
విరి దీపం!
విరి దళ దుర్గ రక్ష లోన,సౌరు మీరు నీలి భరిణె లోన,
కోరి కోరి చేరినట్టి ముద్దులొలుకు చిట్టి దీపకాంతి తీరు
ఏ రసావతార మహా ప్రభావు సంకల్పవిలాస సంజాతమో
కరములుమోడ్చిజయసదానందధామసౌందర్యసీమ యనన్
విశ్వరూపం!
సహస్రాక్ష సహస్రపాదుడై దర్శనమిచ్చె దయ శ్రీక్రృష్ణుడా
బ్రహ్మాండనాయకుడైన హరి యద్భుత విరాడ్రూపమై క్రీడికి,
మోహముద్గర సమ ముపనిషత్సారము గీతను చెప్పు వేళ
ఇహపర సాధక భగవ త్ప్రోక్తాఘనాశినియై యది వెల్గన్!
సమభావం!
ఎంత పాల వెన్నెల, కాన చీకట్లలోన దూరి జారిపోయెనో
ఎంత మురిపాల వెన్నెల, ఆ గోగుపూల చేరి రహి పెంచెనో
ఎంత వెండి పూల సౌరుల, తెలుపెరుగని ఆ చెట్ల నింపెనో
ఎంత పైడి చేల వరికంకుల సైయ్యాటలకు తళ్కు లద్దెనో
ఇంత లే దుల్లమున తన పర కుల్య గిరి కానన భేదము
చింతల తొలగించు శాంతకాంతుల ధనికి కలువరేనికిన్!!
మిశ్రరాగాలు!
అల్లనల్లన వీచేటి తెమ్మెర తరగల హేలగ నృత్యములు
మెల్లమెల్లని సన్నని గళముల సాగేటి గాలి ఊసులాటలు
తెల్లతెల్లవి కావు ఎర్ర ఎర్రలుకావు కోటి కొకటౌ రాగాలు
కొల్లబోవును కాదె మాటలు,పూలబాలల సౌరుల వర్ణనలన్!