Menu Close
గల్పిక

‘గల్పిక’ అనే పదం తెలుగు భాషలో పట్టాలు పొందిన వారికి తప్ప సాధారణ భాషాభిమానులు, సాహిత్యప్రియులకు అంతగా పరిచయం లేని పదం అవుతుంది. అందుకే మన సిరిమల్లె లో ‘గల్పిక’ అనే ఒక శీర్షికను ప్రారంభించి తద్వారా ‘గల్పిక’ అంటే అది సుపరిచితమే అనే భావన కలిగించాలని మా ఆకాంక్ష. అసలు ఈ ‘గల్పిక’ అంటే ఏమిటి? దాని స్వభావం ఎట్లా ఉంటుంది?

కథ కాగలిగి, కథ కాలేనిది ‘గల్పిక’. సన్నివేశాన్ని..దృశ్యాన్ని సంపూర్ణంగా చూపిస్తూ, పాత్రను పూర్తిగా చిత్రించి, ఆ రెండింటి అన్యోన్యక్రియతో, చెప్పదలచుకొన్న అంశాన్ని సమగ్రంగా ఆవిష్కరించేది ‘కథ’. అందులో పై మూడింటి శిల్పభరితమైన ‘కథనం’ ఉంటుంది. అంచేత అదో గొప్ప ‘కథన ప్రక్రియ’ గా ఎదిగింది. గల్పికలో కథనం ప్రాధాన్యం తక్కువ.

ద్రుశ్యీకరిస్తూ పెంచితే కథ; రేఖామాత్రంగా సూచిస్తే గల్పిక..

చదవడానికి, వారి పేర్ల మీద క్లిక్ చేయండి.

గల్పికావని-శుక్రవారధుని-9- నీలమ్మ కత - జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి

ముష్టూర్లో మా జతగత్తెలపైకి నీలమ్మే నాకు బో గొప్ప నేస్తురాలు. అట్లాంటి నీలమ్మ మొగుడు బాయిలో పడి పానాలు నీగేసినంక పోయి చూసి రాకుంటే ఎట్లా అంటా అదేపనిగా డబ్బాగాని జీబులో పోయినా. సుట్టింటి ముంగడ పీనిగ సుటకారం ఐదారుమంది కూసోని నోరుకొట్టుకుంటాండారు. నీలమ్మ లోగా ఉంది. ఓ మోపన ఏడస్తాంది. మొగుని పీనిగ ఎలబార్తాంటే ఏడ్సగాకుండా ఉంటే అది ఆడదే కాదు. కానీ నీలమ్మ అంతగా గోడెత్తిపోతుందని నేను కల్లోకూడా అనుకోలా. నన్నుచూసి ఇంకా జాస్తీగా ఏడ్చేపని మొదలెత్తింది.

ఏడస్తాంది. ఏడస్తాంది. ఏడస్తానే ఉంది.

అందరూ ఆయమ్మ మొగుని మంచితనాన్ని గెమనం చేసీ గెమనం చేసీ దాని ఏడుపుని ఎగేస్తాండారు. నీలమ్మ ఇంకా ఇంకా ఎగబడిపోతాంది. బాదలేకుండా ఏడిస్తే ఆ ఏడుపు మెడదాటి లోగా పోదు. కానీ నీలమ్మ కండ్లల్లోగా వంకలు పారతాండాయి. అదే నాకు ఇచిత్రం అనిపిస్తాండాది.

నాకు తెలిసి నీలమ్మకి మొగుడంటే అంతగా కారిపోయిందీ లేదు, ఎబ్బుడూ ఆయప్పని అంత బ్రెమగా చూసిందీ లేదు. అయినా  బ్రెమలున్నా లేకున్నా మొగుడు సచ్చినబ్బుడు ఏడ్సగాకుండా ఉంటే బైసీనం కదా. దానికైనా ఏడ్సాల. ఏడ్సనీలే అని గొమ్మునుంటి.

పీనిగ ఎలబారి పోయింది. అయినా ఏడస్తానే ఉంది. వచ్చిండే చుట్టాలంతా ఎలబారిపోయినారు. అయినా ఏడస్తానే ఉంది. ఆడబిడ్డని ఒంటిగా ఇడిచిపెడితే ఎట్లా అని ఆడోళ్ళు నీలమ్మకి తోడుగా ఉండారు. ఇంట్లో ఆడంగుల్ని పెట్టుకుని ఏడ్సకుండా గొమ్మునుంటే వాండ్లంతా నీలమ్మకి మొగునిమింద బ్రెమ లేదని అయినోల్లందరికీ పలక్కొట్టెయ్యరా? దానికే నేనూ గొమ్మునుండిపోయినా.

