Menu Close
భగవద్విభూతి
-- ఆర్. శర్మ దంతుర్తి

సత్యాన్వేషణ – 5

(మొదటి, నాలుగు వ్యాసాలు ఇక్కడ చూడవచ్చు: భగవద్విభూతి-1, భగవద్విభూతి-2, భగవద్విభూతి-3, భగవద్విభూతి-4)

భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ధ్యానం కదా మొదట చేయాల్సింది? ఆ ధ్యానం కుదరాలంటే మనసు కుదురుగా ఉండాలి లేకపోతే కళ్ళుమూసుకోగానే మనకి కనిపించేది, రోజూ మనం చేసే మోసాలూ, ప్రపంచంలో కనిపించే కుళ్ళూ, లేదా మనం అనుకునే అద్భుత సౌందర్య రాసులైన సినిమా తారలూను. ఈ మనసు ఓ కోతి వంటిది, ఏది వద్దనుకుంటామో దాని గురించే ఆలోచిస్తుంది కానీ ఎన్ని మార్లు ప్రయత్నం చేసినా మనకి రాముడూ, కృష్ణుడూ తప్ప మిగతా అందరూ ధ్యానం లో కనపడతారు. ఇది మనలో ప్రతీ ఒక్కరికి తెల్సిన విషయమే. దీనికోసం మనసు మన స్వాధీనంలో ఉంచుకోవాలి అంటారు. ఇదే భగవదర్పితం చేయడం అంటే.  మరి మనం భగవంతుడికి ఏమిటి అర్పించేది?డబ్బులా, పువ్వులా, భోజనమా? అసలు భగవంతుడికి ఏదో ఇవ్వబోయే మనకి ఇవన్నీ ఎలా వచ్చాయనే విషయం చూద్దాం.

భగవంతుడు మనకి ఇచ్చినవి ఏమిటి అని చూసుకుంటే, మన జీవితం, ఉద్యోగం, కుటుంబం వగైరా అన్నీ ఆయన ఇచ్చినవే కదా. అటువంటప్పుడు మనం ఆయనకి ఏమి ఇవ్వాలి? గుడికి వెళ్తూ పళ్ళూ, పాలూ, పువ్వులూ పట్టుకెళ్ళారనుకోండి అవి మళ్ళీ మనకో మరొకరికో జేరుతున్నాయి కదా? మీరు ఇవ్వకపోయినా గుడిలో దేవుడు ‘వీడు ఫలానా రోజున గుడికి వచ్చి నాకు ఏమీ ఇవ్వలేదు, అందువల్ల వీడి నెల జీతం కోసి పారేస్తా’ అనుకుంటున్నాడా? అంటే మనం ఇచ్చేది మన తృప్తి కోసమే కానీ విశ్వానికి ప్రదాత అయిన భగవంతునికి మనం నిజంగా ఏమి ఇవ్వగలం? దీని గురించే శంకర భగవత్పాదులు అంటున్నారు చూడండి – భగవంతునికి ఏమి ఇవ్వాలనేది చెప్తూ.

కరస్తే హేమాద్రౌ గిరిశనికటస్తే ధనపతౌ
గృహస్తే స్వర్భూజామర సురభి చింతామణి గణే
శిరస్తౌ శీతాంసౌ చరణ యుగళస్తే అఖిలసుభే
కమర్దం దాస్యే జహం భవతు భవదర్దం మమ మనః        [శివానందలహరి. 26]

(బంగారు కొండ నీ చేతిలోనే ఉంది. అత్యంత ధనవంతుడైన కుబేరుడు నీ స్నేహితుడే. నీ గృహంలోనే కల్పవృక్షం, కామధేనువు, చింతామణి వజ్రం ఉన్నాయి. చల్లదనాన్నిచ్చే చంద్రుడు నీ తలమీదే ఉన్నాడు. నీ పాదాల దగ్గిర సర్వ శుభాలు ఉన్న నీకు నేనిచ్చేదేమి కనిపించదు కనక నా మనసే నీదవు గాక).

