళ్ళి, ఆమెని ప్రేమగా హత్తుకుంది.

పారూ దిశగా చూస్తూ... "నీ ఫోన్ కి బదులు నీవే రావడంతో... ఆశ్చర్యంలో మునిగిపోయింది నీ మనమరాలు." అంది.

పారూ తేరుకుని... "అమ్మమ్మా" అంటూ పరుగున అమ్మమ్మ దగ్గరికి వెళ్లి పాదనమస్కారం చేసింది.

పారూని దగ్గరికి తీసుకున్న సీతమ్మ "అచ్చం నా చెల్లెలు మాణిక్యాంబలా భావయుక్తంగా హృదయం నుండి పాడావురా పారూ. ఇక్కడ నిలబడి నేను, మీ నాన్న.. నీ పాట సాంతం విన్నాము." అంటూ ప్రేమగా మనమారాలి బుగ్గలు నిమిరింది.

ఇంతలో కవలలు నిదుర లేచి ఇంట్లో నుండి తోటలోకి వచ్చారు. అమ్మమ్మని చూసి ఆనందంగా ఆమెని చుట్టుముట్టారు.

"సరే... ఇక అందరూ లోపలికి పదండి. అమ్మమ్మని కాసేపు విశ్రాంతిగా కూర్చుని కాఫీ తాగనివ్వండి." అంటూ సూట్-కేసు అందుకుని లోనికి దారితీసాడు రామ్.

****

స్నానపానాదులు ముగించుకుని, కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్లు కానిచ్చారు ఇంటిల్లిపాదీ.

"అల్లుడుగారికి సున్నుండలు, పిల్లలకి లడ్డూలు, మా శాంతమ్మకి సంపెంగలు, ఇక నా చిట్టితల్లికి పుట్టినరోజు కానుకగా పట్టు పరికిణీలు." అంటూ అందరికీ బహుమానాలు అందించారు సీతమ్మ.

"అర్ధమయిందా పారూ? నీ పద్నాల్గవ పుట్టినరోజుకి అమ్మమ్మ వచ్చింది. వచ్చేవారం నుండి వేసవి సెలవలు కూడా కదా! సంప్రదాయ సంగీతంలో నీకు ఉన్నత స్థాయి శిక్షణ తానే స్వయంగా మొదలెడుతుందట." అంది శాంత.

"అలాగా.. నేను రెడీ అమ్మమ్మా. ఎప్పుడు మొదలు పెడతావు? ఈ రోజు మంచి రోజు.." అంది ఉత్సాహంగా పారూ.

"సంగీత కళని ఇంతగా ప్రేమించే నీ భవిష్యత్తు బంగారమే. తెలుగువారు గర్వించే గొప్ప గాయనివవ్వాలి నీవు. మీ స్కూల్ రజతోత్సవానికి నీవు పాడుతున్నావట కదా! అందుకోసం కూడా వచ్చానురా."

”ఈ సందర్బంగా నీకో మంచి కొటేషన్ కూడా చెబుతాను… విను మరి...

/‘సంగీతం ఒక దివ్యమైన కళ... సంగీతాన్ని అభ్యసించినా ఆస్వాదించినా ఆరాధించినా అమ్మవారి అనుగ్రహం పొందినట్టే’/ …అన్నాడు…స్వామి వివేకానంద …

****

స్కూల్ రజతోత్సవ వేడుకల్లో పరమేశ్వరి గానం ప్రత్యేక కార్యక్రమంగా ప్రచారం జరగడం విశేషం. విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులతో ఆడిటోరియం కిక్కిరిసిపోయింది. మాలిని, జోసెఫ్‌లు రావడం కాస్త ఆలస్యమైనా, ఎలాగోలా లోపలికి రాగలిగారు.

చదువులోనూ, ఆటపాటల్లోనూ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలను అందించే రోజు. పారూ గణితంలోనూ, సైన్స్‌లోనూ మొదటి స్థానం సాధించినందుకు స్కాలర్‌షిప్ లభించింది.

రెండో వరుసలో ఆసీనులై ఉన్న మాలిని, జోసెఫ్ గారి పక్కన కూర్చుని … రామ్, కవలలు కార్యక్రమం చివరిదాకా చూసారు. అమ్మ, అమ్మమ్మ స్టేజి పక్కనే పారూకి కనిపించేలా కూర్చున్నారు.

