విశ్వాసానికి మారుపేరు కుక్క. ధైర్యానికి నిలువుటద్దం కుక్క. స్వామి సేవకు తనకు తానే సాటి కుక్క. త్యాగానికి, అదే ప్రాణ త్యాగానికైనా వెనుకాడని జీవి కుక్క.
శ్రీమదాంధ్రమహాభారతం లో (సంపుటం 1 : ఆదిపర్వం, ప్రధమాశ్వాసం) నన్నయ రచించిన సరమ అనే కుక్క వృత్తాంతం. జనమేజయ మహారాజు యాగం చేస్తుండగా, యాగశాల లోకి ఒక కుక్క పిల్ల వస్తుంది. దాని పేరు సారమేయుడు. దానిని జనమేజయ మహారాజు యొక్క తమ్ముళ్ళు కొట్టి తరిమేస్తారు. ఆ విషయం తెలుసుకొన్న సారమేయుని తల్లి సరమ కోపంతో నేరుగా జనమేజయ మహారాజు వద్దకు వెళ్లి,
“తగునిది (తగదని యెదలో) వగవక, సాధువులకు బేదవారల కేగ్గుల్
మొగిచేయు దుర్వినీతుల కగుననిమిత్తాగమంబు లయిన భయంబుల్” అని,
‘మీ తమ్ముళ్ళు నా బిడ్డను కొట్టారు. ఇది చేయవచ్చు; ఇది చేయరాదు అనే విచక్షణా జ్ఞానం లేని వారికి నాశనం తప్పదు’ అని నిర్భయంగా రాజుతో చెప్పింది. ఆనాడు కుక్కలు కూడా మాట్లాడకలిగేవేమో! కానీ దీని ద్వారా కుక్కలలో ఉన్న ధైర్య గుణం మనకు తెలుస్తున్నాది. నన్నయ ఈ సరమ కథ ద్వారా భారత కథా సూచన చేశాడు.
కుక్క తన యజమాని రక్షణ కొరకు, అతని సన్నిధి కోసం తన ప్రాణాలు సైతం అర్పిస్తుంది. యజమాని కాళ్ళ వద్ద పడుకొని పరమానందం అనుభవిస్తుంది. యజమాని క్షేమం కోసం రేయింబవళ్ళు కాపలా కాస్తుంది. అయితే “విశ్వాసం” కథలో యజమానిని కలవాలని తన ప్రాణాలను అర్పించిన త్యాగమూర్తిగా పాఠకుల మదిలో సుస్థిరస్థానం సంపాదించుకొన్నది. పాఠకుల చేత కన్నీరు పెట్టిస్తుంది.
‘కావ్యమంజరి’ అయిదు ఖండకావ్యాల కృతి. వేటూరి వారు జగమెరిగిన బ్రాహ్మణులు, సాహిత్య రంగంలో వారు చేపట్టని ప్రక్రియ లేదంటే అతిశయోక్తి కాదు. శాస్త్రిగారి 58వ వర్ధంతి సందర్భంగా వారు వ్రాసిన కడుపుతీపు, విశ్వాసం, దివ్యదర్శనం, కపోతకథ మరియు మూన్నాళ్ళ ముచ్చట, అయిదు కథలను తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించారు. ఈ రచనలను ఖండకావ్య ప్రక్రియలో రచింపబడ్డాయి. ఇందులో నుండి ప్రస్తుతం ‘విశ్వాసం’ అనే కథను పరిచయం చేయడం చేస్తున్నాను.
ప్రాచీనతపై పట్టువిడువకనే నవ్యతకు నాందీ పలికే సామరస్య ధోరణి కల్గిన కవిరాజు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు. ఛందోబద్ధంగా కథను నడుపుతూనే భావాలు, భాష తమాషాగా సాగిస్తూ, రసస్ఫూర్తికి ఏమాత్రం లోపం ఏర్పడకుండా ఒక కమ్మని కావ్యాన్ని రచించిన శాస్త్రి గారు ధన్యులు.
“విశ్వాసం” కథ – ఒక పరిశీలన/మనస్తత్వ పరిశీలన:
‘విశ్వాసం’ కథలోని సంఘటనలు నిజంగా జరిగినవి. వాటిని ప్రభాకర శాస్త్రి పద్యకృతిగా మలిచారు. వేటూరి వారి ‘కావ్య మంజరి’ కి వేటూరి ఆనందమూర్తి (ప్రభాకర శాస్త్రి గారి కుమారులు) గారు వ్రాసిన ‘మనవి మాటలు;
అరవైనాలుగు పద్యాలలో (58 గీతాలు, 6 కందాలు) గుడివాడ-బందరు రైలు మార్గంలో కరుణరస ప్రధానంగా సాగిన వాస్తవ గాధ ఇది. ఈ లఘుక్రుతి చదివిన వారికి విన్న వారికి కూడా ఎంత ఆపుకొందామనుకొన్నా ఆగని కన్నీరు ధారలై పారడం ఖాయం. ఇందులోని పాత్రలు, మట్టి పని చేసే ఉప్పరి అతనిపై విశ్వాసం వీడలేని ఓక ఊరకుక్క. కథకుడైన కవి తానూ, మరో తోటి ప్రయాణికుడు చౌదరి ఇతరులు అలతి యలతి నుడులతో అనల్పార్ధాన్ని భావింపజేసే ఈ కృతి చదువరులను ఊపేస్తుంది. ...(కావ్య మంజరి, పు. XIV)
ప్రభాకర శాస్త్రి గారు ఈ క్రింది పద్యంతో కథను ప్రారంభించారు.