ఈ కోతి మనసు గురించి ఇప్పుడోసారి ఆలోచిద్దాం. కళ్ళు చూడగలవు, చెవులు వినగలవు, రుచి తెలియాలంటే నాలుక కావాలి. స్పర్శ తెలియడానికి చర్మం, వాసన తెలియడానికి ముక్కూ కావాలి. అయితే ఈ ఐదు పనులూ కూడా మనసు ఒక్కటీ చేయగలదు. ఉదాహరణకి ఎవరో వచ్చి మీ వీపుమీద చేయి వేసారనుకోండి. వేసినది చేయి దానికి అయిదువేళ్ళు ఉన్నాయి అని ఆ చేయి కనిపించకపోయినా మీకెలా తెలుస్తోంది? పోనీ ఫలానా ఊర్లో అమ్మే – కాకినాడ కాజా అనుకుందాం – బాగుంటుందని మీరోసారి తిన్నా, రెండు మూడేళ్లకి కూడా ఆ రుచి ఎలా మనసులో ఉంది? ఆ పేరు వినగానే నోరు ఎందుకు ఊరుతోంది? అది మనసు ప్రభావం. అందువల్ల మనకి ఏది కావాల్సినా అది మనసుతో చేయవచ్చు. ఈ మనసుని అధీనంలో ఉంచుకుంటే మనంతటి వాడు లేడు, ఉంచుకోకపోతే పిచ్చాసుపత్రిలో జేరనూ వచ్చు. ఏ మనస్సుతో పని చేస్తున్నాం అనేది ముఖ్యం కానీ ఏమి ఇస్తున్నాం, ఎంత ఇస్తున్నాం అనేవీ ఏనాడు ముఖ్యం కాదు. ఏడుస్తూ ఎంత ఇచ్చినా అది నిరుపయోగమే అవుతుంది. అందువల్ల ఇచ్చేటప్పుడు మనసు సంతోషంగా ఉంచుకుని ఇవ్వాలి. భవతు భవదర్దం మమ మనః అనేదానికి అర్ధం ఇదే.

ధ్యానానికి మనసు కేంద్రీకరించాలి కదా? దానికోసం ముందు ఆ మనసు శుభ్రంగా ఉండాలి. లేకపోతే కళ్ళు మూసుకుంటే కనిపించేది భగవంతుడు కాదు. దానికోసం అనేకానేక పద్ధతులు బయటకొచ్చాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి నాలుగు రకాల యోగాలు – భక్తి, కర్మ, జ్ఞాన, ధ్యాన యోగాలు. యుగాల క్రితం మనిషి అనేక వేల సంవత్సరాలు జీవించగలిగి ఉండేవాడు – ఎక్కువ ఆయుర్దాయం వల్ల. అప్పుడు హిరణ్యకశిపుడూ, రావణాసురుడూ చేసినట్టు వేల ఏళ్ళు తపస్సు/ధ్యానం చేసి ఏదో ఒకటి సాధించేవారు. ఈ ధ్యానయోగం కష్టమైనది, మనసు అనేకానేక రోజులు భగవంతుడి మీద ఉంచాలి కనక.  ఈ కలికాలంలో నూరేళ్ళు బతకడమే గొప్ప కనక ఏం చేయాలి? భక్తి యోగం సులభం – దేవుడి మీద భక్తి ఉంటే చాలు. సర్వకాల సర్వావ్యవస్థలలోనూ శరణాగతి ఉంటే అదొక్కటే చాలు. పోనీ ఇది సులభమేనా అంటే మన కోరిక తీరితే ‘ఆహా, భగవంతుడు ఎంత దయామయుడు’ అనడం, కోరిక తీరకపోతే ‘భగవంతుడికి పక్షపాతం ఉంది, నా పొరుగువాడికి మంచి జరిగి నాకు ఇలా అయింది’ అని ఆయన్ని తిట్టుకోవడం మన అలవాట్లు కదా? ఆ రెండు విధాలు మానుకోవాలి.

కర్మ యోగం చేసేవాడి పనేమిటి అయితే? ఏ పని చేసినా ఆ పని చేయడం కోసమే చేయాలి కానీ దాని ఫలితం కోసం చేయకూడదు. అప్పుడది నిష్కామ కర్మ అవుతుంది. నిష్కామ కర్మ అంటే కామం/కోరిక లేకుండా చేయడం. అప్పుడా కర్మ వల్ల మనకి మలినం అంటుకోదు. జ్ఞానయోగం లో ఉన్నది మరో విధం. దీని ప్రకారం ప్రపంచంలో ఉన్నది బ్రహ్మం, భగవంతుడు తప్ప మరొకటి ఏమీ లేదు. అందువల్ల ఈ జ్ఞానయోగులు అవలంబించే సూత్రం ‘నేతి, నేతి’ అంటారు. అంటే ‘ఇది కాదు, ఇది కాదు’ అని. మనం ఓ పువ్వో, కాయో ఏది చూపించినా ఈ జ్ఞానయోగులు  ఏమంటారంటే – ఇది బ్రహ్మం కాదు. ఒకటి గమనించారా? వాళ్ళు చెప్పేది  ఇది పువ్వు కాదు, అది కాయ కాదు అని మాత్రమే. అన్నీ బ్రహ్మమే కదా అటువంటప్పుడు పువ్వు ఎక్కడుంది, కాయ ఎక్కడుంది? ఏదీ లేదు బ్రహ్మం తప్ప. అది జ్ఞానయోగుల పద్ధతి. అలా ప్రపంచంలో బ్రహ్మం తప్ప మరొకటి ఏదీ లేదు.