పరమేశ్వరి గానం జనాలకు వీనుల విందు చేసింది. ప్రజాదరణ పొందిన గీతాలు, లలిత గీతాలను ప్రత్యేకంగా ఎన్నుకుని, మధురంగా పాడింది. చివర్లో మాత్రం “అమ్మమ్మ కోసం” అంటూ... తనకిష్టమైన 'ఎన్నగాను రామభజన కన్న మిక్కిలున్నదా' కీర్తన పాడిన ఆ అమ్మాయి స్వరాన్ని, నైపుణ్యాన్ని ప్రేక్షకులు ఎంతగానో ప్రశంసించారు.

స్కూల్ రజతోత్సవంలో ధ్రువతారలా వెలిగి, మన్ననలు పొందిన పారూని మనసారా అభినందించింది మాలిని. పారూ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని రామ్ కుటుంబాన్ని … నగరం లోని పేరున్న భోజన హోటల్లో ప్రత్యేక విందుకి తీసుకునివెళ్ళారు మాలిని, జోసెఫ్ లు. అక్కడ పారూ చేత కేక్ కోయించి ఆశీస్సులందించారు.

****

ఇంటికి వెళ్లే సమయంలో మాత్రం... మాలిని మౌనంగా ఉండడం జోసెఫ్ ని ఆశ్చర్యపరచింది.

"ఏమైంది మాలిని? ఎందుకలా ఉదాసీనంగా ఉన్నావు? నీ దత్తపుత్రిక పారూ అందుకున్న ప్రశంసలు నీకు ఆనందాన్ని కలిగించలేదా?" అడిగాడు జోసెఫ్.

మాలిని జవాబివ్వకుండా ఉండిపోయింది. “ఇంతకీ, నిన్ను బాధిస్తున్న సంగతేమిటో చెప్పు మాలి.” నిముషాల తరువాత మరో మారు అడిగాడు అతను.

ఓసారి భర్త వంక చూసి, "ఏముంది జోసెఫ్, నన్ను కలవరపెడుతున్నది…పారూ బాగోగుల విషయమే. కుమార్ వాళ్ళు తమ పెద్దమ్మాయి పట్ల ప్రేమాభిమానాలు కలిగి ఉన్నారనడంలో సందేహం లేదు. కాని నేనో విషయం గమనిస్తున్నాను. ఇంటా బయటా పారూ చాలా పనులు చేస్తోంది. వంటింట్లో సాయం దగ్గరి నుంచి పచారి సరుకులు తేవడం, గిన్నెలు తోమడం, తమ్ముడికి చెల్లెళ్ళకి అన్నం పెట్టడం వంటి... వయసుకు మించిన బాధ్యతలు మోస్తోంది." అన్నది మాలిని.

మాలిని చెబుతున్నవన్నీ జాగ్రత్తగా వింటున్నాడు జోసెఫ్.

"ఆ పిల్ల వయసెంతని జోసెఫ్? క్రమశిక్షణ పేరుతో పారూ పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు రామ్, శాంత. కొడుకేదో ఉద్ధరిస్తాడనే భ్రమలో ఉండి, పునీత్‌ని చూసీ చూడనట్లు వదిలేస్తోంది తల్లి. తొమ్మిదేళ్ల జననీ ఆమె దృష్టిలో చిన్న పాపాయే ..." అంటూ ఓ క్షణం ఆగింది మాలిని.

ఒకింత ఊపిరి పీల్చుకుని.. “ఇదంతా కాక, ఇంత చిన్నతనంలో ఆ పిల్లకొస్తున్న పేరు ప్రఖ్యాతులు తనకేదైనా కీడు చేస్తాయోమో! అలా జరిగితే, తన ప్రతిభ, నైపుణ్యం అన్నీ వృథా అయిపోతాయేమో!...అని నాకు భయం." అంది కాస్త బాధగా.

"మాలా, నువ్వు మరీ ఎక్కువ బెంగ పడుతున్నావని నాకనిపిస్తోంది. నిజంగానే ఇంట్లో పని ఎక్కువై, శాంత, కూతురి సాయం కోరుతోందేమో? ఇంటి పనుల్లో సాయం చేయడం పారూకి కూడా ఇష్టమేనేమో. చిన్నప్పటి నుండీ పద్దతిగా పెంచారు కదా!"