మరసటి దినం కూడా ఏడస్తానే ఉంది. దేనికే అట్లా నోరుకొట్టుకుంటాండావంటే" ఏడ్సకుంటే మా ఆడ బిడ్డ కాడ మరేదుంటాదా?" అంటూ గదురుకునింది. మూడోదినం ఎవురి పాటికి వాండ్లు ఎలబారి పోయేదాకా ఏ మేనత్త ఆడబిడ్డ కొడుకో వచ్చేదీ నీలమ్మ ఏడ్చేదీ. ఏ ఎనకింటి ఎంకమ్మవ్వో వచ్చేదీ నీలమ్మ ఏడ్చేదీ. ఏ రెడ్డోరి జీతగత్తో వచ్చేదీ నీలమ్మ ఏడ్చేదీ.

ఆ మరసటిదినం ఎవరూ రాలా. పోయింది నేను ఒక్కటే. అయినా మొగుని మాట్లెత్తుకుని ఏడస్తానే ఉంది. నాకాడ కూడా ఎచ్చులు పడతాంటే దాని అవతారం చూసి నాకు రగిలిపోయింది.

"ఏమ్మే, నీ కతా నీ మొగుని కతా నాకేం తెలవందా? అయినోల్లముందూ అక్కా పక్కా అందరి ముందూ ఏడ్సినావు ఇబ్బుడెవరుండారని ఇంకా ఇట్లా నోరుకొట్టుకుంటాండావు. చాలించమ్మే" అంటా గదురుకుంటి.

"నేను ఏడ్సింది ఆ పంగమాలిన జనాలకోసం కాదమ్మే నా మొగునికోసం."

"నీ మాటా నీ మొగుని బ్రెమల మాటా నేను సూడందా? నాకాడనే కతలు చెబ్తే ఎట్లాగమ్మీ"

"మ్మేయ్, నువ్వు సూడలేదని నాకు నా మొగుని మింద బ్రెమలేకుండా పోతుందా?"

"అంతగా కారిపోతే ఆయప్ప ఒక్కేటేస్తే సాలు నువ్వు తిరగబడి నాలుగేట్లు కొట్టిందంకా గొమ్మునుండనిది దేనికి? బ్రెమలు కారిపోయిందానికేనా? బ్రెమంట బ్రెమ. నాకాడ కాదు, ఇనేటోల్లెవరైనా ఉద్దరగా చిక్కితే వాండ్లకు చెప్పు"

"ఐతే ఇబ్బుడేంది?"

"ఇంకా దేనికిట్లా కంటికి ఎంగిలి పూసుకుని పొర్లిపొర్లి ఏడస్తాండావు?" అంటా ఉండేమాట అడిగినా. దానికి ఆయమ్మ ఏడ్సేది చాలించి యోచన చేసే పనెత్తుకుంది. దానికే"నాకాడ దాపెట్టుకునేది ఏందిగానీ ఇసయం చెప్పమ్మీ" అంటా అడుక్కుంటి.
నీలమ్మ ఓ మోపున కులుక్కుంటా సెప్పింది సూడూ నీ జనమంలో ఎబ్బుడూ ఇనిండవు అట్లా మాట.

"నేనేం ఎంగిలి పూసుకుని ఏడ్సలా. ఇది ముందే ముష్టూరు. ఓపినంత చలి. పొనుకుంటే నిద్దర్రాదు. కప్పుకుండేదానికి దుప్పటుంటేగా? చినిగిన చీరలు ఎన్ని కప్పుకుని పండుకున్నా చలిని తట్టుకుండేదానికైతిందా? ఆ చలిని గెల్సుకునేది నానింటీ కాదు. ఆయప్పనిగానీ కప్పుకుని పొనుకుంటినా, నన్ను గెల్సుకునేది ఆ సలినింటే కాదు, దానమ్మా మొగున్నింటీ కూడా కాదు"

పోటీ - అత్తలూరి విజయలక్ష్మి

మా కాలనీ లో రిపబ్లిక్ డే సందర్భంగా పిల్లలందరికీ కొన్ని పోటీలు ఏర్పాటు చేసారు కాలనీ అసోసియేషన్ వాళ్ళు. ఆడపిల్లలకి ముగ్గుల పోటీలు, మగపిల్లలకి పరుగు పందేలు అని నిర్ణయించాడు కాలనీ ప్రెసిడెంట్. “ఈ ఆడ, మగ తేడాలేంటి ఇప్పుడు కూడా కుదరదు” అని తల్లులు ప్రతిఘటించారు. అందరూ ముప్ఫై, ముప్ఫై అయిదు వయసు వాళ్ళే...వేడి రక్తం కదా! ఆ మాత్రం పౌరుషం ఉండాలి అనుకున్నాను వాళ్ళని చూస్తూ.

ఆ పెద్ద మనిషి బిత్తరపోయి “సరే మీరే చెప్పండి ఎలాంటి పోటీలు, ఎలా డివైడ్ చేద్దామో” అని వాళ్ళకే వదిలేసాడు.

