నీతో పెదవి కదిపినప్పుడల్లా
నాలోకి నేను తొంగిచూసుకున్నట్లు అనుభూతిస్తాను.
నీ పేరు తలుచుకున్నప్పుడల్లా
నన్ను నేను మరిచిపోయి
ముప్పిరి గొన్న ఆనందంతో మురిసిపోతాను.
నా మదిలో నీ జ్ఞాపకం చొరబడినప్పుడు
పందిరిని ఆలంబన చేసుకొని పైకి పాకిన తీగలా
పచ్చదనంతో ప్రతినిత్యం మెరిసిపోతాను.
నీ పలకరింపు కురిసిన కారు మేఘమై
నేలతల్లిని నిలువెల్లా తడిపి
మోడుబారబోతున్న మొక్కకు ప్రాణం పోసినట్లు
మళ్ళీ చివుళ్ళ జీవాన్ని సంతరింపజేస్తుంది.
నీ స్మృతులు గుర్తుకు వచ్చినప్పుడల్లా
వసంతాగమనంలో ఒళ్ళంతా పచ్చదనాన్ని పరుచుకున్న చెట్టులా
నీ మధురస్మృతుల పూలు నాలోని ప్రతి కొమ్మను అలంకరిస్తాయి.
నీతో పంచుకున్న అనుభూతులన్నీ
నా దేహం చెట్టుపై కొమ్మల్లో వాలిన కోయిలగా కుహూ కుహూ రాగాలను ఆలపిస్తుంది.
నీ స్మృతుల పలవరింతల్లో తెలియాడుతుంటానా
అప్పుడప్పుడు నీ మౌనం నన్ను ఏదో నైరాశ్యంతో చుట్టు ముట్టి
నువ్వు నాకు దూరమౌవుతావేమోననే దిగులు మేఘాన్ని గుర్తుచేసి
నన్ను నిలువెల్లా కంపింపజేసి కలవరపెడుతుంది.
మంచి కవిత మేడం.. థాంక్ యు..
ప్రేమికుల ప్రేమకు అద్దం పట్టేట్టు ఉంది