9. ఆంధ్రుల ఆరాధ్య దైవం
కోసల రాకుమారుడు, దశరథమహారాజ సుతునిగా జన్మించిన శ్రీ రాముడు ఆదర్శ మానవుడు అనగా- శిష్యునిగా, పుతృనిగా, భర్తగా, దుష్టశిక్షకుడు - శిష్టరక్షకుడుడైన మహారాజుగా జీవించి, అందరిచేత "రామో విగ్రహవాన్ ధర్మః” లేక “ధర్మో విగ్రహవాన్ రామః" అని కీర్తించబడిన తాను అవతార పురుషునిగా ఎక్కడా ప్రకటించలేదు కానీ యావత్ భారతదేశ ప్రజలచే దేవుడు గా ఆరాధింపబడుతున్నాడు. మనదేశంలో రామాలయం లేని ఊరు బహుశా ఉండదేమో! మనిషి దైనందిన మనుగడ లో ఎదుర్కొనే ఆటుపోట్లలో మనస్థైర్యాన్ని పెంచేందుకు ఎవరో ఒకరి సహాయము అవసరమవుతుంది. అది మానవ రూపంలో హితులైన పెద్దలుగానో, ఆత్మబంధువులు గానో ఉంటుంది. కానీ అది కావలసి వచ్చినప్పుడు లభించదు గనుక మనసుతో చూడగలిగే అదృశ్య దైవశక్తిని ఆలంబననగా కోరుకుంటాము. క్లిష్ట పరిస్థితులలో దానికై తపన మరీ బలంగా వేధిస్తుంది. ఆ సమయంలో మనం కోరుకునేది ధర్మమై, ఋజు మార్గంలో నమ్మకంగా నడిపించగలిగే శక్తి. ఉన్నతుడు, ఆదర్శమూర్తి అయి మానవ జీవన విధానానికి దగ్గరలో ఉండి తన లాగే దైనందిన సమస్యలకి పరిష్కారం వెదుక్కుంటూ జీవించిన దైవాన్ని అత్యంత ప్రీతికరమైన వ్యక్తిగా ప్రేమిస్తూ ఆరాధిస్తాడు మానవుడు. శ్రీ రాముడు అటువంటి అంచనాలకి సరితూగుతాడు గనుక భగవంతుని అవతారాలలో జనావళికి అది అతి ప్రీతికరమైన అవతారమైంది. అందుకే తెలుగు వారు ఏదైనా వ్రాసేముందు 'శ్రీ రామ' తో సాధారణంగా ఆరంభిస్తారు. తల్లులు పిల్లలకి 'శ్రీరామరక్ష' పెట్టడము మనం చూస్తూనే ఉన్నాము. రాముణ్ణి బలంగా నమ్మే జనం రామ కోటి వ్రాస్తూనో, దుర్వార్త వినడం సంభవిస్తే 'రామ రామ' అనుకుంటూనో, లేక అనుకోని సమస్య ఎదురైతే 'అయ్యో రామచంద్రా' అంటూనో, అనుకోని కష్టం వస్తే 'ఎందుకయ్యా రామా నాకీ కష్టాన్ని ఇచ్చావు' అంటూనో, లేదా పండగ సమయాల్లో ఏ గుడిలోనైనా రామ భజన చేస్తూనో కనిసిస్తుంటారు. ఆ జనావళి లో కళాతృష్ణ గల వాళ్లకి కొదువలేదు. హిందూ జనాలకి ఆరాధ్యదైవమైన రాముడ్ని ఎందరో భక్తులు తమ కవితా సంపద తోటి, గాన మాధుర్యాలతోటి, చిత్ర లేఖనా పటిమలతోటి, నాట్య కళా వైదుష్యంతోటి పూజించి అలరించారు. సాహిత్యంలో గోన బుద్దారెడ్డి, బమ్మెర పోతన, ఆతుకూరి మొల్ల, విశ్వనాథ సత్యనారాయణ; సంగీతంలో వాగ్గేయకారులు అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు, బాలమురళి; చిత్రలేఖనం లో బాపు, వడ్డాది పాపయ్య; చలనచిత్రాలలో కళా సృష్టికి బాపు మొదలైన ఎందరో ఆదేవుణ్ణి ఆర్తి తో కొలిచి అయన మెప్పు, ప్రజల మెప్పుని పొంది, అందులో కొందరు తుదకు కైవల్యాన్ని పొందారు. తెలుగు నేలపై గల రాముణ్ణి కొలిచే ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు భద్రాచల రామాలయం, ఒంటిమిట్ట కోదండ రామాలయం, హంపిలోని కోదండ రామాలయం.
