Menu Close
దూరం (ధారావాహిక)

అత్తలూరి విజయలక్ష్మి

అత్తలూరి విజయలక్ష్మి

గతసంచిక తరువాయి »

స్మరణ హై టెక్ సిటీలోని ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ లో ఇంటర్వ్యూ కి వెళ్ళింది. ఆమెతో పాటు మరో నలుగురు కాండిడేట్స్ ఉన్నారు. అందరూ నీటుగా డ్రెస్ చేసుకుని, ఒడిలో చక్కటి ఫోల్డర్స్ పట్టుకుని సైలెంట్ గా కూర్చున్నారు.

మార్బల్ ఫ్లోరింగ్ తళ, తళా మెరుస్తోంది. కనిపించీ, కనిపించకుండా లేత నీలం రంగు గీతలున్నాయి మార్బల్ మీద. గోడలు ముట్టుకుంటే మాసిపోతాయి అనిపిస్తోంది. గ్లాస్ డోర్ మనిషిని చూడగానే పక్కకి జరిగి ఆహ్వానం పలుకుతోంది. ఎల్ షేపులో వేసి ఉన్న ఖరీదైన కుర్చీలు. విశాలంగా ఉన్న హాల్లో కొంచెం దూరంలో అధునాతనమైన ఫర్నిచర్ తో రిసెప్షన్,.. ఎల్ షేపులో ఉన్న టేబుల్.. దాని మీద కంప్యూటర్, రెండు ఫోన్స్... కంపెనీ చిన్నదైనా, పెద్దదైనా అక్కడ అడుగుపెట్టిన వారినందరినీ ఆకర్షించడం కోసం కార్పొరేట్ ఆఫీస్ లు చేసే గిమ్మిక్కులులో ఒకటి యాంబియన్స్ అందంగా తీర్చిదిద్డడం. ఫర్నిచర్, ఫ్లోరింగ్, గ్లాస్ డోర్స్..ఇత్తడి కుండీల్లో రకరకాల ఇండోర్ ప్లాంట్స్...మంద్రంగా నాసికాపుటాలను తాకే రూమ్ స్ప్రే.. అన్నిటికీ మించి మంచినీళ్ళ ప్రాయంగా ఇంగ్లిష్ మాట్లాడే స్టాఫ్. వీటికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. కార్పోరేట్ ఆఫీస్ లో పని చేసే వాళ్లకి విషయ పరిజ్ఞానం కన్నా ధారాళంగా ఇంగ్లిష్ మాట్లాడగలిగితే చాలు. దాన్నే వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. కొంచెం కంప్యూటర్ పరిజ్ఞానం, ఇంగ్లీష్ మాట్లాడగల సామర్థ్యం, అధునాతనమైన ఆహార్యం సాఫ్ట్ వేర్ ఇంజనీరు అనే ట్యాగ్ ఉంటే చాలు.. ప్రారంభంలోనే  వేలకి వేలు జీతాలు డిమాండ్ చేస్తారు. ప్రస్తుత సమాజంలో సాఫ్ట్వేర్ ఇంజనీరు కి ఉన్న డిమాండ్ వేరే ఏ వృత్తుల వారికీ లేదు.. జీవితాలు కూడా వారు అనుభవిస్తున్నట్టు మరెవరూ అనుభవించరేమో!