ఇంతకీ ఏ దారిలో వెళ్ళాలని నిర్ణయించుకున్నా మొత్తానికి చేయాల్సినది – మనసు కేంద్రీకరించడం. దీనికి రమణ మహర్షి చెప్పేది వింతగా ఉంటుంది. ఒకాయన అడుగుతారు రమణులని – భగవంతుడిని ఎక్కడ చూడాలి, ఆయన ఎక్కడ ఉన్నాడు? దీనికి రమణుల సమాధానం ఏమిటంటే, “భగవంతుడి గురించి నీకెందుకయ్యా, ముందు నువ్వు ఉన్నావా లేదా అనేది చూసుకో.” ఈ వింత సమాధానానికి వివరణ చూద్దాం.

పెద్ద అగ్ని గుండం ఉందనుకోండి. అందులోంచి మీరో పుల్ల పెట్టి వెలిగించి చిన్న నిప్పురవ్వ తెచ్చుకున్నారు మీ ఇంటికి. ఆ నిప్పురవ్వతో మీ ఇంట్లో కుంపటి వెలిగించుకోవచ్చు కదా? పెద్ద అగ్నిగుండంలో నిప్పు ఊర్లూ, దేశాలూ కాల్చగలదు. అలాగే మీరు తీసుకొచ్చిన చిన్న నిప్పు రవ్వ పెద్దది చేసి దాంతో కూడా ఊర్లూ దేశాలూ కాల్చవచ్చు. ఈ నిప్పు రవ్వ వెనక్కి తీసుకెళ్ళి ఆ అగ్ని గుండలో పారేసారనుకోండి, రెండూ కలిసి అదే నిప్పు కదా? అలాగే అక్కడనుంచి ఎత్తుకొచ్చిన నిప్పుకీ అక్కడ ఉన్న నిప్పుకీ ఏమీ భేధం లేదు. ఇది మనకి అన్వయించి చూసుకుంటే ఆ పెద్ద అగ్ని గుండం విశ్వం అంతటిలోనూ ఉన్న బ్రహ్మం. మనం తెచ్చుకున్న నిప్పురవ్వ – అది పరమాణువు అంత చిన్నదైనా సరే – మనలో ఉండే చైతన్యం/బ్రహ్మం. ఈ చైతన్యం విశ్వవ్యాపితమైన బ్రహ్మంలో కలిపితే అది కూడా పూర్ణ బ్రహ్మం. అక్కడనుంచి కొంచెం వేరేగా తీసుకొచ్చినప్పుడు కూడా ఆ విశ్వం లో ఉన్న బ్రహ్మం అలాగే ఉంది. ఇదే మనం  చెప్పుకునేకునే ఉపనిషత్ శ్లోకం.

ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే,
పూర్ణాస్య పూర్ణామాదాయ పూర్ణమేవావషిష్యతే

కనిపించని బ్రహ్మం (అది) ఏదైతే ఉందో అది సంపూర్ణంగా ఉంది. కనిపించే మనలో చైతన్యం (ఇది) కూడా సంపూర్ణం. ఆ పూర్ణంలోంచి (పెద్ద అగ్ని గుండం) ఏది బయటకి తీసుకొచ్చినా (చిన్న నిప్పు రవ్వ) బయటది కూడా సంపూర్ణం. ఈ చిన్న చైతన్యాన్ని ఆ పెద్ద బ్రహ్మానికి కలిపినా మిగిలేది కూడా సంపూర్ణం. భాగవతంలో చెప్పే పద్యం కూడా ఇదే. చరాచర ప్రపంచంలో హరి కాని ద్రవ్యము, పరమాణువు కూడా ఏదీ లేదు.