శ్రీ కోదండ రామాలయం, ఒంటిమిట్ట: విజయనగర ఆలయ నిర్మాణ పద్ధతిన పదహారవ శతాబ్దంలో కట్టిన ఈ ఆలయం కడప జిల్లా ఒంటిమిట్టలో ఉంది. ఒంటెడు, మిట్టడు అనే ఇరువురు గజ దొంగలకి రాముడు కలలో కనబడి తాను దగ్గర అడవిలో ఒకచోట కప్పబడి ఉన్నానని, తనని వెదకి ఒక గుడి కట్టించమని చెప్పాడట. వాళ్ళు అక్కడ వెదకగా నిజంగా ఆ విగ్రహాలు దొరకగా, వాళ్ళకి ఆ దైవంపై గురి కుదిరి వాళ్ళు మారిపోయి సాధు జీవనం చేస్తూ, ఆ గుడి కట్టించారట. 32 స్తంభాలపై సుందరమైన అప్సరసల శిల్పాలతో తీర్చిదిద్దబడ్డ ‘మధ్యమండపం’ ఆలయానికే మకుటాయమానమై నిలుస్తోంది. అది 16వ శతాబ్దంలో శ్రీ కృష్ణ దేవరాయల కాలంలో పునరుద్ధరింపబడినదట. పోతన ఇక్కడ ఉంటున్న కాలంలోనే కోదండరాముడు కలలో కనబడి భగవతాన్ని ఆంధ్రీకరించమని ఆఙ్ఞాపించాడట. 'పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరొండు గాథ పలుకగనేల?' అంటూ పోతన తన “శ్రీమదాంధ్ర మహా భాగవత” కవితా కన్యని ఆ రామునికే అంకితమిచ్చాడు. ఇక్కడి రాముని ప్రోద్బలంతోనే అన్నమయ్య రాముని పై కీర్తనలు వ్రాశాడట. భావనాసి మాల ఓబన్న అనే భక్తుడు తాను రాసిన భక్తి గీతాలు పాడుకుంటూ ఇక్కడే గతించాడట. అతని పేర ఒక మండపం తూర్పు గోపురం వద్ద కనిపిస్తుంది. 'ఆంధ్ర వాల్మీకి' గా పేరొందిన వావిలకొలను సుబ్బారావు వాల్మీకి రామాయణాన్ని యధాతధంగా 24 వేల పద్యాలతో అలంకరించి "శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణ క్షీరార్ణవ మందరము" గా తెలుగు చేసి ఒంటిమిట్ట లోని కోదండ రామునికి అంకితం ఇచ్చారు. ఆయన ఆలయాన్ని పునరుద్ధరణకు తనవంతుగా కృషి చేసారు. ఈ ఆలయం కడపనుంచి తిరుపతి వెళ్లే మార్గ మధ్యంలో రహదారి పక్కనే కనిపిస్తుంది.