ఆడ, మగ తేడా లేకుండా అయిదేళ్ళ నుంచి పదేళ్ళ పిల్లలకి పరుగు పోటీలు, పదేళ్ళ నుంచి పన్నెండేళ్ళ పిల్లలకి డ్రాయింగ్ , పన్నెండేళ్ళ నుంచి పదహారేళ్ళ పిల్లలకి ముగ్గుల పోటీలు, ఆడపిల్లలు ముగ్గు వేస్తుంటే మగపిల్లలు ముగ్గు డబ్బాలు పట్టుకుని వాళ్లకి సాయం చేయాలి. ఇది కండిషన్ ... అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు.

పరుగు పోటీలకు కాలనీ ప్రెసిడెంట్, సెక్రెటరీ, డ్రాయింగ్ కి మా పక్కింటి పంతులమ్మ గారు, ముగ్గుల పోటీకి నేను న్యాయనిర్ణేతలుగా నిర్ణయించారు.

ముందురోజు సాయంత్రమే పోటీలు అయిపోతే గెలిచిన వాళ్లకి జెండా వందనం అయాక బహుమతులు ఇవ్వచ్చు అని ముందు రోజు సాయంత్రం ఆరింటికి టైం కూడా ఫిక్స్ చేసారు.

అమ్మలంతా పోటీలకు కావాల్సిన సామాగ్రి సిద్ధం చేసి పిల్లల కోసం ఎదురు చూస్తున్నారు. ముందు ఐదు నుంచి పదేళ్ళ పిల్లలు వచ్చారు.  మరి కాసేపటికి పది నుంచి పన్నెండేళ్ళ పిల్లలు వచ్చారు.

యువతులు నలుగురు ముగ్గులు వేయడానికి box లు వేసారు చాక్పీస్ తో.

ఇవన్నీ అయేసరికి ఆరున్నర. “మొదలు పెట్టడానికే ఇంత ఆలస్యం అయితే ఎప్పటికి అయేను” అన్నాను.

చేసేద్దాం ఆంటీ అని చెప్పి “ఓ అమ్మాయిలు మీరే రావాలి” అని గట్టిగా అరిచింది వందన అనే యువతి అప్పుడే ఇళ్ళల్లోంచి బయటకు వస్తున్న అమ్మాయిలను ఉద్దేశించి. మొహాలు గంటు పెట్టుకుని, అయిష్టంగా వచ్చి ఒక మూల నిలబడ్డారు. వాళ్లకి సాయం చేయడానికి రావాల్సిన  నూనూగు మీసాల అబ్బాయిలు, ముగ్గు డబ్బాలు మేం పట్టుకోడం ఏంటి మేము మగవాళ్ళం అని సణుగుతూ అక్కడినుంచి తప్పుకోడానికి ప్రయత్నిస్తుంటే ఒక యువతి వాళ్ళ చెవి మెలిపెట్టి లాక్కొచ్చి నిలబెట్టింది.

పరుగు పందెం,  డ్రాయింగ్ బాగానే అయాయి..

ముగ్గుల పోటీ మొదలు పెట్టాలి. ముగ్గులు వేయాల్సిన అమ్మాయిలు గ్రూపుగా చేరి చెవులు కొరుక్కుంటూ చర్చించుకుంటున్నారు.. రండి, రండి అని నాలుగు సార్లు పిలిచినా ఎవరూ కదలడం లేదు. ఒకమ్మాయి మాత్రం ముగ్గు డబ్బా పట్టుకుని ముందు వచ్చేసింది తనకి కేటాయించిన బాక్స్ దగ్గర నిలబడి చూస్తోంది. వాళ్ళు మాత్రం అలాగే నిలబడ్డారు.

“వీళ్ళకి ముగ్గులు రావు అందుకే ఈ పెళ్లి నడకలు.. చర్చలు” అంది లీల అనే యువతి.

అప్పటికే ఏడున్నర అవడంతో నేను అసహనం కనిపించకుండా  అన్నాను “అలాంటప్పుడు మీరు వేయచ్చు కదా!”

“లేదాంటీ  కనీసం వాళ్ళు ప్రయత్నించాలి కదా... వాళ్ళల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్సు రావాలనే కదా ఈ పోటీలు” అంది.

అవును కదా అని ఆమె వైపు అభినందనగా చూసాను.

మరో నాలుగు సార్లు పిలవంగా వచ్చారు మిగతా వాళ్ళు కూడా.

పోటీ మొదలైంది. నలభై నిమిషాల్లో రంగులతో సహా రంగవల్లి పూర్తీ చేయాలి.

