పంచతంత్రం కథలు
- దినవహి సత్యవతి
బ్రాహ్మణుడు – రాక్షసుడు
అనగనగా ఒక అడవిలో ఒక రాక్షసుడు నివసించేవాడు. ఒకనాడు అతను అడవిలో తన నివాసమైన చెట్టుపైన కూర్చుని ఉండగా ఆ దారినే పోతూ ఒక బ్రాహ్మణుడు కనిపించాడు.
వెంటనే రాక్షసుడు ‘ఓరీ! ఆగు..ఆగు..’ అని అరుస్తూ ఒక్క ఉదుటన చెట్టుపైనుంచి క్రిందికి దూకి గబ గబా బ్రాహ్మణుడి దగ్గరకు వచ్చి ఆతని భుజాలపై ఎక్కి కూర్చుని ‘ఊ త్వరగా నడు’ అన్నాడు.
హఠాత్తుగా రాక్షసుడు తగులుకునేటప్పటికి ఏంచేయాలో తెలియని బ్రాహ్మణుడు వాడిని భుజాలపై మోసుకుంటూ భయపడి గబగబా నడవడం మొదలుపెట్టాడు.
కొంతదూరం నడిచాక రాక్షసుడి పాదాలు చూసి ‘అయ్యా! మీ పాదాలు ఇంత కోమలంగా ఎలా ఉన్నాయి?’ అడిగాడు బ్రాహ్మణుడు.
‘ఓ! అదా...నేను తడి పాదాలతో భూమిని తాకను. ఇది నా నియమం. అంతేకాదు నేనసలు నా అంతట నేను నడవను. నీలాగే ఎవడో ఒకడు తగిలితే ఇలాగే వాడి భుజాలపై ఎక్కి పోతుంటాను’ అన్నాడు.
రాక్షసుడి మాటలు విని ‘అయితే వీడు ఇప్పుడప్పుడే నన్ను వదిలేలా లేడు. ఎలాగైనా వీడిబారినుంచి తప్పించుకోవాలి’ అనుకున్నాడు బ్రాహ్మణుడు.
ఇంతలో దగ్గరలో ఒక చెరువు కనిపించింది. బ్రాహ్మణుడు గబగబా చెరువు వద్దకు వెళ్ళి రాక్షసుడిని గట్టుపై కూర్చోబెట్టి ‘అయ్యా మీరిక్కడే కూర్చోండి. నేనిప్పుడే చెరువులో స్నానంచేసి వస్తాను’ అన్నాడు.
‘ఊ సరే త్వరగా రా’ ఉరిమాడు రాక్షసుడు.
స్నానం ముగించుకున్న బ్రాహ్మణుడు, రాక్షసుడు కూర్చున్న వైపు కాకుండా మరోవైపునుంచి, తప్పించుకుని పారిపోసాగాడు.
పారిపోతున్న బ్రాహ్మణుడిని చూసిన రాక్షసుడు, తడి కాళ్ళతో నడవకూడదన్న తన నియమం గుర్తొచ్చి ఆతడు వెళ్ళిన వైపే కోపంగా నిస్సహాయంగా చూస్తుండిపోయాడు.