
కృతజ్ఞతలు సదాశివా...
నీకోసం తపించే ఆరాటం
నీకోసం నడిచే ఆసక్తి
నీకోసం పాదయాత్ర చేసే అవకాశం
నాకు కల్పించినందుకు కృతజ్ఞతలు సదాశివా...
ఎక్కడో పల్లె నుంచి
ఎక్కడో ఉన్న నల్లమలదాక
నడిచే సహనం, ఓపిక ఇచ్చి
15వ సారి పాదయాత్ర చేసిన పేరు, ఫలితం
నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు సదాశివా...
నా ఊరు ఆదోనిలోని పర్వతాపురం
నీ ఊరు నల్లమలలోని శ్రీశైలం
మధ్యలో దూరాన్ని భక్తితో తీసి
శ్రీశైల మల్లికార్జునుడిగా
ముక్తి దర్శనం ఇచ్చినందుకు కృతజ్ఞతలు సదాశివా...
ఏపుగా పెరిగిన చెట్లు
ఏరులా సాగే భక్తులు
బైర్లూటి అంజన్న అభయం
నాగలూటి వీరభద్రుడి కొండ మెట్లు
చూసే భాగ్యం ప్రసాదించినందుకు కృతజ్ఞతలు సదాశివా...
అడవి అందాలు
అడవిలో ఆశ్చర్యాలు
చెంచుగూడాలు
పెచ్చెరువు సోయగాలు
పాదయాత్రికులకు చూపించినందుకు కృతజ్ఞతలు సదాశివా...
మనుషులను పచ్చగా మార్చే పసరు కొండ
మనుషుల కోరికలు తీర్చే కోరికలకొండ
మనుషుల చిత్తశుద్ధిని పరీక్షించే కత్తులకొండ
మనుషులను మరో లోకానికి తీసుకెళ్ళే భీముడికొలను
నీ ఆట ఆహ్లాద నల్లమల అందాలకు కృతజ్ఞతలు సదాశివా...
హటకేశ్వరలింగం చూసిన హాయితనం
పాలదార పంచదారల ఔనత్యం
ఆదిశంకరుల తపసు బిలము
సాక్షి గణపయ్యతో నేను చెప్పుకున్న
అంతా నీ దయ సౌభాగ్యం కృతజ్ఞతలు సదాశివా...
దుమ్ము పట్టిన దేహంతో నేను చేసుకున్న దూళిదర్శనము
అమ్మ భ్రమరాంబతో కలిసి నువ్వు ఇచ్చిన దర్శనము
నా కళ్ళనిండుగా మెరిచిన శ్రీశైల శిఖరం
అ మల్లికార్జునుడు నా గుండెల్లో నిఖరం
మాటల్లో చెప్పని మహాత్మ్యం చూపినందుకు కృతజ్ఞతలు సదాశివా...
మరో రోజు 24 కిలోమీటర్ల దూరానున్న ఇష్టకామేశ్వరి దర్శనం
శ్రీశైల క్షేత్ర పుట్టుకకు మూలమైన కార్తీకేయుడి శిఖరం దర్శనం
తలనీలాలు సమర్పణం, పాతాళగంగ స్నానం
అక్క మహాదేవి గుహల విశిష్టం
శ్రీశైలమందు సకల గుళ్ళ వీక్షణం
మనసును ఉప్పొంగించే శివాజీ స్పూర్తి కేంద్రం
ఇంతటి కరుణకు కృతజ్ఞతలు సదాశివా...
శివరాత్రి దినం
శ్రీశైల క్షేత్రమందు పాగాలంకరణం
చంద్రమతి శివలింగానికి అభిషేకం
లింగోద్భవ కాలమందు మల్లికార్జునుడి ఏకదాటి స్మరణం
శివయ్య... ఈ అర్భకుడికి ఇంతటి మహప్రసాదం
నీతో స్నేహం చేసిన ఈ జన్మధన్యం...
కృతజ్ఞతలు సదాశివా...