క. హరిమయము విశ్వమంతయు
   హరి విశ్వమయుండు సంశయము పనిలేదా
   హరిమయముగాని ద్రవ్యము
   పరమాణువు లేదు వంశపావన వింటే              [2-17]

కొంచెం ఆలోచిస్తే జ్ఞాన యోగులు చెప్పేది కూడా ఇదే. చరాచర ప్రపంచంలో ఏదైతే ఉందో అది బ్రహ్మం తప్ప మరొకటి కాదు. ఆ పెద్ద బ్రహ్మాన్ని చూడాలంటే ముందు మన దగ్గిరే మొదలుపెట్టాలి. భగవంతుణ్ణి చూడ్డానికి ఎక్కడకీ వెళ్ళనవసరం లేదు. మనం చూసే ప్రతీదీ కూడా భగవంతుడే, ఆ భగవంతుడి చైతన్యం/బ్రహ్మం మనలోనే, మనకి ముక్కుకన్నా దగ్గిరలో ఉంది. ఆ చైతన్యమే ఆత్మ. చేయాల్సినదల్లా దృష్టి లోపలకి తిప్పి, లోనికి చూడడమే. అలా చూడడానికి అలవాటు పడితే మనసు దానికదే శుభ్రం అవుతుంది. అప్పుడు మనలో మనకి కనిపించే చైతన్యమే ఆత్మానుభూతి. అది చూసాక ఇతరులలో కనిపించేది పర+ఆత్మ = పరమాత్మ.

ఉన్న చిక్కు ఏమిటంటే ఎప్పుడైతే మనం ఆత్మ దర్శనం “బయట” కనిపిస్తుందని చూడడానికి మొదలుపెడతామో అప్పుడది మనకేనాటికీ కనిపించదు. ముందు చూడాల్సినది మనలో. దీన్నే మనం ఇంట గెలిచి బయట గెలవడం గా చెప్పుకోవచ్చు. మనలోనే ఉన్న ఆత్మ కనిపించాలంటే అంతర్దృష్టి అవసరం. దీనినే రమణులు చెప్పినది – నువ్వున్నావా అది చూడు ముందు. ఇక్కడ నువ్వు అంటే మనలోని చైతన్యం అన్నమాట. దీనినే రమణుల సంగ్రహంగా చెప్పినది – నేనెవరిని అనేది శోధించడం. ఒకసారి మనమెవరమో – అంటే మనమే పరబ్రహ్మ స్వరూపులం అనేది మనకి తెలిస్తే అంతా తెలిసినట్టే. దీనిని రమణులు మరోలా చెప్తారు కూడా. పంచదార నోట్లో వేసుకుంటే ఎలా ఉంటుంది? ఈ విషయం దాదాపు అందరికీ తెల్సినదే. అయితే ఏనాడూ పంచదార అనేది చూడనివాడూ, తెలియనివాడూ, నోట్లో వేసుకోనివారూ ఉన్నారనుకోండి వాళ్లకి పంచదార నోట్లో వేసుకుంటే ఎలా ఉంటుందనేది మిమ్మల్ని చెప్పమన్నారు. ఎలా చెప్తారు? ఏదీ చెప్పనవసరం లేదు, ఇంత పంచదార తీసి ఆయన నోట్లో పోస్తే చాలు కదా? అలాగే మనలో ఉండే చైతన్యమే బ్రహ్మం. అదెలా ఉంటుందని అడగడం ఎటువంటిదంటే – పంచదారని, “నీ తీపి ఎలా ఉంటుంది తింటే? అని అడగడం వంటిదే. నువ్వే బ్రహ్మానివి అయినప్పుడు ఇంకెక్కడకి వెళ్ళడం దాన్ని చూడ్డానికి? ఇదే అహం బ్రహ్మాస్మి (నేనే బ్రహ్మాన్ని), సర్వం ఖల్విదం బ్రహ్మ (అంతా బ్రహ్మ మయం).

