గత రెండు సంచికల ‘గ్రంథ గంధ పరిమళాలు’ శీర్షికలో “మధూకమాల” గ్రంథం గురించిన విశ్లేషణ అందించాను. ఈ సంచికలో “సాహిత్య మరమరాలు – వందేళ్ళ సాహిత్యంలో అపూర్వ ఘటనలు” గ్రంథ పరిచయం చేస్తున్నాను. ఈ గ్రంధాన్ని నేను సుబ్బరామయ్య గారి అనుమతితో సమీక్షించడం జరిగింది. ఈ పుస్తకాన్ని నాకు బహుమతిగా అందించిన చిరంజీవి సి. ఆనంద్ కు నా ధన్యవాదాలు. సాధారణంగా మరమరాలు అంటే మనకు సాయంత్రం సమయంలో తీసుకొనే ఒక చిరుతిండి. మరమరాలు ఇష్టపడని తెలుగు వారు ఉండరు. అయితే ప్రస్తుతం సమీక్షిస్తున్న ఈ ‘సాహిత్య మరమరాలు’ ఎల్లప్పుడూ మనలను అలరించే అపూర్వ ఘటనలు అని నేను చెప్పగలను.
రచయిత పరిచయం:
“సాహిత్య మరమరాలు – వందేళ్ళ సాహిత్యంలో అపూర్వ ఘటనలు” అనే ఈ గ్రంథాన్ని మనకు అందించిన వారు శ్రీ మువ్వలు సుబ్బరామయ్య గారు. వీరు విజయవాడ వాస్తవ్యులు. జయంతి పబ్లికేషన్ అధినేత. మంచి రచయిత. ప్రజోపకరమైన రచనలు అందించారు. ఈ గ్రంథాన్ని తన ఆప్త మిత్రుడు చలసాని ప్రసాదరావు కు అంకితమిచ్చారు. నవంబర్ 1998 నుండి, డిసెంబరు 2002 వరకు 'వార్త' దిన పత్రికలో ఆదివారం విభాగంలో సాహిత్య మరమరాలు ధారావాహికంగా ప్రచురింపబడింది. 1,000 సంఘటనలకు చోటు కల్పించిన ఈ రచనలను సుబ్బరామయ్యగారు "సాహిత్య మరమరాలు' అనే గ్రంధంగా ప్రచురించారు.
౧. స్రవంతి:
“చార్మినార్ మీద ఎగిరే పావురాలు శాంతి పతాకలై కనుపించేవి. పబ్లిక్ గార్డెన్స్ లో పచ్చని గడ్డి మీద పాదాలు మోపితే చిరకాల రోగులు ఆరోగ్యవంతులయ్యే వారు. ‘సవేరా’ ల్లోని జల కణాలు తలమీద చల్లదనాలను చల్లేవి. ఒక రూపాయతో కడుపునిండా భోజనం చేసేవారు. పావలా ఇస్తే పదిమైళ్ళు తీసుకువెళ్ళేవాడు రిక్షావాడు. రోజూ కవి సమ్మేళనాలు, ముషాయిరాలు, కవ్వాలీలు, భవాని ప్రసాద్ భావ బంధుర హిందీ గీతాలు, శ్రీ కృష్ణ రాయ గ్రంధాలయంలో విశ్వనాథ, నాయని, నండూరి, నారాయణ రెడ్డి కవితాగానాలు, కళకళ లాడే ప్రతాప్ గిర్జీ, కోఠి సభలు, సమావేశాలు.
అబిడ్స్ ఆ రోజుల్లో అందాల బృందావనంలా ఉండేది. చలన చిత్ర శాలల వద్ద యువతీ యువకులు శృంగారం ఒలకబోస్తూ గుమిగూడడం..మత్తెక్కిన మధుర రాత్రులు – హైదరాబాద్ గజ్జె గట్టిన గజల్ లా కనిపించేది. ...” – దాశరథి – సాహిత్య మరమరాలు- పుటలు 133-134.
౨. అలవాటు:
“పెద్దవాళ్ళంతా నన్ను సుబ్బారాయుడి గారి తమ్ముడు అంటారు. మా ఊరి వాళ్ళంతా నన్ను కామమ్మ గారి తమ్ముడు అంటారు. మరోచోట శివశంకర శాస్త్రి గారి వియ్యంకులని, తీర్థుల వారి మామగారని అనిపించుకోవడం నాకు బాగా అలవాటయింది.” – మొక్కపాటి నరసింహ శాస్త్రి – సాహిత్య మరమరాలు – పుట 73.