శ్రీ రామచంద్రస్వామి ఆలయం, భద్రాచలం: త్రేతాయుగంలో భద్రునికి రాముడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ద్వాపరయుగంలో చేసిన అతని ఘోర తపస్సుకి మెచ్చి, దర్శనమివ్వడానికి వచ్చే తొందరలో అపసవ్యంగా అస్త్రాలు ధరించి ప్రత్యక్షమైన విష్ణువు, భద్రుని కోరిక మేరకు శిలామూర్తి గా అక్కడే వెలిస్తే, ఆ విగ్రహం కాలగర్భంలో చీమల పుట్టతో కప్పబడి పోయి, కలియుగంలో 17వ శతాబ్దం చివరలో గోదావరి వరదలలో బయటపడినదట. పోకల దమ్మక్క అనే సాధ్వి ఆ రాముడికి మొదట్లో ఒక గూడు ఏర్పాటు చేస్తే, కంచర్ల గోపన్న ఆప్రాంతపు తాసిల్దారుగా పని చేస్తూ ఆ రాముని దీన స్థితి చూసి, శిస్తు గా వచ్చిన డబ్బు తో గుడి కట్టించడానికి ప్రయత్నించి అది సరిపోక భక్తజనావళి ఇచ్చిన ధనంతో గుడిని పూర్తి చేశాడట. శిస్తుగా వసూలు చేసిన ధనాన్నినిజాము ఖజానాకు కట్టకుండా గుడికి అక్రమంగా వాడినందుకు శిక్షగా నిజాము కారాగారంలో వేసి పన్నెండు ఏళ్లపాటు హింసలు పెడితే, అప్పుడు గోపన్న వ్రాసిన నిందాస్తుతి కీర్తనలు అన్ని ప్రాంతాల ప్రజలలో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నాయి. అవి మహా కవి కబీరుదాసుచే 'రామదాసు’ ని చేసి అతడికి అఖండ కీర్తినార్జించి పెట్టాయి. రాముడు లక్ష్మణుని తో సహా వచ్చి నిజాముకి శిస్తు మొత్తం ఆరు లక్షల బంగారు నాణాలు ఇచ్చి రసీదు తీసుకుని గోపన్నను రుణ విముక్తుణ్ణి, చెరసాల విముక్తుణ్ణి చేశాడట. ఆ బంగారు నాణాలలో కొన్ని నిజాము ఆ గుడికి బహుకరించగా వాటిని ఇప్పటికి ఆ గుడిలోనే భద్రపరచారు. వాటిని ప్రతి శ్రీరామ నవమికి భక్త జనాలకి చూపించి వారిలో భక్తి భావాన్ని పెంపొందిస్తున్నారు.
శ్రీ కోదండరామాలయం, హంపి: రాముడు వాలిని చంపిన తరువాత అదేస్థలంలో సుగ్రీవుని సింహాసనాధీశుని చేసిన పిమ్మట సుగ్రీవుడు ప్రతిష్టించిన రామ, లక్ష్మణ, సీత విగ్రహాలివేనని ప్రచారంలో ఉంది. ఈ ఆలయం కిష్కింధ లో ఉంది.
అ. తమ సాహితీ సంపదతో రాముణ్ణి కొలుచుకున్న శారదాపుత్రులు:
గోన బుద్ధారెడ్డి (౧౩౦౦): గోన బుద్దారెడ్డి గారు వాల్మీకి రామాయణాన్ని అక్కడక్కడ విశిదీకరిస్తూ తండ్రిపేర ద్విపద కావ్యంగా సరళమైన తెలుగులో ప్రజారంజకంగా మలచిన "శ్రీ రంగనాథ రామాయణం”, మొదటి రామాయణ గ్రంథమని చెప్పొచ్చు. ఇతడు యుద్ధ కాండ వరకు వ్రాయగా మిగిలిన భాగాలు ఆయన కుమారులు పూర్తి చేశారట. సుందరకాండలో హనుమంతుడు సముద్ర లంఘనం చేయడాన్ని, అక్కడ అయన కాంచిన లంకని ఎలా వివరించాడో చూడండి:
