తమ స్వంత టెంపోని రోజువారీ పాసెంజర్ సర్వీస్ లోంచి తీసేసి సర్దార్, బాలాజీలు జగదీష్ సింగ్ గారితో పనిచేయడానికి చేరిన సరిగ్గా మూడు నెలలకి పంజాబీ ఢాభాలన్నింటికీ సరుకులు చేరవేసే కొత్తరకం టెంపో సర్వీస్ మొదలైంది ధన్ బాద్ లో. ఫలానా నెంబర్ కి ఫోన్ చెయండి, మీ సరుకులు మేము దింపుతాం, సిర్ఫ్ ఏక్ ఫోన్ కాల్, బస్.
గురుద్వారాలో అమ్మలక్కలు బ్రహ్మచారి కనబడితే ఊరుకోరు కనక మరో ఏడాదికి జీవితంలో సరిగ్గా కుదురుకున్న సర్దార్ ఆలస్యం అయినా పెళ్ళై స్థిర పడ్డాడు. తనకి తెల్సిన అమరీన్ కౌర్ అనే ఆవిడ బాలాజీకి జోడీగా నచ్చుతుందో లేదో సర్దార్ కనుక్కుంటున్నాడు అప్పుడప్పుడు. బాలాజీకి మొహమాటం, ఏం చేయాలో తెలియని పరిస్థితి. అది తేల్తే బాలాజీ కూడా దార్లో పడ్డట్టే.
బాలాజీ నాయుడుపేటనీ, అమ్మా, నాన్నల్నీ మర్చిపోయాడా అంటే చెప్పడం కష్టం. ఇన్నేళ్ళలో అనేకసార్లు మనసు పీకింది – అమ్మ ఎలా ఉందో చూడాలని. కానీ తండ్రి అంటే అసహ్యం, రోజూ కొట్టే తండ్రిని అడ్డుకోలేని తల్లి చేతకానితనం, వాళ్ళెలా పోతే నాకేం అనే ఆలోచనలు రాగానే దాన్ని మర్చిపోవడం.
*********
రంగారావుకి యాభై తొమ్మిదేళ్ళొచ్చాయి. ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉన్నా ఇంకా సైకిల్ షాపుని అంటిపెట్టుకునే ఉన్నాడు కానీ ఇప్పుడు జీవితం వేరు. మునపటిలాగా లేదు బిజినెస్. ఎవరో స్కూల్ కుర్రాడు వస్తే పేచ్ రిపైర్ చేయడం లాంటి చిన్న పనులు తప్ప పెద్దగా పని లేదు. రంగారావు వాళ్ళావిడ బాలాజీ ఇంట్లోంచి పారిపోయినందుకు రంగారావుని సాధించని రోజు లేదు. వాడే ఉంటే ఈ పాటికి ఎంత బాగా చదువుకుని పైకొచ్చి ఉండేవాడో అనడమో మరోటో. రంగారావుకి ఇప్పుడు నోరుమూసుకుని పెళ్ళాం ఏదిపెడితే అది తినడం ఒకటే వచ్చు. తాగడం తగ్గినా ఎప్పుడైనా ఇంట్లో డబ్బులు కనిపిస్తే ప్ర. సా. దు లో తగలేయడం చేస్తూనే ఉన్నాడు. భార్యని కొట్టడం మానుకున్నాడా అంటే అదీ లేదు. కొట్టినప్పుడు ఆవిడ తిరిగి కొడుతోంది కనక తగ్గించాడు వంటి మీద వాతలు గుర్తు పెట్టుకుని. ఆవిడ నాలుగిళ్ళలో పని చేస్తూ ఏదో జీవితం గడుపుతోంది.
బాలాజీ ఓ రోజు సర్దార్ తో చెప్పాడు ఇంటికెళ్ళి తల్లీ తండ్రీ ఎలా ఉన్నారో చూసి వస్తానని.
“నేను ఎప్పట్నుంచో చెప్దామనుకున్నాను కానీ నువ్వు వెళ్లనంటావేమో అని చెప్పలేదు. తప్పకుండా వెళ్ళి ఇద్దర్నీ తీసుకురా. ఇక్కడే ఉండొచ్చు.”
“నన్ను కొట్టి వాతలు పెట్టిన వాణ్ణా ఇక్కడకి తీసుకురావడం? అదెప్పటికీ జరగదు. తల్లిని చూడాలని ఉంది తప్ప ఆ దరిద్రుడు చచ్చినా నేను పట్టించుకోను.” దాదాపు అరుస్తూ చెప్పాడు బాలాజీ.
