నా చిన్నతనంలో అమ్మని చూసి ఆశ్చర్యపోయాను.
నీ సృష్టిని, అమ్మపై నీకున్న రసదృష్టిని,
అమ్మ పాత్రకు నువ్వు ఇచ్చిన ప్రాధాన్యతని తెలిసి
నీ తెలివికి తెల్లబోయాను,
అమ్మ పాత్రపై నీకున్న ప్రేమకు పొంగిపోయాను.
అప్పుడు అమ్మ ఒడే ఒక గుడిగా,
అమ్మపాలా అవి అమృతం అన్నట్టుగా,
అమ్మ కౌగిలి – ఒక అద్వితీయ ఆనందపు లోగిలిలా,
అమ్మ ప్రేమ – వెలకట్టలేని సిరిలా,
తెలివిలో అమ్మనే పిలుస్తూ, నిదురలో అమ్మనే తలుస్తూ,
అమ్మేసర్వంగా, అమ్మఒడిలో గర్వంగా,
అమ్మే ఒక ధ్యానంగా, అమ్మే ప్రాణంగా,
అమ్మతప్ప మరేమీ అక్కర్లేనంతగా, తెలియక్కర్లేనంతగా,
భావించి జీవించేలా నీచే తీర్చిదిద్దబడిన,
మా స్వభావాలను చూసి నీ కరుణకు ఆశ్చర్యపోయాను.
పెరిగి పెద్దయ్యాక ఇప్పుడు దీనమైన అమ్మ పరిస్థితులను,
హీనమైన అమ్మస్థితి గతులను చూశాక,
నీహృదయ కాఠిన్యానికి అవాక్కయ్యాను.
పెడుతున్న తిండి సహించక, తిడుతున్న తిట్లు భరించలేక,
ఇష్టం లేని చోట ఇమడలేక, కష్టాలు పెడుతున్నా పారిపోలేక,
ఆ జీవితం నుండి జరిగిపోలేక, మృత్యుఒడిలోకి ఒరిగిపోలేక,
బాధలలో బందీ అయిన అమ్మ బ్రతుకును చూసి,
ఆమెపై నీకున్న అలక్ష్యం అర్ధమయ్యాక
నిన్ను అసహ్యించుకుంటున్నాను.
అమ్మపాత్రను ఇప్పుడెందుకింత చులకన చేసావని,
వింతవేదనకు అమ్మనిలా ఎందుకు బలిచేశావని.
ఆక్రోశంతో కూడిన ఆవేశంతో నిన్నిపుడు నిలదీస్తున్నాను
నీ సృష్టిని, అమ్మపై నీకున్న నీరసదృష్టిని,
అమ్మ పాత్రకు నువ్విచ్చిన పరితాపాన్నితలచి
తీవ్రవ్యధకు లోనౌతున్నాను.
అమ్మ పాత్రపై నీకున్న నిర్లక్ష్యాన్ని చూసి నివ్వెరపోతున్నాను.
అప్పుడు ఆకాశమంతవిశాలమైన వ్యక్తిత్వంతో
అందరినీ ఆదరిస్తూ, ఆనందాన్ని పంచుతూ అమ్మ!
ఇప్పుడు అధఃపాతాళపు లోతుల్లో
ఎవరు చేరదీయక, ఆలంబన లేక ఆవేదనతో ఒంటరిగా అమ్మ!
అప్పుడెందుకు అమ్మ విషయంలో నీకంత ప్రాధాన్యత?
మరి ఇప్పుడెందుకు అదే అమ్మ జీవితంపై నీకింత కాఠిన్యత?
ఒక ప్రాణి మనోవేదన తల్లిపై …మారుతున్న కాల స్థితి గతి లో … బాగుంది ..