స్మరణ పరిసరాలను పరికించింది. ఆమెకి కుడిపక్క ఒక యువతి కూర్చుని ఉంది. ఆమె పూర్తిగా, అదునాతంగా ఉంది. మోకాళ్ళ వరకూ ఫ్రాక్ వేసుకుంది. లూజుగా వదిలేసిన కురులు, ఎర్రటి లిప్ స్టిక్, వాక్సింగ్ చేసిన కాళ్ళు, చేతులు నున్నగా మెరుస్తున్నాయి. పెన్ షూ.. చేతివేళ్ళకీ, పాదాల వేళ్ళకి నెయిల్ పోలిష్.. కార్పొరేట్ కంపెనీ కి తగినట్టుగా ఉంది. మరోపక్క ఒక కుర్రాడు.. తెల్లగా, సన్నగా ఉన్నాడు. తెల్లటి షర్టు, లేత నీలం రంగు పాంట్. ఒక పక్క నుంచి చూస్తె అమీర్ ఖాన్ లాగా, మరో పక్క నుంచి చూస్తే తెలుగు హీరో నానీలాగా ఉన్న ఆ కుర్రాడు తెలుగువాడో, నార్త్ ఇండియనో అర్థం కాలేదు స్మరణకి. అటూ, ఇటూ పరికించి చూస్తూ ఎవరితో నైనా చూపులు కలవగానే హలో అంటూ ఓ చిరునవ్వు పారేస్తున్నాడు. స్మరణ చూపులు కలవకుండా అతి జాగ్రత్తగా కూర్చుంది.

కొంచెం సేపట్లో ఇంటర్వ్యూ మొదలైంది. స్పీకర్ లో “మిస్ ఆన్యా” అని వినిపించగానే స్మరణ పక్కనున్న అమ్మాయి గబుక్కున లేచి లోపలికి వెళ్ళింది. ఇప్పుడు అక్కడ స్మరణ, నానీఖాన్ కాక మరో ఇద్దరు కుర్రాళ్ళున్నారు.

“ఎక్స్ క్యూజ్ మీ” నానీ ఖాన్ స్వరం వినిపించి అతని వైపు చూసింది స్మరణ.

“మీకేమన్నా ఐడియా ఉందా ఎలాంటి ప్రశ్నలు వేస్తారు? కళ్ళు కొంచెం చికిలించి ఇంగ్లీష్ లో అడిగాడు. తెలియదు అన్నట్టు భుజాలెగరేసింది వీడు నానీ “ఖాన్” కాదు ఒత్తి నానీ అనుకుంటూ.

“ఇంతకు ముందు మీరేదన్న ఇంటర్వ్యూ అటెండ్ అయారా”.

వెళ్లానని చెప్పాలా, వెళ్లలేదని చెప్పాలా అని ఆలోచిస్తున్నట్టు చూసి అంది “వెళ్లాను.”

“ఓ ... ఎలాంటి క్వశ్చన్స్ వేస్తారు” కుతూహలంగా అడిగాడు.

“మీరిదే మొదటిసారా ఇంటర్వ్యూ అటెండ్ అవడం?”

“అవునండి రీసెంట్ గా బి.టెక్ కంప్లీట్ చేసాను. ఐ.బి.ఎం వాళ్ళు కాంపస్ ఇంటర్వ్యూ చేసారు.. నేను సెలెక్ట్ అవలేదు..మీరు?” కుతూహలంగా అడిగాడు.

“నేను ఆల్రెడీ వర్కింగ్..”

“ఐసీ.... మరి ఇక్కడికెందుకు వచ్చారు?”

“హైక్ ఇన్ శాలరీ, ఎక్స్ట్రా ఇన్ సెంటివ్స్ ... బెటర్ ఫ్యూచర్..”

“ ఓ....” ఇప్పుడెంత ఇస్తున్నారు అడగాలనుకుని స్మరణ సేరియస్ మొహం చూసి అడగలేకపోయాడు. కొంచెం నిరాశగా అన్నాడు “నాకు కమ్యూనికేషన్ స్కిల్ లేదండి..”

ఈ లోపల ఆన్య హై హీల్స్ టక, టకలాడిస్తూ వచ్చింది. “మిస్ స్మరణా!” అని వినిపించగానే స్మరణ ఫోల్డర్ జాగ్రత్తగా పట్టుకుని లేచింది.

“ఆల్ ద బెస్ట్ అండి” అన్నాడు నానీ.