“మాఫ్ కరో బాలా. తప్పు, ఇన్నేళ్లకి కూడా అలా ఆన్నీ మనసులో పెట్టుకోకూడదు. వెళ్ళి చూసిరా.”
“సరే, అయితే,” మనసులో ఏమనుకున్నాడో కానీ ఓ ఆలోచన స్ఫురించినట్టూ బాలాజీ చెప్పాడు.
ఓ రెండు నెలలు దట్టంగా జుట్టూ, గెడ్డం పెరగనిచ్చి బొకారో ఎక్స్ ప్రెస్ ఎక్కి నాయుడిపేట బయల్దేరాడు.
*********
బొకారో ఎక్స్ ప్రెస్ కదిలాక బెర్త్ మీద పడుకుని తీరిగ్గా ఆలోచించాడు ఏం చేయాలో. తండ్రి కొట్టిన వంటి మీద దెబ్బలు, వాటి తాలూకు మంటా తాను ఏనాటికీ మర్చిపోలేడు. తన జీవితం దాదాపు నాశనం అయి ఉండేదా నాయిడిపేటలోనే ఉంటే? ఏమో ఎవరు చెప్పగలరు? తనకి సర్దార్ తో ఏదో జన్మలో సంబంధం కాబోలు లేకపోతే ఎక్కడి నాయిడి పేట, ఎక్కడి ధన్ బాద్? “ధన్,” ఔర్ “బాద్.” హ, హ తన ధన్ ఈ నగరంలోనే ఉన్నట్టుంది. పిచుక కాలుకి తాడు కట్టి లాగినట్టూ ఈ నగరం తనని ఇక్కడకి లాక్కొచ్చింది. తర్వాత పదం “బాద్” అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది.
నాయిడిపేటలో బండి దిగి ఓ లాడ్జ్ లో సామాను పెట్టి ఊర్లోకి బయల్దేరాడు. రైల్వే స్టేషన్ అవతల తండ్రి షాపు; దూరం నుంచి చూసాడు. ఎవరూ లేని షాపులో తెల్లబడిపోయిన జుట్టు, మాసిన గెడ్డం తో రంగారావు లుంగీ కట్టుకుని కూర్చునున్నాడు. బయట ఓ పాత సైకిల్ స్టాండ్ వేసి ఉంది, రంగారావుదే కాబోలు. ఇంటికెళ్ళి అమ్మ ఎలా ఉందో చూద్దాం అనుకున్నాడు కానీ తమాయించుకుని మిగతా ఊరు చూడ్డానికి బయల్దేరాడు. సాయంత్రం వరకూ తిరిగాక ఓ పాత వస్తువులు అమ్మే చోట కనుక్కున్నాడు పాత సైకిళ్ళు ఎక్కడ అమ్ముతారో.
పాత వస్తువులు అమ్మే షాపు ఆయన దగ్గిరే ఉందిట ఓ సైకిల్ అయితే రెండు చక్రాలకీ కొత్త టైర్లు వేయాలి, మరో కొన్ని చిన్న రిపేర్లు ఉన్నాయి. ఆ పనికిరాని సైకిల్ అయిదొందలకి అమ్ముతాడు కావాలిస్తే. బేరం ఆడితే నాలుగు వందలకి వప్పుకున్నాడు షాపు ఓనర్.
తొక్కడానికి పనికిరాని ఆ సైకిల్ మోసుకుంటూ తీసుకెళ్ళలేడు కనక మర్నాడు వచ్చి కొంటానని చెప్పి వెనక్కొచ్చాడు; దాన్ని తీసుకురావడానికి రిక్షాయో మరోటో చూడాలి.
మర్నాడు రిక్షాలో వెళ్ళి కొన్న ఆ పాత సైకిల్ తీసుకుని రంగారావు షాపు దగ్గిరకొచ్చాడు బాలాజీ. మొహం సరిగ్గా కనబడకుండా నల్ల కళ్ళజోడు, జుట్టూ, గెడ్డం పెంచి ఉన్న ఆసామీ ఎవరో తెలియక రంగారావు బయటకొచ్చి అడిగాడు, “రిపేర్ కావాలాండి సైకిల్ కి?”
