అది విన్న సూర్యానికి మాట తోచలేదు. చేసేదిలేక, "పెప్పీ పడే ఇబ్బందిని ముందే చెప్పినందుకు కృతజ్ఞతలు. పెప్పీకి మరొక మార్గం ఆలోచిస్తాం. అదంటే మా అందరికీ ప్రాణం. దాని ప్రాణం మాకెంతో ముఖ్యం", అని వైద్యుడి దగ్గర సెలవు తీసుకున్నాడు సూర్యం.
దిగులుతో ఇల్లు చేరుకున్న సూర్యం వైద్యుడు చెప్పిన విషయం గాయత్రి, వెంకట్, చిన్నిలకు చెప్పాడు. అప్పటిదాకా ఆనందంగా ఉన్న ఆ ఇంటి వాతావరణం గంభీరంగా మారింది. చిన్ని, వెంకట్ లిద్దరూ పెప్పీని దగ్గరకు తీసుకుని బిక్క మొహాలు పెట్టి కూర్చున్నారు.
"మనకు తెలిసినవారికెవరికైనా పెప్పీని ఇచ్చి కొద్దికాలం పాటూ చూడమని చెప్పచ్చు. కానీ మనము అమెరికాలో కనీసం రెండేళ్ళైనా ఉండవలసి వచ్చేలా ఉంది. ఆ తరువాత నా పనిని ఇంకో రెండేళ్లపాటు కొనసాగించే అవకాశం ఉంది. ఇన్నేళ్లు మన పెప్పీని ఎవరు చూసుకుంటారు? అలాగని పెప్పీని విడిచి మనం ఉండగలమా?", అని ఆవేదనతో అన్నాడు సూర్యం.
"ప్రతి సమస్యకీ ఏదో ఒక పరిష్కారం ఆ భగవంతుడే చూపిస్తాడు. మనం దిగులుగా ఉంటే పెప్పీ కూడా బాధపడుతుంది. సరైన మార్గం దొరికే వరకూ మనమంతా కాస్త ఓపిక పట్టాలి", అంది గాయత్రి.
అంతలో సూర్యం దగ్గరి బంధువు అయిన సీతాపతి తన స్నేహితుడు కిరణ్ తో కలిసి సూర్యం ఇంటికి వచ్చాడు. పెప్పీ వారిద్దరి వద్దకూ వెళ్లి కిరణ్ తో ఆటలు మొదలు పెట్టింది. సీతాపతితో ఆ మాటా ఈ మాటా మాట్లాడిన తరువాత తమకొచ్చిన సమస్యను గురించి చెప్పింది గాయత్రి.
అప్పుడు సీతాపతి, "అవును! ఇష్టంగా పెంచుకుంటున్న కుక్కతో మనకు తెలియకుండానే బంధం ఏర్పడుతుంది. దాన్ని ఇలా మధ్యలో వదలాలంటే కష్టమే. కానీ కిరణ్ ఉద్యోగం కుక్కలకు శిక్షణనివ్వటమే. మీకు ఈ విషయంలో అతను మంచి సలహా ఇవ్వగలడనుకుంటా", అని కిరణ్ తో, " ఏం కిరణ్? పెప్పీని జాగ్రత్తగా చూసుకునేవారెవరైనా ఉన్నారా?" అని అడిగాడు.
"నా ఉద్యోగం కుక్కపిల్లలకు ప్రత్యేక శిక్షణను ఇచ్చి వాటిని ఆరోగ్యరీత్యా చక్రాల కుర్చీకి పరిమితమైన వారి సేవకు ఉపయోగ పడేలా తయారు చెయ్యడం. అలా శిక్షణ ఇచ్చిన కుక్కపిల్లలు తమ యజమానికి అనేక విధాలుగా సహాయ పడుతూ ఉంటాయి. అవసరమైనప్పుడు తలుపులు తెరుచుకోవడానికి మీటలు నొక్కడం, జాగ్రత్తగా రోడ్డు దాటించడం, వారికి అత్యవసరసేవలవసరమైనప్పుడు చుట్టూ ఉన్నవారిని అప్రమత్తం చెయ్యడం వంటివి కూడా చేస్తాయి. అయితే అన్ని కుక్కపిల్లలకూ మేము ఇటువంటి శిక్షణను ఇవ్వలేము. మాకు ఈ పనికి కావలసిన కొన్ని లక్షణాలున్న కుక్క పిల్లలను మాత్రమే ప్రత్యేకంగా ఎంచి వాటికి తగిన శిక్షణ ఇస్తాం. నేను ఇందాకటి నుండీ పెప్పీతో ఆడుతూ దాని స్వభావం గమనిస్తున్నాను. మాకు కావలసిన నెమ్మదితనం, ఓర్పు, విధేయత వంటివి పెప్పీ లో కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. మీరు ఒప్పుకుంటే నేను పెప్పీకి అటువంటి శిక్షణను ఇచ్చి ఒక మంచి పనికి దాని సామర్ధ్యాన్ని వినియోగించగలను. మరి మీకిష్టమేనా?", అని అడిగాడు కిరణ్.
