సాహితీ సిరికోన లో ప్రచురించిన కొన్ని గల్పికలు గంగిశెట్టి గారి అనుమతితో సిరిమల్లె పాఠకుల కొరకు ఇక్కడ అందిస్తున్నాము.
వాయ్స్ ఓవర్
డియర్ వ్యూయర్స్, వెల్ కమ్ టు బయం బక్తి చానెల్ మోస్ట్ ఎవైటింగ్ డివోషనల్ ప్రోగ్రామ్ "టెంపుల్ దర్శన్". మనం ఈరోజు చిత్తూరు డిస్ట్రిక్ట్, కలకడ మండల్, ఎర్రకోటపల్లె విలేజ్, ముస్టూర్ లో ఉన్న ముష్టూరమ్మ టెంపుల్ దగ్గరకి వచ్చేశాం. ఇక్కడికి వస్తే చాలు, ఈ ఛుట్టూ కనిపింఛే పరిసరాలన్నీ మంత్రాలు, సుప్రబాతాలు, మంగల వాద్యాలతో స్రవనానందఖరంగా మారు మోగుతూ ఉంటాయి. ఇక్కడి టెంపుల్లో కొలువైన ముస్టూరమ్మ మోస్ట్ పవర్ ఫుల్ గాడెస్ అని బక్తులందరూ విశ్వసిస్తారు. ఆ తల్లిని పిలిచిన పలికే కొంగు బంగారం అంటారు. ఇట్స్ సెంట్ పర్సెంట్ కరెక్ట్. ఇదిగో మీరే చూడండి. ముస్టూరమ్మకి కట్టిన చీర. దాని కొంగు కూడా గోల్డ్ తో వీవ్ చేసిందే. ఇక్కడి బక్తులు అందర్నీ సెంట్ పర్సెంట్ బక్తులు అంటారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చే బక్తులు వాల్ల బందుమిత్రులు ఎవరైనా సరే సెంట్ లేకుండా లోపలకి రాకూడదు. అందుకే వాల్లని సెంట్ పర్సెంట్ బక్తులు అంటారు. అలాంటి సెంట్ పర్సెంట్ బక్తులందరూ కోరుకునే ఆయుస్సు, ఐస్ వర్యం, అదుర్ స్ టమ్, అబీష్ టమ్, ఏ కష్ టమ్ లేకుండా తీరుస్తుందని బక్తులు విస్వసిస్తారు. అలాంటి మోస్ట్ పవర్ ఫుల్ గాడెస్ ముస్టూరమ్మ దర్సన్ చేసుకుని దన్యులం అవుదాం. బోగ బాగ్యాలను పొందుదాం.., రండి.
ముస్టూరమ్మ దర్సనానికి కారులో వెల్లేవాల్లు తిన్నగా గుడి దగ్గరకే వెల్లిపోవచ్చు. అలా కాకుండా బస్సులో వచ్చేవాల్లు కలకడలో బస్సు దిగి ఆటోలోగానీ బై వాక్ గానీ రావచ్చు.