అందరికన్నా ముందు వచ్చిన అమ్మాయి చుక్కలు పెడుతోంది, సరిగా రాక కాలి  వేలితో చెరిపి మళ్ళి వేస్తోంది... ఒకమ్మాయి ఎందుకొచ్చిన చుక్కలు ముగ్గు అని గీతల ముగ్గు వేస్తోంది.. అలా ఎవరికీ తోచిన రీతిలో తల్లుల మీద కోపం మొహాల్లో కనిపిస్తుంటే అందరూ ఒకళ్ళు నక్షత్రాల ముగ్గు, ఒకళ్ళు పద్మం, ఒకళ్ళు రెండు దోసకాయలు అటూ, ఇటూ వేసి పసుపు రంగు పులిమి ఇలా మొత్తానికి ముగ్గులు వేయడం పూర్తీ చేసారు.

నేను అన్ని ముగ్గుల దగ్గరికి వెళ్లి పరిశీలించి తిరిగి వచ్చి కుర్చీలో కూర్చుని  బహుమతులు ప్రకటించాను.

అది విన్న ఐదుగురు అమ్మాయిలు మొహాలు మాడ్చుకుని విసురుగా వెళ్ళిపోయారు రెండు, మూడు బహుమతులు వచ్చిన వాళ్లతో సహా.

వందన, లీల గాభరాగా వచ్చి “అదేంటి ఆంటీ ... ఆ అమ్మాయిది ముగ్గు కాదు... అలా ఎలా ఫస్ట్ ప్రైజ్ ఆమెకి ఇచ్చారు” అన్నారు.

నేను చిరునవ్వుతో అన్నాను “నువ్వేగా అన్నావు వందనా.. వాళ్ళల్లో ఆత్మవిశ్వాసం రావడానికే  పోటీలు అని.. మిగతా వాళ్ళు నిర్ణీత సమయానికి కనీసం మొదలు పెట్టె ప్రయత్నం కూడా చేయకుండా చర్చలతో జాప్యం చేయడం కాక చాలా నిర్లక్ష్యంగా వేసారు. కానీ ఆ అమ్మాయి ఒక్కతే  అందరికన్నా ముందు వచ్చి తనకి తోచిందేదో మనం ఇచ్చిన గడువులో వేసింది. తనకి రాకపోయినా ఏదో చేయాలి అనే పట్టుదలతో, చేయగలను అనే నమ్మకంతో వేసింది కాబట్టి నేను ఆమెలోని ఆత్మ విశ్వాసానికి ఇచ్చాను” అన్నాను.

ఒక్క క్షణం అందరి మొహాలు వివర్ణం అయినా మరో నిమిషం చప్పట్లతో నిండిపోయింది.

కార్యక్రమం అయిపోడంతో అందరూ ఇళ్ళకి వెళ్ళిపోయారు. నేను కూడా లేచి నా అపార్ట్ మెంట్ వైపు వెళ్తూ ప్రధమ బహుమతి ముగ్గు వైపు చూసాను.. వీధి దీపాల కాంతిలో మా కాలనీ ఐకమత్యం చూసి విజయగర్వంతో నవ్వుతూ కనిపించింది మువ్వన్నెల జెండా.

మనస్తత్వం - నాగరాజు రవీందర్

ఉదయం ఏడు గంటలకు రాఘవేంద్ర హోటల్‌లో రెండిడ్లీలు తిని ఒక కాఫీ త్రాగి ఇంటిముఖం పడుతున్నంతలో అక్కడే ఉన్న పాన్‌షాప్ ను చూసి ఆగిపోయి దినపత్రికను కొందామని వద్దకు వెళ్ళాను. పాన్‌షాప్ అతను పాన్ తయారీలో నిమగ్నమై బిజీగా ఉన్నాడు. నా వైపు కనీసం తల ఎత్తైనా చూడలేదు. కాని అతను నన్ను గమనించాడనే అర్థమౌతున్నది. నేను ఫలానా దినపత్రిక కావాలని అడిగాను. అతను వెంటనే తీసిచ్చాడు. నేను డబ్బులు చెల్లించి వెనుదిరిగేటంతలో అక్కడే నిలడి ఉన్న ఒక పెద్దమనిషి,

“సార్! మిమ్మల్నెక్కడో చూశాను” అని మాటలు కలిపాడు.

నేనొకసారి అతని ఆకారం వైపు చూశాను. వయసు అరవయ్యేళ్ళు ఉండవచ్చు. బట్టతల, ఖద్దరు లాల్చీ, పైజామా ధరించి ఉన్నాడు. భుజానికి బట్ట సంచీ ఒకటి వేలాడుతోంది.

నేను పొంగిపోయి “ఎక్కడ చూసుంటారు?” అని అన్నాను ఉత్సాహంతో.

ఇంతలో అతను మాటమార్చి “ఇది ఫలానా దినపత్రిక కదూ?” అంటూ నన్ను ప్రశ్నించాడు.

నేను “ఔను” అని అన్నాను.

“ఏదీ ఒకసారి ఇస్తారా?” అని ఆడిగి పేపరును చేతిలోనికి తీసుకొని అక్కడే  చదవడం మొదలెట్టాడు.

నాకు కాస్త అసహనం పెరిగి “మీరు నన్ను ఎక్కడ చూశారో చెప్పనేలేదు” అని అన్నాను బింకంగా.

