వంటి మీద తట్లు తేలిన మర్నాడు పొద్దున్నే లేచాక చెప్పాడు బాలాజీ తల్లితో – క్రితం రోజు షాపులో రంగారావు కస్టమర్లతో అబద్ధం ఆడుతూంటే తాను నిజం చెప్పిన సంగతి; అందువల్ల తండ్రి కి కోపం వచ్చి కొట్టడం సంగతీను. తల్లి కళ్ళు ఇంతింత చేసుకుని చూసింది కుర్రాడికేసి వాడు ఇవన్నీ చెప్తూంటే. వంటిమీద వాతలకి కొబ్బరి నూనె రాసి అంది “ఈ రోజుకి స్కూల్ కి వెళ్ళకురా, మేష్టారు ఈ వాతలు చూస్తే ఏమంటాడో?”
బాలాజీకి ఇంట్లో ఉండడం కంటే స్కూలే నయం అనిపించి బయటకి నడిచాడు. మరో గంటన్నరకి రాత్రి జరిగినది తెలియనట్టూ, తనకేమీ సంబంధం లేనట్టూ రంగారావు మామూలుగా లేచి సైకిల్ షాపు తెరవడానికి బయల్దేరేడు.
స్కూల్లోకి వచ్చిన కుర్రాడికి దెబ్బలు దాచుకోవడం అంత సులభం కాలేదు. పక్కన కూర్చున్న ఒక కుర్రాడు చూసి మరొకడికీ, ఇంకొకడికీ చెప్తే మొత్తం క్లాస్ అంతా తెల్సిపోయింది పది నిముషాల్లో. క్లాసులోకొచ్చిన మిగతా మేష్టర్లందరికీ తెలీయడం ఎంతసేపు?
బాలాజీ కుంగిపోయాడు. ఎవరితోనూ చెప్పుకోలేని వ్యధ, ఎంతకీ ఆగని ఏడుపు. ఇలా అమ్మనీ, తననీ కొట్టడం మొదటిసారీ కాదు; చివరిసారీ కాబోదు.
బాలాజీని తనతో తీసుకెళ్ళి రంగారావుతో మట్లాడతానని స్కూల్లో వీడంటే జాలేసిన ఒక మేష్టారు అన్నాడు కానీ బాలాజీ తనకి తెల్సిన విషయం చెప్పాడు “మా నాన్న ఇప్పుడు షాపులో ఉంటాడండి. మీరు ఏదైనా చెప్తే విన్నా కోపంతో రాత్రి మళ్ళీ తాగొచ్చి అమ్మనీ, నన్నూ కొడతాడు.”
తాగుబోతుల విషయంలో అది నిజమే కాబట్టి ఆ మేష్టారికేం చేయాలో తెలియలేదు. అప్పటికి ఊరుకున్నాడు.
స్కూల్ అయిపోయాక ఇంటికెళ్ళిన బాలాజీ అమ్మతో చెప్పాడు స్కూల్లో సంగతి, మేష్టారు రంగారావు తో మాట్లాడతాడేమో అంటూ. ఆవిడ కంగారుపడింది ఈ రచ్చ స్కూల్ దాకా వెళ్ళినందుకూ, బాలాజీ ఇలా మేష్టార్ తో చెప్పాడని తెలిసి, రంగారావు ఆ రాత్రి తాగి వచ్చి మరోసారి కొడతాడేమో అని. ఆవిడ ఆలోచన వినేసరికి బాలాజీ వణికాడు. రబ్బర్ ట్యూబ్ తో వంటిమీద పడే దెబ్బ కాసుకోవడం అంత సులభంకాదు.
“అమ్మా నేనివాళ షాపుకెళ్ళనే, అలా రైల్వే స్టేషన్ దగ్గిరకెళ్ళి వచ్చేస్తానే,” అని బతిమాలాడు.
“అలాగే కానీ దూరంగా వెళ్ళకు; చీకటి పడకుండా వచ్చేయ్.”
