దోసెడు నవ్వులు
నా బుజ్జి బాబూ
నువ్వు దోసెడు నవ్వులు పోసి
నా కళ్ళ వాకిళ్ళ ముందు
ఆనందాన్ని కళ్ళాపు చల్లుతున్నావ్.
విరిసే మబ్బుల మధ్య చందమామని
నీ తనువు పై గంధం లా మెరిపిస్తున్నావ్.
నిన్నలా చూస్తే చాలు
కొన్ని పువ్వులు కొన్ని నవ్వులు
అలా ఎగురుతూ నా పై వాలతాయ్.
నీ చిట్టి మాటల జల్లుల వెంట
తడవని మనసుంటుందా ..!
నీ ఆటల పందిరి లో
వస్తువు నయ్యాక సమయమే తెలియరాలేదు .
ఆ చిరు నవ్వుల అంచున
కొన్ని సంక్లిష్ట సమయాల నుంచీ
అలా తెలియకుండానే బయట పడతాం .
నీకు కథలు చెప్పటానికి
రాత్రిళ్ళు నిద్రబోవు.
కథల వెంట నీ ముద్దు ముద్దు తీర్పుల వెంట
మురిసిపోతాం.
ఇంకేం చేస్తాం
కాలాన్ని ఆరబోసి
నీ చుట్టూ మునిగి పోతాం.
ఇంకేం చేస్తాం
తరిగిన కాలాన్ని
నీ జ్ఞాపకాల నవ్వులు గా పదిల పరచుకుంటాం.
నీ ఈ దోసెడు నవ్వులు ఈ దోసెడు ఆశలు
నా దోసిట్లో ఒంపుకుని
ఒక తన్మయ గీతం లా మిగిలి పోతాం.