“థాంక్ యూ” నవ్వి గ్లాస్ డోర్ వైపు నడిచింది. ఇద్దరో, ముగ్గురో ఉంటారు అనుకుంది లోపల. హెచ్ ఆర్ మేనేజర్ ఒక్కడే కూర్చున్నాడు. ఛాంబర్ లో అడుగుపెట్టగానే మంచి రూమ్ స్ప్రే పరిమళం ఆమెని చుట్టుముట్టింది. గోడలు, ఎసి తెల్లగా, ఎలాంటి మరక లేకుండా తళ, తళ మెరిసిపోతున్నాయి. అతని రూపం ఎదురుగా ఉన్న గ్లాస్ టేబుల్ మీద ప్రతిఫలిస్తోంది. టేబుల్ మీద  “సౌరభ్... మేనేజర్,  హెచ్ ఆర్ “ అన్న నేమ్ ప్లేట్ ఉంది.

“గుడ్ మార్నింగ్ మిస్టర్ సౌరభ్” చిరునవ్వుతో విష్ చేసింది స్మరణ.

“గుడ్ మార్నింగ్ స్మరణా! ప్లీజ్ బె సీటేడ్” తనూ చిరునవ్వుతో ఆహ్వానించాడు.

తన చేతిలో ఫోల్డర్ టేబుల్ మీద పెట్టింది. ఫోల్డర్ తెరిచి చూస్తూ ఆమె పేరు పైకి చదువుతూ “స్మరణ! అంటే మెమరీ అని కదా అర్థం” అన్నాడు.

“అవును” అన్నట్టు తలాడించింది

“గుడ్ నేమ్ .... బాగుంది” అన్నాడు.

“థాంక్ యూ ....” నవ్వింది.

“యు ఆర్ ఆల్రెడీ వర్కింగ్...”

“ఎస్”

“ఎందుకు క్విట్ చేయాలనుకుంటున్నారు?”

“బెటర్ పే ... బెటర్ పెర్క్స్.. గుడ్ కెరియర్ ..”

“ఓ” అన్నట్టు కనుబొమలెగరేసి “హౌ మచ్ పే యూ ఆర్ ఎక్స్పెక్టింగ్?”

“ఇప్పుడు నేను తీసుకుంటున్న దానికన్నా బాగా బెటర్ పే..”

“అంటే ఎంత!” పూర్తి కాన్ఫిడెంట్ తో సమాధానాలు చెబుతున్న ఆమెవైపు ఆసక్తి గా చూసాడు.

“సిక్స్టీ కే ...”

నవ్వాడు.. “ఎప్పుడు జాయిన్ అవుతారు?”

విస్మయంగా చూసింది. మరో ప్రశ్న అడక్కుండా.. వావ్.. సో కంపెనీ పెద్దదే.. అనుకుంటూ నెమ్మదిగా అంది “అక్కడ వన్ మంత్ నోటీసు ఇవ్వాలి...”

“ఓకే....నో ప్రాబ్లెమ్ యు నీడ్ ఒన్ మంత్ టూ జాయిన్....దట్స్ గుడ్” ఫోల్డర్ ఆమె ముందుకు తోసాడు. “యు కెన్ గో ..... వి విల్ మెయిల్ యు ఆఫర్ లెటర్.”

గాల్లో తేలుతూ బయటికి వచ్చిన స్మరణ తన వైపు టెన్షన్ గా చూస్తున్న నానీని చూసి చిరునవ్వు నవ్వింది.

“మిస్టర్ బదరి!” అసిస్టెంట్ వచ్చి పిలవడంతో లేచిన నానీని చూస్తూ...ఓహో నీ పేరు బదరీ అనుకుంది.

అతను లోపల నుంచి వచ్చిందాకా అక్కడే కూర్చుంది. సరిగ్గా పది నిమిషాల్లో సూర్యకాంతి పూవులాంటి మొహంతో వచ్చాడు. “నేను సెలెక్ట్ అయానండి... ఆఫర్ లెటర్ పంపిస్తామన్నారు ... ఒక్కడే ఉన్నాడండి ... నేనింకా నలుగురు బోర్డు మెంబెర్స్ ఉంటారు అనుకున్నా. అసలు ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రశ్నే వేయలేదు.. పేరు, నా క్వాలిఫీకేషన్ మాత్రం చూసి, ఎక్కడన్నా వర్క్ చేస్తున్నారా అని అడిగాడు.. లేదన్నాను. ఎప్పుడు జాయిన్ అవుతారు అన్నాడు..” సంతోషంతో గబా,గబా చెబుతున్న బదరిని మధ్యలో ఆపుతూ “రండి బయటకు వెళ్లి మాట్లాడుకుందాం“ అంది ఎంట్రన్స్ వైపు నడుస్తూ.. ఆమెని అనుసరించాడు. ఇద్దరూ కాంటీన్ కి వెళ్ళారు.

