Menu Close
sahiti-pudota

భాస్కర శతకము

నేరిచి బుద్ధిమంతుఁడతి | నీతి వివేకము దెల్పినం జెడం
గారణమున్న వాని కది | కైకొనఁగూడదు నిక్కమే; దురా
చారుఁడు రావణాసురుఁడ | సహ్యము నొందఁడే చేటు కాలముం
జేరువయైన నాఁడు నిర | సించి విభీషణు బుద్ధి భాస్కరా!

తాత్పర్యము: భాస్కరా! మానవునకు చెడుకాలము ప్రాప్తించినచో ఎంతటి మహాత్ముడు నీతి చెప్పిననూ తిరస్కరించును. ఎట్లనగా తమ్ముడగు విభీషణుడు నీతితో సీతను రామున కప్పగించుట మంచిదని చెప్పగా చేటుకాలము సమీపించిన రావణుడు ఆ నీతిని తిరస్కరించి తన ప్రాణానికే ముప్పు తెచ్చుకొనెను గదా!

పండితులైనవారు దిగు | వందగ నుండగ నల్పుఁడొక్కడు
ద్దండతఁబీఠమెక్కిన బు | ధ ప్రకరంబుల కేమియెగ్గగున్?
గొండొక కోఁతి చెట్టుకొన | కొమ్మలనుండగఁగ్రింద గండభే
రుండ మదేభసింహనికు | రుంబము లుండవె? చేరి భాస్కరా!

తాత్పర్యము: భాస్కరా! గండభేరుండాది పక్షులు మదించిన ఏనుగులు సింహములు మొదలగునవి, చెట్టు క్రింద ఉండగా, నా చెట్టు కొమ్మల చివర వానరమెక్కి కూర్చున్నంత మాత్రమున దానిచే వాటికి ఏ అవమానము, చెడును కలుగదు. అట్లే నీచుడు దుష్టత్వముచే పీఠము మీద కూర్చుండి యున్ననూ, క్రింద కూర్చుండిన పండితులకు తలవంపు ఏ మాత్రము కలగదని భావము.

పట్టుగ నిక్కుచున్ మదము | బట్టి మహాత్ముల దూలనాడినం
బట్టిన కార్యముల్ చెడును | బ్రాణమువోవు నిరర్థదోషముల్
పుట్టు; మహేశుఁగాదని కు | బుద్ధి నొనర్చిన యజ్ఞతంత్రముల్
ముట్టకపోయి దక్షునికి | మోసమువచ్చెఁగదయ్య భాస్కరా!

తాత్పర్యము: భాస్కరా! దక్షుడు దురాలోచనలతో ఈశ్వరుని తిరస్కరించి, యాగము చేయుటకు సన్నద్ధుడై యుండగా, ఆయాగమంతయు పాడై చివరకు తన ప్రాణమునకే ముప్పును తెచ్చుకొనెను. అట్లే దుష్టుడు గర్వముతో పట్టువిడవక, మంచి వారిని తూలనాడుచున్నచో ఆ పని పాడగుటయే గాక, ప్రాణహాని కూడా పొందగలడని భావము.

పరహితమైన కార్యమతి |భారముతోడిదియైనఁబూను స
త్పురుషుఁడు లోకముల్పొగడఁ | బూర్వము నందొక ఱాలవర్షమున్
గురియఁగజొచ్చినన్ గదిసి | గొబ్బున గోజన రక్షణార్థమై
గిరి నొక కేల నేత్తెనట | కృష్ణుడు ఛత్రముభాతి భాస్కరా!

తాత్పర్యము: భాస్కరా! ఇంద్రుడు శ్రీ కృష్ణునిపై కోపముతో రాళ్ళ వర్షము గురిపించుచుండగా ఆ కృష్ణుడు గోవులను, గోపాలకులను రక్షించు నిమిత్తము మిగుల కష్టమగు గోవర్థన పర్వతమును గొడుగు మాదిరిగా ఒక్కచేతితో పైకి ఎత్తెను.  అట్లే మంచివాడెంత కష్టమైన కార్యమునైనను పరోపకారము కొరకు లోకము మెచ్చునట్లు చేయుచుండును.

పలుచని హీన మానవుడు | పాటిఁదలంపక నిష్ఠురోక్తులం
బలుకుచు నుండు గాని, మతి | భాసురుఁడైన గుణప్రపూర్ణుఁడ
ప్పలుకులఁబల్కబోవడు ని | బద్ధిగ నెట్లన; వెల్తికుండ దాఁ
దొలఁకుచునుండుగాని మఱి | తొల్కునె నిండు ఘటంబు భాస్కరా!

తాత్పర్యము: భాస్కరా! నిండుగా నీళ్ళులేని, వెల్తిగల కుండ తొణుకును గాని, నీరు నిండుగా గల కుండ తొణకదు. అట్లే నీచుడు న్యాయము చెప్పక కఠినపు మాటలను మాట్లాడును. కానీ గుణవంతుడు న్యాయముతో నిండిన మాటలనే పల్కుచుండును.

వచ్చే సంచికలో మరిన్ని భాస్కర సూక్తులతో కలుద్దాం.

 

మూలం: పెద్దబాలశిక్ష

Posted in April 2018, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!