"శ్రీరామ కార్యంబు సేయంగ బూని - వారధి పిల్లకాల్వయుబోలె దాటి; చారు శ్రుంగంబుల సానుదేశముల - భూరిభూరుహలతాపుంజకుంజముల గలిమిచే నొప్పు లంకా సమీపమున- వేలాయుసు వేలాద్రి వేడ్కమై నెక్కి; యంత నాహనుమంతు డాయాద్రి మీద - నెంతయు గడకతో నేపుమైనిలిచి యట దక్షిణము చూచి యప్పుడిట్లనియె- నట ద్రికూటాద్రిపై నెమరెడుదాని; నమరావతీపురం బబ్ధిమధ్యమున- గమనీయగతి నొప్పు గల్గినదాని నలక కుబేరుతో నాలుకమైనచట -నెలకొన్న కైవడి నెగడెడుదాని; గలకాలమును నధోగతి నుండలేక - తెలివిమై భోగవతీనగరంబు జలరాశి వెలువడి సరి త్రికూటమున - వెలసినకైవడి విలసిల్లుదాని ;నంబుధి యావరణాంబువు ల్గగా - బండిన ప్రభనొప్పు బంగారుకోట నళినసంభవు గేహ మననొప్పునట్టి-లలితమై నొప్పెడు లంకాపురంబు ; కని చాల వెఱగంది కనురెప్ప బెట్ట - కానీ లతనుభవం డందంద జూచి యెల్లోకంబులు నెక్కట గెలిచి -బల్లిదుడై పేర్చు పంక్తికంధరుడు; ఇట్టిసంపదలచే నేనయు నీ లంక- పట్టాభిషిక్తుడై బ్రతికి పాలేది సకలేశుడగు రామచంద్రుని దేవి- వికలుడై కొనివచ్చే వీడేల పొలిసె? ; యని వాని దూషించి యాలంక చొరగ- ననువు విచారించి యా సత్వధనుడు ….” అట్లాగ సాగుతుంది ఆ ద్విపద కావ్యం.
బమ్మెర పోతన (1450-1510): సహజకవిగా ప్రసిద్ధిగాంచి దశావతారాలని మధురంగా తెలుగించి పండిత పామరుల మెప్పును పొందిన పోతన, శ్రీనాధ కవి సార్వభౌమునికి సమకాలికుడు. పోతన భాగవత గ్రంధాన్ని శ్రీ రామునికి అంకితమిచ్చి, వాణికి యిచ్చిన "నిన్ను నాకటికిం గొనిపోయి యల్ల కర్ణాట కిరాట కీచకులకమ్మ త్రిశుద్ధిగ నమ్ము భారతీ" అని చేసిన ప్రతిజ్ఞని నిలబెట్టుకున్నాడు. పోతన భాగవతంలోని కొన్ని మచ్చుతునకలు.
'కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలన్, కలడందురన్ని దిశలను" అని, "ఒకపరి జగముల వెలినిడి యొకపరి లోపలి గొనుచు, నుభయము గనుచున్, సకలార్ధ సాక్షి నాగు నయ్యకలంకుని నాత్మమయుని" అని, "లోకంబులు లోకేశులు లోకస్థులు దెగిన దుదిన లోకంబగు పెంజీకటి నెవ్వడు వెలిగేడు నేకాకృతితోడ" అని, "విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్ముని విశ్వవేద్యు విశ్వు నవిశ్వున్ , శాశ్వతునగు బ్రహ్మ ప్రభు నీశ్వరునిన్ "అని, "ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలనుండు లీనమై, యవ్వని యందుడిందు బరమేశ్వరుడెవ్వడు, మూలకారణంబెవ్వఁడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానె అయినవాడెవ్వడు, వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్", అని సకల వేదాంత సారమాకళింపుతో ఆ పరమాత్ముని శరణువేడిన గజేంద్రుని తనలో ప్రతిబింబిస్తూ ఆ మొర వినిపించిన పోతన ధన్యుడు. రామ భక్తుడైవుండి కూడా అద్వైత వేదాంతతత్వాన్ని సులభరీతి