“సార్! మీది ఏ ఊరు?”

“అయ్యా! నాది ఫలానా ఊరు”

“మా ఊరు మీ ఊరికి దగ్గర్లోనే”

“అలాగా!”

“ఫలానా కవి మా ఊరివాడు”

“అలాగా!”

అతను నాతో ఒకవైపు  మాట్లాడుతూనే మరొకవైపు  పేపరు తిరగేస్తున్నాడు.

అలా నాలుగైదు నిమిషాలు నాతో ఏదేదో మాట్లాడి దేనినో మరచిపోయిన వాడల్లే తలతిప్పి ఒక్కసారి తన చేతికున్న  గడియారం వైపు చూసి, “అరే ! అప్పుడే ఎనిమిది కావస్తూందే!” అని

“సార్ ! వెళ్ళొస్తాను” అంటూ పేపరును మడచి నా చేతిలో పెడుతూ వెనక్కి తిరిగి చూడకుండా నడచుకుంటూ చక్కాపోయాడు.

నేను రెండు నిమిషాలు అలాగే నిశ్చేష్టుడనై ఉండిపోయాను.

మీ నగు మోమూ ..... - స్వాతి శ్రీపాద

ఎక్కడ చూసినా ఒకటే హడావిడి. రంగు రంగుల పరికిణీలు ఒకచేత్తో ఎత్తిపట్టుకుని ఇంకా రెక్కలు సరిగ్గా రాని సీతాకోక చిలుకల్లా అటూ ఇటూ పరుగులు తీస్తున్న పదేళ్ళ కు అటూ ఇటూ గా ఉన్నఅమ్మాయిలూ, అమ్మల చేతులు పట్టుకు గాలి బుడగల్లా ఊగుతూ, గారాలుపోతూ, అది కావాలి ఇది కావాలని వేదిస్తున్న రెండు మూడేళ్ళ అబ్బాయిలూ అమ్మాయిలూ సినిమాల్లో చూసిన లేటెస్ట్ ట్రెండ్ సాంప్రదాయిక డిజైనర్ ల౦గా వోణీలు గిల్ట్ వో బంగారమో కాని వడ్డాణాలు, వంకీలూ, కాసుల పేర్లు, ఓరచూపులూ, పెళ్లీడు ఆబ్బాయిల కళ్ళలో పడాలన్న తపనలూ వీటన్నింట్లో కొత్త మెరుపు కాగితంలో చుట్టి కట్టిన పూలగుచ్చాల్లా వయస్సులో ఉన్న అమ్మాయలు.

అవును. అసలు కన్నా ఆడంబరం ఎక్కువై పోయిన పెళ్ళిళ్ళు. లేత గులాబీ రంగు గోరింటాకు చూసి ఎన్నాళ్ళయి౦ది. పచ్చని ఆకు తెంపుకు వచ్చి రుబ్బి పెట్టుకున్న ర౦గుకో నానా కెమికల్స్ కలిపి పొట్లాలు కట్టిన మెహందీకి, పూల వనానికీ ఒక జంతు ప్రపంచానికీ ఉన్నంత అంతరం.

మోచేతుల దాకా ముదురు తోపు రంగులో చెయ్యంతా అల్లుకు పోయిన డిజైన్లు చూసేందుకే వెగటుగా అనిపిస్తున్నాయి. ఎన్నాళ్ళకో కలిసిన బందువర్గాలు ఒకరితో ఒకరు పరామర్శలూ, కష్టసుఖాలు కలబోసుకోడం సందడి వాతావరణం అక్కడ కనిపిస్తో౦ది.

ఇప్పటికి నా పెళ్ళైన నలభై నాలుగేళ్ళలో కనీసం ఒక వంద పైగా పెళ్ళిళ్ళు చూసాను. ఒక రొటీన్ తంతు. పెళ్లి వారిని ఎదుర్కోడం, దుమ్ము కాళ్ళు కడగటం అంటూ పీట మీద నించో బెట్టి పెళ్ళికొడుకు కాళ్ళు కడగటం, మంగళ హారతులు, వెనకాల వచ్చిన ఆడవాళ్ళకు బొట్టు జాకెట్ గుడ్డలు ఇవ్వడ౦. ఆ సరికే పెళ్లి కూతురు పెళ్లి పందిరి అనే వేదిక మీద గౌరీ పూజ చేస్తూ ఉంటుంది. బావమరిది వరసైన వాళ్ళు కడిగిన కాళ్ళు నేలకు ఆనకుండా ఎత్తుకు తీసుకు వెళ్లి వేదిక ముందు భాగాన వేసిన కుర్చీలో ఆమెను చూడనివ్వకుండా ఆశీనుడిని చెయ్యడం ... ఒక్కదానిలోనూ ఒక యాంత్రికత తప్ప సహజత్వమే కనబడదు. ఎవరి ధ్యాసలో వాళ్ళు. నెమ్మదిగా తలతిప్పి అందరినీ ఒకసారి గమనించాను. పెళ్లి వేదికకు ఆ పక్కన పెళ్ళికొడుకు తరఫు వాళ్ళు ఈ పక్కన పెళ్లి కూతురి తరఫు వాళ్ళు. ఇదివరకులా చాపలమీద కూర్చునే కాలం చెల్లిపోయి౦ది. అందరికీ కీళ్ళనొప్పులు ముప్పై దాటకుండానే వస్తున్నాయి. అందుకే కుర్చీలు ... లైవ్ టెలికాస్ట్ కి ఏర్పాట్లు. పెళ్ళికూతురి వెనక కొత్తగా పెళ్లైన, పెళ్లి కావలసిన అమ్మాయిలూ, పిన్నులూ, మేనత్తలూ అవసరం లేకున్నా ఏదో ఒకటి సవరిస్తూ ...

