॥ శ్రీలక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబమ్॥
కం.
లేనిదియున్నట్లు సులువుఁ
గానదె యున్నదియు లేక! కాదే మాయా
మానిని జగమిది! మదిరా
పానామోదమునిది! హరి!! భవహర రామా!!
ఉ. కోయను బాగుగా శ్రమము కోసినమీదట కాదొకో ఫలం బీయది సేవనాసుగమ మింత! ఫలమ్మును చేరగా తపం బో! కడఁ గల్గుగా రసము పూర్ణఫలంబులు. లోకమందు టెం కాయలు కాయలై మిగులు గావు ఫలంబులటన్న సత్యమే
ఉ. చంద్రుడు పుట్టెనే గగన సాగరమందున తారలిమ్మయెన్ సాంద్రపు భావనావిపిన జాలములన్నియు భస్మమైయటన్ చంద్రికనోలలాడె మది సాత్వికబుద్ధికి చోదనంబయెన్ మంద్రపు రీతులే వదిలి మానసమందెను మెల్లగా ఛవిన్
శా. తీపుల్ చేదులనున్ సమంపు క్రియలోఁ దీటైన కారంబులన్ సంపూజ్యంబుగ జీవరాగగతిలో స్వాదించు బోధాబ్జమున్ బాపౌఘఘ్నముగాదిపచ్చడియనే భావంబు మూర్తింపగన్ వేఁపాకుల్ గొని చేయఁ బచ్చడినహో వేడ్కన్ భుజింపం దగున్
ఉ. నీరజనాభుతోనెపుడు నెయ్యమునందుచు ధన్యులౌదురే వారిజనేత్రుసేవనతి భాగ్యముగా మరిసేయరే విధిన్ సారజమంత్రముల్ జదువు స్వాములు! నిశ్చయభాగ్యులేను పూ జారుల నిత్యకృత్యములు సజ్జనమోదముఁ గూర్పకుండునే ?!
ఉ. ముళ్ళ సమాహితంబయెను భూమిని వేగపుజీవితమ్మయో!! వళ్ళు సుచర్వణంబయెడి 😉 వ్యాకులమయ్యెడి మానసంబొకో కళ్ళకు నిట్టి నాళ్ళ మరి కాన్కగు కమ్మని తల్లివంట, వే పుళ్ళకు నుప్పు కారములఁ బూతగ నద్దిన మేలు గల్గెడిన్
కం.
మా! సామా! ప్రాచ్యాప్తా!
దాసాబ్జా! కార్యభాస! ధాతా! శ్రీరా
జ్ఞీసారా! పాకాద్యా!
రాసుల ప్రేమకు నిలయము ప్రాణము నీవే!!
చక్కని పద్యాలు.నిత్యసత్యాలు