Menu Close

page title

హంస

swan

హంస వాహన దేవీ అమ్మా సరస్వతీ.. అంటూ వాగ్దేవిని ప్రార్థిస్తాం. ఔను. హంస విద్యాదేవత ఐన వాగ్దేవి వాహనం. పూర్తిగా శాకాహారి. తామర తూడులలోని గుజ్జును మాత్రమే అవి ఆహారంగా స్వీకరిస్తాయి.

హంస చాలా అందమైన పక్షి. Anatidae కుటుంబంలో Cygnus అనే తరగతి చెందిన పక్షులు మన హంసలు. హంసల్లో తెల్ల హంసలు, నల్ల హంసలు ఇలా చాలా రకాలు ఉన్నాయి. వేద కాలంలో హంసలు గ్రీష్మ ఋతువులో మానస సరోవరం సరస్సుకి ఎక్కడి నుండో తరలి వచ్చేవి. వాతావరణ మార్పులు కారణంగా నేడు ఇప్పుడు వాటి రాక లేదు.

హిందూమతంలో హంసలకొక ప్రత్యేక స్థానం ఉంది. హంస సరస్వతిదేవి వాహనమేకాక ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి చేరిన వారిని 'పరమహంస' అంటారు. ఉదా- రామకృష్ణ పరమహంస, పరమ హంస యోగానంద. హంస పాలలోని నీటిని వేరు చేయగలదని అంటారు. హంస గొంతులో ఉండే కొన్ని గ్రంధుల ద్వారా శ్రవించే రసాలు నీటిని ఆవిరిగా మార్చేసి స్వఛ్ఛమైన పాలనే లోనికి పంపుతాయంటారు. ‘హంస నడక’ అని అందమైన అమ్మాయిల నడకను హంస నడకతో పోల్చుతారు.

హంస గాయత్రి - ఓం పరమహంసాయ విద్మహే మాహా హాంసాయ ధీమహి, తన్నోహంసః ప్రచోదయాత్.-అంటూ హంస గాయత్రిని ఉచ్చరించడం మన సాంప్రదాయం.

హంసకు చాలానే పేర్లున్నాయి. ఉదాహరణకు: అంచ, కలకంఠము, క్షీరాశము, తూడు దిండి, తెలిపిట్ట, మరాళము, శ్వేతగరుతము మొదలైనవి. ఇంగ్లీషు లో హంసను ‘స్వాన్’ అంటారు.

హంస తెల్లగా, అందంగా, బాతు ఆకారానికి దగ్గరగా ఉంటుంది. వేదాల నుంచి నలదమయంతుల చరిత్ర వంటి కావ్యాల వరకు హంస ప్రస్తావన ఉంది. అపోలో అనే దేవత హంస రూపం ధరించినదని గ్రీకు ఇతిహాసం చెప్తున్నది. హంస చనిపోయే ముందు అద్భుతంగా గానం చేస్తుందని గ్రీకు పురాణాల నుంచి ఒక నానుడి ఉంది. 'స్వాన్ సాంగ్' అంటే అంత్యకాలంలో గానం చేసే గీతమని వాడుకలోకి వచ్చింది. షేక్స్పియర్ ఒథెల్లో నాటకంలో ఎమిలియా చేత ఆమె మరణించే ముందు ఇలా అనిపిస్తాడు -'హంసనవుతాన్నేను. పాటలోనే ప్రాణం విడుస్తాను'.

శ్రీనాథుడు రచించిన శృంగార నైషధం గ్రంథాలలో హంస పాత్ర అద్భుత మైంది. వేద కాలంలో సోమరసం నుంచి నీటిని వేరు చేయగలదనే విశ్వాసం ఉండేది.

హంస – అంటే మన భాషలో ‘ఆత్మ’ అన్న అర్ధం కూడా ఉంది.

నల మహారాజు దమయంతిల స్వయంవరం లో హంసపాత్ర ప్రాధాన్యం . క్లుప్తంగా---

ఒకరోజు నలమహారాజు ఉద్యానవనంలో ఉండగా హంసల గుంపు వచ్చి వాలుతుంది. నలుడు వాటిలో ఒకదానిని పట్టుకున్నాడు. నలునితో అతని చేతిలోని హంస మానవభాషలో ఇలా అన్నది. "ఓ మహారాజా! నీవు దమయంతిని ప్రేమిస్తున్నావు. నేను దమయంతి వద్దకు వెళ్ళి నీ గురించి చెప్పి నీ మీద అనురాగం కలిగేలా చేస్తాను" అంటుంది. ఆ హంస పలుకులు విని నలుడు ఆనంద పడి, దానిని విడిచిపెడతాడు. ఇచ్చిన మాట ప్రకారం ఆ హంస విదర్భదేశానికి ఎగిరిపోయింది. అంతఃపురం ముందు విహరిస్తున్న హంసను చూసి దమయంతి ఆ హంసను పట్టుకుంది.

ఆ హంస దమయంతితో "దమయంతీ! నేను నీ హృదయేశ్వరుడైన నలుని వద్ద నుండి వచ్చాను. నలుడు సౌందర్యంలో, గుణంలో ఉత్తముడు. నీవు అతనికి తగినదానివి." అని పలికింది. దమయంతి "ఓ హంసా! నలుని గురించి నాకు ఎలా చెప్పావో అలాగే నలునికి నా గురించి చెప్పు" అన్నది. ఆ హంస అలాగే చేసింది. ఇలా ఇరువురికి ఒకరిపై ఒకరికి అనురాగం కలుగను హంస రాయబారం చేసింది. ఇలా హంస రాయబారం గురించిన కధ ఉంది.

మొత్తానికి హంస స్వఛ్ఛతకు, అందానికీ, సున్నితత్వానికీ చిహ్నం. మనం హంస నుండి మంచి చెడులను వేరుచేసి, మంచిని మాత్రమే గ్రహించే స్వభావాన్ని నేర్చుకుందామా!

Posted in August 2018, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!