“రాక బందరు, కదియును రైలు మీదఁ
జేరె నారైలు గుడివాడ స్టేషనుకును
ఎక్కువారును దిగువారు త్రొక్కటంబు
గూరుచుండిరి; నేనట్టె కూరుచుంటి.”
బందరు నుండి బయలుదేరి రైలులో గుడివాడ చేరిన ప్రభాకర శాస్త్రి గారు, ఆ రైలులో అక్కడ తానూ ప్రత్యక్షంగా చూచిన ఒక సంఘటను మరిచిపోలేక దానినొక కథగా మలిచి దానికి ‘విశ్వాసము’ అని పేరు పెట్టారు.
రైలు గుడివాడ చేరింది. ఒక చౌదరి గారు రైలు ఎక్కాడు. అప్పుడు ఒక ఉప్పరి పనివాడు కూడా రైలు ఎక్కడం జరిగింది. కాని చౌదరికి ఆ ఉప్పరి తన ప్రక్కన కూర్చోటం ఇష్టం లేదు. అందుకే కరకరని తెల్ల వల్వలు కట్టుకొన్న ఒక బ్రాహ్మణ యువకుని తానే పిల్చి తన ప్రక్కన కూర్చోబెట్టుకొన్నాడు. ఉప్పరి వాడు తన పారతో, మట్టి తట్టతో భయభయంగా ఒక ప్రక్క నిలబడ్డాడు. ప్రభాకర శాస్త్రి (కవి) అతనికి భయం పోగొట్టి ఓదార్చాడు. ఇంతలో ప్లాట్ఫారం మీద ఉన్న ఒక వృద్ధుడు రైలులో ఉన్న బ్రాహ్మణ యువకుని చూచి “ఇంట ఇబ్బంది తీరగానే...అమ్మాయిని తెచ్చి విడిచి పెడతానని చెప్పడం చూచి ప్రభాకర శాస్త్రి గారు “మీర్లల్లు మామలా?” అని అడిగారు. ఇంతలో ఒక ఊరకుక్క ‘బిట్టు మొఱుగుచు రైలు దగ్గరికి వచ్చింది. ఉప్పరి వానిని జూచి, తన సహజగుణంతో
“చూచి మూచూచి మినికాళ్ళ లేచి యేచి
తోకనాడించుకొనుచుఁ దుందుడుకు తోడ
దన్ను నాకగా నాలుక దడవుకొనుచు
ముక్కుచును మూలుగుచు నున్న కుక్క జూచి”
ఎంత సహజత్వం! ఇదే శాస్త్రి గారి ప్రతిభ.
ఉప్పరివాడు కుక్కకు తెలియకుండా రైల్వే స్టేషన్ కు వచ్చినా ఆ కుక్క అతని జాడ పసిగట్టి వచ్చేసింది. ఉప్పరివాడు దానికి టికెట్టు కొనడానికి డబ్బులు లేక ఇంటివద్ద వదిలేసి వచ్చాడు. అయినా ఇప్పుడది అతన్ని వెదుక్కొంటూ వచ్చింది. దాన్ని చూచిన ఉప్పరి వాని మొహం “వెడతెల్వి తెప్పరిల్లె” తలుపు తెరిచి కుక్కను రైల్లోకి ఎక్కించాలనుకొన్న ఉప్పరి వానిని వారిస్తూ చౌదరి తలుపు తెరవవద్దని అరిచాడు. కుక్కు అరుస్తుండగా బ్రాహ్మణ యువకుడు తన చేతి కర్రతో ఆ కుక్క మూతి మీద కొట్టాడు. ఉప్పరిని తిట్టాడు.
ప్రభాకర శాస్త్రి గారు ఈ కథలో చూపించిన మానసిక విశ్లేషణ, ఆ యా ప్రాత్రల ముఖంగా మానవుల ప్రవర్తన, వారి మధ్య ఉండవలసిన సంబంధ బాంధవ్యాలు ఆరు కందాలలో, 58 తేటగీతులలో చక్కగా తేటతెల్లం చేశారు. పేదవాడి బ్రతుకు ఆనాడైనా. ఈనాడైనా, ఏనాడైనా పదిమందికి ఆట బంతే.
ఇక్కడ శాస్త్రి గారు ప్రధాన కథకు కొంచెం విరామం ఇచ్చారు. శోకాంతమైన ఈ కథ కడవరకు ఒకేసారి చదివినప్పుడు పఠిత మానసిక స్థితి అల్లకల్లోలమవుతుంది. అందుకే శాస్త్రి గారు ఇక్కడ ఒక చిన్న ఆహ్లాదకరమైన సంఘటనను గూర్చి చెప్పడం గమనార్హం.
“అంతలో గుఱ్ఱపుంబండి నమ్మఁగూతు
లరుగుదెంచి రిర్వురు వారి నరసినంత ..”
అల్లుని మోహంలో “తెల్వి వెల్లివిరిసె”
ఇంతకూ ఎవరీ అల్లుడు? ఎవరా అమ్మా కూతుళ్ళు?