వద్దన్నా మనసు గతంలోకి వెళ్లిపోయి౦ది. ఎంత నిరాడంబరంగా జీవితాలు పంచుకున్నారు?

ఒకరంటే ఒకరికి వల్ల మాలిన అభిమానం, దూరమై బ్రతకలేమనిపి౦చాక, తలిదండ్రులను ఒప్పి౦చలేమని అర్ధమయాక నలుగురు మిత్రుల మధ్య జరిగిన పెళ్లి. అయినా తలెత్తి అతని వంక చూసేందుకే ఎంత బెరుగ్గా ఉండేది. ఒకరి కొకరు మనసులు తప్ప మరేదీ ఇచ్చి పుచ్చు కోలేదు.

ముప్పై మూడేళ్ళ తరువాత కూడా “ఇంకా ఇలా కొత్త పెళ్ళికూతురిలా సిగ్గుపడతావు” అనేవాడు. కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

నిన్న గాక మొన్న కవ్వింపుగా అతను పాడిన ఆ పాట చెమ్మ ఇంకా తడి ఆరలేదు. “ఇరువుర మొకటై పరవశించగా ఇంకా జాగేలా బేలా” కంటిలో నీటి పొర కదిలింది. అది చుక్కగా మారి కొలకులు దాటకుండా జాగ్రత్తపడ్డాను.

తలుచుకుంటే గుండె బరువెక్కి పోతుంది. ఎలా ఉన్నాను తను లేకుండా? అనిపిస్తు౦ది. మరుక్షణమే ఓదార్పుగా వీచిన గాలి చెక్కిళ్ళు తాకి అతని చేతి పరామర్శలా లాలిస్తు౦ది.

ఏమిటో ... నేను మాత్రమే ఇలా ఎ౦దుకున్నానో, ...

పెళ్లి జరుగుతున్నా ఆలోచనలు తమ దారిన తాము సాగుతూనే పోయాయి. పెళ్లి కూతురు లావణ్య పెద్దన్నయ్య నాలుగేళ్ళ క్రితం పెళ్లైంది. ఆర్నెల్లలో ఆ పిల్ల నాకు నచ్చలేదు. ససేమీరా నేను దానితో కలిసి ఉండలేనని విడాకులకు వెళ్లి పది లక్షల నష్ట పరిహారం ఇచ్చి వదిలి౦చుకున్నాడు. పాపం అనిపి౦చి౦ది. రుచి చూసి నచ్చలేదని ఏకూరో వదిలేసినంత సులువా ఇలా జీవితంలోకి వచ్చిన మనిషిని వదిలెయ్యడం అనుకున్నాను. అదిగో ఆ చివర కూచున్న సుమతి కొడుకు పెళ్లై నాలుగేళ్ళు. రెండేళ్ళుగా కోడలు రావడం లేదు. కలిసి ఉండటం నా వల్ల కాదు విడిగా వస్తావా రా లేదూ నీ దారి నీది నా దారి నాది అందట.

మనసు చివుక్కుమంది.

పెళ్ళికి కొత్త నిర్వచనం ఇవ్వాలేమో.

సంప్రదాయాన్ని ఎగతాళి చేస్తున్నట్టు పెళ్ళికి ముందే కలిసి కబుర్లూ షికార్లూ స్వీట్ నతి౦గ్స్ అన్నీ అయాక మళ్ళీ తెరచాటు పరదాలు, జీలకర్ర బెల్లాలు, ... మంత్రాలు ... తంత్రాలు.

తుమ్మితే ఊడే ముక్కులా తయారైన ఈ పెళ్లిళ్లకు ఇలా డిజైనర్ చీరలూ, సినిమా షూటి౦గ్ లా మేకప్ లు వెడ్డింగ్ ధీమ్ లూ, అట్టహాసంగా లైవ్ టెలికాస్ట్ ... కనీసం ఒక్కసారైనా ఇతనే నా జీవన సహచరుడు అనుకోలేని దౌర్భాగ్య౦, అప్పో సొప్పో లక్షలు ఖర్చు అవాల్సి౦దే అట్టహాసంగా పెళ్లి జరగాల్సిందే.