ముస్టూరమ్మ బేసిగ్గా బేబీ బూన్ గాడెస్. పిల్లలు లేనివాల్లకి పిల్లలని కలిగిస్తుంది. పిల్లలు లేనివాల్లు గుడికి వచ్చి వర పడతారు. అంటే గుడి ముందున్న బోర్ వెల్లో బాత్ చేసి తడి బట్టలతో బక్తిబావంతో వచ్చి పాతకాలం ఐదు గంటలకి ( ఈ రైటరెవడోగానీ పైనొకటీ కిందోటీ సున్నలు పెట్టాడు. వాటినెలా ఛదవాలో ఐ డోంట్ నో. బికాజ్ ఐ know నో తెలుగు. తెలుగులో ఎంతో మంది ఎన్నోఅక్సరాలు తీసేసారంట. నేనీ రెండు సున్నల్నీ తీసేస్తే నస్ టమ్ ఏముంది. టెంపుల్ కి వెల్లేది మార్నింగవర్స్ లోనే కాబట్టి, పాతకాలం అంటే మద్యానానికి పాతకాలం మార్కింగే కదా. మరి 'పా'కి రావత్తు ఎందుకు పెట్టాడు? ఈ రైటర్ కి రాయడం తప్ప అన్నీ వఛు. ఈ ప్రాథకాలం అంటే మార్నింగే అయ్యుంటుంది. ఓకె నో ప్రాబ్లం. ఐ విల్ కరెక్ట్ ది స్క్రిప్ట్.. కమాన్ టేక్) పాతకాలం ఐదు గంటలకి అంటే ఎర్లీ మాణింగ్ ఫైవోక్లాక్ కి గరబ గుడికి ఎదురుగా ముస్టూరమ్మ వెండి కల్లు చూసి వాటిని మనసులో తలుఛుకుంటూ కల్లు మూసుకుని సాయం కాలందాకా ద్యానం చేస్తూ పడుకుంటారు. అలా బక్తితోపడుకుంటే వాల్లకి ఓ సపనం వస్తుంది. ఆ సపనంలో మనులు, మానిక్యాలు, , పల్లు, పూర్ నాలు, సొర్ న పాదాలూ కనిపిస్తే పిల్లలు పుడతారు. బై మిస్టేక్ వాల్లకి ఆ సొపనంలో కల్లు, ముల్లు, కాల్లు, బల్లు, బానాలు, వేప రుచ్చం, ఔదుంబర రుచ్చం, బోదిరుచ్చం కనిపిస్తే వాల్లకి సంతానబాగ్యం లేదని అర్ దం. అలా సంతాన బాగ్యం లేనివాల్లకి ముస్టూరమ్మ సాక్సిగా గరబ గుడిలో మల్లీ పెల్లి చేస్తే సంతానం కలుగుతుంది. మల్లీ పెల్లి అంటే పూజార్లు వచ్చి కొన్ని ట్రెడిషనల్ రిచువల్స్ జరిపించి ఆ బార్యాబరతలకే మల్లీ పెల్లి జరిపించి వాల్లకి సంతాన బాగ్యం కలిగిస్తారు. అందుకే అందరూ ముస్టూరమ్మని సంతాన సౌబాగ్య పరదాత అంటారు.
ముస్టూరమ్మ గుడిలో అన్ని గుల్లలోలాగా కల్లుమూసుకుని దర్సనం చేసుకోకూడదు. కల్లు తెరుచుకుని కల్లారా ఆ తల్లిని దర్సించుకోవఛు. గుడి ఛుట్టూ మూడు పరదక్సినాలు చేస్తే ఛదువు, పదకొండు పరదక్సినాలు చేస్తే పెల్లి. నూటొక్క పరదక్సినాలు చేస్తే ఐస్వర్యం, సౌబాగ్యం కలుగుతాయి. బక్తి అతిషయింఛినవారు పొర్లుదండాల పరద క్సీనాలు చేస్తే అసటైస్ వరియాలూ, నవ నిదులూ లబిస్తాయని బక్తుల విస్వాసం. మండల దీక్స చేస్తే విథౌట్ ఎనీ డౌట్ వాల్లు సంగంలో గొప్పవాల్లవుతారు. వాల్లకి రాజయోగం పడుతుంది. వాల్లనిమింఛినవాల్లు ఎవరూ ఉండరు.
ముస్టూరమ్మ మరోస్పెసాలిటీ ఏమిటంటే ఎవ్రీ ఫ్రైడే అంటే సుక్రవారం ఇక్కడ వీక్లీ జాతర జరుగుతుంది. అన్ని టెంపుల్స్ లోనూ జాత్రలు సంవస్తరానికి ఒక్కసారి మాత్రమే కమిన్స్ చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం వీక్లీ జాతర. ఆ జాతర అంగాంగ వైబవంగా సకల వైబవాలతో సకల సుబాలతో సకల సౌబాగ్యాలతో సకల జనుల బాగస్వామ్యంలో బవబందాలను తెంచుతూ బక్తిబావాన్ని పెంచుతూ మనసుల్ని మైత్రీ బందాలలో ముంచేస్తుంది. ఇలా వారం వారం జాతర జరిపే టెంపుల్ వరల్డ్ వైడ్ గా ఇది ఒక్కటి మాత్రమే. దీన్ని గిన్నీస్ బుక్కులోకి కూడా ఎక్కింఛారు.
