Menu Close
Page Title

తత్త్వమ్

తత్ అనగా – నిర్గుణుడైతే పరబ్రహ్మం ; సగుణుడైతే విష్ణువు, పరమేశ్వరుడు, ఈశ్వరుడు, శుభంకరుడు, భోళాశంకరుడు, శివుడు.., ఆ విశేషాత్మ అందరిలోను  ఉండి, ఆలోచింపచేసి, నడిపించే శక్తిమూలం ఆ పరమ శివుడే.  జగత్ కి మూలం శివుడే, శివుని వల్లనే అది నిలుస్తోంది, తుదకు, శివునిలోనే అది ఐక్యమౌతోంది.   అదే శివ తత్త్వం...

దాన్నే శ్వేతాశ్వేతర ఉపనిషద్ ఈ విధంగా నిర్వచించినది .

"ఏకోహి రుద్రో న ద్వితీయాయ తస్థుర్య ఇమాంల్లోకానీశత ఈశనీభిః|
ప్రత్యజ్జనమానంస్తిష్ఠతి సంచుకోపాంతకాలే సంసృజ్య విశ్వా భువనాని గొపాః||"    మంత్రం 3 -2

అనితర సహాయుడుగా, అద్వితీయమైన శక్తులతో పరమాత్మ నిర్గుణ బ్రహ్మము గాను, బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపాలతో సగుణ బ్రహ్మము గాను భాసిల్లుతున్నాడు. వివిధ విభూతులతో ఈ విశ్వాన్ని తానొక్కడై పాలిస్తున్నాడు.

అతడే అన్ని జీవులలో ఉంటూ, సమస్త భువనాలని సృష్టించి పోషిస్తూ, ప్రళయకాలంలో మళ్ళీ తనలోకే ఆకర్షించుకుంటున్నాడు. రుద్ర శబ్దానికి అర్ధం- భక్తుల పాపాలను, శోకాలను నాశనం చేస్తూ మానవులలో ఆనందాన్ని పంచేవాడై, పాపులని కఠోరుడుగా శిక్షించి పాలించు వాడు. ఎటువంటి మార్పు లేక, లక్షణ రహితుడై, సర్వవ్యాపియై, సర్వాతీత మైన శుద్ధ ఛైతన్యమూర్తియే బ్రహ్మము, ఆ పరమాత్మ.

'అనోరణీయాన్ మహతో మహీయా నాత్మాస్య జన్తోర్నిహితోగుహామాయ్|'- కఠోపనిషద్ (ద్వితీయ వల్లి-శ్లోక ౨౦)

సూక్ష్మాతి సూక్ష్మమైన అణువుకంటే చిన్నదీ, బ్రహ్మాండం కంటే గొప్పది అయిన పరమాత్మ, జీవుల హృదయాలలోనే ఉన్నాడు.

అది మౌర్తీభవించిన సత్-చిత్-ఆనంద స్వరూపం. సుందర విశాల పకృతి అయన యొక్క విభూతియే. ప్రకృతి వైపరీత్యాలు, ప్రళయం కూడా ఆయన విభూతులే. ఆయన దయానిధిగా, చిత్ర విచిత్ర రీతులలో ఈ విశాల సృష్టి అంతటిని సృజించి, తగినరీతిలో పెంచి, ఆదుకుంటూ, తుదకు తగిన సమయంలో లయం చేసే నిర్వికారుడు. తామరాకుమీద నీటిబొట్టువలె అంటీముట్టని చిదానంద మూర్తి. అనంత విశ్వం, అందులోని నక్షత్ర సమూహాలు, వాటిలోని అనేక లోకాలు, వాటిలోని, చేతన, అచేతన సృష్టి, వాటిని నడిపే  గురుత్వాకర్షణ శక్తి, అవి వెదజల్లే దివ్య తేజస్సు, సమస్తం ఆయన కల్పనలే.

ఆశ్రిత సులభుడైన శంకరుడు భక్తుల తపోబలానికి మెచ్చి వారిని ఆశీర్వదిస్తుంటాడు. బహుశా అందువల్లనే కాబోలు నరులు, వానరులు, రాక్షసులు, దేవతలు ఒకరనేమిటి అందరు ఆయన్ని ప్రార్ధించి, తపస్సుతో మెప్పించి అప్పుడప్పుడు చిక్కులలో పెడుతున్నా ఆయన తీరు మారలేదు.

సర్వజ్ఞుడై దక్షిణామూర్తి రూపంలో ఋషిపుంగవులకు ఆత్మతత్వాన్ని, సృష్టి రహస్యాన్ని మౌనంగానే బోధించి, వారి సందేహాల్నిమానసిక స్థాయినే విచ్చిన్నంచేసిన ధీశాలి శశిశేఖరుడు.

