గోదావరి ఒడ్డున ఊపిరిపోసుకుని, మేనమామల ఒడిలో ఓనమాలుదిద్దుకుని, తాతగారి చిటికినవేలు పట్టుకుని లోకాన్ని క్రమశిక్షణే ఉపిరియై వీక్షిస్తూ, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలలో విద్యాబుద్ధులు పెంచుకుని, దూరసంచార సాంకేతిక పరిధిలో మానసిక పరిణతి పొంది, వివిధ గడ్డు సమస్యలని సాంకేతికంగాను, మనోస్థైర్యంతోనూ ఎదుర్కొంటూ ముప్పయి రెండు సంవత్సరాలు భారతదేశంలోనూ, మూడు వత్సరాలు ఆఫ్రికా ఖండంలోనూ ఎదురైన క్లిష్ట సమస్యల పరిష్కరిస్తూ, అభినందనల జల్లులలో తడిసి, అమెరికా వలస వచ్చి పదిసంవత్సరాలు అక్కడ దూరసంచారాభివృద్ధిలో సాంకేతికంగా పాలుపంచుకుని, జీవితపు చరమాంకంలో దైవచింతనతో జీవన్ముక్తుడు కావాలనే ఆశయంతో ఆత్మాన్వేషణలో సాగుతున్న ఈ జీవితానికి పరమార్ధం ఏమిటో వెతుక్కుంటూ గడుపుతున్నాను...
తెలుగు భాష మీది మక్కువ, నా జీవితానుభవ సాహితీ పటిమతో నా రచనల ద్వారా భావితరాలకు ఎంతో కొంత తెలుగు భాషా సంస్కృతిని పంచాలనేది నా అభిలాష.
--గుమ్మడిదల వేణుగోపాలరావు
1. కవి, మహారాజు
ప్రపంచ చరిత్ర తిరగేస్తే చాలామంది గొప్ప కవులు ఉన్నారు, అలాగే పెద్ద రాజ్యాలనేలిన గొప్ప రాజులూ ఉన్నారు. కానీ కవి అయిన మహా రాజులు కొద్దిమంది అనే చెప్పాలి. మన దేశంలో ఉత్తరాదిన శ్రీ హర్షుడు (ఆరవ శతాబ్దానికి చెందిన ఈయన నాగానందం, రత్నావళి, ప్రియదర్శిక అనే గ్రంధాలు కాకుండా మూడు, శృంగార, నీతి, వైరాగ్య శతకాలు వ్రాశాడు), మాల్వసామ్రాజ్యాధీశుడు, ధారానగరాధీశుడు భోజరాజు (పదవ శతాబ్దానికి చెందిన ఈ మహారాజు- చెంపు రామాయణ, సరస్వతి కంఠాభరణం -వ్యాకరణ గ్రంధం, యుక్తి కల్పతరు-నౌక శాస్త్రం, రాజకీయము, నగర నిర్మాణం, నగల నాణ్యత, భుజబల భీమ- జ్యోతిష శాస్త్ర గ్రంధం, మొదలైన ఎనభై పైన పుస్తకాలు సంస్కృతంలో వ్రాసాడు. వాటిలో కొన్ని సాంకేతిక గ్రంధాలు). దక్షిణాన సుమతి శతక కారుడు బద్దెన (పదమూడవ శతాబ్దానికి చెందిన ఈయన ఒక చిన్న సామంత రాజు), వేమన శతక కారుడు వేమన (పదిహేడో శతాబ్దానికి చెందిన కొండవీటి రాజు) ఈ కోవకే చెందినా, వారు నీతి శతకాలకే తమ రచనలని పరిమితం చేశారు. వీరి రాజ్యాలు పెద్దవి కాకపోవడంవల్ల, రాజ్యభారం పరిమితమై ఇతర రచనా వ్యాసంగాలకి సమయం మిగిలేది.
