
చాల్లే పోవయ్య
చేయకూడని తప్పులు చేసినోడిని
తలపై పెట్టుకునే నీ యంత మంచిగుణం నాకు లేదు లేవయ్య...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
చాల్లే పోవయ్య...
నెత్తిన గంగను పెట్టుకుని
పార్వతమ్మకు కోపం వస్తుందని
తనువు సగభాగం ఇచ్చి చల్లబరిచావు
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
చాల్లే పోవయ్య...
కనిపించని నిన్ను
కనిపించమని కోరుకునే మాయలో మనుషులను పెట్టి
కనిపించకుండా తిరుగుతున్నావా
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
చాల్లే పోవయ్య
బోడీ విషాన్ని ఎందుకు మింగావో
మా తెలుసులేవయ్య
నా భక్తులు తాగడానికి మజ్జిగ ఇస్తారనే కదా
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
చాల్లే పోవయ్య
తోలుబట్ట కట్టుకుని
తొమ్మిది బొక్కల ఈ తోలుతిత్తి తోలు తీయడమే నీ పనా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
చాల్లే పోవయ్య
మెడలో పామును వేసుకుని
భయపెట్టి బలవంతపు పూజలు అందుకుంటున్నావు
నువ్వేం దేవుడివయ్య
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
చాల్లే పోవయ్య
భార్య పిల్లను ఇంట్లో వదిలేసి
కాట్లో తిరుగుతూ
దేహాల గూట్లో దీపాలు ఆర్పేస్తూ తైతక్కలాడుతావా
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
చాల్లే పోవయ్య
ప్రాణాలు తీయడమే పనిగా పెట్టుకున్న నువ్వు
పరమాత్ముడి ఎట్లైతివో
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
చాల్లే పోవయ్య
పిలగాడి తలతీసి తలమార్చిన నువ్వు
మా దేవుడని చెప్పుకోవడానికి తలతీసినట్లుంది...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
చాల్లే పోవయ్య
ఆది భిక్షగాడై
అందరి ప్రాణాలను కాలపు జోలెలో వేసుకుంటున్నావా
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...