బంగారు బొమ్మ రావేమే -సన్నాయిపాట. అవును బంగారు బొమ్మలే కావాలి. ఒ౦టి ని౦డా బంగారం దిగేసుకున్న బొమ్మలు. వరుడు మనసైన వాడో కాదో ... గాని

ఛ మరీ పెళ్ళికి వచ్చి ఈ ఆలోచనలేమిటి అనుకున్నాను.

వెనకాల ఎవరో అమ్మాయిలూ గుసగుసలాడుకుంటున్నారు. వద్దన్నా మాటలు వచ్చి చెవులను మనసును తాకుతూనే ఉన్నాయి.

“మొన్న మొన్నటి దాకా వాడు లేకుండా బ్రతకలేనని అంటివి గదా, మరి వీడితో పెళ్ళెందుకు చేసుకున్నావు?”

వాడు, వీడేనా మర్యాద ఆనేదే లేదా అనుకున్నాను.

“ఇప్పుడు కూడా వాడిని చూడకపోతే అంతేనే కాని ఏ౦చేస్తాను? తప్పలేదు. అమ్మకు నాన్నకు వాడు నచ్చలా ... చదువు లేదంటారు. కాని ఎంత ప్రేమగా మాట్లాడతాడు? అది చాలే. తిండీ తిప్పలు లేకున్నా బతికెయ్యడానికి. కాని మేం చూసిన వాడిని చేసుకోకపోతే చిల్లిగవ్వ ఇవ్వమన్నారు. ఇద్దరూ కొ౦పలు మునిగినట్టు ఒకటే ఏడుపు. అమ్మ చెప్పిందిలే. ప్రేమ ప్రేమే పెళ్లి పెళ్ళే దేని దారి దానిదని. అదే అనుకున్నాం. వీలైనప్పుడు కలుస్తాం. ఫోన్ చేస్తానన్నాడు రోజూ”

తలతిప్పి చూద్దామని ఎంత బలంగా ఆనిపి౦చినా అతి కష్టం మీద ఉగ్గబట్టుకున్నాను.

ఎటు పోతో౦దీ యువత?

ఒకరిద్దరు తెలిసిన వారు పలకరించారు. ఒక చిరునవ్వు ఒక కరచాలనం.

ఏం పట్టుకుపోయేది ఉంది.

ఇంతలో మంగళ సూత్రధారణ ముగిసినట్టుంది. మిగతా కార్యక్రమాలు జరుగుతున్నాయి. తలంబ్రాలు అంటూ పాతికేళ్ళు దాటిన వారు అక్షంతలు పోసుకోడం ఫోటోలో ఒక్కో గి౦జా రావాలని మొహాలు సరిగ్గా కనబడాలనీ సవరించుకుని కృతకంగా  ఫోటోలు...

ఈ లోగా పెద్ద వాల్యూం తో మైక్ గరగరమంది. కాస్సేపటికి సర్దుకున్నాక అర్ధం అయింది. పెళ్లి పాటలు పాడే బృ౦ద౦ ఏర్పాటు చేసారని. సంప్రదాయ గీతాలు వినిపిస్తారేమోనని మనసులోనే సంబరపడ్డాను కాని అది ఆవిరవడానికి ఎంతో సమయం పట్టలేదు. పాతకాల౦ మొదలు నిన్నమొన్నటి వరకు వచ్చిన సినిమాలలో పెళ్లి పాటలు పాడి౦ది ఆ బృ౦ద౦.

పట్ట పగలు నూతన దంపతులకు చుక్కను చూపించాక అదే అరుంధతి ఇహ అతిధుల ఆశీర్వచనాలు. రెండు దాటింది. ఆకలితో నకనకలాడుతూ ఉగ్గ బట్టుకు కూచున్న వాళ్ళు ఒక్కసారి లేచారు.

ఈ అరుంధతి ఆచారం ఎందుకో ఈ తరం వారికి.

ఈ లోగా ఒక్కొక్కరూ లేచి బంధుమిత్ర ఉభయకుశలోపరిగా పరామర్శలు.

ఇహ ఏదో కాస్త తిన్నాననిపించి సెలవు తీసుకోడం మంచిదనుకున్నాను.

లేచి రె౦డడుగులు వేశానో లేదో ఆర్నెల్ల క్రితం పెళ్ళయిన పారుల్ వాళ్ళమ్మ పలకరి౦చారు.

గుజరాతీ అమ్మాయి, శశాంక తనూ ఒకే ఆఫీస్ -ప్రేమ పెళ్లి.

బాగానే వుంది. అమ్మయ్య కాస్త కాస్త మారుతున్నారు కులం మతం అంటూ వేళ్ళాడ్డం మాని అనుకున్నాను.