"వాని నా రాని/ అలివేని/ పూబోని/ కిర్ స్నవేని/ కలవాని/ మనిమేకల/ తలతలల/ పెలపెలల/ కలకలల/గలగలల మనికర్ నిక ముస్టూరమ్మ వర్ న రంజిత స్ వర్ న కూజిత/ పర్ న పూజిత/ కలి కల్ మస హారిని"అంటూ పొయిట్రీ రాసిన గ్రేట్ పొయెట్ స్త్రీస్త్రీస్త్రీ పున్ య మూర్ తుల విగ్’ నేస్వర సాస్త్రి గారు ఈ ముస్టూరమ్మని ఆజన్ మాంతం సేవించి పూజించి తరించిన పున్యాత్ ముడు. ముస్టూరమ్మని దర్సిన్ ఛుకుని పున్యం పొందడానికీ బక్తులందరికీ సాదరంగా ఆహ్ వానం పలుకుతుంది "స్ వర్నాలయ" గోపూర్ ద్ వారం. ఇక్కడ బక్తుల సౌకర్ యార్ దం ఎన్నో ఎరేంజ్ మెంట్స్ ఛేసారు. గుడి దగ్గర ఫ్రీ చెప్పల్ స్టాండ్, ఫ్రీ బాత్ రూమ్స్, ఫ్రీ బ్రేక్ ఫాస్ట్ మద్యానం ఫ్రీ బోజనం, మార్నింగ్ ఈవెనింగ్ ఫ్రీ దర్సన్. ఎవ్రీథింగ్ ఈస్ ఫ్రీ.
అన్ని గుల్లలోలాగా ఈ గుల్లో ముస్టివాల్ల బెడద ఉండదు. ఎందుకంటే ముస్టూరమ్మ టెంపుల్ దగ్గర ముస్టి అడుక్కుంటే వాల్లకి లోకంలో పల్లకిందకి రాల్లు కూడా రావని బక్తుల విస్వాసం. సో ఫీల్ ఫ్రీ టు విజిట్ ఫర్ ఫ్రీ దర్సన్ ఆఫ్ ముస్టూరమ్మ.
సో ఇంతవరకూ ముస్టూరమ్మ పరమ పున్యదర్సనం చేసుకున్న బక్తులందరికీ మా బయం బక్తి చానెల్ తరపున దన్యవాదాలు తెలియజేసుకుంటూ నెక్స్ట్ ప్రోగ్రామ్ "పున్యమ్ పురుసార్ దమ్" కార్ యక్రమానికి వెల్ కమ్ చెబుతూ.. హేవ్ ఎ గుడ్ డే.., ప్చ్.., ఫ్.., బై మల్లీ రేపటి బయం బక్తీ కార్ యక్రమంలో కలుద్దాం.., అంటిల్ దెన్ సర్ వే జనాసుకినో బవంతు. కాలే వర్సతు పర్ జన్ య .., (ఏంటండీ ఈ స్క్రిప్టు తొక్కలాగా కాలే వర్సం ఏంట్సార్. వర్సం ఎక్కడైనా కాల్తుందా? మీరు పేమెంటిచ్చేది వాయిస్ ఓవర్ చదివినందుకా లేక కరెక్షన్స్ చేసుకుందుకా? ఈసారి కాస్త తెలుగొచ్చినోల్లతో రాయించండి లేకపోతే ఆ రైటర్ పేమెంట్ కూడా నాకే ఇవ్వండి. ఈ మాత్రం వాయిస్ ఓవర్ నేను రాసుకోలేనా? ఓకే లెట్ మీ కంప్లీట్)
కురిసే వర్సపు ప్రజాన్యాయ పృద్వీరాజ్ సస్య సాలినీ
(మంత్రాలు ఎక్కువ ఛదివితే రేటింగ్స్ పడిపోతాయి. ఇంక ఛాలు)
కఠిన పదాలకు అర్థాలు
ప్చ్=డివోషనల్ కిస్
ఫ్=డివోషనల్ కిస్ ని గాల్లోకి ఊదడం
వాయ్స్ ఓవర్=దృశ్యానుగుణ వ్యాఖ్య.