కిరణ్ చెప్పినది ఆసక్తిగా విన్న సూర్యం, "ఈ ఆలోచన బాగానే ఉన్నట్టుందే! అయినా ఇందులో ఉండే సాధకబాధకాలు మరొకసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం", అన్నాడు. "సరే. నేను మళ్ళీ రెండు రోజులలో వస్తాను. మీ అభిప్రాయం చెప్పండి", అని చెప్పి కిరణ్ సీతాపతితో పాటు వెళ్ళిపోయాడు. అన్న ప్రకారం రెండు రోజుల తరువాత కిరణ్, సూర్యం వాళ్ళింటికి వచ్చాడు.
అప్పుడు సూర్యం కిరణ్ తో, "నేను నా పిల్లల వల్ల అందరికీ ఆనందం కలగాలనీ, వారి వల్ల నలుగురికీ మేలు జరగాలనీ, వారు ఇతరులకి చేతనైన సహాయం చెయ్యాలనీ ఎప్పుడూ ఆ భగవంతుడిని కోరుకుంటూ ఉంటాను. పెప్పీ మా 'దత్త' పుత్రుడు. అది అవసరంలో ఉన్న వారికి ఉపయోగపడుతుందంటే మాకు ఆనందమే! మాకు పెప్పీ దూరంగా ఉన్నా అది క్షేమంగా ఉండాలన్నది మా కోరిక. దానిని మీతో తీసుకెళ్లండి", అన్నాడు.
అది విన్న కిరణ్, "చాలా సంతోషం. ఇది ఖచ్చితంగా సరైన నిర్ణయమే. ఆ విషయం కొద్ది కాలం తరువాత మీకే తెలుస్తుంది. నేను పెప్పీని నాతో తీసుకెళ్ళేందుకు ముందు కొన్ని వివరాలను మా సంస్థకు ఇవ్వవలసి ఉంటుంది. వారి అంగీకారం అందిన వెంటనే వచ్చి మీకు తెలిపి పెప్పీని నా వెంట తీసుకుని వెడతాను", అని అన్నాడు.
కిరణ్ బయలుదేరుతున్నంతలో చిన్ని కిరణ్ వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి, "కిరణ్ మామయ్యా! పెప్పీ ని చాలా బాగా చూసుకునే వాళ్ళకే దాన్ని ఇవ్వాలి. అది ఎవరి దగ్గరైతే ఉంటుందో వాళ్ళు నాకు ఎప్పుడు కావాలన్నా పెప్పీ విషయాలు చెప్పగలిగితే బాగుంటుంది”, అని అంది.
"తప్పకుండా చిన్నీ. మీ అందిరికీ పెప్పీ అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసుగా! తప్పకుండా దాన్ని ప్రేమించే వారికే ఇస్తాను. సరేనా?", అన్నాడు కిరణ్.
సూర్యం కుటుంబం అంతా పెప్పీని కిరణ్ తో పంపడానికి మానసికంగా సిద్ధం అయ్యారు. తమ సంస్థ అంగీకార పత్రంతో పెప్పీని తీసుకు వెళ్ళడానికి మరుసటి రోజు వచ్చాడు కిరణ్.