లో వెలుగొందించిన ధీశాలి. ఆసమయంలోనే, వైకుంఠపురంలోని విష్ణుని స్థితిని "ఆల వైకుంఠ పురంబులో .." వర్ణింపనారంభించి అక్కడి స్థితి ఊహకందని పరిస్థితిలో నదీ తీరాన దిక్కుగానక ఆలోచనలతో సతమతమౌతున్న సమయాన, ఆరామచంద్రుడే పోతన రూపముతో వచ్చి కూతురు వద్ద సగము వ్రాసిన పద్యభాగాన్ని తీసుకుని "నగరిలో నామూల సౌధంబు దాపల మందార వనాన్తరామృత సరః ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రామా వినోది యగునాపన్న ప్రసన్నుండు, విహ్వల నాగేంద్రము పాహి పాహి యన గుయ్యాలించి సంరంభి యై" అని పూరించి వారింట భుజించి, పోతన కవీంద్రునేకాదు మనలని కూడా పులకాంకితులని చేశాడు. వామనావతార ఘట్టాన్ని ఆవిర్భవిస్తూ పోతన వామనుడు బలి చక్రవర్తి యజ్ఞ మంటపాన్ని చేరుకుంటున్న విధాన్ని ఈ విధంగా అందంగా కందంలో వివరించాడు: "వెడ వెడ నడకలు నడచుచు, నెడనెడ నడుగిడగ నడరి యిల దిగబడగా, బుడి బుడి నొడవులు నొడువుచు జిడిముడి తడబడగ వడుగు సేరెన్ రాజన్". బుడి బుడి నడకల బుడుగు వటువుని చూసి బలి చక్రవర్తి 'ఎవ్వరివాడవు, ఎక్కడనించి వచ్చితివి' అన్నదానికి సమాధానంగా " ఇది నాకు నిలవని ఏరీతి బలుకుదు? ఒకచోటనక యందుండనేర్తు, నెవ్వనివాడనంచేమని పలుకుదు? నాయంతవాడనై నడవనేర్తు, నీ నడవడి యని యెట్లు వక్కాణింతు బూని ముప్పోకల బోవనేర్తు, నది నేర్తు నిది నేర్తు నని ఏల చెప్పంగ ? నేరుపులన్నియు నేనె నేర్తు; ఒరులుగారు నాకు నొరులకు నేనౌదు నొంటివాడ జుట్ట మొకడు లేడు, సిరియు దొల్లి గలదు చెప్పెద నాటెంకి, సుజనులందు దఱచు జొచ్చియుందు" అని భావయుక్తంగా పలికిస్తాడు పోతన. భాగవత గ్రంధమంతా రసమూరుతూ భావుకుని సాహిత్యరస పిపాసలని తీరుస్తుంది.
ఆతుకూరి మొల్ల (1440-1530): గోపవరం లో కుమ్మరివృత్తిలో జీవనము సాగిస్తున్న కేసన శెట్టి శ్రీశైల మల్లన్న భక్తుడిగా కూతురికి ఆ దేవునికి ఇష్టమైన మొల్లపువ్వు పేరుపెట్టుకుని ఆనందించాడట. ఆమె సాహిత్య సీమలో పంటలు పండిస్తుంటే పరవశించాడట. ఆమె బమ్మెర పోతన రచనలనాదర్శంగా తెలుగించిన వాల్మీకి రామాయణం విని సమకాలీకుడైన శ్రీ కృష్ణదేవరాయలు తన ఆస్థానానికి సపరివార మర్యాదలతో ఆహ్వానించాడట. అక్కడి అష్టదిగ్గజ కవులు, స్త్రీ మరియు కుమ్మరి అని నిమ్నదృష్టి తో చూసి ఆమెకు పరీక్షగా -తనకంటే బలవంతుడైన మొసలి నుండి గజేంద్రుడు ఏవిధంగా రక్షింపబడినదో తాముచెప్పిన వృత్తంలో ఒక్క నిముష కాలంలో చెప్పమంటే అదే గడువు లో రెండు పద్యాలని పాడి వారిని అబ్బురపరచినదట. వారి సలహామేరకు శ్రీ కృష్ణ దేవరాయలు ఆమెను 'కవిరత్న' బిరుదు తోనూ, కనకాభిషేకంతోనూ సత్కరించాడట.