కానీ పదహారవ శతాబ్దానికి చెందిన తుళువ వంశీయుడు, విజయనగర సామ్రాజ్యాధీశుడు, ‘ఆంధ్ర భోజ’/ 'అభినవ భోజ' బిరుదాంకితుడు, శ్రీ కృష్ణ దేవరాయలు, తెలుగు, సంస్కృత భాషల లో కావ్యాలు వ్రాశాడు. శ్రీ కృష్ణ దేవరాయలు ‘ఆముక్తమాల్యద’ అనే కావ్యాన్ని తెలుగులో వ్రాశాడు. జాంబవతి కళ్యాణం, మదాలస చరిత్ర, సత్యవేడు పరిణయం & రసమంజరి అనే రచనలు సంస్కృతంలో చేశాడు. 'భువన విజయం' గా ప్రసిద్ధికెక్కిన శ్రీ కృష్ణ దేవరాయలు ఆస్థానంలో అష్ట దిగ్గజాలు ఉండేవారు. వీరు ప్రబంధ కవులుగా ప్రసిద్ధి చెందిన - పెద్దన (స్వారోచిష మనుసంభవం, హరికథాసారం), నందితిమ్మన/ముక్కుతిమ్మన (పారిజాతాపహరణం), పింగళి సూరన్న (రాఘవ పాండవీయము, కళాపూర్ణోదయం), మాదయ్యగారి మల్లన (రాజశేఖర చరిత్రము), అయ్యలరాజు రామభద్రుడు (రామాభ్యుదయము), ధూర్జటి (కాళహస్తీశ్వర మాహాత్మ్యము), తెనాలి రామకృష్ణుడు(పాండురంగ మాహాత్మ్యము), భట్టుమూర్తి- రామరాజ భూషణుడు (వసుచరిత్రము) రాయల ఆస్థానాన్ని అలంకరించేవారు.
‘దేశభాషలయందు తెలుగు లెస్స’ అనే రాయల ‘ఆముక్తమాల్యద’ పద్యభాగం ఒక నానుడి అయింది. శ్రీ కృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని, హంపి రాజధానిగా చేసుకుని 20 ఏళ్ళు (1509-1529 CE) చాలా పద్దతి గా పాలించాడు. పాలించింది కొద్దికాలమే అయినా, సాధించినది అమోఘమై, ఆయనకు అఖండ కీర్తి ని తెచ్చిపెట్టింది. ఒకవైపు రాజ్య విస్తరణ, దాని సుపరిపాలన, మరోవైపు, వీటితో బాటు సాంస్కృతిక వైభాన్ని అందలానికి ఎక్కించడం, సాహిత్యానికి అఖండ సేవ, దేవాలయాల పునరుద్ధరణ, దేశ సంపదల పెంపు రాయల ఔన్నత్యాన్ని చాటి చెప్పాయి. ఆ రోజులలో హంపీవీధులలో రాతనాలు, వజ్ర వైడూర్యాలు కొలమానికలతో అమ్మేవారట, అది ఆ రోజులలో అనేక విదేశపర్యాటకులు వర్ణించిన విషయం. హంపిని చూస్తే అప్పుడు అక్కడ వాడిన సాంకేతికత మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. విద్యుత్తు ఇంకా పుట్టని రోజులలో ఎతైన రాణి వాసాలకి నీరు సరఫరా చేసేవారు. దేశంలో తెలుగు భాషకి అంతకుముందెన్నడు లేని వైభవాన్ని తెచ్చినది రాయలవారే. ‘భువనవిజయం’ లో జరిగిన రాయల కవి సమ్మేళనాలు, పండిత సభలు సుప్రసిద్ధమై అలరారుతుండేవి. అక్కడి విరూపాక్షాలయంలోని శిలా స్తంభాలు రాయితో గాని, కర్రతో గాని తట్టితే 'స రి గ మ ప లు' యిప్పటికీ ధ్వనిస్తాయి. రాయల కాలాన్ని చరిత్రకారులు తెలుగు సాహిత్యానికి స్వర్ణయుగం గా పరిగణిస్తారు. తెలుగేకాదు, కన్నడ, సంస్కృతం, తమిళ కవులు కూడా అయన ఆస్థానంలో మంచి ఆదరణ పొందేవారు. సంగీత ఔన్నత్యానికి పునాది రాయల కాలంలోనే పడింది. అన్ని కళలయందు పురోభివృధి సాధించినందుకే అది స్వర్ణయుగంగా పేరుతెచ్చుకుంది.
డోమింగోస్ పైస్ అనే పోర్చుగీస్ బాటసారి హంపిని వర్ణిస్తూ, ఆ నగరం రోమ్ అంతటి పెద్దదని, హంపిలో ఉన్నన్ని సౌకర్యాలు ప్రపంచంలో మరెక్కడా లేవని వర్ణించాడు. రాయలని చాల గొప్ప న్యాయ పాలకుడిగా పైస్ అభివర్ణించాడు.
హంపికి కర్ణాటకలోని బళ్లారి నుంచి గానీ, హాస్పెట నుంచి బస్సులపైనా లేదా, స్వంత వాహనాలపైనా గానీ, సులభంగా చేరుకోవచ్చు.
Very nice to read about our great historical land and the monumental heroes. Very well written with many interesting facts. Please keep coming. Waiting for the next one.
Thank you