“కాఫీ తాగుదామా.... జ్యూస్ తాగుదామా” అడిగింది.

“నేను కాఫీ తాగనండి” అన్న అతని మొహంలోకి ఆశ్చర్యంగా చూసింది.

“మావాడికి కాఫీ, టీ అలవాటు లేదండి... పొద్దున్నే ఇంత చద్దన్నం తింటాడు” నిర్మలమ్మ డైలాగ్ గుర్తొచ్చి నవ్వుకుంటూ తనే వెళ్లి ఆరెంజ్ జ్యుస్ తీసుకుని వచ్చింది.

“థాంక్సండి” అన్నాడు.

“సో మీరు ఎప్పుడు జాయిన్ అవుతున్నారు...”

“ఆఫర్ లెటర్ రాగానే మంచి రోజు చూసుకుని జాయిన్ అవుతాను.”

అతని మొహంలో, మాటల్లో కనిపిస్తున్న అమాయకత్వం చూస్తుంటే నవ్వొస్తోంది స్మరణకి.

మరో ఐదు నిమిషాలు బి.టెక్ లో వారి, వారి ప్లాట్ ఫార్మ్స్ గురించి మాట్లాడుకున్నాక “బై సి యూ” అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి తన బండి దగ్గరకు వెళ్ళిపోయింది. అతను కూడా తన బండి దగ్గరకు వెళ్ళిపోయాడు.

ఇంటికి వెళ్తూనే సంధ్యని వాటేసుకుని “నాకు మంచి ఉద్యోగం వచ్చిందోచ్” అంటూ గుండ్రంగా తిరిగింది స్మరణ.

“అయితే ఇంకేం వెంటనే పెళ్లికి ఒప్పుకో” అంది సంధ్య..

గబుక్కున ఆవిడని వదిలేసి, సోఫాలో కూర్చుని టి వి చూస్తున్న దీపక్ దగ్గరకు వెళ్లి అతని చేతిలో రిమోట్ తీసుకుని టి.వి ఆఫ్ చేసి, దీపక్ మొహంలోకి చూస్తూ సీరియస్ గా అంది.

“డాడీ ఈవిడని తవ్వకాల్లోంచి తీసుకొచ్చావా!” ఆ మాటకి అడిగిన తీరుకి ఫక్కున నవ్వాడు దీపక్.

సంధ్య గబ, గబా వచ్చి స్మరణ నెత్తిన ఒకటి మొట్టి...”ఏడిశావ్ లే... నువ్వు పెద్ద చంద్రమండలం లో పుట్టావు..” అంది.

ఆవిడ చేయి పట్టుకుని తండ్రికి, తనకి మధ్యలో కూర్చోబెట్టి “చంద్రమండంలో పుట్టనక్కరలేదు సంధ్యా!  రాజమండ్రిలో పుట్టినా మారుతున్న కాలానికి తగినట్టు మన ఆలోచనలు మారాలి.. ఈ ఎలక్ట్రానిక్ యుగంలో చక్కగా మసి లేకుండా ఇండక్షన్ స్టవ్ మీద వంట చేసుకోండి అని మోడరన్ ఎక్విప్మెంట్స్ కనిపెట్టి ఇస్తోంటే, నేనింకా కట్టెల పొయ్యి మీదే వంట చేస్తాను అంటే దాన్ని ఏమంటారు? “

స్మరణ మాటలకి వత్తాసు పలుకుతూ “ఎస్ కరెక్ట్” అన్నాడు దీపక్.