ఆమె కవితా విపంచి పలికిన కొన్ని పద్యాలు:
పూర్వకవులు తమ కావ్యాలలో విరివిగా వాడిన సంస్కృత పదాలని మెచ్చుకోలేక వ్రాసిన వ్యంగ్య పద్యం:
“గీ. తేనె సోక నోరు తీయన అగురీతి ;
తోడ నర్ధమెల్ల దోచకుండ;
గూఢశబ్దములను గూర్చిన కావ్యమ్ము;
మూగచెవిటివారి ముచ్చటగును.
హనుమంతుడు సీతా దేవికి తాను రామునివద్దనుండి తెచ్చిన ఉంగరము ఇచ్చి, శ్రీ రామునికి తాను సీతా మాతను కలిసిన సంగతి నమ్మకము పుట్టటకు ఆమెను ఒక ఆనవాలు యిమ్మని కోరగా సీత దేవి:
'క. నానాధు క్షేమ మంతయు;
ధీనిధి ! నీచేత వింటి దెలియఁగనైనన్
నీ నిజరూపము చూడక;
నేనారత్నంబు నమ్మి నీ కీయాజుమీ.
వ. అనుటయు నా హనుమంతుడు,
క. చుక్కలు తలపూవులుగా ;
నక్కజముగా మేను వెంచి అంబరవీధిన్
వెక్కస మై చూపట్టిన ;
నాక్కోమలి ముదము నొందె నాత్మస్థితికిన్.
వ. ఇట్లు తన మహోన్నత రూపంబు చూసి ఎప్పటి యట్ల మరల సూక్ష్మ రూపంబు గైకొని నమస్కరించిన నా హనుమంతునకు నద్దేవి తన శిరోరత్నంబనుగ్రహించి యిట్లనియె
చం. రవికులవార్ధి చంద్రు డగు రాముని సేమము చాలవింటి నా;
వివిధములైన పాట్లు పృథివీపతికిన్ దగజెప్ప గల్గె నే,
దవిరళభంగి నీవలన నచ్చుగ నే నుపకారము మేమియున్ ;
దివిలి యొనర్ప లేను వసుధాస్థలి వర్ధిలు బ్రహ్మకల్పముల్ "
అని తేట తెలుగులో వ్రాసిన ఆమె రచనా తీరు శ్లాఘనీయం.
కంకంటి పాపరాజు (1575-1632): నరసమాంబ, అప్పయ్యమాత్యుల కుమారుడు, నెల్లూరు జిల్లావాసి. 'శ్రీ మదుత్తర రామాయణం' ప్రబంధ కావ్యాన్ని చెంపు శైలిలోను, విష్ణు మాయావిలాసం యక్ష గాన రూపంగాను వ్రాసి కీర్తి కెక్కాడు. ఈయన శైలితో ప్రభావితులయి, దాని ననుసరించి తరువాతి కాలంలో ప్రసిద్ధి గాంచిన కవి శేఖరులు తిరుపతి -వెంకట కవులు, పింగళి-కాటూరి కవులు, జాషువా, మరియు కరుణశ్రీ.
శ్రీ రామ అవతారము ముగించు ఘట్టాన్ని ఈ విధము గా వివరించాడు పాపరాజు:
సీ. పండు వెన్నెలడాలు బైటవేయగ జాలు ప్రవిమల క్షౌమాంబరములు గట్టి
గరుడపచ్చలయేవు పరిహసింపగ నోపు దర్భాంకురములు హస్తముల దాల్చి
హరినీలములరంగు నపహరింప దొడంగు ఘనకేశబంధంబు వెనుక జేర్చి
తమ్మి రేకులజోక తలగ జేయువిలోకనములు స్వనాసికాగ్రముననుంచి
తే. శాంతలక్ష్మి వసించుకంజాత మనగ ;
మొగము దులకించ బటుమౌనముద్ర మించ
నేవికారంబు లేక యయ్యిన కులేంద్రు;
డల్లనల్లన నాత్మ గృహంబు వెడలె.
కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ (1895- 1976) : చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రిగారి అసమాన శిష్యుడు, విశేష శాస్త్రీయ తెలుగు కవి. ఆయన వ్రాసిన పద్యాలు, నవలలు, నాటికలు, కథలు, గేయాలు, వ్యాసాలు వివిధ సాహిత్య, సామాజిక, పౌరాణిక, చారిత్రక, మానసిక, శాస్త్రీయ, ఆధ్యాత్మిక విషయాలని స్పృశిస్తూ సమగ్ర ఆకళింపుతో వివిధ కోణాల్లో పరిశీలించి పండితులని మేధావులనే కాక సామాన్యులని కూడా మెప్పించే గ్రంధాలుగా సుప్రసిద్ధములు. ఆయనకి అత్యంత ఉన్నత సాహిత్య గ్రంథ కర్తలకి మాత్రమే యిచ్చే విలువైన 'జ్ఞానపీఠ' సత్కారముతోను (1970), 'భారత ప్రభుత్వం 'పద్మభూషణ్' (1970) బిరుదంతోను సత్కరించి వాటి ప్రతిష్టని పెంచుకున్నాయి. 'పురాణ వైర గ్రంథమాల' గా పన్నెండు నవలలు, 'నేపాల రాజ వంశ చరిత్ర' గా ఆరు నవలలు (చార్వాక ఆలోచనాక్రమాన్ని, సమాజంపై దాని ఫలితాలని విశదీకరిస్తూ), 'కాశ్మీర్ రాజ వంశ చరిత్ర' ఆరు నవలల రూపంలోను, 'వేయిపడగలు' అనే ఉత్కృష్ట నవలారాజమేకాక దాదాపు 200 ఖండకావ్యాలు, 50 నవలలు, 30 పద్యకావ్యాలు, 20 నాటికలు, 'విశ్వనాథ మధ్యాక్కరలు' అనే నీతి శతకము, ఇంకా చాలా లిఖించి తెలుగు సాహిత్య సీమ లోనే చరిత్ర సృష్టించిన మహోన్నతుడు. ఆయన వ్రాసిన 'రామాయణ కల్పవృక్షము' వాల్మీకి వ్రాసిన రామాయణానికి స్వేచ్చానువాదమే అయినా తెలుగులోనే ఒక చారిత్రక సృష్టి. అందులోని కొన్ని ఉదాహరణలు:
రాముని బాల్యక్రీడలు వర్ణిస్తూ
‘పాల్ద్రావు రామచంద్రుండు పాల్ద్రావుచు రాఘవుండు పరువెత్తి మరిన్;
పాల్ద్రావువచ్చి యాతడు పాల్ద్రావఁగ దల్లియడద పాలకడలియౌ’.
విశ్వామిత్రుడు దశరథుడిని రాముని యాగరక్షణ కు పంపని కోరగా దశరధుడు :
'రాముడు నాకు స్నానమగు రాముడు నాకు జపంబు ధ్యానమున్
రాముడెయెల్ల నాబ్రతుకు రాముడు నన్నునుగన్న తండ్రి యీ
రామువైనా నిమేషమవురా మనజాలను గాదనియేనినీ
రామునివీడి ఈ యఖిల రాజ్యము గాధిసుతా! గ్రహింపవే!'
అంటూ తన కుమారుని పట్ల గల భావ బంధాన్ని తెలియజెప్పాడు.
విశ్వనాథ వారి గిరి కుమారుని ప్రేమగీతాలలో
'అస్మదీయకంఠమునయం దాడుచుండె; నొక యెదోగీతి బయటికి నుబికిరాదు
చొచ్చుకొని లోనికింబోదు వ్రచ్చిపోయె; నాహృదయ మీ మహా ప్రయత్నమునందు.'
మరొక ఉదాహరణ, ఒకే పద్యంలో ఆయన ఏర్చి గుచ్చిన సామెతల సమాహారం:
'అయినవారికేమొ యాకుల యందున; గానివారి కైన గంచములను
ఇంటిలోన దించు నింటివాసంబులు; లెక్క పెట్టునట్టి లెక్కగాఁగఁ.’
-o0o- సశేషం -o0o-