
వివరణ:
దేహళీదత్త దీప న్యాయమును ఒకచోట ప్రస్తావిస్తూ మా గురువు గారు బ్ర.శ్రీ. శ్రీనివాస రావు గారు, "రెండు గదుల మధ్య నుండు గడపపై నుంచిన దీపము రెండు గదులనూ ఒకేసారి భాసింపజేస్తుంది" అని చెప్పినారు. అది స్ఫోరకంగా వ్రాసినది…… నేమాన గోపాల్.
ఐహికాముష్మికముల రెంటినీ చూపునట్టి
మనసు కల మానవుని స్వయంజ్యోతి
సంసార, సాయుజ్యముల రెంటిమధ్య
నిత్యమూ భాసించు నిశ్చలజ్యోతి
రజస్తమో గుణముల మధ్య
భాసించు సత్త్వజ్యోతి
ఆవరణ, విక్షేప దోషముల నెత్తి జూపి
ఆత్మానాత్మ విచక్షణ కలుగజేసి
జీవ, జగద్భావముల ప్రాలద్రోలి
నా జ్ఞాన మార్గమును సదా వెలిగించు జ్యోతి
అదియె పిండాండ, బ్రహ్మాండముల మధ్యనుండి
నటునిటు ప్రసరించు జ్ఞానజ్యోతి
దానిముందు సూర్య, చంద్ర, నక్షత్రాదులు
వెలవెల బోవునెపుడు
ఆత్మబుద్ధి ప్రకాశమై తనరు నా స్యయంజ్యోతి
నిత్యమూ, సత్యమై, శాశ్వతానందమయమై
లోన భాసించు సనాతనజ్యోతి
అవస్థాత్రయమునంతా నావరించి
నన్ను నడిపించు ప్రత్యర్జ్యోతి
మాయావిగా మాయని భాసింపజేసి,
మమ్ము మభ్యపెట్టి, మాలోన దాగియుండి,
స్థావర, జంగమాత్మక విశ్వంబు నెల్ల
నా వెలుగులో నెత్తి జూపి,
సర్వదా సర్వాత్మయై యుండి వెలుగు
నదియె, బాహ్యాభ్యంతరముల రెంటినీ
ప్రకాశింపజేయు నంతర్జ్యోతి
సర్వాత్మత్వమును ప్రకటీకరించు పరంజ్యోతి.