“కూసే గాడిద వచ్చి.... మేసే గాడిదని చెడగొట్టిందట.. మీ తండ్రి కూతుళ్ళకి మెదళ్ళు చిలుం పట్టాయి.. వస్తున్నారుగా మావయ్యగారు ... చింతపండు పామి తోముతారు.. అప్పుడు తెలుస్తుంది” కసిగా అంది సంధ్య.

“ఓ తాతయ్య వస్తున్నారా... ఎప్పుడు?” హుషారుగా అడిగింది స్మరణ.

“శనివారం వస్తున్నారు. ఈ సారి నీ పెళ్లి చేసి కాని తిరిగి రాజమండ్రి వెళ్ళరు గుర్తుంచుకో.”

స్మరణ తల్లి మాటలు వినిపించుకోలేదు.. గబుక్కున లేచి తన గదిలోకి వెళ్తూ,, “ఆకలేస్తోంది మాగీ చేయి” అని చెప్పింది.

“చూసారా! దాని ఆర్డర్ ....” ఫిర్యాదుగా అంటూ వంట గదివైపు వెళ్ళింది సంధ్య.

ఆ తల్లి, కూతుళ్ళ గిల్లికజ్జాలకి మురిపెంగా నవ్వుకున్నాడు దీపక్.

స్మరణకి తాతగారు వస్తున్నారు అన్న వార్త బోలెడంత సంతోషం కలిగించింది. తాతయ్య.. ఆమెకో మంచి ఫ్రెండ్. చిన్నప్పటి నుంచీ ఆయన గారాబం, ఆయన వాత్సల్యం చవిచూస్తూనే పెరిగింది. రాజమండ్రి వెళ్ళినప్పుడల్లా ఇద్దరూ గోదారి గట్టుమీద కూర్చుని ఎన్నో విషయాలు మాట్లాడుకునే వాళ్ళు. ఆయన తన చిన్ననాటి కబుర్లు చెబుతుంటే కుతూహలంగా వింటూ, మధ్య, మధ్య తన అనుమానాలు, సందేహాలు వ్యక్తం చేస్తూ, అనేక విషయాలు తెలుసుకుంది. బ్రిటిష్ జనరల్, కాటన్ దొర గురించి ఆయన ఇటు ధవళేశ్వరం, అటు ప్రకాశం బ్యారేజ్, కే.సి కెనాల్ కోసం  చేసిన కృషి గురించి ఎన్నో విషయాలు చెప్పేవాడు ఆయన. కాటన్ మ్యుజియం చూపించాడు. రాజమహేంద్రవరం పేరు వెనక నేపధ్యం చెబుతూ “రాజరాజ నరేంద్రుడు తన మామగారైనచోళ రాజేంద్రుని గౌరవార్ధం రాజమహేంద్రవరం నిర్మించాడు.. అది ఆ రోజుల్లో పెద్దవాళ్ళకు ఇచ్చే గౌరవం. తరవాత అదే రాజమండ్రిగా మారింది. తిరిగి చంద్రబాబు హయాంలో రాజమహేంద్రవరం అని మార్చాడు అంటూ అనేక  విషయాలెన్నో ఒక పాఠంలా ఆసక్తికరంగా తాతగారు చెబుతుంటే అంతకన్నా ఆసక్తిగా వినేది స్మరణ.

ఆంజనేయ ప్రసాద్ తండ్రి అప్పట్లోనే పెద్ద సివిల్ లాయర్ గా పేరు గడించాడు. ఆయనకీ నలుగురు మగపిల్లలు.. వారిలో నాలుగోవాడు ఆంజనేయ ప్రసాద్. అన్నగారికి పిల్లలు లేరని  ఆంజనేయ ప్రసాద్ ని దత్తత ఇచ్చాడు. అందుకే ఆయన చదువు నర్సాపూర్ లో సాగింది. యర్రమిల్లి నారాయణమూర్తి కాలేజ్ లో చదువుకున్నాడు. “ఆ కాలేజ్ గురించి చెబుతూ మా కాలేజ్ కి చాలా చరిత్ర ఉంది స్మరణా! అదంతా తల్చుకుంటే ఇప్పటికీ నేను రోమాంచిత మవుతాను. నీకు ఎప్పుడన్నా నా కాలేజ్ చూపిస్తాను. ఎంత బాగుంటుందో తెలుసా నర్సాపూర్”  పరవశంగా చెప్పే తాతాగారి మొహం గుర్తొచ్చింది.