నిరాడంబరుడుగా దిగంబర మూర్తిగా, శవభస్మాన్నే విభూతిగా ధరిస్తూ, కపాల ధారియై బిక్షాటన చేస్తూ, నాగ భూషణుడు గా మానవులకి ఆదర్శ మూర్తిగా నిలిచిన ఆరాధ్యమూర్తి. ఆయన యోగీశ్వరుడు, అనేక  మానసిక, శారీరక,  ప్రాపంచిక, ఖగోళిక సమస్యలకి సమాధానం ఆయనే. అన్నికళలకు మూలం, ఆధారం ఆయనే. ఓంకార నాదానికి శబ్దము, అర్థం కూడా ఆయనే.

దేవాసురులు అమృతాన్వేషణలో కడలిని చిలికినప్పుడు ఉద్భవించిన హాలా హలాన్ని తానే త్రాగి, కంఠం భగ భగ మంటతో కాలుతూ నీలిరంగవుతున్నా, కక్కక, మ్రింగక గొంతులోనే నిలిపి తనలోని అంతర్లోకాలని బహిర్లోకాలని రక్షించిన నీలకంఠుడు, కరుణా సముద్రుడు. మార్కడేయునివంటి భక్తులని మృత్యుముఖమునుండి బయటకులాగి చంజీవిని చేసిన అమృతామూర్తి.

స్త్రీ కి అత్యధిక విలువ యిస్తూ అర్ధనారీశ్వరునిగా ఆచరణతో నిరూపించి వామదేవుడైనాడు.

విరూపాక్షుడిగా మూడుకళ్లతో బాహ్య సౌందర్యం కంటే అంతః సౌందర్యమే జీవికి ప్రధానమని ప్రస్ఫుటించాడు.

కపర్ది, శూలపాణి అయి త్రిగుణాలని (సత్వ, రజస్, తమోగుణాలని) నియంత్రించువాడు. ఎల్లరకు శుభాలనొసగే సదాశివుడు, ఆశ్రిత సులభుడు, భక్త వత్సలుడు గా సు ప్రసిద్ధుడు. మార్గ బహుళ చతుర్థి నాడు, మహాశివరాత్రి గా, శంకరుడు లింగరూపం లో ఆవిర్భవించిన  రోజని,  శివ శక్తుల వివాహ దినంగాను, ఆనంద తాండవమాడిన దినంగాను గణించి పవిత్ర దినంగా భక్తులు ప్రార్ధనతో, అర్చన అభిషేకాలతో, ఉపవాసాలతో, శివ లీలా గాధల శ్రవణంతోనూ భక్తి శ్రద్ధలతో గడిపి రాత్రి జాగరణతో తమ దీక్షని ముగిస్తారు.

'చంపేయ గౌరార్థ శరీర కాయై కర్పూర గౌరార్థ శరీరకాయ|
ధమ్మిల్ల కాయైచ జటాధరాయ నమః శివాయైచ నమః శివాయ||'

ఎవరి శరీరాలు మెరుగుపెట్టిన బంగారం వలె మెరుస్తాయో, ఎవరి శరీరాలు తెల్లని కర్పూరకాంతితో శోభిల్లుతాయో, అట్టి జటాధరుడు, అయిన గౌరీ పతికి ప్రణమిల్లుతున్నాను.

సత్యం, శివమ్, శుభం, సుందరం, కాంతం
సత్చిదానంద, సంపూర్ణ, సుఖ శాంతం
చిదానందరూప శివోహం, శివోహమ్ ||

అమల, విమల, నిర్మల, అచల
అవాఙ్మనోగోచర, అక్షర, నిశ్చల
చిదానందరూప శివోహం, శివోహమ్ ||

సత్యం జ్ఞానం అనంతం, ఆనందం
సత్-చిత్-ఆనంద, స్వయం జ్యోతి ప్రకాశం
చిదానందరూప శివోహం, శివోహమ్ ||

చేతనా చైతన్య చిద్ఘన, చిన్మయ
చిదాకాశ, చిన్మాత్ర, సన్మాత్ర, తన్మయ
చిదానందరూప శివోహం, శివోహమ్ ||

పూర్ణ, పరబ్రహ్మ, ప్రజ్ఞానఆనంద
సాక్షి, ద్రష్ట, తురీయా, విజ్ఞానా నంద
చిదానందరూప శివోహం, శివోహమ్||

సోహం, శివోహం, తత్వమసి, అహంబ్రహ్మాస్మి,
మహావాక్య సంస్థితా పూర్ణ పరబ్రహ్మ,
చిదానందరూప శివోహం, శివోహమ్ ||

-o0o-

Posted in March 2021, సాహిత్యం

2 Comments

  1. Krishna

    Very interesting to read about Siva Thathvam. Happy to know more about Lord Siva. Thanks to share this nice article in the month of Sivarathri. Om namasivaya!

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!