కార్యేషు దాసీ... కరణేషు మంత్రీ ... శయనేషు రంభా
(ఎవరీ ముగ్గురు? కథంతా చదివి చెప్పుకోండి చూద్దాం)
ఏమయ్యా! నీకిది బాగుందా? మనిద్దరం ఎంత సన్నిహితంగా ఉండే వాళ్ళం? నీకు పెళ్ళై అర్థాంగి వచ్చాకా కూడా నన్ను వదల్లేదు నువ్వు. ఎప్పుడూ నీ ఎదపై తలపెట్టుకుని పడుకునే దాన్ని. నువ్వు ఇల్లు వదిలి కార్యాలయానికి కార్లో వచ్చినంత సేపూ నీ ఎదపై తలపెట్టుకుని పడుకుంటే ఎవ్వరూ ఏమనుకునేవారు కాదు.
నేను నృత్యం చేస్తుంటే నీ కెంతో ఇష్టం. నీ కోసం ప్రతి రోజూ ఎన్ని గంటలపాటు నృత్యం చేస్తూండేదాన్ని? నేను నృత్యం చేస్తున్నంతసేపు నీకరస్పర్శ నన్ను పరామర్శిస్తూనే ఉండేది. కార్యాలయంలో కూడా నా నృత్యం ఆగిపోతే చాలు నీ ఎదపై నా నిద్ర. ఎవ్వరూ ఏమనుకునే వారు కాదు. నాలుగు ఋతుచక్రాల కాలాన్ని మనం కలిసి చూశాం. ఇప్పుడు ఆ నృత్యమూ లేదు? ఆ కరస్పర్శా లేదు. మొదటి రెండు దశాబ్దాల కాలంలో మన అన్యోన్యత ఎంత బాగుండేదో. ఆ ప్రేమ వేరు. ఆ ఆప్యాయత వేరు. మూడోవ దశాబ్దం నుంచి నీలో మార్పు వచ్చింది. నన్ను ఇంటికి తీసుకురావడమే మానేశావు. ఆఫీసులో నాకోసం ఒక ఏసి రూమ్ లో స్థానం కల్పించావు. కార్యాలయంలో నీకు చేదోడు వాదోడుగా ఉంటూ ఎన్ని విలాసాలు చూపేదాన్ని? ఎంత హొయలొలికేదాన్ని? నీ ప్రతి పదోన్నతి లో నా ప్రమేయం ఉంటూనే ఉండేది. ఇప్పుడవన్నీ ఆగి పోయాయి. ఎప్పుడైనా నువ్వు నన్ను స్పృశిస్తే నే నృత్యానికి ఉద్యుక్తం అయ్యే లోపు నన్ను వదిలేస్తున్నావు. రెండు దశాబ్దాలుగా నీలో చాలా మార్పు వచ్చింది. నువ్వొక రంగులాడి వలలో చిక్కుకున్నావు. ఆ వన్నెలాడి మోజులో పడ్డాకా ఎక్కువ కాలం దానితో గడపటమే. ఎప్పుడూ ఆమె వంటిమీదే నీ చేతులు. నాలాగా ఆమెకు నృత్యం చెయ్యటం రాదు.అయినా నీమోజు దానిపైనే. నన్ను *కార్యేషు దాసీ* అన్న భావన తోనే చూశావు. దాన్ని *కరణేషు మంత్రీ* అనే స్థాయిలో చూస్తున్నావు. ఒక సుదీర్ఘమైన నిట్టూర్పు విడిచి పెట్టింది.
ఈ కబుర్లన్నీ వింటున్న రంగులాడి అందుకుంది. "ఆ ఏముంది లేమ్మా! ఆ వైభోగం అయిపోయింది. నేనంటే ఎంతో ప్రాణం లాగ చూసుకునేవాడు. అన్నివిధాలా తన ప్రగతికి నన్ను వాడుకున్నాడు. తన అవసరాలనన్నింటినీ నేను తీరుస్తూనే ఉన్నానా? నువ్వు ఎదపై వాలిపోయే దానవట. నన్ను వళ్ళో కూర్చోబెట్టుకొనేవాడు. ఇంటికి చేరాక కూడా ఇతను సోఫా లో కూర్చుని ఉంటే తన అంకసీమలోనే నా కాలం అంతా పదేళ్ళ పాటు చక్కగా గడిచిపోయింది. ఆ పదేళ్ళ లో తన భార్య తో కంటే నాతో నే సాన్నిహిత్యం ఎక్కువ. మరో అయిదేళ్ళు మధ్యస్థం గా గడిచాయి. ఆ అయిదేళ్ళలో నన్ను ఇంటికి తీసుకు వెడుతూండేవాడు కాని మా సాంగత్యం క్రమంగా తగ్గిపోయింది. చివర అయిదేళ్ళలో నా పని మరీ అధ్వాన్నంగా తయారైంది నా పరిస్థితి.