వస్తున్నారుగా... ఆయనకే చెప్పాలి తన మనసులో మాట.. ఆయన తప్పకుండా అర్థం చేసుకుంటారు. అమ్మకన్నా, నాన్న కన్నా తాతయ్యే చాలా ప్రోగ్రెసివ్.. తన కథ ఆయనకీ చెబితే అర్థం చేసుకోవడమే కాదు సహరిస్తారు కూడా. అవును తాతగారికే చెప్పాలి.

అలా నిర్ణయించుకున్నాక స్మరణ మనసు తేలికైంది. శనివారం... ఇంకా రెండు రోజులు..

స్మరణ డ్రెస్ మార్చుకుని, కాళ్ళు, మొహం కడుక్కుని గదిలో నుంచి బయటకి వచ్చేసరికి ఘుమ, ఘుమలాడుతూ మ్యాగి రెడీ గా ఉంది. వేడి, వేడిగా ఉన్న బౌల్ అందించింది సంధ్య. ఫోర్క్ తో తింటూ “మమ్మీ! రేపు మనం షాపింగ్ కి వెళదాం.. తాతయ్యకి బట్టలు కొందాం” అంది.

“చూసావా సంధ్యా! తను జాబ్ లో చేరి ఆర్నెల్లు అయింది.. ఒక్క జీతంతో కూడా నీకు, నాకు బట్టలు కొందా ! తాతయ్య వస్తున్నారు అని నువ్వు చెప్పగానే బయలుదేరింది షాపింగ్ అట... హు... నిన్ను కనిపెంచింది నేనే..తాతయ్య కాదు” స్మరణ నెత్తి మీద మొట్టికాయ వేశాడు దీపక్.

“కానీ, నిన్ను కనిపెంచింది తాతయ్య కదా! ఇంత మంచి నాన్నని నాకిచ్చినందుకు ఆయనే గ్రేట్ .. కాబట్టి నాకు ఆయనే ఎక్కువ”

సంధ్య, దీపక్ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. సంధ్య వస్తున్న నవ్వు పెదవుల మధ్య బిగపట్టి “ఇద్దరూ కాసేపు నోళ్ళు మూసుకుని తినండి...” అంది.

“డాడీ! మీ ఆవిడకి బొత్తిగా నువ్వంటే గౌరవం లేదు చూసావా! నోరు మూసుకోమంటున్నది.”

ఏదో అనబోతున్న దీపక్ మొబైల్ మోగడంతో చేతిలో ఉన్న బౌల్ టేబుల్ మీద పెట్టి, మొబైల్ తీసుకుని ఆన్సర్ బటన్ నొక్కాడు.

“నమస్కారమండి! దీపక్ గారా! నా పేరు ఆదినారాయణ, హై టెక్ సిటీ నుంచి మాట్లాడుతున్నాను. ఆంజనేయ ప్రసాద్ గారు ఈ నెంబర్ ఇచ్చారు..”

“నమస్కారమండి... అవును నాన్నగారు చెప్పారు..” మాట్లాడుతూ, కూర్చున్న దగ్గర నుంచి లేచి వీధి గుమ్మం తలుపు తీసుకుని గేటు దగ్గరకు వెళ్ళాడు దీపక్.

తండ్రి అలా వెళ్ళడంతో సంధ్య వైపు చూసి “ఏంటి మీ ఆయనకీ నీకు తెలియని సీక్రెట్స్ ఉన్నాయా! చూసుకో తల్లీ” అంది స్మరణ కొంటెగా.

సంధ్య సమాధానం చెప్పకుండా దీపక్ వైపు నడిచింది.

 

****సశేషం****

Posted in July 2021, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!