౩. ఈ శతాబ్దం నాది:
“ఇప్పుడు మనం 20 వ శతాబ్దంలో ఉన్నాం. ఈ శతాబ్దం నాది (తెలుగు సాహిత్యానికి సంబంధించినంత వరకు). నేను 1910 లో పుట్టాను (తోకచుక్క లాగా). మూడుసార్లు మృత్యువుతో పోరాడి గెలిచాను. 1918 లో మొదటి గీతం వ్రాశాను (గణ యతి ప్రాసలంటే ఏమిటో తెలియకుండా). 1920 లో మొదటి నవల (వీరసింహ విజయసింహులు) రాసి పారేశాను. 1925 లో మొదటి నవలిక (పరిణయ రహస్యం) అచ్చయ్యింది. 1928 లో మొదటి ఖండకావ్య సంపుటిని అచ్చువేయించ గలిగాను. 1930 వ సంవత్సరంలో నేను 63 రోజులు టైఫాయిడ్ జ్వరంతో బాధపడ్డాను. జీవితం మృత్యువుతో ఎలా పోరాడుతుందో స్వయంగా తెలుసుకొన్నాను. 1930 దాకా తెలుగు సాహిత్యం నన్ను నడిపించింది. ఆ తర్వాత నుంచి నేను నడిపిస్తున్నాను. అప్పటినుండి తెలుగు సాహిత్య చరిత్ర నాది.” - శ్రీ శ్రీ స్వీయ చరిత్ర - సాహిత్య మరమరాలు – పుట 67.
౪. కవితావేశం:
“తెలుగు లెంక తుమ్మల సీతారామ మూర్తి గారు గెడ్డం గొరిగించుకొంటానికి మంగలికి కబురు పెట్టారు. అంతలో ఆయనకు ‘తెనుగు తీపి’ విషయంపై కవితావేశం వచ్చింది. మూడు, నాలుగు పద్యాలు రాశారు. అంతలో మంగలి వచ్చాడు. కవిగారు కవిత రాయడం ఆపేశారు. మంగలి కవి గారి గడ్డం సగం గొరిగేసరికి కవి గారికి మరలా కవితావేశం ముప్పేట ఆవహించింది. ఆవేశాన్ని ఆపుకోలేకపోయారు. మంగలిని గీయడం ఆపమన్నారు. కలం పట్టుకొని పద్యాలు రాయడం మొదలుపెట్టారు. ఐదు, పది నిమిషాలు కాదు, పావు గంట, అరగంట కాదు. ఏకబిగిన ఒక గంట సమయంలో నలుబది పద్యాలు వ్రాశారు. కవితావేశం తగ్గింది. మంగలిని పిలిచారు. గడ్డం పూర్తిగా గీయించుకొన్నారు. మంగలిని ఆపు చేసినందులకు పావలాకు బదులు ఒక రూపాయి ఇచ్చి తిండిపెట్టి వానిని తృప్తిపరిచి తాను తృప్తి చెందారు.” – తుమ్మల సీతారామ మూర్తి - సాహిత్య మరమరాలు – పుట 86-87.
నోట్: అదండీ సంగతి! కాదు కవులతో తమాషా!
౫. నా కత్తి కవిత:
“జీవితం నాకు ఎన్నో పాఠాలు నేర్పింది. నా గురువులు ఇద్దరు – పేదరికం. కులమత బేధం. ఒకటి నాకు సహనాన్ని నేర్పితే రెండోది నాలో ఎదిరించే శక్తిని పెంచిందే గాని బానిసగా మాత్రం మార్చలేదు. దారిద్యాన్ని, కులబేధాన్ని కూడా చీల్చి నేను మనిషిగా నిరూపించుకోదలచాను. వాటిపై కత్తి కట్టాను. అయితే నా కత్తి కవిత.” – గుఱ్ఱం జాషువా - సాహిత్య మరమరాలు – పుట 158.
౬. భారం:
హరికథా పితామహుడు శ్రీ ఆదిభట్ల నారాయణ దాసు గారికి ఆంద్ర విశ్వ కళా పరిషత్తు, ‘కళాప్రపూర్ణ’ బిరుదునిస్తే, “భగవంతుడొక్కడే కళాప్రపూర్ణ శబ్దవాచ్యుడు. మానవమాత్రులెవరూ అందుకర్హులు కారు. నేను దాని భారం భరించలేను.” అని నిరసించారు. –ఆదిభట్ల నారాయణ దాసు - సాహిత్య మరమరాలు – పుట 181.