"మీకో శుభవార్త! పెప్పీని హైదరాబాద్ లోనే ఉంటున్న ఒక విశ్రాంత సైనిక ఉన్నతాధికారికి కేటాయించారు. ఆయన ఎవరో కాదు. శ్రీ పరమేశ్వర చక్రపాణి గారు. మీరు ఆయన పేరు వినే ఉంటారు. యుద్ధంలో ఆయన గాయపడితే రెండు కాళ్ళు తీసివెయ్యవలసి వచ్చి ఆయన చక్రాల కుర్చీకి పరిమితమయ్యారు. ప్రస్తుతం ఆయనకు సేవలందిస్తున్న కుక్క ముసలిదైపోవడంవల్ల పూర్తి స్థాయిలో సేవలందించలేకపోతోంది. పెప్పీ గురించి విన్న వెంటనే చక్రపాణిగారు తనకు కావాలని అడిగారు. ఆయనకు కుక్కలంటే ప్రాణం. వాటిని చాలా ముద్దుగా చూసుకుంటారని అందరూ అంటారు. పెప్పీకి క్షేమంగా, ఆనందంగా ఉండేందుకు ఇంతకన్నా మంచి ఇల్లు ఎక్కడుంటుంది?”, అని అన్నాడు కిరణ్.
"చక్రపాణి గారంటే తెలియని వారెవరుంటారు? వారి సేవలకుగాను ప్రభుత్వం అత్యున్నత పురస్కారాన్ని కూడా ఇచ్చి సత్కరించింది కదా! దేశానికి మరువలేని, గర్వించదగ్గ సేవలందించిన ఆయనకు మా పెప్పీ సేవ చెయ్యడానికి నియమించబడటం మాకు నిజంగా చాలా ఆనందకరం", అన్నాడు సూర్యం. "నిజంగా మాకిది మంచి వార్తే కిరణ్", అంది గాయత్రి.
వెంకట్ పెప్పీకి సంబంధించినవన్నీ ఒక సంచిలో పెట్టి తీసుకునివచ్చి కిరణ్ కు ఇచ్చాడు. చిన్ని, పెప్పీని ఎత్తుకుని జాగ్రత్తగా కిరణ్ చేతుల్లో పెడుతూ, "నిన్ను మేమస్సలు మరువము పెప్పీ!”, అంటూ బాధ తట్టుకోలేక గట్టిగా ఏడ్చేసింది. గాయత్రికి కూడా కన్నీరు ఆగలేదు. కిరణ్ పెప్పీని తీసుకుని బయటకొచ్చేసరికి ఆ వీధిలోని వారంతా పెప్పీకి వీడ్కోలు పలికేందుకు సూర్యం ఇంటి ముందు గుమిగూడి ఉన్నారు. ఒక కుక్కపిల్ల పై ఇంతమంది ఇంత అభిమానం చూపుతున్నారా అని కిరణ్ ఆశ్చర్యపోయాడు. అందరూ ఒక్కొక్కరుగా భారమైన హృదయంతో పెప్పీని నిమిరి కిరణ్ తో దాన్ని సాగనంపారు.
*** *** *** *** ***
పెప్పీని తలుచుకుంటూ అమెరికా వెళ్ళింది సూర్యం కుటుంబం. చక్రపాణి గారు, పెప్పీకి, సూర్యం ఇంటిల్లుపాదికీ ఉన్న అనుబంధం అర్ధంచేసుకుని వారికి ఎప్పటికప్పుడు పెప్పీ విశేషాలు తెలియజేయటం మొదలుపెట్టారు. పెప్పీ సంతోషంగా ఉన్నందుకు అందరూ ఆనందించేవారు. సూర్యం అమెరికా వెళ్లిన తరువాత రెండేళ్లు గిర్రున తిరిగాయి. సూర్యం ఊహించినట్లే తన పనిని పొడిగిస్తూ ఇంకో రెండేళ్లు అమెరికాలోనే చెయ్యాలని చెప్పారు సూర్యం పై అధికారులు. దాంతో ఇంకో రెండేళ్లు అమెరికాలోనే ఉండి పని పూర్తయ్యిన తరువాత భార్యా పిల్లలతో కలిసి ఇండియాకి తిరిగి వచ్చి హైదరాబాద్ లోని తన ఇంటికి చేరాడు సూర్యం. ఇంట్లోకి వస్తూనే అందరికీ పెప్పీ కళ్ళ ముందు కనబడింది. ఎక్కడ చూసినా పెప్పీనే గుర్తుకు వచ్చేసరికి చిన్ని సూర్యంతో, "నాన్నా, చక్రపాణి గారు ఉండేది హైదరాబాద్ లోనే కదా! ఒకసారి వెళ్లి పెప్పీని చూడాలని ఉంది. వెళ్లి వద్దామా?" అని అడిగింది. "అవును నాక్కూడా చూడాలని ఉంది", అన్నాడు వెంకట్.