“అయినా ఓ విషయం చెబుతాను. పారూని నీ స్నేహితురాలి బిడ్డగా కాక... నీకు తెలియకుండానే నీ సొంత బిడ్డలా ప్రేమిస్తున్నావు. ఆ అమ్మాయిని కంటికి రెప్పలా కాపాడుకోవాలని భావిస్తున్నావు. సరే... మంచిదే... మాలీ." అన్నాడు మాలిని మనసు తేలిక పరచడానికి ప్రయత్నిస్తూ.

****సశేషం****

రచయిత్రి పరిచయం ....

‘నాట్యభారతి’ ఉమాభారతి - నర్తకి, నృత్య గురువు, నటి, రచయిత్రి, టీ.వి చిత్ర దర్శక-నిర్మాత

కూచిపూడి, భరతనాట్యం నృత్యాలలో నిష్ణాతురాలు ఉమాభారతి. నాలుగు దశాబ్దాలుగా దేశవిదేశాల్లో కూచిపూడి నృత్య విస్తరణకు కృషి చేసి ఆ కళకు వన్నె తెచ్చిన మేటి నర్తకిగా, గురువుగా ఖ్యాతి గడించారు ఆమె. పద్నాలగవ యేట అఖిలభారత కూచిపూడి నృత్య పోటీలో గెలుపొంది, 1977 లో ప్రపంచ సాంస్కృతిక సభలచే ఆహ్వానింపబడి, ఆంధ్ర ప్రదేశ్ సాంస్కృతిక విభాగం వారిచే సాంస్కృతిక రాయబారిగా పరిగణింపబడిన అప్పటి యువ నర్తకి, ఉమాభారతి.

1970 లో ‘కూచిపూడి రంగప్రవేశం’ గావించి, 20 సంవత్సరాల వయసుకే విదేశీ పర్యటనలు, జాతీయ అంతర్జాతీయ గుర్తింపు, సినీ రంగ ప్రవేశం, చిత్ర నిర్మాణం కూడా చేపట్టి కళారంగంలో ఎనలేని కీర్తినార్జించింది ఉమాభారతి.

బాలనటిగా ‘సుడిగుండాలు’ చిత్రంలో, కథానాయకిగా ‘చిల్లరదేవుళ్లు’ చిత్రంలో, ఊర్వశి గా NTR సరసన ‘యమగోల’ చిత్రంలో నర్తించిన ఉమాభారతి 1976 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి కోసం విద్యార్ధి దశలోనే ‘భారతీయ నృత్య రీతులు’ అనే 30 నిముషాల డాక్యుమెంట్రీ నిర్మించారు.

సేవే ధ్యేయం, నృత్యం మార్గంగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక ప్రతినిధిగా… విద్యానిలయాల నిర్మాణాలకి, వరద బాధితుల నిధికి, నేత్రదాన శిబిరాలకి, 2 వ తెలుగు ప్రపంచ సభలకు, ‘రామసుబ్బయ్య పేద విద్యార్ధుల స్కాలర్షిప్ ఫండ్’ కు స్వచ్చందంగా నృత్య కార్యక్రమాలను చేసారు.

సౌతాఫ్రికా, మారిషస్, సెషిల్స్ ఆంధ్ర మహాసభల నిర్వహణలో నృత్య ప్రదర్శనల ద్వారా ఆలయ నిర్మాణ నిధులకి, తెలుగు భాషా-సంస్కృతి ప్రాచుర్యం పెంపొందించే కార్యక్రమాలకి నిధులు సేకరణకి నృత్య ప్రదర్శనలు చేశారు.

అమెరికా లోని వివిధ (25)  దేవాలయ నిర్మాణ సంస్థల నిధుల సేకరణార్ధం సాంస్కృతిక పర్యటనలు నిర్వహించారు. 1982 లో హూస్టన్ లో అర్చన ఫైన్-ఆర్ట్స్ అకాడెమీ స్థాపించి ప్రవాసాంధ్రుల యువతకి నృత్యశిక్షణ కొనసాగిస్తూ జెమిని టి.వి కి ‘అలయనాదాలు’ టెలీ సీరియల్ నిర్మించి దర్శకత్వం వహించారు.