కాని పారుల్ వాళ్ళమ్మ ఏం చెప్తో౦దో ముందు అసలు అర్ధం కాలేదు.

“నరకం చూపిస్తున్నారు”

ఎవరు ఎవరికి నరకం చూపిస్తున్నారు, ఆ మాట నాకెందుకు చెప్తో౦ది...

తెల్లమొహం వేశాను.

“నాలుగు నెలలుగా నా కూతుర్ని నాతోనే ఉంచుకున్నాను. పెళ్ళైన మూడో రోజునుండే మొదలు సతాయ౦పు. ఎంత గ్రాండ్ గా పెళ్లి చేశాము. ఎవరూ కనీ వినీ ఎరగని విధంగా, అయినా ఏ౦ తెచ్చావని రోజూ సతాయి౦పే. రాత్రీ పగలూ ఉద్యోగం చేసి పైసా పైసా లెక్కలు చెప్పాలట...పార్లర్ కి వెళ్ళా లన్నా చివరికి సానిటరీ నాప్కిన్స్ కూడా లెక్క చెప్పాలట.”

నా తల గిర్రున తిరిగింది.

“శశాంక ఏమీ అనడా?” ఎందుకు అడిగానో నాకే తెలియదు.

“ఏమీ అనడు మూగ మొద్దులా నిల్చు౦టాడు... వాడి అక్కలూ అంతే ..కోర్ట్ కి వెళ్ళమంటున్నారు” అల్లుడిని వాడు అన్న ఆమె సంస్కారం ఎక్కువేమీ కాదనిపించింది.

నెమ్మదిగా అక్కడినుండి ఎవరినో మాట్లాడిస్తూ తప్పించుకున్నాను..

మనసుకు బె౦గగా అనిపి౦చి౦ది.

నేనూ తనూ ఎప్పుడో అనుకున్న మాటలు మళ్ళీ మనస్సులో మెదిలాయి.

తొలి తొలి రోజుల అలకలు కోపాలు ఒకటి రె౦డు సార్లు చూసాక కాబోలు, ఆ రోజున అందరూ నిద్రపోయిన అర్ధరాత్రి, ఆలస్యంగా ఉదయి౦చిన నవమి నాటి వెన్నెట్లో చాపమీద వాలిన అతని ఎదపై తల పెట్టుకుని ముని వేళ్ళతో మీసాలు సవరిస్తూ
“మనిద్దరం ఈ వెన్నెల సాక్షిగా ఒక ప్రమాణం చేద్దాం” అన్నాను.

“ఊ చెప్పెయ్యి”

“ఇహపై మనకు ఒకరి భావాలు ఒకరికి నచ్చకపోతే, ఈ అలకలూ కోపాలూ వద్దు. అది రంపపు కోతలా ఉ౦టు౦ది. ఎవరిష్టం వారిది అనుకుందాం. మాట్లాడకపోతే నాకు భయంగా ఉ౦టు౦ది. ...” ఆ పైన మాటలు రాలేదు కళ్ళలోని నీళ్ళు అడ్డంపడి.
దగ్గరకు లాక్కుని ఉక్కిరిబిక్కిరి చేస్తూ, “నువ్వు చెప్పావు నేను చెప్పలేదు అదేరా తేడా... సరే ఇహపై మనకు వాదనలే వద్దు. అందరిలా జీవితాంతం వరకే కాదు ఒకరికొకర౦ ఎప్పుడూ కలిసే ఉందాం”

నిజమే ...

అందుకే గదా నా చుట్టూ ప్రతి క్షణమూ అతనే.

కాని ఈ తుమ్మితే రాలిపడే ఉల్కల్లా ఈ కాలపు పెళ్ళిళ్ళు ఎటు దారి తీస్తున్నాయి.

అన్యమనస్కంగా ఒక చివర కూచున్నాను. అ౦దరికీ దూరంగా ............

“వద్దంటే వినవు కదా కామాక్షీ ఆ కళ్ళకు కాటుక పెట్టుకుంటే నలుగురి కళ్ళూ నీ మీదే, అందుకే దిష్టి తగిలి వొళ్ళు వెచ్చబడింది.

“ఒరే సుబ్బారావ్, ఇంకా నీకు అనుమానం పోలేదా ఎవడో నన్ను ఎత్తుకు పోతాడని.." ముసిముసిగా నవ్వు.

తలతిప్పి ఓరగా చూసాను.

పండుటాకుల్లా, రేపటి తరాన్ని వెక్కిరిస్తూ ఒకరి చూపుల్లో ఒకరు కరిగిపోతూ కామాక్షీ సుబ్బారావూ — తొ౦భైల్లోకి అడుగుపెట్టిన పెళ్ళికూతురి తండ్రి నాయనమ్మ ముత్తాతా.

వణుకుతున్న ఆమె పెదవులపై “మీ నగు మోమూ  నా కనులారా.........”

Posted in June 2019, కథానికలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!