ఇతగాడికి ఈ మధ్యనే ఒక చురుకైన చిన్నది దొరికింది. దానితోటే ఇతడి కాలమంతా. నన్నూ వదిలేశాడు. నిన్నూ వదిలేశాడు. కట్టుకున్న భార్యనూ వదిలేశాడు. ఇరవై నాలుగు గంటలూ దీనితోనే కాలక్షేపం. *శయనేషు రంభా* అన్నట్టు రాత్రి పూట పక్కలోకూడా అదే. పాటలు పాడి ఆనందపరుస్తుంది. ఎప్పుటికప్పుడు తన కొత్త కొత్త నయగారాలతో నయాగరా లా మురిపిస్తూ ఇతడి చేతుల్లో ఇమిడి పోయి సరసాలను చవి చూస్తోంది. ఇతడిని తన బానిసని చేసింది.
ఈ ఇద్దరి సంభాషణ వింటున్న ఆ చురుకైన చిన్నది ముసిముసిగా నవ్వుకుంటోంది. అతగాడికి ఆ ఇద్దరి సంభాషణ ఎక్కటం లేదు. పెళ్ళాం అక్కర్లేదు. ఈ చిన్నదాని తో సరసాలాడుతూనే ఉన్నాడు. కొత్తదెవతైనా దొరుకుతుందేమోనని చూస్తున్నాడు. వీడు దక్షిణ నాయకుడు మరి.
పక్కన బాంబు పడినట్టు ఉలిక్కిపడింది గీత .. ఫేస్బుక్ నచ్చలేదా! ఎంతమాట! అనకూడని మాట, వినకూడని మాట..ఎందుకు?
“ఎందుకు నచ్చలేదు... అందులో ఏంటి నచ్చలేదు..” సీరియస్ అయిపొయింది గీత ..
“నీకు సరిగ్గా వాడుకోడం రాదను..నీకు దాని విలువ తెలియదను..అంతేకాని ఫేస్బుక్ బాగాలేదనడం ఏమి బాగాలేదు.. అసలు ఇప్పుడు ఫేస్ బుక్ కాకుండా వేరే ఎంటర్టైన్మెంట్ ఏముంది? టి వి చూస్తే అక్కడ హత్యలు, ఇక్కడ రేప్ లు బుర్ర పాడైపోతుంది అన్నావా నువ్వే.. చుట్టాలు, ఫ్రెండ్ ఇళ్ళకి వెళ్ళాలంటే ఈ భయంకరమైన ట్రాఫిక్ లో గంటలు, గంటలు గతుకుల రోడ్లమిడ ప్రయాణం.. వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ టైం .. వేస్ట్ ఆఫ్ ఎనర్జీ ... ఇంతా చేసి వెళితే కూర్చున్నంత సేపూ వాళ్ళ గొప్పలు వినలేక చస్తున్నాను అన్నావా.. కూర్చున్న గంట, రెండు గంటలు అవతలి వాళ్ళు మనకి కాఫీలు, టిఫిన్లు తయారు చేయడంతో సరి పోతుంది.. ఇంక ఆలస్యం అవుతుందని మళ్ళి పరుగు అన్నావా! మరి ఇన్ని భవసాగరాలు ఫేస్ బుక్ లో ఉన్నాయా...