రంగారావు తాగి రాత్రి ఇంటికొచ్చేసరికి ఇంటి ముందు జనం. తర్వాత తెల్సిన విషయం, బాలాజీ రైల్వే స్టేషన్ కి వెళ్తానన్నాడు, చీకటి పడకుండా వచ్చేయమంటే సరే అని చెప్తూ. అయితే ఇప్పటివరకూ పత్తాలేడు. ఏమయ్యాడో తెలియదు. కొడుకు కనిపించనందుకు పెళ్ళాం ఏడుస్తూంటే చుట్టుపక్కలవాళ్ళొచ్చి తలో నాలుగూ అంటించారు రంగారావుకి. మత్తు దిగాక తెల్సింది వాడికి బాలాజీ సంగతి. తాను కొట్టడం వల్లే వాడు పారిపోయాడా? పెళ్ళాం గొంతెత్తి అందరితో అంటోంది “ఈ సచ్చినోడు రబ్బర్ ట్యూబ్ పెట్టి కొట్టాడు, ఇదిగో వాతలు చూడండి. కుర్రాడి వంటి మీద కూడా ఇవే వాతలు; రక్తం కారతా ఉంది. ఆడు స్కూల్లోకెళ్తే పిల్లకాయలు మేష్టారితో చెప్పార్ట. ఏడుస్తూ వచ్చాడు. చిన్న పిల్లాణ్ణి కొట్టడానికి చేతులెలా వచ్చాయో ఈ ముదనష్టపోడికి.’
రంగారావు, ఇంటి చుట్టుపక్కల వాళ్ళూ రైల్వే స్టేషన్ దాకా వెళ్ళి తెలుసున్న అందర్నీ అడిగి చూసారు. పదకొండేళ్ళ బాలాజీ ఎవరికీ కనబడ్లేదుట; చూసినట్టు గుర్తు లేదు.
అదే ఆఖరి సారి రంగారావు బాలాజీని చూడడం. ఆ రోజునుంచి పెళ్ళాం రంగారావుని తన పక్కలోకి రానీయలేదు. అలాగని రంగారావు తాగడం మాననూ లేదు. ఎప్పుడైనా రంగారావు పెళ్ళాం ని కొట్టబోతే మాత్రం ఆవిడే, కొడుకు వెళ్ళిపోయిన కోపం వల్లనేనేమో, ఇంట్లో మరోచోట దాచి ఉన్న రబ్బర్ ట్యూబ్ తీసి మొగుణ్ణి నాలుగు వాయించడం నేర్చుకుంది. బాలాజీ మాత్రం ఏమయ్యాడో ఇద్దరికీ తెలియలేదు.
రైల్వే స్టేషన్ కి వచ్చిన బాలాజీకి వంటిమీద దెబ్బలు మంట పుట్టిస్తున్నాయి. అక్కడే ప్లాట్ ఫాం మీద తచ్చాడుతూంటే ఏదో బండి వచ్చి ఆగింది. ఇంటికెళ్తే ఏమౌతుందో తెలియదు. మేష్టారు వెళ్ళి తండ్రితో చెప్తే ఈ రాత్రే మరోసారి తాగి వచ్చి కొడతాడనేది తెల్సిందే. తల్లి ఎలా ఓర్చుకుంటోందో? తనక్కానీ బలం ఉంటే తండ్రిని చంపేసి ఉండేవాడు. అయినా తానేం తప్పుచేసాడు? డబ్బులు తీసుకుని కూడా డబ్బులు ఇవ్వలేదు అని అబద్ధం ఆడుతూంటే “కాదు, డబ్బులు ఇచ్చాడు మోటార్ సైకిల్ ఆయన,’ అని నిజం చెప్పడంలో ఏమిటి తన తప్పు? గాంధీ గారు అలాగే నిజం చెప్పాడు కదా? ఇప్పుడు ఇంటికెళ్తే ఎంతకాలం ఇలా దెబ్బలు తినడం? తండ్రి తాగుడు మానడని తెల్సిందే. ఆలోచనలు తెగడం లేదు. ప్లాట్ ఫాం మీద బండి కదుల్తూంటే అసంకల్పితంగా ఎదురుగా ఉన్న కోచ్ లో ఎక్కేశాడు.