"సరే. చక్రపాణి గారికి ఎప్పుడు వీలవుతుందో కనుక్కుని వెడదాం", అన్నాడు సూర్యం.
"నాకు పెప్పీ తెగ గుర్తుకొస్తోంది. చక్రపాణి గారు ఒప్పుకుంటే మనం మళ్ళీ పెప్పీని ఇక్కడకు తెచ్చేసుకుందాం”, అంది చిన్ని. "దాన్ని మనమే పెంచుకుందాం", అన్నాడు వెంకట్. పిల్లల కోరిక వెంటనే కాదనలేక మౌనంగా ఊరుకున్నాడు సూర్యం.
సూర్యం చక్రపాణిగారితో తమ రాక గురించి మాట్లాడిన తరువాత ఒక రోజు సూర్యం, గాయత్రి, వెంకట్, చిన్నిలు పెప్పీ కోసం చక్రపాణిగారి వద్దకు బయలుదేరారు. చక్రపాణి గారింటి తలుపు తట్టగానే కాస్త పెద్దగా కనబడుతున్న ఒక కుక్క తలుపు తెరిచింది. అది తాము పెంచిన పెప్పీనే అని గ్రహించడానికి చిన్నికి ఎక్కువ సమయం పట్టలేదు. అందరిని ఠక్కున గుర్తు పట్టిన పెప్పీ ఆనందంతో అటూ ఇటూ గెంతులేసింది. చిన్ని దాన్ని దగ్గరకు తీసుకుని దాని బొచ్చంతా నిమురుతూ, “ఎంత పెద్దవాడివయ్యావురా పెప్పీ!!”, అంది. ఉన్నట్టుండి పెప్పీ ఏదో పనున్నట్టు లోపలి గదిలోకెళ్ళి చక్రపాణి గారు చక్రాల కుర్చీలో వస్తూ ఉంటే ఆయనతో పాటూ మెల్లిగా వచ్చింది. చక్రపాణి గారు వృద్ధులు. దేశ సేవకు అడ్డు వస్తుందని వివాహం చేసుకోలేదు కాబట్టి ఆయన ఒక్కరే ఉంటున్నారు. అందరూ ఒకరినొకరు పలకరించుకున్న తరువాత తనకిష్టంలేక పోయినా, తప్పని అనిపిస్తున్నా, పిల్లల ఆనందానికి అడ్డు రాలేక పెప్పీ విషయం లో పిల్లల అభిప్రాయం చక్రవర్తి గారికి చెప్పాడు సూర్యం.
"అయితే మీరు నేనొప్పుకుంటే పెప్పీని తీసుకు వెడదామని అనుకుంటున్నారన్న మాట”, అని అన్నారు చక్రపాణి గారు.
"అవునండి", అన్నాడు సూర్యం.
ఒక్క క్షణం కళ్ళు మూసుకుని దీర్ఘాలోచనలోకి వెళ్లారు చక్రపాణిగారు. అంతలో ఆయనకు చెప్పలేనంత దగ్గు మొదలయ్యింది. సూర్యం, గాయత్రిలు స్పందించేలోపే పెప్పీ ఒక్క ఉదుటున పక్క గదిలోకి వెళ్లి ఒక మందుల సంచిని తీసుకు వచ్చి చక్రపాణి గారికిచ్చి రివ్వున వెళ్లి మంచినీళ్ల సీసా నోటితో పట్టుకుని వచ్చి చక్రపాణిగారికి అందించింది. చక్రపాణిగారు తనకు కావలిసిన మందును వెంటనే వేసుకుని కొద్ద సేపట్లో తేరుకున్నారు. ఆ తరువాత పెప్పీని దగ్గరకు పిలిచి తలపై నిమిరి "వెళ్లి ఆడుకో" అని అన్నారు. పెప్పీ ఆయన వద్దకు వెళ్లడం చూస్తే గాయత్రి వద్ద చిన్నప్పుడు అది గారాం చెయ్యడం గుర్తుకువచ్చింది సూర్యం వాళ్ళందరికీ.