ఫేస్బుక్ కి వెళ్ళడానికి కాబ్ కావాలా, బస్సు కావాలా, ఆటో కావాలా ... అవతలి వాళ్ళకి నువ్వు వెళ్ళేటప్పుడు పండో ఫలమో తిసేకేళ్ళాలా ... వాళ్ళు సరే సరి పాపం టిఫిన్లు కాఫీలు చేయాలా! ఇటు నీకు ఖర్చు .. అటు వాళ్ళకి ఖర్చు..పైగా వాళ్ళ గొప్పలు, వాళ్ళ మాటలు చచ్చినట్టు వినాలా! అదే ఫేస్ బుక్ అనుకో పైసా ఖర్చు లేదు.. ఎలాగా అన్ని కంపెనీల వాళ్ళు పోటిల మీద మనకి అన్ లిమిటెడ్ డేటా ఇచ్చేస్తున్నారు. మన ఇష్టం వచ్చినట్టు కబుర్లు మనం చెప్పేయచ్చు.. చెప్పేయడం అదేలే పోస్ట్ చేయచ్చు.. రోజూ నువ్వు చేసే వంటలు నీ మొబైల్ లో ఫోటో తీసి రెసిపి తో సహా పోస్ట్ చేయచ్చు.. రుచి, అభిరుచి కార్యక్రమానికి ఆ టివి వాళ్ళు నిన్ను పిలవారని, సినిమా వాళ్ళని పిలిచి వంటలు చేయిస్తారు.. వాళ్ళు నువ్వు చేసినంత రుచిగా చేయరని ఓ తెగ బాధపడ్డావుగా. ఇప్పుడు నువ్వే నీ వంటల కార్యక్రమం వీడియో తీసుకుని మరీ పోస్ట్ చేయచ్చు. నువ్వు కొత్తగా కొనుక్కున్న చీర, నగ అలంకరించుకుని నీ ఫ్రెండ్స్ అందరికి వెంటనే ఫోటో తీసి పెట్టేసి అభిప్రాయ సేకరణ చేయచ్చు.. నన్ను, నాన్నని, అన్నయ్యని మా ఫోటోలు పెట్టేసి పరిచయం చేసేయచ్చు.. నీ పెళ్లినాటి ఫోటోలు, మా బారసాలలు, పుట్టినరోజుల ఫోటోలు పెట్టేయచ్చు.. నా పదహారేళ్ళ అందం ఎవరికీ తెలియడం లేదు.. నా జుట్టు ఊడిపోయి కొంచెం ఏదో వయసు పెరిగేసరికి అందరూ నన్ను ముసలిదాన్ని అంటున్నారు అని వాపోతావుగా పెట్టేయ్ నీ పదహారేళ్ళ వయసు ఫోటోలు .. అన్ని తీసి దుమ్ము దులుపు.. హాయిగా నీ యాభై ఏళ్ల అనుభవాలన్నీ ఫేస్బుక్ లో సీరియల్ గా రాసేయ్.. తిరిగి వచ్చిన నీ కవితలన్నీ రోజుకి రెండు, మూడు పెట్టేయి.. చదవక చస్తారా! తెల్లారేసరికి నువ్వు ప్రముఖ రచయిత్రుల జాబితాలో చేరిపోతావు.. ఇన్ని సౌకర్యాలు, ఇన్ని అవకాశాలు ఉండగా పేస్బుక్ బాగాలేదు అంటావేంటమ్మా .
“నా బొంద ...అవన్నీ చేయడం అయిపొయింది..అందరు స్వార్ధపరులు.. ఎవరి పోస్ట్ లు వాళ్ళు పెట్టుకోడం తప్ప నా పోస్ట్ లు ఒక్కటికి లైక్ కొట్టడం లేదు.. లైక్ ల కోసమేగా నేను ఎవరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపినా యాక్సెప్ట్ చేసాను .. నా లైక్ ల సంగతి పక్కన పెడితే వాళ్ళ పోస్ట్ లకి లైకులు కొట్టలేక నేను చస్తున్నా.”
పెన్షన్ తో బాటు రావాల్సిన ఎరియర్స్ మొత్తం బాగానే వచ్చింది. అపర్ణ కమలతో అంది, ఇదివరకు అదనపు పైకం రావాల్సింది వస్తుందంటే ఎంతో సంతోషంగా ఉండేదే. ఆడబ్బుతో ఇంట్లో ఏదైనా కొత్త వస్తువు కొనుక్కోవచ్చని ముచ్చట పడేవాళ్ళం. దానికోసం కలలు కూడా కనేవాళ్ళం కదే. నీకు గుర్తుందా! అవునే ఆరోజులు ..ఆసంతోషమే వేరు, సరే ఇక వెళ్దామా అంది కమల.