ధన్ బాద్ వేపు పోయే బొకారో స్టీల్ సిటీ ఎక్స్ ప్రెస్ వేగం అందుకుంది.
మూడు నాలుగు స్టేషన్లు దాటాక రైల్ కోచ్ లో తలుపు దగ్గిర నక్కి కూర్చున్న బాలాజీని ఎవరో పెద్దాయన పలకరించాడు, “ఏం అబ్బాయ్, ఈ వంటి మీద దెబ్బలేమిటి? ఎవరైనా కొట్టారా? కింద పడ్డావా?”
ఏడవడం మొదలుపెట్టాడు బాలాజీ సమాధానం చెప్పకుండా. ఏడుపు ఆగే వరకూ కాసేపు చూసి ఆయన మళ్ళీ అడిగితే చెప్పాడు, “మా నాన్న తాగొచ్చి కొట్టాడు. అమ్మని కూడా ఇలాగే కొడుతూంటాడు రోజూ.”
జాలేసింది కాబోలు తన కూడా రమ్మని, తన దగ్గిర ఉన్న భోజనంలో కొంత కుర్రాడికి పెట్టాడు పెద్దాయన. కాసేపటికి మళ్ళీ తలుపు దగ్గిరకి చేరాడు బాలాజీ. రెండో రోజుకి దాదాపు మధ్యాహ్నం నాలుగు అవుతోంటే బాష తెలియని ధన్ బాద్ అనే ఊర్లో మొత్తం బండి ఖాళీ అయ్యాక, ఏం చేయాలో తెలియని బాలాజీ అసంకల్పితంగా తానూ బండి దిగాడు.
మట్టికొట్టుకుపోయిన బట్టలతో స్టేషన్ లోంచి బయటకొస్తే తాను ఎక్కడున్నాడో ఏ ఊరో తెలియదు. ఎవరేం మాట్లాడుతున్నారో కూడా తెలియదు. వెనక్కి ఇంటికి వెళ్ళాలి, కానీ ఎలా వెళ్ళాలో తెలియదు. ఏ బండి ఎక్కి ఇక్కడకి వచ్చాడో తెలియదు. ఏ బండి ఎక్కి ఇంటికి వెళ్ళాలో కూడా అసలే తెలియదు. మరోసారి ఏడుపు. ఓ టీ కొట్టు దగ్గిరకెళ్ళాడు ఏం చేయాలో తెలియక.
టెంపో డ్రైవర్లు టీ తాగుతున్నారు కొట్టు దగ్గిర. ఓ కుర్ర సర్దార్ డ్రైవర్ బాలాజీ కేసి చూసి హిందీలో అడిగాడు, “శరీర్ పర్ యే చోటేం క్యా?”
ఏం చెప్పాలో తెలియదు. వెర్రిమొహం వేసుకు చూస్తూంటే కుర్రాడికి హిందీ రాదని తెల్సినట్టుంది. దగ్గిరకొచ్చి బాలాజీ వంటి మీద దెబ్బలు చూపిస్తూ చేత్తో సౌంజ్ఞ చేసాడు ఇవేంటీ అంటూ.
మళ్ళీ ఏడుపు; ఈ సారి ఏడుస్తూ చెప్పాడు తెలుగులో, “మా నాన్న తాగొచ్చి కొట్టాడు. అమ్మని కూడా ఇలాగే కొడుతూ ఉంటాడు రోజూ.”