"రా పెప్పీ! కాసేపు బయట ఆడుకుందాం", అని పెప్పీని పిలిచింది చిన్ని. పెప్పీ మెల్లిగా పరిగెడుతూ చిన్ని వెంట బయటకు వెళ్ళింది. కానీ ప్రతి రెండు నిమిషాలకోసారి పెప్పీ చక్రపాణి గారి వద్దకు వెళ్లి రావడం చిన్నిని ఆశ్చర్య పరిచింది. ఈ నాలుగేళ్లలో పెప్పీకి చక్రపాణిగారికీ మధ్య ఏర్పడిన ప్రేమ, అనుబంధం, ఒకరిపట్ల ఒకరు చూపుతున్న ఆప్యాయతలు వెంకట్, చిన్నిలకు అర్థమయ్యాయి. తమ చిట్టి పెప్పీ పెద్దదవ్వడమే కాకుండా చక్రపాణిగారి పట్ల ఎంతో బాధ్యతాయుతంగా ప్రవర్తించడం వారికి ఆనందాశ్చర్యాలు కలిగించింది.
ఇంట్లోకి వచ్చిన చిన్నిని చూస్తూ, "నేను కిరణ్ తో మాట్లాడతాను. మీరు పెప్పీని మీతో తీసుకెళ్లవచ్చు. దాని ఆటవస్తువులు కొన్ని ఉన్నాయి. అవన్నీ సద్ది ఇస్తాను. పట్టుకెళ్లండి”, అంటూ చక్రపాణిగారు లోపలి గదిలోకి వెళ్లారు. ఆయనను అనుసరించింది పెప్పీ. అంతలో చిన్ని వెంకట్ చెవిలో ఏదో చెప్పింది. వెంకట్ సరేనన్నట్లు తల ఊపాడు.
పెప్పీ ఆటవస్తువులతో బయటికొచ్చిన చక్రపాణి గారితో వెంకట్, "మేము పెప్పీని మాతో తీసుకెళ్లాలన్న ఆలోచన విరమించుకున్నామండీ! పెప్పీ మాతో ఉంటే మేము కేవలం ఆటలు మాత్రమే ఆడతాము. అదే మీతో ఉంటే మీకు బోలెడన్ని పనులలో సహాయం చెయ్యడం మా కళ్లారా చూసాం. మాకన్నా దాని అవసరం మీకే ఎక్కువ. మేము చెయ్యలేని సేవ అది మీకు చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మీకు సమ్మతమైతే మీరు ఉండేది హైద్రాబాద్ లోనే కాబట్టి మాకెప్పుడు పెప్పీని చూడాలని అనిపిస్తే అప్పుడు వచ్చి కాసేపు దానితో గడిపి వెడతాము. మా చిన్ని అభిప్రాయం కూడా ఇదే", అని అన్నాడు.
ఆ మాట చక్రపాణిగారికి ఎంతో ఆనందం కలిగించింది. ఆయన వెంకట్ వంక మెచ్చుకున్నట్టుగా చూస్తూ, "పక్కవారి కష్టసుఖాల గురించి ఇంత చిన్న వయసులో ఆలోచిస్తున్నారంటే తప్పకుండా మీకు గొప్ప భవిష్యత్తు ఉంది. మీకెప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి పెప్పీతో ఆడుకోవచ్చు. అయితే మీకొక షరతు పిల్లలూ! మీరికనుండీ నన్ను తాతయ్యా అని పిలవాలి. సరేనా?”, అని అన్నారు.
"ఓ అలాగే తాతయ్యా!!" అని చిన్ని, వెంకట్ లు నవ్వుతూ అన్నారు. చిన్ని పెప్పీని దగ్గరకు పిలిచి గట్టిగా తన గుండెలకు హత్తుకుని "మళ్ళీ వస్తా" అని చెప్పి ఇంటి బయటకు నడిచింది. చక్రపాణి గారికి వెళ్ళొస్తామని చెప్పి చిన్ని వెంట నడిచారు సూర్యం, గాయత్రి , వెంకట్ లు.
"మన పిల్లలతో పాటూ మన 'దత్త' పుత్రుడు కూడా నలుగురూ మెచ్చుకునేలా ప్రవర్తిస్తూ మన ఇంటికి మంచి పేరు తెస్తున్నాడు కదండీ?" అంది గాయత్రి.
"అవును. పిల్లల విషయంలో మన ఆశయం నెరవేరింది", అన్నాడు సూర్యం.
పిల్లల త్యాగాన్ని, సేవ చెయ్యడంలో పెప్పీ చూపిస్తున్న ప్రేమను, అంకిత భావాన్ని తలుచుకున్న సూర్యం, గాయత్రిలకు అమితానందం కలిగి వారిరువురి కళ్ళూ ఆనందభాష్పాలతో నిండాయి.