అపర్ణ ఇంట్లోకి రాగానే మొబైల్ తీసి కూతురు సౌమ్యను పిలిచింది. సౌమ్యకు అప్పుడు ఆఫీస్ లో లంచ్ సమయం. అందుకనే బదులు పలికింది. అపర్ణ అంది, సౌమ్యా నాకు అరియర్స్ వచ్చాయే, ఈ నెలలో సోనీ పుట్టిన రోజు కదా నా మనవరాలికి మంచి నగ ఏదైనా కొని ఇస్తానే, ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడు ఇంటికి రావే. అలా షాపింగ్ చేసి వద్దాం అంది అపర్ణ. ఆమాట వినగానే సౌమ్య "అమ్మా ఇప్పుడు నగ ఎందుకు చెప్పు?. హాయిగా నీ డబ్బు నువ్వు ఖర్చు పెట్టుకో అమ్మా, కాళ్ళ నొప్పి అంటున్నావు కదా, ఫిజియో థెరపిస్ట్ ను ఇంటికి పిలిచి చికిత్స చేయించుకో అమ్మా. నీ ఫ్రెండ్స్ సింగపూర్ టూర్ కు వెళ్తారన్నావు కదా. సరదాగా వాళ్ళతో కలసి నువ్వు కూడా వెళ్ళమ్మా. మా గురించి ఆలోచించకు, అని ఫోన్ కట్ చేసేసింది సౌమ్య.
అపర్ణకు దిగులుగా అనిపించింది. తను వాళ్ళ దగ్గర ఉండడానికి ఇష్టపడదు, కూతురు సౌమ్యకు మంచి ఉద్యోగం. అల్లుడిది హోదా కలిగిన కార్యభారం. ఇక మనుమరాలు సోనీని బోర్డింగ్ స్కూల్ లో చేర్పించారు , కనుక ఇంట్లో పొద్దస్తమానూ ఎవరూ ఉండరు. అందుకనే తాను ఒంటరిగా తన ఇంట్లో ఉండడానికే ఇష్టపడుతుంది. ఇక్కడయితే చుట్టుపక్కల వాళ్ళందరితో పరిచయం. పైగా తనకోసం వచ్చేవాళ్ళకు, స్నేహితులకు ఈ ఇల్లు పరిచయం.
అలవాటైన ఇల్లు వదిలివెళ్ళడానికి మనసొప్పదు. సరేలే, అప్పటికి సాయంత్రం 5 గంటలయింది. అబ్బాయి ఈపాటికి లేచే ఉంటాడు, అనుకొని వాట్స్ అప్ కాల్ చేసింది. అక్కడ సమయం పొద్దున 7 గంటలు కావస్తోందట. భరత్ లేచి ఆఫీసుకు తయారవుతున్నాడు. అమ్మ చేసిన కాల్ అందుకుని అమ్మా ఎలావున్నావు అని అడిగాడు. భరత్ నాకు అరియర్స్ వచ్చాయిరా, మంచి పట్టు చీర కొంటాను, పద్మజను పిలు, ఏ రంగు కావాలో అడుగు తాను, అంది. పద్మా అమ్మ కాల్ చేసింది, నిన్ను ఏదో అడుగుతుందట , అన్నాడు. పద్మకూడా బయలుదేరే హడావుడి లో ఉంది. కాల్ అందుకుని అత్తయ్య గారూ అని మాట్లాడబోతుంటే, అపర్ణ అందుకుని ఏం లేదే, నీకొక మంచి చీర కొందామని అనుకుంటున్నాను ఏ రంగు కావాలో చెప్పు, అంది. ఆ మాటకు వెంటనే పద్మజ, నాకు చీరలెందుకు అత్తయ్యా. బోలెడున్నాయి. వాటినే కట్టుకోవటం లేదు. పైగా మొన్ననే ఇండియా కు వచ్చినప్పుడు చూసినవన్నీ కొని ఇచ్చారుగా, ఆపని మాత్రం చేయకండి. అంటూ ఫోన్ ను భరత్ చేతికిచ్చేసింది. ఆ సంభాషణను విన్న భరత్ అమ్మను మందలిస్తున్నట్టుగా, అమ్మా, నువ్వు మాకు కొని ఇవ్వడమేమిటి ఇంకా, మా ఫ్రెండ్ ఇండియాకు వస్తున్నాడు నీకేమైనా కావాలంటే చెప్పు పంపుతాను. అన్నాడు. అపర్ణకు ఆ మాటలు విని దిగులుగా అనిపించింది. కాల్ కట్ చేసాక నిట్టూరుస్తూ సోఫాలో వాలింది.