సర్దార్ జీ రూపంలో మరో జాలి పడిన ప్రాణం బన్నూ పాలూ ఇప్పిచ్చి వెళ్ళిపోతూంటే ఆయన వెనకనే నడిచాడు. ఆయన మాట్లాడేది బాలాజీకీ, బాలాజీ చెప్పేది ఆయనకీ అర్ధం కానప్పుడు సర్దార్ కి ఏం చేయాలో తెలియక తనకి తెల్సిన ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్ళాడు కుర్రాణ్ణి. వంటి మీద దెబ్బలు చూసి ఏదో ఆయింట్ మెంట్ ఇచ్చారు. మరోసారి సర్దార్ వెనకనే నడక. టెంపో బిజినెస్ రాత్రి పదింటికి కట్టేసి కుర్రాడితో పాటు సర్దార్ తానుండే ఇంటికిచేరాడు. సత్రం భోజనం మఠం నిద్ర గానే బతికే సర్దార్ ఇల్లు అంటే ఆయన ఒక్కడూ ఉండే చిన్నగది.
ఇరవై రోజులు గడిచాయి. వంటి మీద దెబ్బలు తగ్గాక బాలాజీ హుషారుగా టెంపో మీద సర్దార్ తో పాటు తిరుగుతున్నాడు. ఆయియే, అందర్ జావో, బైఠీయే, రైల్వే స్టేషన్ ఆగయా, లాంటి పదాలు పట్టుబడ్డాయ్. సర్దార్ నవ్వుతున్నాడు బాలాజీ భాష చూసి. ఎప్పుడైనా ఎవరైనా మద్రాసీ కుటుంబం కనబడుతుందేమో వాళ్ళతో ఈ కుర్రాడి గురించి చెప్దాం అని సర్దార్ జీ చూసాడు. రెండు మూడు సార్లు కొందరు మద్రాసీలు కనిపించారు కానీ ఈ కుర్రాడు మాట్లాడే భాష వేరే మాకు అర్ధం కాదనేసరికి ఏం చేయాలో పాలుపోలేదు. సౌత్ ఇండియాలో కూడా ఇన్ని భాషలు ఉంటాయనేది సర్దార్ కి అర్ధం కాని వింత. కుర్రాడు సహాయం చేస్తున్నాడు టెంపో బిజినెస్ లో; పైసా జీతం ఖర్చు లేదు తిండి తప్ప; కనీసం ప్రస్తుతానికి.
ఆరు నెలలు గడిచాక ఓ తెలుగు కుటుంబం టెంపో ఎక్కితే సర్దార్ వాళ్లని అడిగాడు బాలాజీతో మాట్లాడమని. తాను ఇక్కడకి ఎలా వచ్చి తేలాడో చెప్పాడు బాలాజీ. ఏ బండి ఎక్కి వచ్చాడో తెలియదు. తన ఊరు మాత్రం నాయుడుపేట అని తెలుసు అంతే. తెలుగాయన సర్దార్ తో చెప్పాడు హిందీలో బాలాజీ సంగతి. నాయుడుపేట నెల్లూర్ దగ్గర; అక్కడకి డైరెక్ట్ గా వెళ్ళడానికి బొకారో ఎక్స్ ప్రెస్ అనేది ఉంది. టికెట్ దాదాపు మూడు వందలు ఉండొచ్చేమో?
వాళ్ళు మాట్లాడుకున్న హిందీ మాటలు కొంచెం అర్ధం అయ్యీ కానట్టున్న బాలాజీ, బలంగా ఉన్న సర్దార్ చేయి గట్టిగా పట్టేసుకుని బిగ్గరగా ఏడుస్తూ తెలుగూ హిందీ కలగాపులగం చేస్తూ చెప్పాడు “హం నహీ జావూంగా, నేను వెళ్తే మళ్ళీ నాన్న నన్ను ట్యూబ్ తో కొడతాడు, హం నహీ జావూంగా, హం నహీ జావూంగా…నేను వెళ్లను… నేను వెళ్లను…”
సర్దార్జీకి ఏం చేయాలో పాలుపోలేదు. నాయుడిపేట, నెల్లూర్, బొకారో ఎక్స్ ప్రెస్ అనేవి మాత్రం అర్ధమయ్యాయి. ఆయన కష్టాలు ఆయనవి.