అందువల్లే భగవంతుడున్నాడా, ఎక్కడ, ఎందుకు కనిపించడూ అనే అన్ని ప్రశ్నలూ అనవసరం. ముందు మనని మనం తెలుసుకుంటే మిగతా విషయాలు, సమాధానాలు వాటికవే వస్తాయి తర్వాత. ముందు వ్యాసాల్లో స్వామి సత్యానందగారు చెప్పినట్టూ చూశాం ఓ సారి – లెక్కలలో సమాధానం రావాలంటే ముందు మొత్తం ఒకటి అనుకోవాలి అని ఉపాధ్యాయుడు చెప్పాడు కదా? అలాగే ఇక్కడ కూడా మొదటిది ఏమిటంటే – భగవంతుడు/బ్రహ్మం అనేది ఉన్నాడు/ఉంది అని అనుకుని ధ్యానం ప్రారంభించడం. ఇప్పుడోసారి వెనక్కి చూసి ఆలోచిద్దాం. బ్రహ్మం అనేది ఉంది అని మొదలుపెట్టి ధ్యానం ప్రారంభించాం. కానీ ఏమీ ఉపయోగం కనిపించలేదు ఇరవై ముప్ఫై ఏళ్లకి కూడా. అందువల్ల ఆ దారి వదిలేసి భగవంతుణ్ణి తిట్టుకోవడం, లేదా అసలు భగవంతుడే లేడు అనుకోవడం మంచిదేనా?

దీనికి స్వామి వివేకానందుల సమాధానం చూడండి – “జీవితంలో మీకున్నదంతా సత్యం తెలుసుకోవడం కోసమే ధారపోయండి. అదీ మామూలుగా కాదు మీ అవయవాలు, మనసు బుద్దీ అన్నీ పెట్టి త్రికరణశుద్ధిగా ప్రయత్నించండి. భగవంతున్నాడా లేదా అనే శంకలేమీ పెట్టుకోవద్దు. జీవితంలో భగవంతుడు కనిపిస్తాడా అనేది కూడా ఆలోచించవద్దు. మీరు చేయాల్సిందల్లా మీ ప్రయత్నంలో లోపం లేకుండా చూసుకోవడమే. చివరకి నిజంగా భగవంతుడు లేకపోయినా రోజువారీ చచ్చు పనులకి మీ జీవితం పాడవలేదనే సంతృప్తి మీకు మిగులుతుంది. అత్యంత వైభవమైన బ్రహ్మం తెలుసుకోవడమే జీవితంలో ముఖ్యం కానీ తుఛ్ఛమైన కోరికల కోసం కాదు.”

ఇప్పుడీ భగవద్విభూతి, అంటే భగవంతుడు ఈ చరాచర ప్రపంచంలో ఎంత విస్తారంగా ఉన్నాడో అనేది ఆయన నోట చెప్పినదే (భగవద్గీత విభూతి యోగం) చూద్దాం. కృష్ణా నేను నిన్నెక్కడ చూడవచ్చు బ్రహ్మం రూపంలో, నీవు చెప్పినది ఎంత విన్నా ఇంకా వినాలనే ఉంది అని అర్జునుడు అడిగితే చెప్తున్నాడు భగవంతుడు.

శ్రీభగవానువాచ

హన్త తే కథయిష్యామి దివ్యా హ్యాత్మవిభూతయః
ప్రాధాన్యతః కురుశ్రేష్ఠ నాస్త్యన్తో విస్తరస్య మే          [10-19]

నా విస్తారానికి అంతు అనేది లేదు కానీ ముఖ్యమైనవీ, దివ్యమైనవీ, ధ్యానానికి పని కొచ్చేవీ అయిన వాటి గురించి మాత్రం చెప్తున్నాను. ఇదే కదా మనం చూసినది, ఈ చరాచర ప్రపంచం మొత్తం అంతా కూడా బ్రహ్మం తప్ప మరోటి కాదు. అయితే గమనించవల్సినది ఏమిటంటే ఇక్కడ చెప్పేవి ముఖ్యమైనవీ, దివ్యమైనవీ మాత్రమే.

అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః
అహమాదిశ్చ మధ్యం చ భూతానామన్త ఏవ చ [10-20]

ప్రాణులందరి హృదయాలలో (సర్వభూతాశయస్థితః) ఉండే చైతన్యం నేనే (అహం ఆత్మా). ఆది, మధ్య, అంతం కూడా నేనే (ఆదిశ్చ, మధ్యంచ, భూతానమంత ఏవచ). దీన్ని బట్టి తెలిసేదేమంటే – పుట్టుక, బతకడం, చావులో కూడా ఉండేది బ్రహ్మం తప్ప మరొకటి కాదు. ఇదే పైన చెప్పిన “హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు” అన్నది. వచ్చే వ్యాసంలో విభూతియోగం లోని మిగతా శ్లోకాలు చూద్దాం.

****సశేషం****

Posted in March 2021, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!