గడియారం
మన జీవితంలో అతి ముఖ్యమైన అంశం కాలము. మరి ఆ కాలాన్ని వృధా చేయకుండా చక్కగా వినియోగించుకొని జీవన సోపానాలను నిర్మించుకొని మంచి జీవితాన్ని అనుభవించాలని మనలో ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ముఖ్యంగా ‘సమయ పాలన’ చక్కగా ఉండాలని అందరూ అంటుంటారు. అయితే అందుకు ఒక కొలమానం కావాలి. అదే మనకు ‘సమయం’ అనే పదాన్ని నిర్వచిస్తూ రూపొందించిన ఒక పరికరం దానినే మనం ‘గడియారం’ అంటాం.
మరి ఈ గడియారం ఎప్పుడు కనుగొనబడింది? దాని పుట్టు పూర్వోత్తరాలు ఏంటి? అన్న ఒక చిరు ఆలోచనే నన్ను ఈనాటి ‘టూకీగా’ లో గడియారం అంశాన్ని తీసుకునేట్లు చేసింది.
పూర్వకాలంలో సమయాన్ని సూర్యుని గమనం ఆధారంగా నిర్వచించేవారు. నీడ గడియారం, నీటి గడియారం అనేవి ఆనాడు ప్రాచుర్యంలో ఉండేవి. సూర్య కాంతి లభించని సమయాలలో కాలాన్ని నిర్ణయించడానికి ఇసుక గడియారం లేక కొవ్వొత్తి గడియారాన్ని కనుగొన్నారు. 13 శతాబ్దంలో యాంత్రిక గడియారాలను కనుగొనిన తరువాత ఎన్నో మార్పులు చేర్పులు జరిగి నేడు అత్యంత ఆధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో మనమున్న ప్రదేశం లోనే కాదు విశ్వంలో ఏ ప్రదేశంలో అయినా కాలాన్ని సెకన్ల తో సహా ఖచ్చితముగా చెప్పగలుగుతున్నాము.
గడియారంలో ముల్లులు ఎడమవైపు నుండి కుడివైపుకు తిరుగుతాయి. దానినే మనం ‘క్లాక్ వైజ్ డైరెక్షన్’ అని అంటాము (ప్రస్తుతం మనం వాడుతున్న డిజిటల్ క్లాక్స్ గురించి కాదు నేను మాట్లాడేది. మన ఇంటిలో ఇంకా గోడకు బిగించి టిక్ టిక్ మని అంటున్న ముల్లులు ఉన్న గడియారం గురించి మాట్లాడుతున్నది). మరి అట్లా ఎందుకు ఎడమవైపు నుండి కుడివైపుకు తిరుగుతాయి అంటే అందుకు ఒక సాంకేతిక సూత్రం ఉంది. భూమి ఉత్తరార్థ గోళంలో కుడి నుంచి ఎడమకు తిరుగుతూ ఉంటుంది. దానర్థం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు సూర్య రశ్మి ఎడమనుంచి కుడికి మారుతూ ఉంటుంది. పూర్వకాలంలో కాలాన్ని సూర్యుని గమనం ఆధారంగా నిర్ధారించేవారు కనుక సూర్యకాంతి వల్ల ఎడమనుంచి కుడికి ఏర్పడే నీడ ఆధారంగా సమయాన్ని లెక్కించేవారు. ఆ నీడ గడియారం ఆధారంగానే తరువాత కనుక్కొన్న గడియారాలన్నింటిలోనీ ముల్లులను ఎడమనుంచి కుడికి తిరిగేటట్లు నిర్మించారు. దానినే మనం నేడు క్లాక్ వైజ్ (సవ్య), యాంటి క్లాక్ వైజ్ అపసవ్య దిశలు అని చెప్పుకొంటున్నాం. మరి ఉత్తరార్థ గోళం కాకుండా దక్షిణార్థ గోళం యొక్క గమనాన్ని పరిగణలోకి తీసుకొంటే అనే సందేశం రావచ్చు. అప్పుడు ముల్లులు కుడి నుంచి ఎడమ వైపుకు తిరుగుతాయి. కాని భూమి ఉత్తర ధృవం ఆధారంగా 23 డిగ్రీలు వంగి ఉంది. కనుక దానినే మనం పరిగణిస్తాము.