౭. సొగసు:
“చిన్నతనంలో బొమ్మలాట నేర్చి ఉండుట చేత లోకమనే రంగంలో చిత్రకోటి రీతులను ఆటాడే మనుషులనే పాత్రముల సోగసును కనిపెట్టడము నాకు అలవాటైనది. సొగసులేని మనిషి ఉండడు. స్నేహము, ప్రేమ అనేవి అనాది అయినప్పటికీ సరికొత్తగా వుండే రెండు వెలుగులను నరుని మీద తిప్పికాంచితే వింత వింత సొగసులు బయలుదేరుతవి. అసూయ అనే అంధకారంలో అంతా ఏక నలుపే” – గురజాడ - సాహిత్య మరమరాలు – పుట 188.
నోట్: ‘తిప్పి కాంచితే’, ‘ఏక నలుపు’ ఆనాటి భాష. బొమ్మలాటలు పిల్లలకు భవిష్యత్తులో పనికి వస్తాయి. మానవ స్వభావాలు, మనసులు, మమతలు ఆ ఆటలవల్ల పిల్లలకు చిన్న వయసులోనే అవగతమౌతాయి.
౮. ఖండాంతర ఖ్యాతి:
దువ్వూరి రామిరెడ్డి ఖండాంతర ఖ్యాతి పొందిన ఆంధ్ర కవి. వారికి జేమ్స్ హెచ్. కజిన్స్ తో గల మైత్రి దీనికెంతో దోహదం చేసింది. వారు తన ఖండ కావ్యాలలో కొన్నింటిని ఆంగ్ల భాష లోకి అనువదించి ‘వాయిస్ అఫ్ ది రీడ్’ అనే పేరుతొ ప్రచురించారు. అంతే కాదు తనకు పేరు సంపాదించిన అనేక ఖండ కావ్యాలను కూడా ఆంగ్ల భాష లోకి అనువదించారు. రామి రెడ్ది గారి కవిత్వాన్ని గురించి కజిన్స్ ఎంతో చక్కగా కలకత్తాలోనూ, లండన్లోనూ ప్రసంగించాడు. కలకత్తా పత్రిక “ఫార్వర్డ్” కజిన్స్ ప్రసంగాన్ని యదాతథంగా ముద్రించి “in our Rabindranath, in Harindranath, Sarojini and in young Ramireddy was burning a light of the spirit which sent an appeal in other parts of the world to release the poet with in” అని వ్యాఖ్యానించింది. అంతేకాదు, కజిన్స్ ఆంగ్ల భాషలో రచించిన ‘సమదర్శన’ అనే గ్రంథంలో కూడా రామిరెడ్డి కవిత్వాన్ని పొగుడుతూ “Ramireddy’s poems are ages above than what is produced in America” అని అన్నాడు. “British empire edition of English poetry” లో కూడా శ్రీ రామిరెడ్డి గారి పద్యాలు చేరాయి. – నాగళ్ల గురుప్రసాదరావు - సాహిత్య మరమరాలు – పుట 190.
౯. చేజార్జుకొన్న సంపద:
1816 ప్రాంతంలో సర్వేయర్ జనరల్ గా పనిచేసిన కల్నల్ కాలిన్ మెకంజీ మన గ్రామ చరిత్రలు వ్రాయించారు. ఇవే కైఫీయతులు. వీటి ఆధారంగానే మెకంజీ ప్రాచ్య దేశ చరిత్రలు కూడా వ్రాయించాడు. వాటిని మళ్ళీ తిరగరాయించి ప్రాచ్య లిఖిత భాండాగారం లో భద్రపరచిన వారు సి. పి. బ్రౌన్. వాటిని గూర్చి కొంత వివరణ.
కృష్ణా జిల్లా ఘంటసాలలో లభించిన పాలరాతి శిల్పావశేషాలను మొదటి నుండి భద్రం చేసివుంటే ఘంటసాల ఘన కీర్తికి సాక్షిగా చారిత్రక సంపద మనకు మిగిలి ఉండేది, బౌద్ద శిల్పాలు బట్టలు ఉతికే బండలుగా మారి శిధిలమై పోయ్యేవి కావు.
1920 లో ఒక రైతు ఘంటసాల లోని కోట దిబ్బ దున్నుతుంటే అరవై శిల్పాలు బయట పడ్డాయట. అవి శాక్యముని జీవితగాధో, జాతక కథనో తెల్పే శిల్పాలు. ఆ శిల్పాలు ఒక చెట్టు క్రింద కుప్ప పోసి ఉంటే పాండిచేరి నుండి వచ్చిన విదేశి సంస్థ ప్రతినిధి వాటిని ఐదు వేల రూపాయలకు కొనుక్కొని వెళ్ళాడట. అవే శిల్పాలు ఇప్పుడు పారిస్ లోని మ్యూజియం లో భద్రంగా ఉన్నాయి. – బి కోటేశ్వర రావు - సాహిత్య మరమరాలు – పుట 266-67.