ఐదు దశాబ్దాలుగా కొనసాగుతున్న కృషికి గుర్తింపు:
శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి చేతుల మీదగా స్వర్ణకంకణం, ‘నాట్యభారతి’ అనే బిరుదు, పాండుచేరి గవర్నర్ నుండి L.V.R ఫౌండేషన్ వారి ‘రాజ్యలక్ష్మి అవార్డ్’. ‘వంశీ’ వారి ‘ఉత్తమ ప్రవాసాంధ్ర కళాకారిణి’ పురస్కారం, ఆంధ్రప్రదేశ్ సినీ గోయర్స్ వారి ‘జవహర్లాల్ నెహ్రూ సెంటినియల్ అవార్డ్, U.S.A హూస్టన్ ‘ఏషియన్ విమెన్స్ వారి ‘వుమన్ ఆఫ్ ది ఇయర్ ’ అవార్డ్, ‘TANA’ వారి సాంస్కృతిక పురస్కారం... ఆమె అందుకున్న కొన్ని పురస్కారాలు.

రచయిత ఉమాభారతి:
తెలుగు భాషా సాహిత్యాల పట్ల మక్కువతో 2012 నుండీ నృత్యేతర రచనా వ్యాసంగంలోకి అడుగుపెట్టి ఉమా రాసిన కథానికలు, కవితలు, నృత్యనాటికలు తెలుగునాట  ప్రముఖ పత్రికల్లోను, పలు అంతర్జాల పత్రికల్లోను ప్రచురించబడ్డాయి. విదేశీ కోడలు – కధా సంపుటి (2013), ఎగిరే పావురమా – నవల (2015), సరికొత్త వేకువ – కధా సంపుటి (201 7), వేదిక – నవల (2016), నాట్యభారతీయం – వ్యాసా సంపుటి (2018) ..ఇప్పటివరకు పుస్తక రూపంగా వంగూరి ఫౌండేషన్ వారి ప్రచురణాలగా వెలువడిన గ్రంధాలు. నాట్యభారతి ఉమాభారతి కధలు – కధా సంపుటి (2023) లో వెలువడింది.

ఆమె తాజా నవల ‘హృదయగానం – నేడే విడుదల’ – నవల (2024) లో సిరికోన సాహిత్య అకాడెమీ వారి ఉత్తమ నవలగా గెలుపొంది, ‘జొన్నలగడ్డ రాంభొట్లు, సరోజమ్మ స్మారక పురస్కారం’ అందుకుంది.

నృత్య నాటికలకు గుర్తింపు:
ఆమె రచించి, నిర్వహించిన  ‘భరతముని భూలోక పర్యటన’ ‘పెళ్లి ముచ్చట’, ‘మానసపుత్రి’, ‘లయగతులు’, ‘తెలుగింటి వెలుగు’ నృత్యనాటికలకి అమెరికాలోని ‘తానా’, ‘ఆటా’ వారి ఉత్తమ ప్రదర్శన అవార్డు, సృజనాత్మకతకి గుర్తింపు పొందారు.

విద్యాభ్యాసం: M.A (Pol. Science) – Osmania Universisity
కుటుంబ నేపధ్యం: తల్లితండ్రులు: కీ. శే. మేజర్  సత్యనారాయణ, కీ. శే. శ్రీమతి శారద
భర్త: డా. మురళి మోహన్ కోసూరి, సంతానం: డా. సత్యజిత్, డా. శిల్ప
కూచిపూడి గురువులు – పద్మశ్రీ వెంపటి చిన్నసత్యం, ‘కళాప్రపూర్ణ’ శ్రీ వేదాంతం జగన్నాధ శర్మ
భరతనాట్యం గురువులు – పద్మశ్రీ ఫకీరుస్వామి పిళ్ళై, కళైమామని శ్రీ. టి.ఆర్. రాధాకృష్ణన్

Posted in January 2025, కథలు

4 Comments

  1. Vyjayanthi

    Very interesting story line. Every paragraph takes the reader into a imaginary guessing about the next step …
    Beautifully written.

    • Uma B Kosuri

      సమయం తీసుకుని చదివి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు మిక్కిలి ధన్యవాదాలు.

  2. Uma Kosuri

    భార్గవ్ గారు, నమస్తే.. మీ స్పందన కి మిక్కిలి ధన్యవాదాలు. చిత్రం, కథనం రెండూ మీకు నచ్చడం హర్షణీయం. ఇకపై కథనం మలుపులతో ఆసక్తకరంగా ఉంటుందని అనుకుంటున్నాను. *** ఉమాభారతి

  3. bhargav chagala

    చాలా బాగుంది 💐💐పారూ టెంపుల్ లొ పాడుతున్న పిక్చర్ depiction అత్బుతం, novel idea,, fantastic imagination,,హృదయ గానం వీనుల విందు గా,, అందరి హృదయాలని, తాకుతుంది, sooper success 💐💐

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!