రంగారావు నోట్లోంచి వచ్చే సారా కంపు కి బాలాజీ ఏవగించుకున్నాడు. రిక్షాలోంచి పాత సైకిల్ కిందకి దింపి రిక్షావాడు వెళ్ళాక “ఈ సైకిల్ థోడా పాడైంది రిపేర్ కర్ సక్తా?” కొంచెం హిందీ యాసతో అడిగాడు బాలాజీ కళ్లజోడు తీయకుండా.
సైకిల్ అటూ ఇటూ చూసి చాలా రోజులకి బేరం వచ్చింది అనుకుంటూ చెప్పాడు, రంగారావు “ఒక్కో టైర్ ఐదు వందలు, రిపేర్ కి మొత్తం పదిహేనువందలు ఇస్తే కొత్త సైకిల్లా చేస్తా; వారం రోజులు పడుద్ది.”
“నేను టైర్ ఒక్కొక్కటి రెండేసి వందలు అవుతుందని విన్నాను. ఐదు వందలు కైసే?” తండ్రి తనని గుర్తించలేదని తెలుస్తూనే ఉంది.
“అబ్బే రెండొందలకి టైర్ రాద్సార్,” తండ్రి మారలేదనీ వచ్చినవాళ్లని ఇప్పటికీ మోసం చేస్తున్నాడనీ తెలుస్తూనే ఉంది. ఈ డబ్బుల్లో ఎంత ప్ర. సా. దు. మీద తగలేస్తాడో మరి. తాను పోయినా తన బిజినెస్ దాదాపు పోయినా ఈయన మారడు కాబోలు. కొంతమంది అంతే.
“సరే పన్నెండు వందలు జేస్కో. రిపేర్ కరేగా? ఎప్పుడొచ్చి తీస్కమంటావ్?”
“పదమూడు వందలు జేస్కోండి. వచ్చే లచ్చింవారం ఎనక్కొచ్చి తీస్కోండి.”
“అఛ్ఛా, పైసా సైకిల్ తీసుకునేటప్పుడు ఇస్తా.”
“అబ్బే, టైర్ల కి ముందు డబ్బివ్వాల. ఓ ఎనిమిదొందలు ఇప్పుడివ్వండి. తర్వాత మిగతాది ఇచ్చొచ్చు.”
“నేను వాపసొచ్చాక ఎనిమిది వందలు ఇవ్వలేదని నువ్వు బుకాయిస్తే?” చిన్నతనంలో తన ముందు జరిగింది ఇదే కదా?
“అలా ఎందుకు చేస్తా? ఈ రంగా ఎప్పుడూ మాట తప్పడు,” ముక్కుమీద చూపుడు వేలు పెట్టుకుని తప్పు అన్నట్టూ చూపిస్తూ వచ్చిన వాడి మొహంలోకి పరీక్షగా చూసాడు రంగారావు వచ్చినవాడు ఎవరా అన్నట్టు తెల్సుకోవడానికి.
ఏమీ గుర్తు తెలిసినట్టులేదు నల్ల కళ్ళజోడు, దట్టమైన జుట్టూ, పెరిగిన గెడ్డం వల్ల.
“ఠీక్, ఠీక్, ఇదిగో ఎనిమిది వందలు, సైకిల్ రిపేర్ అఛ్ఛా రావాలి, మిగతాది వచ్చేవారం ఇస్తా,” పర్సులోంచి డబ్బులు తీసి ఇచ్చి చెప్పాడు.
“ఇప్పుడే మొదలు పెడతా పని,” చెప్పేడు డబ్బులు తీసుకున్న రంగారావు.
బాలాజీ షాపులోంచి వెళ్ళిపోయి లాడ్జ్ కి వెళ్ళాక ఆలోచించాడు మరోసారి. తండ్రి దగ్గిర సారా వాసన బట్టి చూస్తే ఈయన మారలేదు. తాగుడు మానేసినట్టైతే ఈయన్ని కూడా ధన్ బాద్ తీసుకెళ్దామనే అనుకున్నాడు. తల్లిని ఇంకా కొడుతూనే ఉన్నాడా? ముందు ఇద్దర్నీ పలకరిద్దామనుకున్నాడు తాను కానీ తండ్రి సంగతి చూస్తే ఈయన ఇంతే. తాను ఈయనకి ఎంత దూరంలో ఉంటే అంత మంచిది.
తల్లిని కలిసాక మిగతా విషయాలు తెలుస్తాయి. దానికి ముందు మరో పని చూడాలి.