అప్పటి రోజులు ఆమెకు గుర్తుకొచ్చాయి. భర్తా తనూ ఎంతో పొదుపుగా సంసారం గడిపారు. ఇద్దరూ ఉద్యోగం చేస్తూ డబ్బు కొరత లేకుండా అవసరాలను తీర్చారు. కూతురు సౌమ్య పెళ్ళికి పి .ఎఫ్. డబ్బు తీసి ఖర్చు పెట్టినప్పుడు చేతికి అందు బాటుకొచ్చిన డబ్బును హుందాగా ఖర్చు పెట్టారు. ఇక కొడుకును అమెరికా పంపించినప్పుడు తీసుకొన్న అప్పును, వాడికి భారం కానీక వాయిదాలమీద బేంకు కు చెల్లించేసారు . ఆనాడు ఎవ్వరి మీదా ఆధార పడకుండా బాధ్యతలను నిర్వర్తించినందుకు ఎంతో తృప్తిననుభవించారు. భర్త జబ్బు పడ్డప్పుడైనా ఎవ్వరి సహాయం కోరలేదు. ఇంతవరకూ మరొకరికి ఇచ్చిందే కాని తను తీసుకోలేదు . ఇవ్వడంలో ఏదో నిండుదనాన్ని అనుభవిస్తుంది అపర్ణ. చిన్నప్పుడు తమ అవసరాలను తీర్చిన అమ్మ ఇప్పుడు ఇస్తానంటే వద్దంటున్న పిల్లల ప్రవర్తనకు వాళ్ళు తనకు దూరమైనట్లుగా భావించింది అపర్ణ. తనకు వాళ్ళ సహాయం అవసరం లేదు. రేప్పొద్దున ఏదైన లేవలేని పరిస్థితి వచ్చినా, సేవ చేసేందుకు మనుషులను పెట్టుకునే ఆర్థిక స్తోమత తనకు ఉంది. పిల్లలకు ఇప్పుడు వాళ్ళ కష్ట సుఖాలు వాళ్ళు చూసుకోగల ధైర్యం , అనుకూలతలున్నాయి. కూతురు పురుడు పోసుకున్నప్పుడు కూడా, అమ్మ ఉద్యోగం చేస్తోంది, సెలవు ఎక్కువ రోజులుండవని, పాపను చూసుకునేందుకు నర్సును నియమించుకుంది.
అపర్ణకు మనసెందుకో భారంగా అనిపించింది. ఇచ్చి పుచ్చుకోడాలేనా ప్రేమ? అని ప్రశ్నించుకుంది. తను ఒంటరిగా ఉండగలిగినా, పిల్లలకు ఇప్పుడు తన తోడు అవసరం లేక పోయినా, ఎవరికి వారుగా జీవిస్తే క్రమంగా ఒకరికొకరు దూరమైపోతామేమో నన్న భావన కలిగింది. మనిషి మనుగడకు ఆప్యాయత ముఖ్యమని, పిల్లల దగ్గర తను ఉంటే ఆ సాంగత్య సుఖం అపురూపమనీ దానిని ఒదులు కోకూడదని నిశ్చయించింది. ఈ వయసులో తన ఔదార్యం కంటే ఆత్మీయత ముఖ్యమని తలచింది. అమ్మగా తను పిల్లలతో అనుబంధాలను దృఢ పరచుకోవాలే తప్ప దూరం చేసుకోకూడదని భావించింది. వెంటనే ఏజంట్ ను పిలిచి, యు.ఎస్ కు టికెట్ కొని యివ్వమని చెక్ ను రాసి యిచ్చింది.