చిలకమర్తి లక్ష్మీ నరసింహం
సాధారణంగా చరిత్రను పుస్తకాలలో చదివితే అంతగా బుర్రలోకి ఎక్కదు. అదే దృశ్య శ్రవణ రూపంలో అందరి మనసులకు హత్తుకునే విధంగా చూపిస్తే, వినిపిస్తే, అవలీలగా అందరికీ చేరి వారికి గుర్తుండిపోతుంది. ఈ చిట్కా ఇప్పుడే పుట్టినది కాదు. మన పెద్దవాళ్ళు ఏనాడో ప్రయోగాత్మకంగా చేసి సఫలీక్రుకృతులైనారు. అందుకే నాటి నాటకాలు, వీధి భాగోతాలు, హరికథలు, బుర్రకథలు మొదలు నేటి టీవీ సీరియల్స్ వరకూ అన్నింటికీ మనం బందీలైనాం. ముఖ్యంగా మన పౌరాణికాలు, ప్రబంధాలు సామాన్య ప్రజలకు అతి సులువుగా అర్థమయ్యేటట్లు చేసిన ఆ నాటక రచయితలకు జోహార్లు. అటువంటి ప్రజానాడి తెలిసి తదనుగుణంగా సామెతలు, నుడికారాలు, లోకోక్తులను, జాతాయాలను తన నాటక రచనలలో చొప్పించి, ఆయా పాత్రల ద్వారా సగటు ప్రేక్షకునికి ఎంతో అనుభూతిని అందచేసిన మహా రచయిత, మానవతా వాది, దాదాపు పాతిక వరకు నాటకాలను సృష్టించిన సంఘ సంస్కర్త, జాతీయ, అంతర్జాతీయ సాహితీ పండితుల మన్ననలను పొందిన మహనీయుడు శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహం, నేటి మన ఆదర్శమూర్తి.
1867 సెప్టెంబరు 26, నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని పశ్చిమ గోదావరి జిల్లా ఖండవల్లి గ్రామంలో రత్నమ్మ, వెంకయ్య దంపతులకు మన చిలకమర్తి వారు జన్మించారు. బాల్యం నుండే సాహితీ రచనల మీద ఎంతో ఆసక్తిని చిలకమర్తి వారు చూపించేవారు. హైస్కూల్ వరకు విద్యాభ్యాసం కొనసాగించారు.
20వ శతాబ్దం ఆరంభ కాలంలో తెలుగు వారిలో ఆధునిక భావాల వికాసానికి, భాషాభివృద్ధికి కృషి సల్పిన మహామహులలో చిలకమర్తి ఒకరు. తన సహజమైన కవిత్వ ధోరణిలో సామెతలను, నాటి సామాజిక స్థితిగతులను జొప్పించి నాటకాల రూపంలో రచించి ప్రజల ఆలోచనలకు చైతన్యం కలిగేటట్లు చేసిన గొప్ప నాటక కర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది మన చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు. తన మొదటి నాటకం ‘కీచకవథ’. అప్పటి నుండి అలుపెరుగక నాటక రచన చేస్తూనే ఉన్నారు. ఆయన రచించిన ‘గయోపాఖ్యానం’ అనే నాటకం ప్రతులు లక్షకి పైబడి అమ్ముడుపోవటమనేది తెలుగు సాహిత్య చరిత్రలో కనీ వినీ ఎరగని విషయం. వీరు రచించిన నాటకాలలో గయోపాఖ్యానము, ద్రౌపది పరిణయము, శ్రీ రామ జననము, పారిజాతాపహరణము, ప్రసన్నయాదవము, ప్రహ్లాద చరిత్ర మొదలైనవి ప్రసిద్ధమైనవి. పద్యనాటకాల ప్రక్రియను మొదలుపెట్టిన వారిలో ఆద్యుడు మన చిలకమర్తి గారే. ఎన్నో బహుమతులు, ‘కళా ప్రపూర్ణ’ బిరుదుతో పాటు ఎంతో కీర్తిని పొందిన లక్ష్మీ నరసింహం గారు దాదాపు 100 వరకు రచనలు గావించారు. ముఖ్యంగా ఆయన నాటక రచనలు సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి.
హాస్యం పండించడంలో, సమయస్ఫూర్తి తో మాట్లాడం చిలకమర్తి వారికి వెన్నతో పెట్టిన విద్య. ఎటువంటి క్లిష్టమైన పద్యాన్ని అయిననూ ఆశువుగా చెప్పడమే కాక, సరళమైన భాషలో అదే పద్యానికి ఎంతో చతురతతో అర్థం చెప్పడం ఆయనకీ మాత్రమే చెల్లుతుంది.
ఒకానొక సమయంలో ఎవరో “పకోడీల” మీద పద్యం చెప్పమని అడిగారు. వెంటనే ఆయన రామాయణానికి తెలుగువారి పకోడీకి లంకెపెట్టి పద్యాలను ఈ క్రింది విధంగా చెప్పారు.
ఆ కమ్మదనము నారుచి
యా కరకర యా ఘుమఘుమ యా పొంకములా
రాకలు పోకలు వడుపులు
నీకే దగు నెందులేవు నిజము పకోడీ.కోడిని దినుటకు సెలవున్
వేడిరి మున్ను బ్రాహ్మణులు వేధ నతండున్
కోడి వలదా బదులు ప
కోడిం దిను మనుచు జెప్పె కూర్మి పకోడీ !ఆ రామానుజు డా గతి
పోరున మూర్ఛిల్ల దెచ్చె మును సంజీవిన్
మారుతి యెరుగడు గాక య
య్యారె నిను గొనిన బ్రతుకడటవె పకోడీ !
మరొక సందర్భంలో “నల్లి” మీద ఆయన రాసిన కింది పద్యం చూడండి.
శివుడద్రిని శయనించుట
రవిచంద్రులు మింట నుంట రాజీవాక్షుం
డ అవిరళముగ శేషుని పై
పవళించుట నల్లి బాధ పడలేక సుమీ.
ఇలా చెప్పుకుంటూ పోతే చిలకమర్తి వారి గురించి ఒక పెద్ద గ్రంథమే అవుతుంది. నిజానికి ఆయన ‘స్వీయ చరిత్రము’ ౩౦౦ పేజీలతో ముద్రించడం జరిగింది. వంద సంవత్సరాల క్రిందటే తెలుగు ప్రజల అభ్యున్నతికి, సంఘంలోని సామాజిక అసమానతలను తొలగించడం కొఱకు ఎంతగానో కృషి సల్పారు. నిరక్షరాస్యత నిర్మూలనకు, విజ్ఞాభివృద్ధికి ఆనాడే బీజాన్ని నాటారు.
గత సంవత్సరం ప్రముఖ రచయిత, పాత్రికేయుడు, కౌముది పత్రిక సంపాదకుడు శ్రీ కిరణ్ ప్రభ గారు తన రేడియో టాక్ లో చిలకమర్తి గారి గురించి ఎన్నో మంచి విషయాలను వివరించారు. ఆ వీడియో ను ఇక్కడ చూడవచ్చు. https://youtu.be/y2-uuEj4rJQ
నాటకకర్తగా, నవలా రచయితగా, సంఘసంస్కర్తగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా తెలుగువారి అందరి మనసులలో స్థానం సంపాదించుకొన్న చిలకమర్తివారు 1946, జూన్ 17న రాజ మహేంద్రవరం అంటే నేటి రాజమండ్రి లో మరణించారు. కానీ ఆయన రచనలు అజరామరము.